Sunday, June 29, 2014

ఎంత ఓపికో ....





వారసుడిని చేరాలని
రెప్పలు ఉబ్బి, కళ్ళు కాయలు కాసి
వేచి, చూసి చూసి .... భూగర్భం లో
దాగి వొదిగి .... అమూల్యమైన సంపద,
దుమ్ము కొట్టుకుని ....
ఆ పాత చెక్క పెట్టె లోపల,

నిష్కల్మషత్వాన్ని చూసా .... నీలో




ఏ అమృతమూర్తో కాదనుకుని
చెత్తబుట్టలోకి విసిరేసిన పసి ఊపిరి ప్రాణం నాది
అప్పటి వరకూ
ఒంటరినే నేను
తప్పిపోయి, గమ్యమూ దారి తెలియని అనాధను

అమ్మే కాదనుకుందన్న బాధ
గుర్తుకొచ్చిన ప్రతిసారీ
కళ్ళు నీళ్ళతో నిండిపోయి
అంతా అనిశ్చితి
చుట్టూ మసక మసగ్గా సమాజం

బోరున కురుస్తుంది  వర్షం
మార్గం సరిగ్గా చూడలేను.
సరిగా అప్పుడే .... దూరంగా నీవు కనిపించావు
పల్లెటూరి అబ్బాయివిలా
చీకటి అయోమయం లో కొట్టుకుంటున్న నాకు
ఒక ఆశాదీపం లా

నిన్ను చూస్తూనే మొదట భయం వేసింది.
నీవు దగ్గరగా వస్తుంటే
గుండె వేగంగా కొట్టుకుంది
అంతకుముందు
ఎందరో స్వార్ధ సంకుచిత మనస్కుల్ని చూసుండటం వల్ల

మెల్లగా అనునయంగా, నిష్కల్మషం గా మాట్లాడావు
నీ మాటలు
నాలో నమ్మకం, ధైర్యాన్ని నింపి ....
నువ్వందించిన చెయ్యందుకోవాలనిపించింది.
నా హృదయమే నీదైనట్లు ....

ఇప్పుడు, నాకు సమాజము, విషపు జీవులు అంటే
ఎలాంటి భయమూ లేదు
ప్రకాశవంతమైన నీ సాహచర్యంలో
నా గమ్యం నాకు స్పష్టంగా కనిపిస్తుంది
నా జీవనయానం లో నాకో దిక్చూచి దొరికిన అనుభూతి

Saturday, June 28, 2014

ప్రత్యేకించి .... ప్రత్యేకతను చూస్తున్నాను నీలో





నా మనః పరిణామ స్థితి, నీకు తెలియపర్చాలనుండేదెప్పుడూ
నువ్వెక్కడో నేనిక్కడో ఉన్నా అరమరికల్లేని విధంగా .... నా ఆలోచనల్లో ....
అనుక్షణం నీ గురించి తెలియని ఏదో సంవేదన, పరితపన
గుండెలు నిండిన ప్రాణవాయువు లా అంతా నీవే అయి .... మార్చలేని ప్రేమ బంధం లా

అదే భావన, అదే తపన .... ఎప్పుడూ మనసెందుకో ఆరాటపడుతూనే ఉండేది.
అసందర్భమే అయినా ఏదో ఒకటి ముచ్చటిస్తుండాలని .... నీతో ఒంటరి ఏకాంతం లో ….
నా కలలకు రెక్కలుంటే బాగుంటుందని .... గగనసీమలకు నిన్నెగరేసుకుపోవచ్చని
నీకు తెలుసా!? వెదుక్కుంటూ ఎగురుతూ తిరిగి .... నీవెక్కడ ఉన్నా నీ చుట్టూ పరిబ్రమిస్తుండాలని 




ఎప్పుడైనా మది లో నీవు .... మెలుకువగా ఉండి, తారసపడితే .... పరామర్శిస్తే .... చిత్రం!
నీవు నా పక్కనే ఉన్నట్లు, బుజ్జగిస్తున్నట్లు .... నా మది స్థిమితపడి .... భారం తగ్గిన భావన
నిజంగా భవిష్యత్తును గురించి ఇంతగా కలలు కనడం అవసరమా .... అనిపించినా
నా ప్రేమ ఫలించి నీ సాహచర్యం లో .... పడిన కష్టం, ఒంటరితనం, బాధ మరచిపోగలనని సర్ధిచెప్పుకునేవాడ్ని.

ఎందుకో చెప్పుకోవాలనిపిస్తుండేది ఎప్పుడూ .... నా జన్మకు ఈ ఉద్వేగానికీ అన్నింటికీ .... కారణం నీవని
కాలగమనం లో ఎక్కడైనా నిర్దేశించబడి కానీ, యాదృశ్చికంగా కానీ .... నీవూ నేనూ ఎదురెదురైతే
ఒక్కటయ్యే పరిస్థితే వస్తే .... నా హృదయాన్ని విప్పి నీ ముందు పరిచెయ్యగలనుగా అనిపించేది
అన్నాళ్ళూ దాచుకునున్న నా ప్రేమ మాధుర్యాన్నంతా పంచుకోగలనుగా అని అనిపించేది.

