Wednesday, September 30, 2015

నేనో హంతకుడ్ని



ఒక నాడు నేనే నీకు అన్నీను
ఎంతో సంతోషంగా ఉండేదానివి,
నిజమో నటనో కాని
నేను కూడా ....
నీవు మాత్రం
హృదయమంతా నేనే నన్నట్లు ప్రేమించావు.
ఎంతో నీతిగా
అంతే లోతుగా
తప్పుడు దారిలో నేను నడుస్తున్నప్పుడు 
తెలిసే .... నన్ను ప్రేమించావు.
అకారణంగా ఎప్పుడైనా
నిన్ను తిట్టినప్పుడు కూడా
మనస్పూర్తిగానే స్వీకరించావు.
ఒకసారి నలుగురిలో మొరటుగా
నిన్ను ముద్దాడినప్పుడూ నన్ను మన్నించావు. 
తప్పులెన్ని చేసినా
నేను ఒక్క నవ్వు నవ్వితే చాలు అనుకునేదానివి.
అంత ప్రేమా నాశనం అయ్యింది.
ఒక్క క్షణం లో
నేను నీకు చెప్పకుండా
నిన్ను ఒంటరిగా ఒదిలి వెళ్ళిపోయానని 
అకారణంగా
అయోమయం అసంతులనం అయిపోయావు.
చంపేసినంతగా వ్యధ చెందావు.
నీ అమూల్య అస్తిత్వాన్ని
నీ ఆత్మను తీసుకుని పారిపోయినంతగా
ఆ ఆత్మే ఇన్నాళ్ళూ నన్ను సహించిందేమో ....
నా తప్పుల్ని మానవతా దృష్టితో చూసి
అప్పటి నుంచీ నీ కళ్ళకు నేనో ... హంతకుడ్ని!
నీకు నీ ఆత్మకావాలి
నీకు నచ్చినవారిని నీవు తిరిగి ప్రేమించాలి.
మళ్ళీ మధుర భావనలలో నీవు ఈదులాడాలి.
ప్రేమించబడాలి .... ఒక్క నాతో తప్ప .... 
ఎందుకంటే, అది నీ నమ్మకం
నేను ఒక ఒంటరిని .... నీచుడ్ని అని,
నేనిక మారను అని,
హంతకుడ్నిలా ఇలానే ఎప్పటికీ ఉంటాను అని,

Tuesday, September 29, 2015

నేను నేరం చేసానా?



నా రక్త మాంసాల  
కుదుళ్ళు కదిలేలా 
ఒక కొలిమి 
గొయ్యి తవ్వి 
పాకుతున్నావు. 
వెన్నుముక కు 
సమాతరం గా 

పిడిగుద్దులు గుద్ది 
శరీరం లోకి 
సొరంగాలు తవ్వి
తవిటిపురుగు లా 
గజ్జి తామర బాధిస్తున్న 
పిచ్చిదానిలా 
నన్ను 
విషమయం చేసి  

నా రక్తనాళాలు 
జ్ఞానేంద్రియాలు 
చీకటి నాళాలు 
నీ కదలికల 
రహదారుల్లా మార్చి 
నేను క్షీణిస్తూ 
శిధిలావస్థకు చేరేలా   


ఒక్క హృదయమేనా
శరీరం అంతా, ప్రతి అణువూ 
కుట్లు బెజ్జాలు వేసుకుని 
గుంతలు తవ్వుకుని 
కృశించి నశించి
ఔనూ .... ప్రియురాలిని 
ఇంత ఘాడంగానూ 
ప్రేమించక తప్పదా?

ఓ పసి మనసా



కళ్ళు మూసుకో, భయపడకు
అగంతకుడు వెళ్ళిపోయాడు
ఈ చీకటి చిద్రం కాక తప్పదు
నిన్ను కన్నతల్లిని
నీ పక్కనే తోడు ఉన్నాను.

నీవు నిద్దురపోవాలనుకున్నప్పుడు,
చిరు ధ్యానం చెయ్యి
ప్రతి రోజూ అనుక్షణమూ అన్ని విధాల
నీకు ధైర్యం, నమ్మకం పెరిగి
మనోప్రశాంతత దొరికేవరకూ

ఎన్నినాళ్ళుగానో ఈదుతూ ఉన్నాను
ఈ సంసారం సాగరం జీవితం
ఎదురుచూస్తూ ఉన్నాను
నువ్వు ఎదగాలి తొందరగా అని
అందుకు తొందర తగదని 



