Wednesday, October 22, 2014

మేఘాలపై తేలుతూ .... నీవు


ఎప్పటినుంచో ఇప్పటివరకూ
నీ గురించే ఆలోచిస్తూ ....
నేను

క్షణాలు, నిముషాలు గడియలు
ఎన్ని రోజులు గడిచిపోయాయో
నువ్వెళ్ళిపోయి
ఒంటరిగా .... ఆరుబయట
పచ్చగడ్డిపై పడుకుని
ఆ మేఘాల వైపే చూస్తున్నాను
నీ కుశల సమాచారం తెలుసుకుందామని
ఏ సమాచారమూ లేక కలతగా ఉంది
ఏకాంతాన్ని ఇష్టపడుతున్నావా

ఓ చెలీ ....
మేఘాలపై పంపుతున్నా
నా హృదయాన్ని,
నా ఆత్మను
నా సందేశాన్ని
నా మాటను,
నా మనోభావనను
నా మనసు నీకు అర్ధం కావాలని 


తప్పుగా అనిపిస్తే మన్నించు!
నీ ఆనందం
నేనలా సంజాయిషీ
చెప్పుకోవడం లో
ఉండొచ్చేమో అనే చెబుతున్నా!
లేకపోయినా
నాకొక అవకాశాన్నిచ్చాననుకో
అంతా నీ మనోభిమతమే అనుకో

ఓ చెలీ, నా హృదయంతొ పని అయిపోతే
తిరిగి పంపించు.
మన ప్రేమను ప్రస్తావించు
నీ మాటగా ....
మనది అమర ప్రేమ అని
నాకు తెలుసు
దూరంగా ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే
నీవు నన్ను గమనిస్తుంటావని
నా క్షేమాన్ని ఆకాంక్షిస్తుంటావని

మేఘాల ద్వారా .... నీవు నాకు
ప్రతిసందేశం పంపుతున్నావు కదూ!
అమరం
జన్మజన్మల బంధం
మన ప్రేమ అని
ఉరుముల శబ్దాల్లో మమైకమై
మెరుపు లా
నీ భావనలు నన్ను చేరాలని

నా ఆలోచనల మబ్బులవిగో
మేఘాలపై తేలుతూ ....
నీవు, నన్నే చూస్తూ నవ్వుతున్న
వింత చిత్రాన్ని
నిన్నే చూస్తున్నాను.
వేలసార్లు వ్యక్తం చేసిన
నాటి, నేటి నా మనోభావనల్ని
నీవు అర్ధం చేసుకునున్నానని
నీవు నాతో చెబుతున్నట్లు

ఇదిగో ఇక్కడే
ఈ పచ్చగడ్డిలోనే పసితనం లో
నీవూ నేనూ కలిసి గడిపిన
జ్ఞాపకాల గురుతులు .... చిత్రాల్లా
నేను నిన్ను పోట్లాడుతున్నట్లు,
అల్లరి చేసి ఆట పట్టిస్తున్నట్లు,
నీవు సర్ధుకుపోయినట్లు ....
మరిచిపోయావా?
మరిచి ఉండకపోతే మన్నించు .... చెలీ!
నా నిన్నటి ఆ రోషపూరిత లక్షణాలను

రామపాదం తాకని శిల, ఆమె


ఆమె, ముఖంపై
దూళితో కలిసి జారిన
ఆ మురికి కన్నీళ్ళ
పావన నదీ జలాల లో
తడిసిన పుణ్య స్త్రీ ....
నిశ్శబ్దంగా కూర్చుని
కాలచక్రగమనంలో
నమ్మి, మోసపోయి
సర్వం కోల్పోయిన
తన జీవన ప్రతిబింబ చిహ్నాలు
చిత్రం లా .... క్షణాలు కొన్ని
బైర్లు కమ్మి
నిశ్శబ్దం రాలిన
కన్నీళ్ళను కొన్నింటిని
కర్చీఫ్ తో .... కాలం తుడుచుకుంటూ
గమనించిన ఒక నిజం,
గుండె భారం మానవత్వం మొయ్యలేనంత ....
భావనల గాడత లోతు
ఏ నాగరికతకూ అందనంత ఎత్తు అని, 
అంతులేని ఆ ఆలోచనల అంచుల్లో
అప్పుడు ఆమె
ఒక శిల లా
ఒక అహల్య లా ....
ప్రకృతి పరిహసించిన ఒక వనం లా

Tuesday, October 21, 2014

నాగరికత పడగ నీడలో


చూడలేకపోతున్నావా నేస్తమా!?
నీ చర్యల ప్రభావం
నాపై ఎంత గాడంగా ఉందో
నే నెరుగని దారులవెంట
ఎక్కడికో లాక్కువెళుతున్నావు.
నా గమ్యాన్ని నీవే నిర్దేశిస్తూ .... నడుస్తుంటే
నిన్ను చంపెయ్యాలనే కసి
నీ రక్తం చూడాలనే కోపం ....
నిష్కర్షగా చెబుతున్నా
నా భావనల్ని వేళాకోళం అనుకోకు!