ఊహలలో, కలలలో నీతో విన్నవించుకోవాలనుకునేవాడిని .... ఆ ఊహలు కలలు కరిగిపోయేయి.  
నా ప్రపంచమూ, నా మనసంతా నీవే అని .చెప్పుకోవాలనుకునేవాడిని …. నా ప్రేమ చరిత్ర లో శిలాక్షర పదాలు
నా పేరుపక్కనే, నీ పేరుండాలని, నా ఆకాంక్షని నీతో చెప్పుకుంటున్నట్లు నాకు నేను చెప్పుకునేవాడిని.
ఎందుకో తెలుసా!? నీవు నా జీవితం లో మార్పుకు కారణానివి .... నా జీవితానికో దిక్సూచివి కావాలని. 




మరి ఇప్పుడు నా ఊహలు, కలలు ఆశలు పండి నా తపస్సు ఫలించి నీవు నా పక్కనే ఉన్నావు.
నా కష్టం, బాధ ఆలోచనల్ని నీ నీడలో దాచుకుని ప్రేమ మాధుర్యాన్నై కరిగి నీ రక్తం లో కలిసిపోవాలనుకుంటున్నాను.
ఈ ప్రేమ, పరితపన …. నిజం! ఇప్పుడు రేపును గురించి కలలు కనాల్సిన, ఒంటరి బాధను భరించాల్సిన అగత్యం లేదు నాకు.
ఆకాశమే దిగొచ్చిన ఈ అనుభూతి .... నీ  పక్కనే నడిచి జీవితం వరాన్నాస్వాదించాలనిపిస్తుందే కాని..

ఒక మట్టిరోడ్డు ప్రయాణం .... జీవితం





అక్కడ సర్వం సవ్యంగా జరుగుతున్నట్లే ఉంటుంది
అంతలోనే దారి తప్పిపోయామనిపిస్తుంది.
గులకరాళ్లు, మొరపరాళ్లు, జల్లి,
కంకర వదులు వదులుగా ఉండి
దిగబడిపోనూవచ్చు .... మనం
ఆకశ్మికం గా ఏ ఊబిలోకైనా జారిపోనూవచ్చు
ఆ క్షణం లో ఆ ఊబే మన వాస్తవికత 

వాస్తవికతకు దూరం గా ఎక్కడికీ పారిపోలేము
లోపాలు లేని రహదారి ఉంటుందనుకోనూ లేము
రుచిరహిత పరిహాసం లా అనిపించినా
అదే నిజం! అదే వాస్తవం!
ఎప్పుడు, ఎక్కడ, ఎలా మెల్లగా నడవాలో
ఎప్పుడు పట్టుదొరుకుతుందని ఎదురుచూడాలో
నేర్చుకుని నడుచుకోవల్సింది మనమే 




అది చదునైన సిమెంట్ రోడ్డూ కాదు
తారు రోడ్డు అంతకన్నా కాదు
సమతలం గా ఉండాల్సిన అగత్యం లేని
ప్రాకృతికం గా ఏర్పడిన మట్టి రోడ్డు
ఈ ప్రయాణం
ఇలాగే ఉంటుందని ఊహించలేని
ఋతు ప్రభావి రహదారి అది

ఆ రహదారిలో గతుకులే అన్నీ ....

Friday, June 27, 2014

తోడుంటాను .... ఒక జీవిత కాలం





ఆడకూతురా! .... అంతమైపోవాలనుకోకు .... ఈ రాతిరి,
విషనాగు బుసలు కొడుతూ
గుంటనక్క .... ఒకటి
నీ నిర్ణయం కోసమే ఎదురుచూస్తూ
బలవంతంగా నీ నోరు నొక్కేసే ఆలోచనలో
అపరిష్కృత పరిష్కృతి కోసం
స్వార్ధ ప్రయోజనం, ప్రత్యామ్నాయం కోసం
నీవు ప్రాదేయపడినా పట్టించుకోకుండా

ఎప్పుడైతే, నిన్నూ, నీ అస్తిత్వాన్నీ
ఒక వస్తువులా, మారక ద్రవ్యం లా వాడుకుని
నీ హృదయాన్ని ముక్కలు చెక్కలుగా చేసి
నీదైన ఆభరణం
నీ రక్షణ కవచం స్త్రీత్వాన్ని కూడా అపహరించి
బజారు లో భేరానికి పెట్టినప్పుడే
అర్ధం చేసుకునుండాల్సింది .... .అప్పుడైనా
ఎప్పుడూ అమానుషుడు అతడని.




అమితమూల్యం చెల్లించి మరీ కొన్నానని
తప్పనిసరై అమ్ముతున్నానని
అరేబియన్ల ముందు
తన ఆనందం కోసం నిన్ను
వేలం వేసేందుకు సిద్దపడిన ఆ నమ్మక ద్రోహి
నీ కన్నతల్లిదండ్రుల కన్నీటికి కారణం
అతని కోసం ఏడవొద్దు. కన్నీరు కార్చొద్దు
నీకు తోడుగా నేనున్నాను.




నేనిక్కడే నీ పక్కనే ఉన్నాను .... గమనిస్తూ
నన్ను నమ్ము!
ఆడకూతురా! అంతమైపోవాలనుకోకు!
అభిమానం అర్ధంతెలియని వ్యక్తి కోసం
అర్ధం చేసుకోలేని క్రియాహీనుడి కోసం
నీ జీవితాన్ని త్యాగం చేసుకోకు
నా జీవితంకన్నా అధికంగా ప్రేమిస్తానని మాటిస్తున్నాను.
నికు తోడుంటానని .... ఓ ఆడకూతురా!

