Saturday, June 27, 2015

ఆకాశంలోకి చూస్తూ


వెన్నెల్లో,
డాబా మీద
వెల్లికిలా పడుకుని
ఆకాశం లోకి చూస్తూ
ఆశ్చర్యానికి
గురౌతుంటాను.

ఎన్ని
పగిలిన గుండెల
రోదనలకు,
ఎన్ని ప్రత్యక్ష కథనాలకు
సాక్షులో
ఆ నక్షత్రాలు అని

పగిలి ముక్కలైన
హృదయం
అద్దం ముక్కలపై మెరుస్తూ
ఎందరి బుగ్గలను
ముద్దాడిన 
ఉప్పునీటి కన్నీళ్లను
అవి చూసాయో అని

బహుశా
ఏ గణితానికీ అందని
సంఖ్యను చూసి
ఆ నక్షత్రాల భావనలు
ఎలా మారి ఉంటాయో అని
రాత్రి ఆకాశంలోకి చూస్తూ
అనుకుంటుంటాను.

Sunday, June 21, 2015

వసంత ఋతురాగం .... ప్రేమ


తొకలు ఊపుతూ
బహుశ ప్రేమ కోసమేనేమో
ప్రాకులాడుతూ .... ఉడుములు
వసంతం వచ్చిందని
పిలుపులు
ఆలపింపు రాగాల పక్షులు 


సముద్రం లో అలలను
చిలుకుతూ, ప్రేమామృతం కోసం
తోకలు విదుల్చుతూ .... తిమింగలాలు
గింజుకుంటూ పురుగులు .... ఒడ్డున
పిచ్చిపట్టిన వాళ్ళలా మనం
అందరమూ
ప్రకృతి పరవశం పాటై 
ఏల ఈ మోహభావనలో
ఎందుకిలా వస్తున్నాయో
ఆతురతను, ఆశను రేపుతూ
వసంతం తో పాటు, ఓహ్! .... ఇది ప్రేమే
ఒక ప్రాణి మరొక ప్రాణికై
పరితపించే నిస్వార్ధ భావన
ఇది వసంత ఋతురాగం ప్రేమే

Saturday, June 13, 2015

అమ్మ ఒడి రాగం


కళ్ళు మూసుకో, భయపడకు
ఉరుములకు భీతిల్లకు
రక్కసి దూరంగా పారిపోయింది.
ఈ చీకటి కూడా చెరిగిపోక తప్పదు.
అమ్మను నేను
నీ పక్కనే ఉన్నాను.

నా బుడ్డీ, నా మున్నీ, ఓ నా తల్లీ
నిద్దురపోవాలనుకున్నప్పుడు,
నీవు చిరు ధ్యానం చెయ్యి
ప్రతి రోజూ, ప్రతిక్షణమూ అన్ని విధాలా
నీకు మనోధైర్యం, నమ్మకం పెరిగి
మనోప్రశాంతత దొరికేలా

ఎన్నినాళ్ళుగానో ఈదుతూ ఉన్నాను
ఈ సాగరం .... జీవితాన్ని బాధ్యత గా
ఎదురు చూస్తూ ఉన్నాను
నువ్వు ఎదగాలి తొందరగా అని
తొందరపడకుండా .... ఆశగా
నిమిత్తమాతృరాలినై .... కాలంతో పాటు కదులుతూ 


ఎప్పుడైనా, తెలియని మార్గంలో
కదిలే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రం
నీ ముందు నా అనుభవముంది. చెయ్యందుకో
జరగబోయేదే జీవితం .... అయినా
నీ ప్రయత్నాలు, నీ కలలు, నీ ఆశల
క్రమ సరళి ని నీవే నిర్ణయించుకోవాలి.

