Thursday, January 28, 2016

పదభావనౌషధం


నాకు ఎంతో ఇష్టం .... నీ పదాల రుచి
ఆ తియ్యదనం, ఆ పదాల ఔన్నత్యం
ఎంత సాధారణంగా ఉంటూనే
ప్రతి అక్షరము వెదజల్లే ఆ పరిమళము
పరమ ఆనందం కలిగిస్తూ
మనసు నిండిపోయి, ఆ ప్రతి వాక్యమూ
ఏ అభిలాషో, అపేక్షలమయమో అయ్యి 
ఆనందోల్లాసాల తృప్తిని కలిగిస్తూ
నీ ప్రతి రాత, ఆ రాతలోని
పదము, పదమూ
ఒక వాక్యము తరువాత మరో వాక్యమూ
అభిరుచికి తగ్గట్లుగా విచ్చుకుంటూ 
నా అంగిలిని రంజింపఁజేస్తూ
అవి ఎన్ని వాక్యములు. ఎన్ని పాదములు
ఎన్ని పద్యకావ్యములు ఎన్ని అంత్యప్రాసలైనా
ఏమౌతుంది? మనో రంజకమే కాని ....
అది చందో కవిత్వమో, వచన కవిత్వమో
ఏ అద్భుత ఊహాజనిత కథో
ఏ వాస్తవ జీవితావిష్కరణో
పరిపూర్ణానందమో,
దుఃఖవేదనాత్మకమో అయినా
ఆ రాత ఏదైనా ....
నేను అర్థించేది మాత్రం
ఆ పద వాక్యాలు హృదయారాటం తగ్గించాలని
నా మది, ఆత్మలను అలరించాలని ....
అవి కూడా ఎప్పుడూ తపిస్తునే ఉంటాయి.
నీ భావనల నీడలో సేదదీరాలని 
అంతరంగంలో శూన్యాన్ని నింపుకోవాలని
నాకు ఎంతో ఇష్టం ఆ పదాల రుచి
ఒకవేళ అవి నిజం గా
నన్నుద్దేశించి,
నా కోసం రాసినవే కాకపోయినా

Monday, January 25, 2016

సూటిగా చూడు


తలతిప్పుకోకు
పారిపోకు
భయవిహ్వలవై
దూరంగా

నిజాలెప్పుడూ అంతే
చీము నెత్తురు
గాయాల్లా
అసహ్యంగానే ఉంటాయి

అందుకే

జాగ్రత్తగా గమనించు
గాయపడ్డ కారణాన్ని ....
బాండేజిని కాదు,
దెబ్బను తొందరపాటును

జ్ఞానం, గుణపాటం
అనుభవం వెలుతురై
నీలోకి పవహిస్తూ ఉంటుంది.
సూటిగా చూడు

Saturday, January 23, 2016

ప్రతిధ్వని


ఆలోచనల కత్తులు 
చీల్చుతున్నాయి 
వివర్ణమైన నా చర్మాని 
పదాలు ప్రవహిస్తూ 
ఎర్రగా 
ముదురు ఎరుపు, 
సింధూరం రంగులో 
బొట్లుబొట్లుగా రక్తం 
రాలుతూ 
చదును నేల మీద 
నీ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. 

విశ్రాంతి లేదు. 
నిద్దుర ర్రాదు. 
మంచం మీద దొర్లుతున్నా .... 
ఏ మాదకద్రవ్యమో 
నీ ప్రేమ లా,
నా రక్త నాణాల్లో 
ప్రవాహోదృతి 
తియ్యని బాధ 
నీవు దూరమౌతూ
నన్ను యాచకుడ్ని చేస్తూ

మన్నించవా దయచేసి


దయచేసి
నన్నో బంజారీని చెయ్యొద్దు
ఒక నిర్దుష్ట శుద్ధ సంపూర్ణుడ్ని
కావాలనుంది.
కనుగొనబడి నీచే
నా అంతరంగం బలహీనతలు 

ఒక బానిసను కారాదని ఉంది.
కాళ్ళమీద నిలబడాలనుంది.
ఒక మనిషిగా ....
ఆశయాలు, నిజాయితీ రక్తంలో
నింపుకున్న
పసి బాలుడ్నై .... నీ ఒడిలో 


అబద్దాలే వల్లించినా సంతోషమే
కానీ, దయచేసి
నా ముందు బాధపడొద్దు
ప్రశాంతంగా కూర్చో చాలు
నా ఊపిరివై నాతో 
మరణించేందుకు సిద్ధమై కలిసి

నీ ఊహల్లో, నీ ఆలోచనల్లో
నాకూ కాసింత చోటివ్వు చాలు
కలిసి ఏడడుగులు
నడుస్తాను .... తోడునై
జీవిస్తాను. .... ఏ తీగనో అయ్యి
నీతో చివరి రోజుల్లో

Tuesday, January 19, 2016

ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా!?