Thursday, June 26, 2014

వెళ్ళక తప్పకే వెళుతున్నా .... ఓ పిల్లా!




వెళ్ళిపోతున్నా నీకు దూరంగా .... మార్గాన్ని అన్వేషిస్తూ,
స్వయం ఉపాది ని,
ఆర్ధిక స్వాతంత్రత సౌలభ్యతను పొందేందుకు
సమయం మించిపోకమునుపే
గమ్యం సమీపం లోనే ఉంది అని ....
నీ నయనాల్లో స్పష్టంగా చూస్తున్నాను.
నీ ప్రేమను, నీ కన్నీళ్ళను
నేను వెళుతున్నానే .... కానీ,
అక్కడ నేను ఒంటరిని .... నీవు లేకుండా
జీవితం లో అనుక్షణమూ .... అవసరమే
నీ ప్రేమ, నీ సాహచర్యము.
నన్ను నమ్ము! నా హృదయం నీ చెంతే ఉంది.
నేను మాత్రం ....
నిన్నూ, నా హృదయాన్ని కోల్పోయి దూరంగా ....

నీకు తెలుసు అది నీవే అని
ఎప్పుడైనా ....
నేను అలసిపోయి
మోయలేని భారం మోస్తున్నాననిపించి,
ఓటమిని అంగీకరించబోతుంటానో ....
నీకు తెలుసు
అప్పుడు, అక్కడ నీ అవసరము
అనునయము తోడు కోరుకుంటానని
నాకు అవసరమైన బలం, ధైర్యాన్ని పొందేందుకు
నన్ను నమ్ము పిల్లా!
నిజమే చెబుతున్నాను.
నీ పట్ల .... ఎంతో ఘాడమైన ప్రేమ నాదని, 




ఓ పిల్లా! మరోసారి మనవిచేసుకుంటున్నా
వెళ్ళిపోతున్నానని
ఏదోలా ఒక చిరునవ్వును పొందాలనుంది
వెళ్ళేలోగా .... నీనుంచి
ఎన్నో జ్ఞాపకాల మన కలయికలను
మరచిపోయే ప్రయత్నం చేస్తా .... కొంత కాలం పాటైనా
అప్పటివరకూ,
ఒంటరినే నేను, నీవు లేక .... అక్కడ
అయినా నా ప్రతి కదలిక నీడగా నీవుండాలని ....
నా ఆశ ....
నా హృదయాన్ని నీ వద్దే వదిలేసి
నేను, నీకూ నా హృదయానికీ దూరమౌతున్నాను.
వెళ్ళిపోతున్నాను.
నీ కోసం, నీ ప్రేమ కోసం, మన రేపటి సౌలభ్యం కోసం

Wednesday, June 25, 2014

ఇచ్చినవన్నీ తిరిగి పుచ్చుకుందామని


ఓ అందాల రాక్షసీ ....
నిన్నే
నేనిచ్చిన ప్రతిదీ
బేషరతుగా పుచ్చేసుకోవాలనుంది.
అర్ధం కానట్లు
ఆ అభినయం తగదు

ఆ నేన్నిన్ను ప్రేమిస్తున్నానులు
ఆ బుజ్జగింపులు
ఆ ముద్దుముచ్చట్లు
ఆ కౌగిలి లు
ఆ ప్రేమ ....
అన్నీ 


మనం కలిసున్నప్పుడు
గుండె లోతుల్లోంచి పలికిన పలుకులు
నీతో పంచుకున్న ఆ ఆకాంక్షలు
అన్నీ
నీవు నాకు తిరిగిచ్చేస్తే
పుచ్చుకోవాలి .... నీ నుంచి

చచ్చిపోతానేమో అనిపిస్తూ
శరీరమంతా ఆబ
తట్టుకోలేని తపన
వేడి
ఆవిరులు

అంతరంగాన్ని చల్లబరుచుకుందుకు
ఈ వెన్నెల లో
ఈ మంచు లో
పిచ్చివాడి లా ఇలా
ద్వేషం,
నిస్పృహలతో .... 


విరహం తో సంచరిస్తున్న
కొన్ని ఆత్మల ఆనందం కోసం లా ....
తిరుగుతున్నాను.
అందుకే
ఓ అందాల రాక్షసీ
నేనిచ్చినవన్నీ తిరిగి పుచ్చేసుకుంటా!