గాయపడ్డవారి కోసమే
జీవిస్తున్నట్లు, 
బాధతో విలవిల్లాడే వారి
బాధలు తీర్చేందుకే ఉన్నట్లు,
గుండెలుపగిలేలా రోదించే వారి
ఓదార్పు కోసమే
జీవితం అంకితం అన్నావు.
నన్నూ లాక్కువెళుతున్నావు
అర్ధం కావడం లేదు. నీ పిచ్చి ....

మళ్ళీ ఎవరినీ నీవు గాయపరచకుండా
పిడిగుద్దుల వర్షం కురవాలని,
ఆ వర్షం లో నిలువెల్లా ముంచాలని
నిన్ను మట్టికరిపించాలని ....
అకస్మాత్తుగా
నీ ఊహకు అందని రీతిలో నీపై
దాడి చేసి, నీకు బుద్ది చెప్పాలని
ఇన్నాళ్ళూ నిన్ను నమ్మినందుకు
నీవునేర్పిన కాపఠ్యాన్ని
నీపైనే ప్రదర్శించాలనే .... మనోభావనలు నాలో

నీవు అనారోగ్యంతో బలహీనపడి
చేసిన నమ్మకద్రోహానికి
శిక్ష అనుభవిస్తూ ఉంటే చూడాలనే ....
మృగత్వం, రాక్షసత్వం
నాలో పెరిగిపోతూ, .... ఆలోచిస్తుంటే
నీ సాహచర్యంలో నాలో
మానవత్వం ఇంతగా దిగజారిందా అనే ప్రశ్న
ప్రతీకారం లో
ఇంత సరదా ఉందా అనే శేష ప్రశ్నలా

Thursday, October 16, 2014

రాత్రి

రాత్రివేళ కనగల నిజం
బిగువులు సడలి,
దయతో ....
ఎదలు చేరువ కావడం!

పక్కనే కూర్చుని ఓదారుస్తున్నా
గాలి కవ్విస్తూ,
ఒంటరి నల్లనిరాత్తిరి ....
కన్నీరు కారుస్తుంటే!

బాధలోతుల్లో దైవసాన్నిహిత్యంలా
రాత్రిలోతుల్లో
చీకటి క్షణాల్ని విప్పేస్తూ
నక్షత్ర ప్రకాశం!

Monday, October 6, 2014

సమాజం - ప్రేమ = శ్మశానంజరిగిన దానికి,
ముగింపుకు
ఎవరు ఎవర్ని నిందించీ
ప్రయోజనం ఉండదు.
ఏ గోప్య జీవనపు
పరిణామమైనా ఇంతే!
ఇలానే ఉంటుందనేది చారిత్రక సత్యం.
ఏవో .... కొన్ని విలువైన క్షణాల
అనుభూతుల్ని ఏరుకునేందుకు
మిగుల్చుకునేందుకు ....
ఆబగా ....
తపించి .... తపన తీరని శవాలులా, 


కారణం, నీవు మాత్రమే కాదు ....
నేను కూడా,
అనంతమైన కోరికల
ఆరాటం పెనుగులాట లో ....
ఏ కోరికలూ తీరని
కథకు
తెరపడటం బాధనే కలిగిస్తుంది.
కానీ నిజం
వాస్తవానికీ, కట్టుబాట్లకూ
దూరంగా పారిపోలేని
సామాజిక జీవులం.
కన్నీళ్ళు పెట్టుకోకండెవ్వరూ
జరిగిపోయి,
పోగొట్టుకున్న నిన్న లోకి
తొంగిచూసి
ఆ జ్ఞాపకాల ప్రతిధ్వనుల్ని వింటూ .... 


నిన్న ఈ సమయం లో మేము ....
మేము గానే ఉన్నాము.
నేడు గత్యంతరం లేని స్థితిలో
ఆమె గా, నేను గా .... ఇలా
విడివిడి గా .... అపరిచితులము లా
ఒంటరులము గా ....
ప్రేమ, అపజయం పాలైన
శేష శవాలముగా

Sunday, October 5, 2014

నా చెలి సాహచర్యం ఒక వరం
ఎప్పుడైనా .... ఓ చెలీ నీవు నడిచి వెళ్ళే దారిలో
నీవు గమనించవు గానీ
ఒంటరిగా నిలబడి చూస్తూ ఉంటాను.
నీవు నవ్వుతావేమో అని, పలుకరిస్తావేమో అని,
ఎప్పుడైనా నీరసపడి కూలబడిపోయినప్పుడు
రాలుతున్న నా కన్నీటి బొట్ల శబ్దం నేనే వింటున్నప్పుడు ....
విచలితుడ్నై .... మంచిరోజులన్నీ గతించాయని
భయవిహ్వలుడ్నౌతున్నప్పుడు
నీ చల్లని చూపే తలపుకు వస్తుంది.
వెన్నెల వెలుగుల చల్లని సున్నిత పరామర్శేదో కావాలనిపిస్తుంది.
అది దొరకక ఆ ప్రకాశం దూరమౌతున్నట్లై నేను ముక్కలైపోతుంటాను.