నిన్నే! ఎప్పుడైనా ఎవరినైనా
ఘాడంగా ప్రేమించావా!
ఆ చందమామను స్పర్శించినట్లు
నీ నుంచి నక్షత్రాలు రాలుతూ
స్వర్గాన్ని నీ బాహువుల్లో
బంధించిన అనుభూతిని పొందావా

ఎప్పుడైనా గాలిలో నడిచినట్లు
మబ్బుల్లో నీ చెలితో చెట్టాపట్టాలాడుతూ
పరుగులు తీసినట్లు .... కలకన్నావా
ఎనాడూ నీవు ఊహించని
ఏదైనా సంఘటన నిజమయ్యి
అద్భుతంలా అనిపించిందా!
ఎప్పుడైనా ప్రేమించావా ఎవరినైనా

తెలియని దేని కోసమో
నీవు ఎదురు చూపులు చూస్తూ
నీవు కాలు కదపలేని విధం గా
నీకోసమే స్వర్గం నుంచి
ఒక దేవత దిగివచ్చే అవకాశముందని
ఎవరికోసమైనా కలకన్నావా 


ఎప్పుడైనా ఏ దేవతనైనా ప్రార్ధించావా
నీ శూన్య హృదయభారం తగ్గించమని
తపన ఫలించిందని ఆశ్చర్యపోయావా
నీ కలలు ఆశలన్నీ నెరవేరాయని
అంతకన్నా ఇంకేమీ అక్కరలేదని
అన్యాపదేశంగానైనా .... ఎప్పుడైనా

ఏ ప్రదేశం లో ఏ సమయంలో నైనా
అక్కడే ఉండిపోవాలనిపించిందా
ఎవరో ఉన్నందునే అలా అని
చివరికి కానీ అర్ధం తెలుసుకోలేనట్లు
ఎప్పుడైనా అనిపించిందా
ఈ జగమంతా ప్రేమమయమే అని

ఏకధ్యానులం


క్రూర కుసంస్కారులమై 
ఈ సంసారం లో
అస్తిత్వం సహా, 
అన్నీ అపహరించబడి 
పురోగమనం గా 
పిలుచుకుంటూ, 
భవిషత్తును 
అప్పు తెచ్చుకుని 
నేడే వాడేసుకుంటూ,

నడుస్తూనే ఉన్నాము. 
మనం, రేపు అనే 
శూన్య గోళాలమీద 
కాళ్ళు నరుక్కుని 
సమశ్యల కత్తెర లో
శరీరము అవయవాలు 
రక్తశిక్తం చేసుకుని 
చరిత్ర పుటల్లో 
రక్తాక్షరాలై మిగిలిపోతూ

Monday, January 18, 2016

నిన్నొదిలెళ్ళిపోవాలనుంది


నాతో వున్న నేను నమ్మిన ఎన్నింటితో పాటు
నిన్నూ ఒదిలి దూరం గా
వెళ్ళిపోవాలనుంది.
నా వెనుక ఎవరి కన్నుల అంచుల్లోనో
నీరుబుకుతున్న ఆందమైన అనుభూతేదీ లేదే అని
తెలిసి మది రోదిస్తున్నా మనోభావనలు
బయటికి కనబడనీయకూడదనుకుంటూ
లెక్కలు వేసుకుంటున్నాను.
క్షణాల్ని, గడియల్ని .... రోజుల్నీ శోధిస్తూ
నా ఆత్మ లోతుల్లోంచి వింటూ
పాతబడిపొతున్న అవే మాటల గుసగుసలను
అప్పుడప్పుడూ అనుకుంటుంటాను.
పునఃప్రారంభం చేస్తున్నానేమో అని
గత కొన్ని సంవత్సరాలుగా .... ఇలానే
నాకు నేను సర్ధి చెప్పుకుంటూ వచ్చి
చివరికి ఇప్పుడే నీతో అన్నాను.
వెళ్ళిపోతున్నాను అని,
నాది అనుకున్న తెలిసిన అన్నింటికీ సెలవు అని 