Tuesday, June 24, 2014

అంతా తొందరే





కాలం కదలడం మాని 
నూకలు అడుగంటి 
నిశ్చేష్టుడ్నై దిక్కులు చూస్తున్నప్పుడు 
నీవుంటావు కదూ 
నమ్మకానివై తోడుగా .... నాతొ 

ఆ సూర్యుడి కిరణాల 
వేడి తగ్గి 
ఋతువులు క్రమశిక్షణ కోల్పోయి 
అయోమయుడ్నౌతున్నప్పుడు 
నాతొ ఉంటావు కదూ .... భరోసా యిస్తూ

ఆకాశాన మేఘాలు కమ్మి 
వర్షించడం మానినప్పుడు 
నీరు ఆవిరై, 
గాలి స్తంబించినప్పుడు నీవు 
నాతొనే కదూ .... నాకు ధైర్యాన్నిస్తూ



మరి ఇంతకూ నేనున్నానా .... నీ కోసం అని 
ఇప్పుడే కళ్ళు తెరిచి 
కదులుతున్న క్షణాల్లోకి చూస్తే తెలిసింది  
నేను లేనని, వెళ్ళిపోయానని నీకన్నా మునుపే 
నీకు తోడుండేందుకు .... స్వర్గానికని

జన్మ జన్మల బంధం మనదని నమ్మకం .... ఎందుకో




ఎందుకు అలా అనిపిస్తూ ఉందో
ఎందుకు .... నీకూ నాకూ మాత్రమే తెలుసని
ఎంతో స్వచ్చము నికార్సైన .... ప్రేమ మనదని
నిజమైన ప్రేమకు అర్ధం మనకు మాత్రమే తెలుసని




అప్పుడే అన్యోన్యత, అప్పుడే సిగ్గు
అంతలోనే గిల్లికజాలు,
అంతలోనే చిలిపి కొట్లాటలు
మొట్టుకుని, గిచ్చుకుని, ఏడ్చి ఓదార్చుకుని .... ఒకరినొకరం 



కేవలం నీకూ నాకూ మాత్రమే తెలుసన్నట్లు
నికార్సైన స్వచ్చమైన ప్రేమ
నాలో నీవు, నీలో నేను .... రోజులు, యుగాల తరబడి కనిపెట్టుకుని
ఆనందం, సంతోషం, కష్టం బాధ లను 
కలిసి పంచుకుని జీవన యాత్ర కొన సాగిస్తున్నట్లు


Sunday, June 22, 2014

ఆమె నాకు ఎదురొస్తే .... బావుణ్ణు!?




నాకు చాలా ఇష్టం నా దారికి తను ఎదురొచ్చి
తన ఇష్టాన్ని నా అబిమతంగా ఔననిపించుకునేటప్పుడు
తను నన్ను పిలిచే పలుకులలోని మార్దవం 
ఎంత తీపి రుచో ....
ఆ పెదవులపై కదిలుతూ నా పేరు
ఆ కళ్ళతో తను నన్ను కదలనీయకుండా
బలంగా బంధించెయ్యడం ఎంత మనోహరమో
అందుకే అనిపిస్తూ ఉంటుంది
నాకు తెలిసిన ఒకే నిజం నా చెలి, తానే అని
నాతో అలాగే ప్రవర్తిస్తుందని ఎన్ని జన్మలుగానో నాకు తెలుసని  




అది, కలో మాయో నిజమో .... కానీ
నాకు తెలిసింది మాత్రం ఒక్కటే
తను సమీపం లో ఉంటే సేదదీరుతున్నట్లుంటుంది
విశ్రమించుతూ ఉండిపోవాలని ఉంటుంది ....
అది మరణమే అయినా సరే లా
ఆమె బాలుడ్ని లా నన్ను బుజ్జగిస్తున్నట్లు
ఆకాశమే వంగి నాకు మనస్కరించుతున్నట్లు 
నిజం గా .... తను నా పక్కన ఉన్నప్పుడు
ఎంత ఆనందం ఉల్లాసం ఆహ్లాదమో .... జీవితం

ఆమె స్పర్శ లోని మృధుత్వం
నా శరీరాన్ని తాకుతున్నప్పుడు
రెక్కలు అమర్చిన సీతాకోకచిలుకను లా అనిపిస్తూ
సహజంగా బిడియస్తుడ్ని, భయస్తుడ్ని
ఎవరినీ అంత సమీపం లో ఉండాలనుకోని నేను
ఎందుకిలా .... ఆకాశం, భూమి మధ్య త్రిశంకు స్వర్గంలో
తనూ నేనూ మాత్రమే ఉండాలనుకుంటున్నానో
భద్రం సురక్షితం అనుకున్న అన్ని అనుభూతుల్ని దాటి
తను నా సమీపానికొచ్చిందనో ఏమో




నాలోని ప్రతి అణువు ఇప్పుడు
ఆమె సాన్నిహిత్యాన్నే కోరుకుంటుంది
ఆనందం, ఆహ్లాదం, ఉల్లాసం అనుభూతి కోసమో ఏమో
అది మరణమే కావొచ్చనిపించినా 
తను నన్ను ఒక పసిబాలుడ్నిలా చేసి చూస్తుందనిపించినా
మళ్ళీ మళ్ళీ తన సాంగత్యమే కావాలనిపిస్తూ
నా మార్గానికి ఎప్పుడూ తనే ఎదురు రావాలనిపిస్తూ
తను నన్ను పోట్లాడాలనిపిస్తూ
ఆ గోరువెచ్చని స్పర్శతో ఊహలకు రెక్కలొచ్చి
ఎగిరిపోవాలనిపిస్తూ ..... ఏమైపోతుందో ఏమో నాకు

Saturday, June 21, 2014

అవసరమే



 