ఎప్పుడైనా .... అలసట, అశాంతి పెరిగి
క్రూరమైన కలలు కంటున్నప్పుడు
అసహాయుడ్నై, అలజడి చెందినప్పుడు
నీ ఒడిలో .... తల ఉంచి పసివాడ్నిలా .... ఊరట చెందాలనిపిస్తుంది.
అప్పుడు నేను కోల్పోయిన గతం .... అవకాశాలేవో వెక్కిరిస్తూ గుర్తుకొస్తున్నట్లుంటుంది.
ఎప్పుడైనా, అగ్నిలా ప్రజ్వరిల్లి
కోప జ్వాలలు నాలో ఎగసిపడుతున్నప్పుడు,
నిన్ను కలవాలని .... నీ తోడులో, నా ఆవేశాన్ని చల్లార్చుకుని
ఏడ్చెయ్యాలనిపిస్తూ ఉంటుంది.
అన్ని అయోమయ అవస్థల్లోనూ, 
చీకటి వేళల్లోనూ నీవే తోడుగా కావాలనిపిస్తుంటుంది.


ఎప్పటికన్నా, ఇప్పుడు .... మరీ ఎక్కువగా
నేను విచలితుడ్ని, భయవిహ్వలుడ్ని అయ్యి
ముక్కలు కాకుండా ఉండేందుకు
ఉదయించిన వెన్నెల .... నీ చల్లదనపు తోడు
స్నేహ హస్తం కలిసుండాలనిపిస్తూ, అమృత ఔషధ హస్తం నీది చెలీ
ఎప్పటికీ .... పరిపూర్ణతకు పరమార్ధాలులా మనం ఉండాలని
మన కలయిక, ఒక్కరం కాకపోయినా
ఒక్కరులా, ఒక్కటిలా కనిపించే .... భూమీ ఆకాశాల అంచులలా అయినా 
నీతో కలిసున్నాననే భావన .... అది కల అయినా ఊహ అయినా 
ప్రేమకు, సృష్టికి సాక్షులమై .... నీ సహధర్మాన్ని కావాలని ఉంటుంది.


ఏదో పవిత్రత, మన ప్రేమ గొడుగు నీడలో .... నేను, చేతలుడిగినా 
ఆలశ్యంగానే అయినా
ఎప్పుడైనా మెరుస్తూ
ఒంటరిగానే అయినా ఆశావహంగా జీవిస్తూ, తపిస్తూ
నీ తోడును కోరుకుంటూ ....
నీ తోడులోనే అమరత్వం సాధ్యమన్న భావనలో ....
నిజం! చెలీ! నీ చెలిమి కావాలి తోడుగా నాకు
ఒకప్పుడు ఎప్పుడు పడ్డానో తెలియదు .... నీ ప్రేమలో
ఇప్పుడు మాత్రం చిద్రమైపోతున్నాను.
గుండెకు గ్రహణం పట్టినట్లు
ఎప్పుడో, నా జీవితం లో .... వెలుగులు ఉన్నట్లు
ఇప్పుడు ఆ వెలుగు ప్రేమగా మాత్రమే ఉన్నట్లు .... అదీ అంధకారం లో

చెప్పలేకపోతున్నాను విడమరిచి
పరిపూర్ణ గ్రహణం ఎందుకు పట్టిందో గుండెకు అని
గతంలోకి చూసే ప్రయత్నం చెసిన ప్రతిసారీ నేను గమనించిందొక్కటే
విశాలమైన నీ కళ్ళు మెరుస్తూ,
నన్ను నన్నులా నిజాయితీ గా నన్ను నీవు ప్రేమిస్తున్నట్లు 
వెనక్కు, గడిచిన జీవితం లోకి చూస్తే .... అలా నీవు .... ఒక అద్భుతానివి
నన్ను పరిపూర్ణుడ్ని చేసేందుకు
భువి నుంచి దివికి దిగివచ్చిన దేవతామూర్తివి లా .... కనిపిస్తావు.
నాకు తెలుసు
వరం కోరుకొమ్మన్నా
నీకన్నా మించిన బహుమానం ఏదీ కోరుకోలేనని ....
ఓ చెలీ చెప్పలేక, ముక్కలైపోతున్నాను నీ సాహచర్యం తోడు కోరుకుంటున్నానని