కాలమే ప్రమాణం చైతన్యానికి 
కాలం కన్న వేగంగా కదలలేము
ఎప్పుడైనా, తెలియని మార్గంలో
కదిలే ప్రయత్నం చేస్తున్నప్పుడు
నా అనుభవం చెయ్యందుకో

జరగబోయేదే జీవితం అనుకుని 
నీ ప్రయత్నాలు
నీ కలలు
నీ ఆశల
క్రమ సరళి ని నీవే నిర్ణయించుకో

ఓ తల్లీ, ఓ నా ప్రాణమా
నిద్దుర లేస్తునే .... నవ్య చైతన్యం
నవ రాగానివై పురోగమించు
మానవీయత పరిపూర్ణత వైపు
కాంతులు వెదజల్లుతూ

ఊపిరి



నీ జీవితంలో ఒక రోజు వస్తుంది. 
నీవూ ముద్దాడుతావు
ఎవరు సమీపం లో లేకుండా 
శ్వాసించ లేవో .... 
ఆ ప్రియ మానసిని.
అప్పుడే 
తెలుస్తుంది నీకు,
ప్రాణిగా శ్వాసకన్నా ముఖ్యమైనది 
ఒకటి ఉందని.
అదే ప్రేమ అని.

అది ఒక అణగని, వశపడని 
గడుసు శక్తి అని. 
నియంత్రించాలని అనుకుంటే, 
నాశనం చేస్తుంది అని. 
ఖైదు చెయ్యాలని అనుకుంటే, 
బానిసను చేస్తుంది అని.
అర్థం చేసుకోవాలని అనుకుంటే, 
అమూల్యమైన 
ఎన్నింటినో కోల్పోయిన 
గందరగోళం భావనను కలిగిస్తుంది అని.

Monday, September 28, 2015

తప్పనిసరే అంతా



నిద్దుర రాదు, 
తల నిండిన నీ ఆలోచనలకు 
లొంగిపోయి 
తగదు తగదని అరుస్తూ 
లోలోపల 

నీకు వినపడే అవకాశం లేదు, 
వినపడినా నీవు వినవు 
నాకు తెలుసు 
తెలిసే తప్పదనుకుని నాకు ఇష్టమైన  
ఏ లక్షణానికో అతుక్కునుంటాను.

నీవు మాత్రం 
నా బుర్రను తొలుస్తూ ఉంటావు 
భయపెడుతుంటావు 
అంతకు మించి భిన్నంగా 
ఏమీ ఉండదు.

ఎక్కడికి పారిపోలేను పోయినా 
మనం మనమనే చోటుకే చేరి
అలిసి నీ ముద్దులకు లొంగిపోతాను. 
వద్దు కాదు కూడదనుకుంటూనే 
భావనలను తొక్కిపట్టి 

కానీ  
నీ ఆలోచనలకు మాత్రం 
దూరంగా పారిపోలేను 
నిన్ను తాకకుండా ఉండనూలేను 

ఒకరి వలలో 
ఒకరి ప్రేమలో ఒకరు సుస్థిరమైనట్లు 
బద్దకపు లక్షణాల సౌకర్యాలకు లొంగి 
కాసింత అసౌకర్యంగానూ ఉంటాము 
అంతవరకే మనకు తెలుసు.
  
మన మనోభావనల ప్రభావం తో 
మనకు సంబంధం లేకుండా 
నడుచుకుంటాము. 
మాట్లాడుకుంటాము 
వింత వింత వాగ్దానాలు చేస్తుంటాము. 

చివరికి మనం 
మనమున్న చోటుకే చేరుకుంటాము. 
స్థిమితపడుతుంటాము. 
నాలో నీ మది పలుకుల్ని విని చూడు 
నీకే అర్ధం అవుతుంది.