అవసరం అవకాశం
ప్రమాదమే అయినా
మార్పు

గుడ్డి,
మొండి,
దుముకుడు

మది,
ఎద,
రెండు చేతులు
రెండు కాళ్ళు,
పాచికలు
ద్రొల్లి

జీవ
చదరంగం లో
బటుడై కదలడం

Friday, June 20, 2014

నీ ప్రేమ సందేశమే అది




ఎప్పుడూ
ఆ మబ్బుల వెనుక
దోబూచులాడు
తెల్లని
ఆ వెన్నెల
కిరణ నయగారాలు
పందిరి చిరుగుల్లోంచి
నన్ను పరామర్శిస్తూ

ఒక వింత అనుభూతి 




నువ్వెక్కడున్నావో ....
బహుశ
అవి నిన్ను తాకి ....
నీపు నింపిన ప్రేమే
అయ్యుంటుంది.
వెన్నెల 
నన్ను తాకుతూ ....
ఆ మృదుత్వం

నొసటిరాత సరిగ్గా లేకే .... అనుకుందామా?






ఎందుకు? ఎందుకు మనలో కొందరు
పుట్టు దరిద్రులు, వృద్దులై మరణించాలి ....
ఎందుకు?
ఎందుకు మనలో కొందరు అన్నీ అనుభవించాలి ....
ఎందుకు?
ఎందుకు గురి పెట్టిందొకరికైతే
బుల్లెట్టు యింకెవరికో తగులుతుంది?
ఎందుకు?
ఎందుకు ఈ విపరీత పరిణామాలు?
జిజ్ఞాసను పెంచడనికేనా? ప్రత్యేక కారణముందా?
ఉంటే .... ఏమిటది?





ఎవరు?
ఎవరు వారు?
రాక్షసుల్లా ఉన్నారు? దెయ్యాల్లా ఉన్నారు?
జీవితాల్ని అపహరించే దొంగల్లా ఉన్నారు.
అతనా? ఆమె నా? ఎవరు?
ఎవరని అనుకున్నా ....
పరిగణలోకి తీసుకోక తప్పని నిజం మాత్రం
సమయమే విడమరుస్తుంది అన్నింటినీ అని .
ఏ ఒక్క శక్తి
ఏ ప్రకృతి, ఏ కర్మ
నిర్ణయించింది కాదు .... మానవ జీవితం అని


నిజంగా అదృష్టం అనేది ఒకటుందా?
మనం అదృష్టవంతులమేనా?
పోరాడేందుకు సర్ధుకునేందుకు
మరొక్క రోజు మరో అవకాశం
మనం బ్రతికుండటమేనా?
అదృష్టం అంటే ఇదేనా??
ఎవరైతే అర్ధాంతరం గా ఆఖరి శ్వాస కోల్పోతారో .... అదా?
నిజంగా ఏ మహత్తర శక్తి, ఏ దేవుడైనా
మన వెనకుండి మనల్ని నడిపిస్తున్నాడా?
ఏ భయానక శక్తి
రాక్షసత్వమైనా మన శ్వాసను లాక్కుంటుందా?





మరి అప్పుడప్పుడూ వచ్చి
పట్టణాలు గ్రామాలను లావా మయం చేసేందుకే ....
బద్దలయ్యే .... అగ్నిపర్వతాల మాటేమిటి?
మూకుమ్మడిగా ప్రాణాలను లాక్కుపోయే
తుఫానులు
సునామీల మాటేమిటి?
శోకం కష్టాలను మాత్రమే వదిలివెళ్ళే ఈ .... ఫిట్స్
మానవజాతి ని వెన్నంటుతున్న .... సజీవ నరకాలు కావా? 
అతివాదం ఉగ్రవాదం అంటూ
స్వయం మనంగా సృష్టించుకోవాల్సిన
అవసరం లేని చేదు నిజాలు కావా యివి!?

హృదయాల జూదం .... ఆటలో






ఇక్కడ.
ఇప్పుడు ఈ పర్వతాల నీడలో
నన్ను నేను దాచుకుని
నిశ్శబ్దం లో స్నానం చేసి
ప్రశాంతత లో సేదదీరి
స్వయాన్ని
శుభ్ర పరచుకుంటున్నాను.

ఇక్కడ.
ఇప్పుడు ఏ ప్రాచీన కాలపు
బుద్ధిమత్వం
వివేకం మందమారుతాలై
మెల్లగా
స్పర్శించడం లేదు.
ఏ ఆత్మల శరీరాలను,




ఇక్కడ, ఇప్పుడు
అప్పుడే ఆరంభమై మరు క్షణం లోనే
అదృశ్యమయ్యే
ఏ సాధన కు సాధ్యం కాని
ఎన్నో
ఉచిత సలాహాల
విస్తరెయ్యని వడ్డింపులు .... 




కొనసాగని ఆ కృత్రిమత్వం
ప్రేమ, కోల్పోయేందుకే అన్నరీతి లో ....
నటన లా పరిణమించి
నిజం! నిజంగానే
నిన్ను కలుస్తూనే తొలి పాటంలో ....
నేను అర్ధం చేసుకుంది ఇదే ప్రియా!

