Wednesday, October 26, 2016

నీవు మాట్లాడితే వినాలని
పక్కన నీవు ఉన్నావు అని
ఆశను కోల్పోయిన
ఘాడమైన నొప్పి ....
ఊపిరి ఆడని ఆలోచనల ఒత్తిడి

ఎటుచూసినా అంధకారం
అనంత నిశ్చేష్టత
మిణుగురంత కాంతీ లేదు
కాలాంతం వరకూ అన్నట్లు

ఉత్సాహం ఇసుమంతైనా లేని
నీడలా ఉండాల్సిన స్థితి
కలలు రాక
నిద్దుర లేని ఎండిన కళ్ళతో

కోల్పోయాను సంతోషాన్నీ
నిన్నూ, నీతో కలిసి
జీవించే అవకాశాన్ని
విలువైన జ్ఞాపకాలను కూడా

ఎందుకో తెలియదు కానీ మానసీ ....
ఏదైనా నీవు చెబుతావేమో
వినాలి సంతృప్తి చెందాలని ఉంది
అది మాధుర్యమైనా తీపి బాధైనా

Saturday, October 22, 2016

నిరర్ధక యాంత్రికతఅన్ని వైపులా చీకటే
పోగొట్టుకున్న
హృదయం కోసం తపిస్తున్న
అతని కళ్ళముందు
భరించలేని ఒంటరితనమే

వక్రీకృత నిర్జన ప్రదేశాల
పలుకరింపుల భారం అతని పై
రాలని కన్నీళ్ళ
అతని ఎండిన కళ్ళ కొలనులు  
రక్త వర్ణంతో జేవురించి

ఏదీ అమరం కాదని తెలుసు 
ఏదీ నిత్యం అనుకోలేక
నిలకడ అనుకోలేకపోయినా 
అతని తియ్యని బాధానుభూతులే
ఎవ్వరూ దొంగిలించలేని ఆస్థి అతని వద్ద ఇప్పుడు
పగిలేందుకు ఏ పెళుసుతనమూ లేదు
ఏ పట్టింపూ లేదు  
అమూల్యత .... ఏమీ మిగిలి లేని
యాంత్రిక అపజయం అతను 

అతని హృదయమూ ప్రేమ
నిరంతర పోరాడుతూ 
అస్తిత్వం మనుగడకు అతను
ఏ చీకటి మూలల్లోనో
తల దాచుకోక తప్పనిస్థితైతే 

ఆ తలదాచుకున్న సంరక్షణ స్థలం  
వేరెవరి పరిదిలోనో ఉంటే
అర్ధ రహితమే ....
అలా ప్రేమ లో పడి కొట్టుకోవడం
ఎదురుచూస్తూ తపించడం 

నా ఆత్మబాంధవివి నీవుసమశ్యల దండకారణ్యం లో
అగమ్యుడినై ఉన్నప్పుడు
నా మంచి చెడులను  
విశ్లేషించే
నిఘంటువు సూచివి నీవు
నా కంటి వెలుగువి నీవు 
చీకటి అయోమయంలో
నా జీవన రధ 
సంకల్ప సారధివి నీవు 
ఈ ఊపిరి ప్రవహించినంత కాలమూ ....  నా నమ్మకానివి నీవు 
నా ప్రేమవి నీవు 
నా ఒకే ఆత్మ బాంధవివి నీవు 

Friday, October 21, 2016

సగటు జీవనం
కలలు కంటూ
అనుక్షణం
కలల వీధుల్లో ....
విహరిస్తూ
వర్తమానం లో
కదలికల్లేని ప్రతిమై
నిజానికీ
ఒక్క క్షణానికీ
ఒక్క పలుకరింపు కీ
మధ్య నలిగి ....

Wednesday, October 19, 2016

మధురభావన రూపం ....?సున్నిత సుకుమార
మృదు
లేత
పసి అందాన్ని
అందమైన ఆత్మను
చూసావా ఎక్కడైనా!?

చూసావా?
విలువకట్టలేని ....
కళ్ళు చెదిరే సౌందర్యాన్ని?

ఎంతో తియ్యని
రుచిమయ రసరాగం 
హృదయం నిర్మలత్వం
సొంపును,
సౌష్టవాన్ని చూసావా!?  నోరూరించే
అతిలోక సౌందర్యామృతం
దుర్వినియోగమౌతున్న తీరును
 
పాప భావన కలను
ఒక ఎడతెగని బెంగను 
నిలకడ కోల్పోయిన
నెరవేరని ఒక సంకల్పాన్ని
కన్నావా ఎప్పుడైనా

Tuesday, October 18, 2016

ఆనందాహ్లాదాల పరిమళాలునా చేతి వేళ్ళకు తెలుసు
నా కాలి వేళ్ళకు తెలుసు
చుట్టూరా పరిసరాలకు తెలుసు
ఏదో వింత అనూహ్య భావన
పెరుగుతూ .... ఇంతింతై
ఆహ్లాద పరిమళం పూసినట్లు
వీచే గాలి తరగల మీద
నాతో పాటు
ఆనందోల్లాస భావన నడుస్తూ వస్తూ
అన్ని చోట్లకూ ....
నిజం గా
అది నాపై నీ ప్రేమే .... మానసీ
ప్రేమై వచ్చి ప్రేమను కనబర్చుతున్నట్లు
నీకు తెలుసు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
అనంతవరకూ అని, నా మనసింకా ....
నా ఆధీనంలోనే ఉంది
నా భావనలనే వ్యక్తం చేస్తూ
ఆరంభమూ అంతమూ లేకుండా
నీ భావనల్లో స్థానం కోసం ....
నా ప్రేమ .... నువ్వే ఎప్పుటికీ
నా మనోపలకం మీద
నేను విశ్రమించే వేళల్లో
ఒంటరిని గా ఉన్నప్పుడు
నీవే ఎదురుగా ఉండి
నాతో మాట్లాడుతున్నట్లు
మాటిస్తున్నట్లు
ప్రతిగా నేను బాస చేస్తున్నట్లు
నీ చేతిలో చెయ్యేసి ....
అనిపిస్తుంటుంది.
అవసరమేనేమో అని ....
ప్రతి ప్రాణికీ .... పక్కన జతగా
ఒక మానసి ఉండాలి అని
ప్రతి చర్య లోనూ
ప్రతి పదగమనం లోనూ
అడుగు పక్కన అడుగేసే
నీలాంటి మానసే ఒకరుండాలి అని

Sunday, October 16, 2016

ఆమె ఆనందం లోనే నా పరవశముఆమె ప్రతి చిరు ఆశ
చిరు వెలుగు ను
విస్తృతంగా కమ్మిన
కొన్ని
తటపటాయింపు మబ్బులు
చిటపట చినుకులై
వర్షించడం
ఎప్పుడైనా నర్తించడం 
ఆమె మనో వినీలాకాశం పై 
మసకేసిపోవడం ను
చూస్తూ ఉన్నా పరవశించలేక పోతూ
ప్రతి రాత్రి