Sunday, September 27, 2015

నాకెంతో ఇష్టం వర్షంలో స్నానం




స్వేదం కరగడం
విసిరే వర్షంలో తడవడం
ఎప్పుడైనా కాళ్ళు బురదలో కూరుకుపోయి
లాక్కోవడం లో సఫలీకృతుడిని కావడం 
సంక్లిష్టత ఉండి
అందులోంచి చాకచక్యంగా బయటపడటం
ఇది అందరికీ అంత ఇష్టముండదు.
అయినా, నాకు మాత్రం
కష్టాల్లో స్నానం చెయ్యడం ఇష్టం
చెడును ఎక్కడైనా గమనించినప్పుడు
నాలో ఉత్సాహం
దాన్ని శుభవార్తగా మార్చడానికి
అవకాశమేమన్నా దొరుకుతుందా అని
ఎవరి బాధనో విచారాన్నో ఆనందించి
అనుభూతి చెందాలని మాత్రం కాదు
నిజం నేస్తం!
వర్షం వర్షిస్తేనే నాకిష్టం
నీకేవైనా బాధలు కష్టాలు ఉంటే గుమ్మరించు
నా ముందు, నా మీద
నాకెంతో ఇష్టం
కష్టాలను ఎదుర్కుని సహాయం పొందిన 
కళ్ళల్లో కాంతుల్ని చూడటం
నాకెంతో ఇష్టం
వర్షంలో తడవడం
కష్టాల్లో మునిగి తేలడం
తప్పుదారిన ఎవరైనా వెళుతుంటే
దారి చూపించి 
మార్గదర్శకుడ్ని కావడం
నాకిష్టం
మంచి వైపు మార్గం చూపాననే
ఒక మంచి అనుభూతిని పొందడం
అందుకే
నాకెంతో ఇష్టం
మొన్నటి మధుర గీతాలు
నిన్నటి బాధాతప్త హృదయ రాగాలు
నాకెంతో ఇష్టం కురుస్తున్న కష్టాల్లో మునగడం
చీకటిలో చిరునవ్వుల వెలుగులు నింపడం

నీ కనుసన్నలలో


చదవగా చదవగా అనిపిస్తుంది
నాకు నీవు జన్మజన్మాలుగా తెలుసని
నీకు కూడా విడమర్చేఅంత లోతుగా
నీ మనోభావనల విశిష్టతను
నీ చిరునవ్వును
సూక్ష్మంగా చూడగలనని
నీకు కూడా తెలుసు
ప్రేమ భావన అనే దారం
మన అనురాగం పూపరిమళాలను
అల్లుకుని ఇరువురిని ఒక్కరుగా
కట్టిపడెయ్యాలని చూస్తుందని

నీ కళ్ళలో చూడగలుగుతున్నాను
నా కలల జీవన గమ్యాలను
నీ కనుసంజ్ఞలలో చూడగలుగుతున్నాను
ఎన్నో శేష ప్రశ్నల సమాధానాలను
చూస్తున్నాను .... నీకూ నాకూ మధ్య పెంపొందిన
అమర ప్రేమబంధం కారణాలను
చూస్తున్నాను .... జీవ సాగరంలో మనం అనే నావ
సురక్షితంగా ఒడ్డుకు చేరగలగడాన్ని
నీ సాహచర్యం లోనే .... అర్ధం చేసుకోగలుగుతున్నాను
ఇంతగా నీ పట్లే ఎందుకు ప్రేమో నాకు అని 


ఎన్నోసార్లు నీవూ నాతో అన్నావు. 
కాలం తో పాటు జీవితమూ మారుతుందని
గమ్యాన్ని ఎవరమూ నిర్ణయించలేము అని
కాలమే మనుషులను
అపరిచితులుగానో ఆత్మీయులుగానో చేస్తుందని
మనిషిలో మార్పుతో పాటు 
పురోగమనాన్నీ కాలమే నిర్దేశిస్తుంది అని
ఆ కాలచక్రం పరిభ్రమణలోనే 
సమయంతో పాటు దారులూ మారుతూ
ఒక్క ప్రేమ మాత్రమే శాశ్వతం అన్నావు.
ఆ ప్రేమ కోసమే నా తపన .... మానసీ

Saturday, September 26, 2015

తోడు కావాలి


తెలుసు ఇప్పటికే ఆలశ్యం అయ్యిందని
నేనిలా రావడం సరి కాదని
నీ కలల్లోకి
ప్రభావితం చేసేందుకు ....
ఈ రాత్తిరి

అన్నీ అనూహ్యం గానే జరిగిపోతూ
మనసెందుకో నీ వైపే లాగుతుంది.
నీ కళ్ళలోకి చూడాలనిపిస్తుంది.
ఏదో స్పష్టత కోసం
నాలో చెలరేగి నలిపేసే
ఎన్నో శేషప్రశ్నల సమాధానాల కోసం

వృత్తి పరంగా దూరంగా వెళ్ళక తప్పదు

దూరమవ్వక తప్పదని తెలిసాకే
ఈ తపన ....
నీతో గడిపేందుకు
ఈ ఒక్క రాత్తిరి మాత్రమే మిగిలుందనే
నిన్ను మరింత దగ్గరకు తీసుకుని
పొదువుకోవాలనిపిస్తుంది.



ఒకపని చేస్తే ....
నీవు లేని
రేపును దూరంగా ఉంచగలిగితే
ఈ రాత్రే కలకాలం ఉండేలా చేసుకోగలిగితే

అవును,
నీకు చేరువై,
కొన్ని తీపి క్షణాలను
ఎప్పటికీ మరుపురాని కొన్ని మధుర జ్ఞాపకాలను 
నీ పరోక్షంలో నెమరువేసుకునేందుకు
దాచుకుని ఉంటే మదిలో ఎంత బాగుంటుంది.
నీవు లేనప్పుడు గుండె పగులకుండా ....