నిజం! పిల్లా నిన్ను నేను ప్రేమించాను.
నిన్నైనా నాతో జతగా పొందుదామని
ఎంతగానో ప్రయత్నించాను. 
కానీ కోల్పోయాను.
కోల్పోయాను నన్ను నీ కళ్ళలో 
ఎందుకో అనిపిస్తుంది ఎప్పుడూ ఇంతేనా అని
అంతే కాదు ఆ బలహీన క్షణం లో అనిపిస్తుంది.
కొన్ని గంటలైనా బ్రతకగలనా నీవు లేక అని.
ఆవేదన తో కళ్ళు మూసుకుంటే .... నీవే అంతటా
నా ఆలోచనల్లో నన్ను వెంటాడుతూ 
ఎక్కడివరకో తెలుసా .... ఆకాశం అంచు ప్రకాశంలో
నా కళ్ళు బైర్లు కమ్మే చోటు వరకూ
కానీ, అది న్యాయం కాదు పిల్లా! 
నన్ను వెళ్ళిపోనీ .... దూరంగా
ప్రశాంతత దొరుకుతుందేమో చూస్తాను.
అందుకే అన్నీ ఒదిలేస్తున్నాను నీతోనే
నేనెరిగిన నాకు తెలిసిన అన్నీ ... ఇక్కడే
అయ్యో .... ఎందుకిలా!?
అన్నీ కావాలనిపిస్తూ ఏదీ వద్దనుకునే ఈ మనోస్థితి
వింతగా ఇదేమిటి
నీ అన్నీ, నా అన్నీ నావే కావాలనిపిస్తూ
నువ్వూ నీ మందహాసమూ వద్దని కావాలనిపిస్తూ
ఈ ఒక్కసారికి మాత్రం, దూరంగా వెళ్ళనీ నన్ను 

పూర్ణమానవత్వం???????


ప్రేమించి భూమిని
సూర్యుడ్ని
శ్వాసించే ప్రతి జీవినీ 


చాచిన చేతికి
చెయ్యగలిగినంత
దానం చేసి 


బుద్ధిహీనులు
పిచ్చివాళ్ళు
నిరాశ్రయుల్ని చేరదీసి 


తృణీకరించగలిగిన్నాడు
రాజరికము,
ఆస్తి అంతస్థులను 


వినియోగించగలిగి
శ్రమ ఆదాయాన్ని
శ్రామికుల కోసం


నిజం, అప్పుడు
రక్త మాంసాలే కావ్యమై
ఎంత భవ్యమో సుమా!

Wednesday, January 13, 2016

నా మరో సగం ఆమె


ప్రశాంతంగా నిదురిస్తున్న ఆమెనే చూస్తున్నాను తన్మయత్వంతో 
ఆ నిర్మలత్వాన్ని ఆ నిండుతనాన్ని కళ్ళార్పకుండా
నా జన్మగ్రహాలకు అదృష్టానికీ ధన్యవాదములు చెప్పుకున్నాను.
ఆమె నాతో ఉన్న ప్రతి క్షణమూ ఎంతో అమూల్యం అని
ఇప్పుడు ఆమె నా సహచరై జీవిస్తూ
ఎన్నో పగళ్ళూ రాత్రులై .... శ్వాసై నా జీవితమైనందుకు


కలిసే ఎదిగాము. ఎన్నోసార్లు కలిసి నవ్వుకున్నాము
అప్పుడప్పుడూ కలిసే ఆడుకున్నాము. కలిసే ఆలోచించాము
కొన్నిసార్లు వాదులాడుకున్నాము తెగక పోట్లాడుకున్నాము
ఏదీ ఏమైనా సంబంధం ఉన్నా ఒక్కోసారి లేకున్నా
ఆమె నన్ను నమ్ముతుంది. నిజం .... ఆమె నాకు స్వర్గతుల్యం
అవసరాల వేళ ఆమె ఒక అప్సరస ఒక దేవత నా కళ్ళకు
ఎక్కడ ఉన్నా ఎప్పుడూ ఆమె నా పక్కనే ఉన్నట్లుంటుంది.
నా వెనుకనుంచి నా చర్యల్ని గమనిస్తున్నట్లు, హెచ్చరిస్తున్నట్లు
వెన్నులోంచి చలిపుట్టి ఒళ్ళంతా ఝలధరిస్తుంటుంది
ఆ లక్షణమే పునాది .... నా నమ్మకానికి
ఆమె నా హృదయమంతా నిండి, ఆత్మలో మమైకం కావడానికి
ఆమె నా మరో సగం, నేను పరిపూర్ణుడ్ని కావడం లో