Wednesday, June 18, 2014

నా ఆశ, ఆలోచన






సరైన సమయమే అని సన్నద్ధుడ్నయ్యి .... సూటిగా
ఈ చెట్లూ పుట్టల మధ్య గా
తూరుపు దిశగా కొండలవతలకి కదలి
పొద్దు పూచే వేళ
ఆ వెలుగు, ఆ ప్రకాశం లో
ఒక కిరణాన్నై ఉండిపోదామని
ఔను! ఉండి భూమంతా పరుచుకుని పాకుదామని


నేనెవరో తెలియని చోట .... అన్నీ నేనే లా
ఆ అవాస్తవ అనూహ్య ప్రదేశంలో
కాలానికి మాత్రమే తెలిసిన
గ్రహ ఉపరితలం పై
నా ఆలోచనల, ఆనందాన్ని ప్రతిష్టిద్దామని
ఆకాశం విచ్చుకుని, ద్వారాలు తెరుచుకుంటే
మరింత అందం, అయస్కాంత శక్తిని పొందుదామని





దయ ఉంచి ఓ ప్రియా! నన్ను అర్ధం చేసుకో
జీవితాన్నీ అలక్ష్యం చెయ్యడం
నా ఉద్దేశ్యం నా అలవాటు కావు .... కానీ,
ఆదర్శం, సామాజిక న్యాయం గోడలు
చుట్టూ కట్టుకుని .... నాలుగువైపుల్నుంచి
నన్ను నేను బంధించేసుకుని
జీవితాని కన్నా ఎక్కువగా. ప్రేమ ను ....
ప్రాపంచికంగానే చూడమని ప్రబోధించలేని





ఎందుకో, నాకు అవగతం కావడం లేదు.
యాంత్రికతను వదిలేందుకు ఎవ్వరూ ఇష్టపడక
శ్వాసించలేక పోతున్నారు.
ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం
తప్పనిసరై వెదుకులాటకు ప్రాముఖ్యతనిస్తూ
సూక్ష్మ, నిరాకార అగ్రాహ్యతలను పెంపొందించుకుని
బాధను, భారమే అయినా
దూరంగా బలవంతంగా పారద్రోలుకుంటూ


అందుకే ఈ వ్రెదుకులాడుకుంటున్నా
ఎక్కడ ఏ సమాధి, తన్మయత్వ స్థితికైనా
నన్ను నేను వ్రేలాడదీసుకోగలనా అని
అక్కడ, ఎక్కడైతే
ఈ పగలు రాత్రులను విడదీసే
ఆ సరిహద్దుల్లో .... తప్పును ఒప్పుగా
మార్చిచూసుకోగల సరిహద్దుల్లో ....
అక్కడ, అక్కడే
అచ్చోట .... నేనొక బోధివృక్షాన్నైనా అవుదామని

 

పరిత్రాణం




బాధతో, క్రుళ్ళి క్రుళ్ళి ఏడుస్తున్న
ఒక బాధాతప్త హృదయాన్ని
గమనిస్తున్నావు .... తెలుసా!?
నెమ్మదిగా, నిశ్శబ్దంగా నిరాశతో
మరణానికి సమీపంగా జరుగుతూ
కోరుకున్న దేన్నీ
పొందలేక పోయాననే ఆవేదన
రక్త సాంద్రత నియంత్రణ కోల్పోయి
ఆ సున్నిత కవాటాల
సిరలు దమనులు పోటెక్కి

బచ్చలి పండు రంగు లా
కమిలిపోయి
కన్నీళ్ళు కురుస్తూ .... హృదయం నుంచి
రాలుతున్న ప్రతి బొట్టూ
కండరాలను కంపింప చేస్తూ
ప్రతి కంపన
అలజడి ద్వని తో
బలహీనపడి,
నీరసపడిన ఆత్మ
కాలం తో పరుగెట్టలేని
ఓడిపోయిన పాత గడియారం యంత్రం 




రక్త కణాల పోరాటం
శరీర అవయవ
చివరి శాఖ వరకూ
వెళ్ళి రావాలనే ప్రయత్న వైఫల్యం
శరీరమంతా మొద్దుభారిన
అవ్యవస్థత
గతాన్ని వెదుకులాడి,
చరిత్రలోకి తొంగి చూసి
ఎలాంటి పునరావృతతను
గమనించలేని
మనో అంతర్నయనాల దుస్థితి

నా శ్వాసే
నా రక్తాన్ని
విషమయం చేస్తుందేమో
అన్న భయానక భావన
ఏ అమృతం ఉందో
నీ స్పర్శలో అని
అర్ధం చేసుకునే విఫల ప్రయత్నం
ఆలోచన ....
నీ, నా ప్రేమలో
ఇంత మహత్తు
ఎలా ఉందో అని తెలియక 




నీ సంరక్షణ, సాన్నిహిత్యంలోనే
ఇంత పరిపూర్ణత్వం
ప్రకృతి, పంచభూతాలు ఒక్కటై
"ఒకరికోసం ఒకరు పుట్టారు. మీరు
ప్రేయసీ ప్రియులు!"
అన్నట్లు, అనిపించడం,
వినిపించడం కలేమోనని
ప్రియా నీవైనా తెలియపర్చవా?
నేను నేనుగా ఉన్నప్పుడు
ఆ అసంపూర్ణత ఎందుకనో?

Tuesday, June 17, 2014

భయం తో ....?