నా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయి.
నా అంతరంగం లో
నీపట్ల ఇంత ప్రేమ ఉందని
మనం దూరమౌతావని తెలిసాకే బయటపడింది.
జతగా రావా అని బ్రతిమాడాలనిపించేంతగా

ఎందుకిలానో


ఎందుకు నేనిలా ఎప్పుడూ దిగులుగా 
దూరంగా ఎందుకు పోలేనో 
నీ ఆలోచనలకు, నీకూ 

ఎందుకు నా గుండెలో 
నీవే ఉన్నట్లు 
నా గుండె తీవ్రంగా కొట్టుకుంటుందో 

ఎందుకు నా భావనల్లో 
నా రాతల్లో 
నిన్ను గురించిన ప్రస్తావనలే అన్నీనో   

ప్రేమంటే తెలియని 
నా తలగడ తడిచిపోతుంది  
అర్ధరాత్రివేళల్లోనే .... ఎందుకనో  


ఎందుకు నీవిలా నన్ను ఒంటరిని చేసి 
మలేరియాలా పట్టుకుని 
సతాయిస్తున్నావో 

ఎందుకో 
నిజం చెప్పు మానసీ .... నీవే కదూ 
నా ఈ సమశ్యలన్నింటి సమాధానానివి 

నీవే కదూ 
నా ప్రేమ అబద్దమూ 
నిరర్ధకమూ కాదని తేల్చే పరిపూర్ణతవి 

పరవశము నేను


సందేహాస్పద ఆలోచనాతత్వ
యౌవ్వనం నేను
అపరిపక్వ భావనల
ఆరాటం నేను
మంచీ, చెడు
మొండితనాల మధ్య
ఊగిసలాటను నేను
దూరంగా ఉండమనే హెచ్చరిక
దరికి రారమ్మనే యాచనల
రాతల మనోభావనను నేను 

 ఒక అసాధారణ
అసంతులన స్థితిని నేను
మోకాలి మీద కూర్చుని
పువ్వందించి
ప్రేమించబడాలనుకునే
సాహసాన్ని నేను
ఇష్టం నే ప్రేమనుకునే
నమ్మదగని ఉద్వేగం నేను

Friday, September 25, 2015

కుశలమే నేను


కలకన్నాను. ఆ కలలో
నిన్నరాత్రి 
నేనంటే నీకు ఎంతో శ్రద్దుందని 
తెలుసుకున్నాను.
ఒక ఒంటరి నేనూ 
మరో ఒంటరి నీవు ఎదురయ్యి 
"ఎలా వున్నావు? 
ఏం చేస్తున్నావు? 
కుశలమేనా?" అన్నావు. 

ఎంత అనూహ్య సంతోషమో 
గాల్లో తేలినట్లు  
గోరు వెచ్చని 
ఎంత వింత స్పర్శానుభూతో అది 
నిద్దుర లేవాలనిపించని 
బద్దకము తనువంతా ఆవహించి

Tuesday, September 22, 2015

పడిపోయాను


ఎప్పుడూ ప్రేమే, ఇష్టమే
నీవంటే
అంతరంగం లో
నీలో ఏదో ప్రత్యేకత ఉంది

అది నీ నవ్వో!?
నీ అందమైన కళ్ళో!?
అద్భుతమైన నీ స్త్రీత్వమో!? 
చెప్పలేను 


ఏదైనా కావచ్చు
నేను మాత్రం పడిపోయాను
బొక్కబోర్లా .... ప్రేమ లో
ఎంత ఘాడంగా పడ్డానో మరి 

శూన్యం


కాదనుకున్నావు. 
వెళ్ళిపోయావు దూరంగా 
శూన్య భావనల మయం చేసి  

చుట్టూ 
నల్లని చీకటి శూన్యం 
అంతర్గతంగా 

నిర్జన దురావస్థను .... నేను 
ఒక గజిబిజి గందరగోళం 
శూన్యమై సర్వమూ 

నీ చుట్టే ఎప్పటికీ .... ఈ మనోభావనలు


జన్మ జన్మల బంధం మనోహరీ మనది
ఎప్పుడైనా
ఒక్క క్షణమైనా నీతో ఉంటే చాలనిపిస్తూ
కలలు, ఆశలు .... నీడలా అపనమ్మకమూ 
అంతలోనే ఆ కల నిజమైన భావన 
నా మనసెప్పుడూ
నిన్నే కోరుకుంటూ, నీ చుట్టే తిరుగుతూ 
మున్ముందు కూడా ఈ కల ఇలానే పండాలని
ప్రేమే జీవితమై మనం ముందుకు కదులుతూ  
రహదారంతా ప్రేమై పరిమళించాలని   
ప్రతి రోజూ నీ అనురాగం పొంది
నా ఎద దూదిపింజవ్వాలి.
శరీరం గాల్లో తేలిపోవాలని
నీ చిరునవ్వు తాకి 