ఓ బుజ్జీ, ఓ తల్లీ, ఓ నా ప్రాణమా
నిద్దుర లేస్తూనే, పంచభూతాలనే తోడుగా
నవ్య నవచైతన్య రాగానివై
కదులు ముందుకు ముందుకు
మానవీయత పరిపూర్ణత వైపు
కాంతులు ప్రకాశం పరిసరాల్లో వెదజల్లుతూ

Thursday, June 11, 2015

కలకన్నా నిన్నే


ఆలశ్యం రాత్రుల వీధిలో
ఆదమరచి లోకం నిదురిస్తున్న వేళ
మేలుకుని, నీ గురించే ఆలోచిస్తూ
ఓ కోరికను
ఏ గ్రహోపరితలం మీద ఎక్కడో
ఏ కలలోనో
నీవు నా గురించి ఆలోచిస్తూ ఉండాలనుంది.
ఎందుకలా అనిపిస్తుందో చెప్పనా!?
నిన్న రాత్తిరి కలలో మనం ఒక్కచోటే ఉన్నాము 
ఉదయం వరకూ
ఆ కలలో అందమైన అనుభూతిని ....
నిన్ను, పొదివిపట్టుకునే ఉన్నాను ఆద్యంతమూ
వేరెక్కడో కాదు ఇక్కడే .... ఈ గదిలోనే
ఆశ్చర్యం వేస్తుంది కదూ
నమ్మకమనిపించట్లేదు కదూ .... అది నేనేనా అని
తెలియదు నీకు .... నా కలలో అది నీవేనని
తెలిసుంటే
నీవు నా కళ్ళలోకి సూటిగా చూసింటే
కనిపించుండేది .... నా అంతరాంతరాల్లో ఏముందో?
నీ చూపుల్లో ఉత్సుకతను గమనించాలనే కోరిక తీరుతూ
ఇప్పటివరకూ ఇలాంటి కలలే .... కంటూ ఉన్నాను
నిన్ను గురించి, నీతో సహజీవనం గురించి,
రెక్కలు ధరించి నీతో చెయ్యాల్సిన గగన విహారం గురించి,
ఏ రోజుకారోజు ఆగి, ధైర్యం కూడగట్టుకుని
ప్రయత్నిస్తుంటాను .... నీతో చెప్పేందుకు
ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానో అని,
కానీ చెప్పలేను. అలా అని
నిన్ను కల కనకుండానూ ఉండలేను
రాత్రి వేళ సంసారమంతా నిద్దురలోకి జారే వేళ
నెమ్మదిగా నిన్ను నా కలలోకి లాక్కుంటానే కాని. 


కానీ,ఊహించలేని విషయం
నమ్మలేని నిజం, నీవుగా ఇలా రావడం
నాతో చెప్పడం ఇలా .... "నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను" అని
వెంటనే అన్నాను "నేనూ నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను" అని
ఇప్పుడు, నేను
ఈ రాత్తిరి ఒంటరిగా కాక
నీతో కలిసి కలనుకంటాను
కలిసే ఉంటాను
ఈ జీవితం చరమాంకం వరకూ
కలలు కంటూ .... ఆ కలలు సాఫల్యం చేసుకుంటూ.

Wednesday, June 10, 2015

ఎందుకిలా?


ఎలా ధరించను?
ఆనందోల్లాసాల చిరునవ్వు ముసుగును
నాలో కొంత భాగం
నీతో ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నప్పుడు?

ఎలా నిలబడను?
అణువణువునూ ఉత్తేజపరిచే
ఆత్మ విశ్వాసం బలం
నీతోపాటే నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు?

ఎలా జీవించను?
నాలో నేనే
అపరాదగ్రస్తుడ్ని దోషగ్రస్తుడ్ననే భావనలతో
మనసు ముక్కలుగా విరిగిపోతుంటే? 


ఎలా? ఎందుకు?

ఎందుకు?
నన్ను నేను ....
నిన్ను కోల్పోయాను?

ఎందుకు?
నీవే కావాలనిపిస్తుంది.
ముద్దాడేందుకు నా నొప్పిని
నా బాధను నాకు దూరం చేసేందుకు?

ఎందుకు?
శిలనయినట్లు,
ఎందుకు
నీవు లేకుండా నేనిలా అచేతనుడ్ని?

తెలియడం లేదు?
నా తల అయోమయం, అనర్ధాల చుట్టూ తిరుగుతూ
అప్పుడప్పుడూ భూమిని తాకని
అవాస్తవాలమీద నా పాదాలు పచార్లు చేస్తూ

ఇదో అసాధారణ స్థితి
శ్వాస అందకపోవడం
హృదయం ఆటుపోటులకు లోనుకావడం

ఎందుకు?
ఎందుకు ఈ మది, ఎదల అసంతులనం
ఆత్మ ఆవిరైపోతున్న భావన ....
నీ ప్రేమలో
ఎందుకిలా అతలాకుతలం అల్లకల్లోలం అస్తిత్వం?