Tuesday, January 12, 2016

నిశ్శబ్దం


వెంబడిస్తూ ఉన్నాను
నిశ్శబ్దాన్ని
అది తీసుకువెళుతున్న దిశలో
అదే గమ్యం లా
దాని చుట్టే పరిభ్రమిస్తూ

ఎన్నో
మెలికలు తిరిగిన
బాట లో .

వెంబడిస్తూనే ఉన్నాను
నిశ్శబ్దాన్ని
ఎంతో తీవ్రంగా
శబ్దమెరుగని ఈ చెవుల్లోంచి
నెత్తురు ప్రవాహంలా కారేలా

Monday, January 11, 2016

దూదిలాంటి మనసు నాదిపరివర్తనశీలుడను అవ్వడం 
అలవాటులేని పనే కానీ 
అవ్యవస్థుడ్నయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను.   

అతి చిన్న చిరుపిలుపే అయినా చాలు 
నన్ను పేరుతో పిలువు 
వికసించి గాలిలో తేలిపోతా పరిమళాన్నై

ఓ మానసీ, పాకనీ నాలోనికి  
సర్వత్రా నీ వేళ్ళను
నా ప్రశాంతతను భగ్నం చేసేందుకు 

రాసుకో నీ నామాన్ని 
నీవు సొంతం చేసుకోవాలనుకున్న 
నన్ను లోని అన్ని ప్రదేశాలలోనూ 

ఒంటరిని నేను


ఈ జగతి లో
నా మనోభావనలలో
అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది.
ఒంటరినేగా అని

సన్నిహితులు హితులు
ఎవ్వరూ లేరని అలమటిస్తుంటాను.
కనీసం చెప్పుకునేందుకు
నా బాధల్ని ఆలోచనల్ని

సభ్యసమాజం నుండి
నాది అని అనుకున్న ప్రపంచం నుండి
నేను వెలివేయబడిన అనుభూతే
చివరికి 


నేను కన్నవారు, నా తోడబుట్టినవారు 
నన్ను ప్రేమించిన వారు
నేను ప్రేమించి పోషించిన వారినుంచి కూడా
పలుకరింపులు పొందలేని స్థితి

రాత్రిళ్ళప్పుడు తడిచిపోయిన
నా తడి తలగడే సాక్ష్యం
నేను ఎంత ఒంటరినో
ఎంత ఒంటరితనం ఫీల్ అవుతున్నానో

ఎంతటి శ్మశానవైరాగ్యం అనుభవిస్తున్నానో

Saturday, January 9, 2016

నిశ్శబ్దాన్ని విను


పరవళ్ళు తొక్కుతూ పారుతున్న 
నది లాంటిది శబ్దం 
అయితే
సముద్రం లాంటిది .... 
నిశ్శబ్దం 
నదులన్నీ సాగరం లో 
కలిసినట్లే, 
శబ్దాలన్నీ 
నిశ్శబ్దం లో కలవక తప్పదు. 
ఎప్పుడైనా 
నిశ్శబ్దం నిన్ను వెదుకుతూ ఉంటే 
అలజడి చెంది 
శబ్దం వైపు మొగ్గక్కర్లేదు.
నిశ్శబ్దం, సాగరం హోరునే వినొచ్చు 

ఉపశమనం కావాలి


ఇవ్వవా ఏదైనా ఔషధం
నొప్పిని సంహరించుకునేందుకు
మనోసంకల్పానికి భంగం కలగకుండా
అవివేకం అన్ని వైపుల్నుంచీ నన్ను అలుముకోకుండా

నిజంగా నీ ప్రభావం నామీద
ఇంతగా పడుతుందనుకోలేదు.
నా మది, ఇంద్రియాలు, గ్రాహకశక్తి 
ఇంతగా ప్రభావితమౌతాయని ఊహించలేదు.