బేషరతుగా నా ప్రేమెప్పుడూ నీవే అని 
మరోసారి చెబుతున్నా
సమయం తీసుకుని నింపాదిగా ప్రస్తావించు చాలు
నేనంటే శ్రద్దే అని
కలిసి పంచుకుందాము భవిష్యత్తును అని
బాధలు, కష్టాల పిదప ఆనందం, సుఖం ఉన్నాయని
నిన్ను కలిసిన ప్రతిసారీ అనుకుంటూ 
విడమర్చే చెప్పలేను
నీ చర్యల పతిక్రియల ప్రభావమే అంతా అని 
ఔనూ, ఒకవేళ ఎప్పుడైనా ఒక్క క్షణమైనా నీవు
ఒంటరివై ఉండి ఒంటరిననుకుంటే .... 
నన్ను తలచుకుని 
కొన్ని క్షణాల సమయమైనా నాకివ్వగలవా
ఆ అద్భుత అమృత క్షణాల్ని 
జ్ఞాపకాలు గా నిక్షిప్త నిధి లా దాచుకుందుకు

Sunday, September 20, 2015

పోరాటం ఊపిరై


ప్రతి ముగింపు ఒక ప్రారంభం లా
సమయమూ మూల్యమూ పెరిగి ఆశయాలు 
మసకమబ్బులు అన్నివైపుల్నుంచి ఆవహించి   
ఎంత భయానకమో ఆ స్థితి 

రహదారి ఒడిదుడుకుల మయం అయినా 
అంతిమ క్షణాల్లో గమ్యం చేరిన తరువాత 
పడిన కష్టం, నొప్పి, భయం మర్చిపోయి 
పొందిన ఫలాన్ని చూసుకుని మురిసిపోయి  

కొన్ని సూక్ష్మ క్షణాల ఆ ఆనందం 
ఆ అంధకారానుభూతి పిదప ఆ జీవితం 
నిశ్శబ్దము శాంతి మయమై  
అలాగే కొన సాగు .... శాశ్వతత్వం వైపు 

Saturday, September 19, 2015

నీ స్నేహం కావాలి


కోరుకుంటున్నా.... కనీసం ఒక్క రోజైనా
ఆరు బయట
పడీదులో
నీతో కూర్చుని
ఆ సూర్యకిరణాల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ
ముచ్చటించాలని
మన కష్టాలన్నీ
పొగమంచులా కరిగిపోయి 
నీవు, నా నేస్తానివి కావాలని

మది నిండిన మన మనోభావనల వెచ్చదనం
శరీరాన్నీ ముఖాన్నీ ఆవహించాలని
నీతో కలిసి నడవాలని
ఈ పడీదుల్లో .... ప్రాణాన్ని
చూపిస్తూ
నేను ప్రతి రోజూ
తిరిగి జీవించిన ప్రదేశాలను
చూస్తూ .... కోరుకుందామని
మన కష్టాలు
సౌకర్యాలుగా పరిణమించాలని 

నేనూ నీవూ కలిసి పరుగులుతీసి
అల్లరిచేసి 
ఆనందించాలి
అలసి సొలసి కూలబడి
నవ్వులు విరజిమ్మాలి అని
ఉల్లాసం, ఉత్సుకత
నీ ముఖంపై చిరు చెమటై చిందాలని

నా కోరిక
తూరుపు నుంచి పశ్చిమానికి కదిలుతున్న
నిస్వార్ధ భానునిలా
కదలమని మొహమాట పెట్టి
శూన్య పడీదుల్లో
నిన్ను పరుగులుతీయించి
సుఖం లో సుఖం లేదని
శ్రమలోనూ, తోడులోనే ఉందని ....
కలిసి చూసిన చోటే
ఆనంద సరోవరాలున్నాయని చెప్పాలనే