పొరపాటులే అన్నీ
తొందరపాటులే మళ్ళీ మళ్ళీ
సలహాలు వినీ వినీ
పారిపోవాలని మళ్ళీ మళ్ళీ
అబౌతికం ముక్తిపదం లోకి .... నానుంచి నేను

అతి పెద్ద సంసారంలో
అతి కొద్ది అవకాశం .... జీవితం
మార్గాలన్నీ మూసుకుపోయి
శబ్దరహిత శున్య ఆలోచనలకు దూరంగా
పారిపోవాలని .... వాస్తవానికి దూరం గా

ఒక కొత్త ప్రాణం
మళ్ళీ పుట్టేందుకు
మరణించి
కొత్త దిశ గమ్యం వైపు పయనించేందుకు
ఒక ఆత్మ .... మరో కొత్త నేను లా




పుట్టి, ఎదిగి, పండి క్రుళ్ళిపోవాలని
నుదుట రాయబడి
రోగాలు రొష్టులకు భారినపడి
నేరస్తుడిలా పరుగులుతీసి
జీవబంధాల నుంచి విముక్తుడయ్యేందుకు

ఎన్ని రాత్రిళ్ళు గడిచిపోయాయో
నిశ్శబ్దం మాత్రం సమసిపోలేదు
అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే
గొడలులా అడ్డొస్తూ .... గమ్యం దిశలో
వాస్తవికతకు ఎదురుపడలేక

Monday, June 16, 2014

భిన్న ఏకత్వం




రెండు చెట్ల
ఇరు ఆత్మల కాండాలు
ఒకదాన్నొకటి మెలివేసుకుని
కొంత మేర ఒక్కటైపోయి,
భూమ్మీద
ఒక ఆహ్లాదకర ఏకీకరణ

ఆ ఆత్మల శరీరాల
వ్యక్తిత్వ అస్తిత్వాల
వేళ్ళు
విడి విడిగా లోతుగా
భూమిలోకి
బలంగా పాతుకుపోయి .... 




అది
జీవ సౌలభ్యం కోసమో
ఏమో
కానీ

స్వతంత్రతను కాపాడుకుంటూ
ఆ వేళ్ళు భూమి లో
కలిసిపోయిన
ఆ ఎత్తైన శాఖలు ఆకాశం లో
ఒక అద్భుతమైన అల్లిక
ప్రతి సృష్టి లా .... ప్రకృతి మహిమ

Sunday, June 15, 2014

మా నాన్న




తెలిసిన అన్ని సమస్యలూ
నాన్నగారి ఒక్క మాటతోనే
సర్ధుకునేవి, నా .... చిన్నప్పుడు
నాన్నగారి చిరునవ్వు లో సూర్యరశ్మి వెచ్చదనం
ఆ అరుపు ఉరుము లా
మంచితనం, ఉదార స్వభానికి మారు పేరు 
ఆయనంటే అందరికీ ఎంతో గౌరవమర్యాదలే
హద్దులు గీసేవాడు అన్నింటికీ
గణిత అభ్యాసాలను క్షుణ్ణంగా
అది చిన్నదైనా పెద్దదైనా
సమశ్యను కూలంకషంగా పరిశీలించి
రాత్రి భోజనాల వేళకు మునుపే ముగించేవాడు.



ఎదురులేని మనిషి, సింహం అనేవారు అందరూ
నత్తనడకలా ఏ పనీ జరగరాదని
ముందు నిలబడి మరీ, మార్గదర్శకుడిలా
పరుగులు తీసి, పరుగులు తీయించేవాడు.
అతనే మా నాన్న
మా నాన్న గారి మార్గదర్శకత్వం పొందేందుకు
ఆ మహొన్నత వ్యక్తి లేడు. జీవించి .... ఇప్పుడు.

Saturday, June 14, 2014

నేరమా ప్రేమ!?




సందేహం లేని, తిరస్కరణ కాని
నేర రహిత భావన ఒకటి
అగ్ని సమీపానికి వెళుతున్నట్లో
చీకటి అయోమయంలో పచార్లు చేస్తున్నట్లో
అజాగ్రత్త, అసాద్యం కోరికల ఒత్తిడి భారమై
హృదయం ముక్కలయ్యే దిశగా కదులుతూ

సరైనదో కాదో అని పట్టించుకోవాలనిపించని
ఆ చేతులు .... చుట్టూ అల్లుకునుంటే చాలనే
ఆ అనుభూతిని పొందితే చాలనిపించే
ఒక వింత వుద్వేగం
ఆ సమయం, ఆ అనుభూతి అపూర్వతను
పదిలంగా దాచేసుకోవాలనిపిస్తూ

ఆ కళ్ళలో
ఆ నవ్వు లో
ఆ ముద్దు లో .... అవిగో ఆశల
ఇంద్రధనస్సు రంగులు
ఊరిస్తూ
రక్తం ఉరకలెత్తేలా చేస్తూ

తప్పు వైపు
అడుగులేస్తున్నామని
మది వివేకం హెచ్చరిస్తున్నా
తప్పుకాదనే భావననే చూడాలని
తెలియని అనుభూతిని
తీపి స్పర్శనే కోరుకుంటూ




ఆ దేవుడే దిగివచ్చి
ఏదైనా కోరిక కోరాల్సొస్తే
ఈ అనుభవం, ఇలాగే ఉండాలని
ప్రార్ధించాలనిపిస్తూ,
ఆ అలౌక్య నిషిద్ద నిట్టూర్పులను
కలలా కనేలా చూడమని అడగాలనిపిస్తూ

నేరం కాని, సందేహం లేని
గొప్ప కామోద్దీపన .... అది ప్రేమో ఏమో కానీ
దూరం చెయ్యొద్దని .... ఓ దైవమా!
అది ప్రేమే అయితే ఆ అనుభూతిని శాశ్వతం చెయ్యమని
మన్నించమని కోరుకుంటూ,
ఆ ప్రేమిక/ప్రేమికుడు ని నేననుకుంటూ ....