వీటిలో వేటినీ తిరిగి పొందగలననుకోవడం లేదు.
ఎన్నిసార్లు తలకొట్టుకున్నానో
దోషవిముఖ్తుడ్ని కావాలని
ఎంత అరాజకంగా అలమటించానో

ప్రయోజనం లేకపోయింది.
నా తలలోనే అంతా జరిగిపోయింది.
సంతులనం కోసమే .... ఈ ప్రయత్నం అంతా
ఉపద్రవ భావనల అనియంత్రణను నియంత్రించేందుకే

అందుకే ప్రాదేయపడుతున్నాను.
ఇవ్వవా ఏదైనా ఔషధం సంహరించేందుకు ఈ నొప్పిని
లేదా అంగీకరించి, అనుమతించవా
రక్తనాళాల్ని తెగఁద్రెంచుకుని ఉపశమనం పొందేందుకు

Wednesday, January 6, 2016

ఆశల ఉయ్యాలలో


ఎన్ని రాత్రులు అలా ఉలిక్కిపడి నిద్దుర లేచానో 
అంతకు ముందు రాత్రి అలసిన శరీరం 
పొందుతున్న విశ్రామము నుంచి .... తలగడ తడిచి 
నాకు తెలియకుండా అనుకోకుండానే 

నా కలలో నేను ఒక ప్రత్యక్ష సాక్షిని 
సామాజికం గా జరుగుతున్న ఎన్నో 
దుర్మార్గ, అలక్ష్య అత్యాచారాలకు 
నొప్పి, మానసిక అశాంతి, ప్రశ్నార్ధక సంఘటనలకు  

అపనమ్మకం, ప్రేమ రహిత ద్వేషమే ఎటుచూసినా  
ఏవో కట్టుబాట్ల దారాలతో ముడిపడి 
తెగని అనుబంధాల చెరలే అన్నీ
ఎన్ని కష్టాలో .... ఆ అనుబంధాలను అపసవ్యం చేస్తూ 

అన్నీ సమశ్యలే ఎన్నో పరిక్షలు .... చివరికి 
నాకు నేను మూల్యత ఆపాదించుకునేందుకు కూడా
అన్ని వైపులా చీకటి అంధకారమే .... అందులోంచి బయటపడటానికి 
జీవితాన్ని మొత్తంగా ఖర్చు చెయ్యాల్సి వస్తూ 

కాలి ఖర్చైపోతున్న ఆ క్షణాల్లోనే ఒక కొత్త కల ....
మరో జీవితాన్ని పొందుతున్నట్లు .... ఈ తెల్లవారు జామున 
జీవితము, వ్యక్తిత్వము .... ప్రేమను పొందుతున్నట్లు
ఏనాటి ఏ దాస్యబంధం నుంచో విముక్తుడ్ని కాబోతున్నట్లు 

ఎంత అందమైన కల, తడవకుండానే తలగడ 
నిద్దుర మెలుకువొచ్చింది. ఉలిక్కిపాటు లేని చీకటమ్మ ఒడి లో
తెల్లవారుఝామున .... ఏ ఆనందబాష్పాల తడి స్పర్శతోనో 
ఏ కొత్త జననంపై ఆశతోనో .... కళ్ళముందు అంతా కాంతిమయమై

Tuesday, January 5, 2016

మౌన శరం


ఒక చూపు ఒక మాట
ఒక పలుకరింపు ఒక పరామర్శ
మధ్య మధ్య తటస్థమయ్యే
సమాధించలేని ఏ జ్ఞాపకాల అల్లరి
అయోమయ స్థితిలో,   

నేను చేస్తూ ఉన్న ప్రయత్నం
ఏ కేకలు అరుపులకు
చులకన కారాదని .... బదులుగా
అవసరానికి చిరునవ్వుల ఒరలోంచి
ఏ మౌనం శరాన్నో సంధించాలని