ప్రయత్నమూ ఆశ ఉన్నాయి నా కోరికలో
ఆ గోరు వెచ్చని ఎండ
శరీరాన్ని తాకి
కష్టాలు కరిగిపోయి 
ఎన్నాళ్ళుగానో
నాలో నేను పాడుకునే కూనిరాగాన్ని
పాటలా నీతో కలిసి పాడుకుందామనే 
నీ నేస్తాన్నయ్యే భాగ్యం పొందాలనే
ఒక్కరోజైనా
ఆ పరిమళాలు ఆస్వాదించాలనే

చివరికి మిగిలదేదీ


తీవ్రస్థాయిలో
తడుముకుంటూ ఉన్నాను.
నా ఏకాంత గృహంలో
అన్ని మూలలా ....
కావలిసిన అమూల్యమైన దేన్నో
ఎక్కడో పారేసుకున్నట్లు
ఆ నీలి ఆకాశం రంగు
జ్ఞాపిక కోసం పిచ్చిగా 

మబ్బుల చాటు చంద్రుడ్ని
తెచ్చిస్తానన్న
నాటి నా అనాలోచిత వాగ్దానం
నిజం చెయ్యబోతున్నవాడిలా
నాడు నీకు కోసి తెచ్చిస్తానన్న
ఆ నక్షత్రాలను
భద్రంగా దాచేసుకుని
వెదుక్కుంటున్నవాడిలా 


వెదుకుతున్నది దొరికింది.
అది మసకేసి దుమ్ముకొట్టుకుని
వెలిసిపోయి చీకిపోయి
శ్మశానం బూడిదలా ....
నీవు ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం ఇచ్చిన
నా పేరు తొలి అక్షరం ఉన్న రుమాలు అది
బహు భద్రంగా
గుండెలకు హత్తుకున్నాను. 
కన్నీళ్ళ వర్షం కురిసి కురిసి అలసిన
ఆకాశాన్ని .... నేనై

Friday, September 18, 2015

చిక్కుకుపోయా .... నీ చూపుల్లో


నీ కళ్ళలో ఆ నిర్మలత్వం 
దోబూచులాడే ఆ అమాయకత్వం
ఏం మాయో కానీ 
ఆ అద్భుతం
కనికట్టు లా
కేవలం
ఒకే ఒక్క చూపు
నమ్మని ప్రతి దాన్నీ
అప్సర, కిన్నెర
యక్ష, గాందర్వాలను
మాయను
మర్మాన్నీ
ప్రేమను నమ్మేలా చేసి

Thursday, September 17, 2015

గుర్తొస్తుంటావు కానీ గుర్తు చేసుకోను


పక్కన ఉన్నా ఎక్కడ ఉన్నా
నా ఆకాంక్ష
నీవు సుఖం గా ఉండాలని
నీవు వెళ్ళిన నాటి నుంచి
కోలుకుంటూ ఉన్నాను
నెమ్మదిగా .... ఇప్పుడిప్పుడే
సాధారణ జీవితం
సామాన్యుడ్ని కాగలుగుతున్నాను.
మరీ అంత కష్టంగానూ 
భరించలేనంత బాధగానూ లేదు

ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. 
అప్పుడప్పుడూ
ఇది సాధ్యం ఎలా అయ్యిందా అని
ఎలా అయ్యాను?
మామూలు మనిషిని అని
పతనమైన నేను
ఆ పతనావస్థకు దూరంగా
జీవించగలుగుతున్నానన్న భావనలోకి
ఎలా రాగలిగాను అని
ఇది ఆశ్చర్యం కాదు
మళ్ళీ స్వేచ్చా వాయువులు
పిలుస్తున్నానన్న భావనే తప్ప

ఎప్పుడైనా ఒక్కోసారి బాధగానూ
భారంగానూ ఉంటుంది.
ముఖ్యంగా శ్వాసిస్తున్నప్పుడు
అప్పుడే ఒత్తిడి ఎక్కువయ్యి
గుండె ముక్కలైపోతున్నట్లు
తీవ్రంగా కొట్టుకుంటుంది.
కలలు కనే వేళే కలలు రావు.
గమ్యాలు ఆశలూ మరణిస్తుంటాయి.
అందుకే, ఆ స్థితి నుంచి విముక్తి కోసమే
ఎప్పుడో, ఈ శ్వాస ఆపుకునే ప్రయత్నం 


నేను అబద్దాలు చెప్పడం లేదు.
రాత్రి వేళల్లో ఒంటరిగా
నిద్దుర పోకుండా ఉంటున్నానని
కాలనీ చివర
ఏ పార్కులోనో కూర్చుని
విలపిస్తున్నానని .... అయినా
ఆదుర్దా చెందాల్సిన అవసరం లేదు
నిజం గా, నేను సామాన్యం గానే ఉన్నాను.
ఏ గతాన్నీ, నీ జ్ఞాపకాల్నీ
తిరిగి చూడటం లేదు.