Friday, June 13, 2014

నిబద్దించుకోలేక .... నన్ను!


 














మేము ఆదివాసులం
ఎవరి ఆలోచనలను ఎవరి ఆనందాన్ని
కాదనని
అర్ధం చేసుకోవాల్సిన సమాజం
వద్దనుకున్న జీవులం
మేమూ
మా సమూహమూ
మా దారుల్ని
సడల్చుకున్నాము. మీ ఇష్టం మేరా
శాంతిని కోరుకుని,
అయినా
మీరెందుకిలా ఇంకా మమ్మల్నీ,



మా గమ్యాన్ని నిర్వచిస్తున్నారు?
మీ నిర్దేశానుసారమే నడిచేలా?
మేము నడుస్తున్నాము.
నడుస్తూనే ఉన్నాము .... తరతరాలుగా
ఆది మానవుడి రోజుల్నుండీ
ఎందరమో ప్రాణాలను కోల్పోయాము.
మా భూముల నుంచి మమ్మల్ని వెలి వేసి, ఇంకా.
వెలి వేస్తూనే ఉన్నారు.
మాలో ఆవేశపరులు కొందరి ఆందోళన
వారి ఆవేశాన్ని ఆశయాల్నీ
మీ కాళ్ళ వద్ద పణంగా పెట్టామని .....
మీ శాంతి ప్రస్తావన విని,
ఇప్పుడు
వారు మమ్మల్ని జాతి ద్రోహులంటున్నారు
గాయపరుస్తున్నారు.
తిడుతున్నారు
వెలివేస్తున్నారు
మాలో ఎందరో విప్లవం బాట పడుతున్నారు.
తటస్తంగా ఉన్న మమ్మల్నే
అందరూ అసహ్యించుకునేది.
మా పైనే అన్ని అపనిందలూ
అన్నికోణాల నుంచీ
నేనొక ఆదివాసిని. ఇప్పుడు ....
నా రక్తం లో యుద్దమృదంగాలు
నా జాతి, నా జాతి గౌరవం కోసం
నేనిప్పుడు నా చేతిలో లేను.

Thursday, June 12, 2014

సహజీవన సౌరభం




అదే గీతాన్ని ఏకగళం తో అదే శ్రావ్యతతో గానం చేసి
సాధారణ చిరు ప్రక్రియల భాగస్వామ్యం లో
సౌకర్యం, ఆత్మానందం పొందగలిగి
నాదీ, నాకోసమే ఆమె జనియించిందని
అనుకునే....లా ప్రేయసి ఎవరైనా తారసపడాలని ....

సుప్రభాత వేళ తన తీపి నవ్వుల పరిమళంతో
నా ఉదయాన్ని చైతన్యం ప్రకాశవంతం చేసి
తన మృదువాక్కుల, సున్నిత నయనాల పలుకరింపులతో
నన్ను అభినందించి మరింత చేరువై
ఆత్మాలింగనము చేసుకునే ఒక సహచరి ఎవరైనా

రెండు గోడల ఇరుకు ఆలోచనల మధ్య
రెండు శరీరాల సంబాషణ లా కాక
అమ్మలక్కలు, మంద మారుతాల గుసగుసలు
కలిసి, కలిపిన ఇరు హృదయ సంగమం లా
బాధలు కష్టాలు కన్నీళ్ళలో తోడై ఉండే మానసి లా




నా ఒంటరి హృదయం మౌనం ని భగ్నం చేసి
చేరువై మమైకమై ఏ సహృదయం అయినా
తన సంగమం తో .... తీపి అభిరుచి, సౌకర్యం ఒద్దిక కూర్చి 
నా ఆత్మ స్పందనలు కన్నీళ్ళు కష్టం నిశ్శబ్దం
కలిసి పంచుకునేందుకు సమ భాగస్వామై ఎవరైనా

పైకి కనిపించని తొందరపాటు గాయాలు మచ్చలు
అవలక్షణాలు .... నా ఆత్మ అంతరంగం ను తట్టి
మరొక ఆత్మ లా చేరువై సహృద్భావం తో
బిడియపడక, అసహ్యించుకోక, అవకాశం అదృష్టం లా
జీవితాన్ని మార్చుకుని సంభరపడిపోయే తోడు

ఆ తోడు, ఆ లక్షణాలు .... ఆమె లో కనిపించాయి.
ఎంత అదృష్టం అనే భావన కలిగి

ఆమె సాన్నిహిత్యం అనుభూతి, స్వర్గం అనిపించే 
ఈ సంభరాల స్వాగత తోరణాలు .... ఆమె కోసం ఎర్రతివాచీ పరచి
నా కలల హర్మ్యం ముంగిట్లో నిలబడి ఎదురుచూస్తూ .... నేను