Saturday, October 10, 2015

ఎగరలేని కాగితాన్ని ....



నేను, భావుకుడ్ని కవిని కాను
దయచేసి అనొద్దు ....
నన్ను కవో, రచయితో అని
స్థిరంగా ఉండని ఈ చేతులు
తడబడే ఈ నడక
జీవితం నాలుగురోడ్ల కూడలి లో
ఈ అగమ్యపు హృదయస్పందనలతో
నేను, ఒక సగం నడుం వొంగిన
ముడతలుపడ్డ కనురెప్పల
బలవంతపు నవ్వును.
ప్రకటించలేని సిగ్గు జీవితాన్ని.
నేను మోసి మోసి అలసిన
జారిన భుజాన్ని,
పగిలిన పెదవుల ఒక రాలని నవ్వును. 
నేను, కవినో రచయితనో కాను.
పరిశీలనగా చూస్తే నీకే తెలుస్తుంది..
ఈ తొందరపాటు, ఈ పొదగని మది
ఈ నిర్వచించలేని నొప్పి .... దీని మూల్యత
నా ఊపిరితిత్తుల్లో ఈ అడ్డంకుల మెట్లు
శ్వాసించలేని ఈ దుస్థితి
నాకే తెలియదు .... పరిణామం ఇదీ అని
గోడకు వ్రేలాడుతున్న నా ఫొటోవంక చూడు
మసకేసి పోతూ నేను అదురుతున్నాను.
నా కళ్ళలోంచి రక్తం కారుతుంది.  
నేను, ఒక తెల్ల కాగితాన్ని
ఈ సిరా, ఈ రక్తం, ఈ ఆవేశం
పొగొట్టుకున్నవారినే కాదు
తపించే వారిని, బాధాతప్త హృదయుల్ని
ప్రేమారాధ్యుల్ని, విప్లవ శంఖారావాలనీ
అక్షర ఖడ్గాలనీ .... పరిచయం చేస్తుందని
గమనిస్తే తెలుస్తుంది ఎవరికైనా
నేను కవినీ, రచయితనూ కానని
ఏమీ రాయని ఒక తెల్లకాగితాన్నని

No comments:

Post a Comment