నీవు గుర్తుకొచ్చినప్పుడే
ఆ జ్ఞాపకాల నీడలు
జుట్టులు విరబోసుకుని
వెంటాడినప్పుడే
ఈ శ్వాస అందకుండా పోయే స్థితి.
శరీరం లో వేడి తీవ్ర స్థాయికి చేరి
కళ్ళు మసకబారి పోతూ
అందుకే నిర్ణయించుకున్నాను.
ఇక తలతిప్పి చూడను అని
గతం లోకి, మన ఒకప్పటి అన్యోన్యత
అనురాగం జ్ఞాపకాలలోకి. 

Sunday, September 13, 2015

సాహసం చెయ్యాలి


నాకైతే తెలియదు 
ఎందుకు జన్మించానో 
ఏమి సాధించేందుకనో 
తెలియని సిగ్గు 
సిగ్గును మించి అబిమానం 
అస్తిత్వంగా జీవిస్తూ 


ఎందుకో తెలియదు 
బిగ్గరగా ఏడవాలని ఉంటూ  
అప్పుడప్పుడు 
ఎందుకు బ్రతికున్నానా అని 
అనిపిస్తూ 
చచ్చిపోవాలనిపిస్తుంటుంది. 


జీవించాలనీ అనిపిస్తుంది. 
సాధించాలని, .... బ్రతికి 
గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని
పిల్లల్ని కనాలని, ఆ పిల్లలు పెరిగి 
నా అంతవాళ్ళయ్యి  
వాళ్ళూ పిల్లల్ని కనాలి అని 
కలలు కంటూ ఉంటాను. 


కానీ, ఎందుకో ఎప్పుడూ 
నా మదిలో ఓ మూల 
ఏదో సంశయం 
ఎవరో భోదిస్తున్న అనుభూతి 
నీవు అర్హుడివి కావు 
అర్ధం చేసుకుని జీవించేందుకు 
సాహసించ గలగాలి అని

Saturday, September 12, 2015

శూన్యరాగం


నేను
ఒక ఖాళీ మనసును.
ఒక తడి ఆరని రెల్లును,
నిటారుగా నిలబడలేని
నిర్జన రహదారిలో ....
పిచ్చితనాన్ని లా
తూలుతూ కదులు ప్రేమను 


నేను
ఒక అపరంజిని.
స్వచ్ఛతను,
అమాయకతను,
ఆడుకోవడటానికి సరదాపడేంత
పడేస్తే పడి పగిలి ....
గుండె ముక్కలైపోయే 
సౌందర్యాలరాసిని

మార్పు తప్పదు


పరిభ్రమిస్తూ  
భూమి  
చైతన్యం కదలికలు 
మాత్రం అలానే 
ఉండిపోవాలని  

కాల చక్రం ఆగి 
కొన్ని క్షణాలు 
కొన్ని అమృత గడియలు మాత్రం 
సంరక్షించబడి  
దాచివేయబడాలని 
అనుకోవడం అసమంజసం 

అంతం, అర్హత 
ప్రామాణికం కావు 
ఏ సందర్భాలు 
సంఘటనలకు   
ఒక సమయపు ఆదర్శం 
మరో సమయం లో 
ఆదర్శం కాకపోవచ్చు  

అందుకే 
సమయము 
మనిషి మనోగతం 
మారుతున్న ప్రమాణాలతో పాటు 
మార్పు చెందాలి. 
తప్పదు మనిషి కి 

Friday, September 11, 2015

కాల్పనిక జీవితంలో


నా కోరిక
సమాధి కాబడాలి అని
కాల్పనిక ప్రపంచం లో
వాక్యాలు, పేజీలు 



ముగింపు ఎరుగని
హాని తలపెట్టని
పదాక్షరాలలో
అంతకన్నా అందంగా
ఎన్నడూ
వ్రాయబడని రీతిలో

ప్రేమలో


అదో వింత ఆకర్షణ 
వింత ప్రేమానుభూతి 
వర్షపునీటి బొట్లపైనుంచి  
పరావర్తన చెంది  

వెలుగు కిరణాలు 
కొన్ని 
మన్మథ లక్ష్యాలై 
బంగారు శరాలులా రాలి  


Monday, September 7, 2015

అందం అంతరంగం


చూసాను .... ఈ రోజే
ఒక అందం, అంతరంగాన్ని  
ఒక యౌవ్వనం, సౌందర్యాన్ని 
ఎన్నో వన్నెల కిరణాల 
ఆకర్షణా శక్తి,  
మరెన్నో లక్షల లక్షణాల 
లోపాల మానవ శిల్పాన్ని
ఆలోచించడమే కష్టంగా ఉంది. 
అంత అందం 
అంత విలాసమయమైన 
ఆ ముఖం చాటున  
అంత స్వార్ధం, 
అహం అంతరంగమా అని  
మానవ అస్తిత్వం నిజంగా 
అంత లోపమయమా అని 