Monday, January 4, 2016

బంధీని


ఎప్పుడైతే అనుకున్నానో నేనో నిరర్ధకాన్ని నీవూ, నీ ప్రేమ లేకుండా అని .... అప్పుడు నా ఈ ఒంటరి జీవితం లోకి మంచితనం నిజాయితీవై వచ్చావు. ఎంత కష్టమో .... నిజంగా సూటిగా నీ కళ్ళలోకి చూడటం నాలో ఉద్వేగం రక్త ప్రసరణ వేగం కట్టలు తెంచుకుంటూ ఓ అద్భుతం ఝలదరింపౌతూ నేనేమీ నిస్వార్ధపరుడ్నని కాను. బహుశ నా తలపై రాసి ఉండొచ్చు నేనిలా ఇక్కడ ముగిసిపోవాలని నా స్వార్ధం నా కోరికా మాత్రం నీవూ, నీ ప్రేమ నా సొంతం కావాలని .... కానీ ప్రేమ నాకు ఒక కొత్త పాటం నేర్పింది దాని మార్గం లో నిలబడున్నప్పుడు తప్పకుండా నేర్పుతుందని తెలిసింది. ఈ సమాజం లో ఇక్కడ నేనొక బంధీని నా బలహీనతల్లో ఇరుక్కుపోయి ఎంతో శీతలమూ శున్యమూ అయిన జీవితం సీసాలో చిక్కుకుపోయి సీసా గొంతు లోంచి బయటకు రాలేక నేను ఒక అశక్తుడ్ని బంధీని నా ఆలోచనల ఆశల వలయంలో 

తెలుగు టెలివిజన్ సీరియల్స్ లో లా అనాసక్తికర సాగదీతల జీవితం లా ఎప్పుడు వెనుదిరిగి చూసినా .... ఏదో వెలితి అంతరాత్మ కాలుతున్న అనుభూతి కాకపోతే మెల్లగా కాలుతున్నట్లు నేను ఆ అసంతృప్తి మంటల్లో కాలిపోతూ చల్లర్చేందుకు నీవు లేక ఉద్వేగ భావనల్లో బూడిదైపోతున్నట్లుంటుంది. ఎందుకో తెలియదు. ఊహ తెలిసిన నాటి నుంచీ నేనీ చట్రం లో నాకు తెలియకుండానే చుట్టబడి ఇలాగే కొట్టుకుంటున్నాను. ఈ ప్రపంచమంతా శూన్యంలా కనిపిస్తూ నాకలలకు నా జీవితానికీ పొంతన లేదు. అన్య అనితర భావనల్లో అస్వస్తుడ్నై అనాసక్తుడ్నై కొట్టుకుంటూ

మహోన్నత వ్యక్తిత్వం నీవు


వెలుతురే
ఎటు చూసినా
నీ ఉపస్థితి లో
భూమ్యాకాశాలను
ఏకం చేస్తూ
నేను కనబడను
ఆకశ్మికంగా
నిలబడితే
జతగా
నాపక్కన నీవు

స్వచ్చప్రేమైతేనిశ్శబ్దం గా
బలపడిన  
ఆకర్షణే  

నీవు నమ్మిన 
నీ నిజమైన 
ప్రేమ  

చేరదియ్యనీ 
నిన్ను 
లొంగిపోవాల్సొచ్చినా

ద్వంసం 
కావు నీవు
బూడిద 

Saturday, January 2, 2016

గతానుభూతంతియ్యని చేదు 
చుట్టూ తచ్చాడుతూ 
బొట్లు బొట్లుగా 
రాలుతుంది శబ్దం

పడి బొట్లు 
ఒకటి రెండు 
పిదప 
వెంటనే నిశ్శబ్దం 

ఆలోచనలు నర్తిస్తూ 
ఒంటరిగా 
భయపడి 
చుట్టేసుకుంది మౌనం

నిశ్శబ్దం
 నిశ్శబ్దాన్ని గమనించి
ఎందుకలా భయపడుతున్నావు?
నిశ్శబ్దమే మూలం, దేనికైనా
ఈ శూన్యం ఖగోళంలో
పరిభ్రమించి చూస్తే
కనిపిస్తూ వినిపిస్తాయి. 


ఎన్నో వేల గొంతుకల
ఆశల ఆవేశాల సందేశాల ధ్వనులు 
వినే ఉత్సుకత ఓపికే ఉంటేFriday, January 1, 2016

మనం

వెన్నెల రాత్రి 
చందమామతో అనుబంధం,
నది తో 
సాగర సంగమం 
మనం 
వెన్నెల విహంగాలం 
ఆ నక్షత్రాల వీధిలో 
తేలుతూ ఉండిపోయి