Saturday, September 5, 2015

మచ్చ ఏదైనా


ఎంత కొత్త అనుబంధం సంబంధం ను
పెంపొందించుకున్నా
చవుడు నేల తడి బురద లా
అలాగే ఉండిపోతుంది.
ఏర్పడిన గాయపు మచ్చ
ఎదీ ఆ మచ్చను కప్పేస్తూ ఎదగదు
కాస్మటిక్ సర్జరీ తో
బాహ్య ప్రపంచం కళ్ళను కప్పొచ్చు కాని 


వాస్తవం గతం
జ్ఞాపకం మచ్చ అలాగే నిన్ను
అసంతృప్తి గురిచేస్తూనే ఉంటుంది

అస్థిరత


స్థిరం గా నిలబడలేని  
ఘోర భయానక స్థితి, అస్థిరత 
వెన్నుపూసల్లోంచి పుట్టుకొస్తూ చలి 
రాపిడి శబ్దం చేస్తూ దవడ పళ్లు 
ఎడారిలా ఎండి పగిలిన పెదవులు 

పాషాణ హృదయ రక్తనాళాలు  
అలజడి అసంతులనాల సునామీ తో  
చిన్ని పదాల అనంత అహం లా 
శరీరం కంపిస్తూ కొట్టుకోవాలనిపిస్తుంది.  
నా నుదురు, నా దవడ, నా చాతీ

మానసి మాట్లాడింది



చివరి సారి 
ఆమెను నేను చూసినప్పుడు, 
ఆమె అన్న మాటలు 
ఇంకా 
చెవిలో ప్రతిధ్వనిస్తునే ఉన్నాయి.

అందరూ సున్నిత మనస్కులే 
అయినా, ఎందుకో తెలియదు. 
కొందరు ప్రేమికులు మాత్రం 
మిగిలినవారి కన్నా .... లోతుగా 
సున్నితంగా ఆలోచిస్తుంటారు. అంది

అది ఒక రకం గా 
శాపము 
మరొకరకం గా 
వరము 
అని కూడా అంది. 

అప్పుడప్పుడూ  
ఏ ఆనందపు వెచ్చదనాన్నో 
ఆస్వాధించుతూ, 
అప్పుడే, ఏ వేడి వాడి 
వడగాలిలానూ భావించుతారు అంది.

సరిగా 
ఆ మాటలు నాతో అన్న 
వారం రోజుల 
తరువాత కనిపించలేదు, 
ఆమె మళ్ళీ 

సీరా ఒలికి .....


నిజంగా
నా ప్రపంచంలోకి నీవు అడుగుపెట్టిన్నాడు
ఎంత అందంగా రాసావో
నా జీవితాన్ని
తుడిచేసి ....
బాధలు, గాయాల మచ్చల్ని
ఎంత ఆనందం
ఎంత వింత మధురానుభూతో అది
నీవే రచయిత్రివి కవయిత్రివి మన కథకు
తియ్యదనం, సంతోషం
పులకరింతల ఇంద్రధనస్సులు నిండిన
సరళమైన మన జీవన కావ్యానికి 


ఎందుకో, ఏమయ్యిందో, కారణం ఏమిటో
అనుకోకుండా ఆ రోజు
నీవే అన్నావు.
ఈ ఆనందానుభుతులు అశాశ్వతం
సంతృప్తిని ఇవ్వలేకపోతున్నాయి అని
నా జీవితంలోంచి
నిన్ను తుడిచెయ్యాలనుకుంటున్నాను అని 
నేను కనీసం ఆలోచించనైనా లేని
భావన అది,
నీవు లేని జీవితాన్ని ఊహించనైనా లేను.
నీకూ తెలుసు ....
నీవు కలిసిన తొలిరోజు నుంచీ
నీవే నా ప్రపంచానివి, నా జీవితానివి అని

Thursday, September 3, 2015

ప్రేమ



నీవే నాలోనూ
నీవే నా చుట్టూనూ
ఒక్క నీవే కనిపిస్తున్నావు
ఏవైపు చూసినా
వెళ్ళినా
బహుశ
మన
ప్రేమ ప్రపంచం లో
అంతా శూన్యమేనేమో
ఒక్క నీవూ నేనూ తప్ప