Sunday, November 30, 2014

చెప్పాలని ఉంది


ఓ అందమా! అనుబంధమా!! 
నా మనో ఆకాశం నక్షత్రమా!!! 
నేన్నిన్ను ప్రేమిస్తున్నాను.
రాత్రి విశ్రమ వేళలలో
చల్ల గాలుల బద్దకపు కదలికలలో
చెట్ల కొమ్మల ఆకుల గుసగుసల సడి,
చిరు సవ్వడుల మధ్య
జీవితం వెలుగులమయం
సాధ్యం కారణం .... నీవే
నీ రాక తోనే .... నిశ్శబ్దం గానే

సాధారణంగా 
ప్రతిమనిషి భయపడే విషయాలు ఎన్నో
అందులో ఒకటి
గుర్తింపును కోల్పోవడం
ఉండను చూడను అని తెలిసీ
మరణించాక కూడా
ఎక్కడ అందరూ మరిచిపోతారో
ఏమనుకుంటారో అనే భయం
కొందరు మరిచిపోవడం ఊహించనూ లేము.


నేను కూడా అంతే!
నీవు మరిచిపోవని నమ్మకం ఉన్నా
ఎక్కడ మరిచిపోతావో
నన్నెరుగనని మోసగించుకుంటావో
అసహ్యించుకుంటావో అని
భయం!

తేనె కన్న తియ్యనిది.
ప్రేమ కన్నా స్వచ్చము పవిత్రమైనది
నీ మనసని తెలుసు.
మంచు బిందువులు
చిగురాకులపై మురికిని కడిగినట్లు
నీ సున్నిత మృధు ఆలోచనలతో
రావణుడ్ని రాముడ్ని చేసిన
దేవతా లక్షణమూర్తివి .... నిన్నూ
నీ వ్యక్తిత్వాన్ని కోల్పో లేను.

వికారము, వికృతము .... భయం ఆలోచనలు
వెంటాడే కలలు
దూరం చేసిన అందం, నీ ముఖం
ఆహ్లాదకరం .... నీ మృదు పలుకులు
నాకోసమే దివి నుంచి దిగివచ్చిన 
అనుభూతి .... దేవతా స్త్రీవేమో అనిపిస్తూ
నీతో చెప్పాలని అనిపిస్తుంటుంది.
నా హృదయాన్ని నీకు
సమర్పించుకున్నానని .... శాశ్వతంగా అని
నేన్నిన్నే ప్రేమిస్తున్నాను అని
మనసు విప్పాలని, నీతో చెప్పాలని

సుతిమెత్తని మానసం


ఆమె
అతని వైపే
నడిచి వెళుతూ ఉంది.
ఎక్కడ
అతనికి
నిద్దుర భంగం అవుతుందో అన్నట్లు
సిగ పువ్వులను విసర్జించి మరీ,
గడ్డి మైదానం లో
నిదురిస్తున్న మృగరాజుల మధ్య
నడుస్తున్నంత జాగ్రత్తగా
అడుగులో అడుగు వేస్తూ ....
పిచ్చి ప్రేమే ఆమెది
బిడ్డడిని
ఒడిలోకి తీసుకుని
ముద్దాడలేని కన్నతల్లి
అలవికాని
మమకారం, తపనే అది
ఏ గణితము
లెక్కకూ
అందనన్నో సారి ఆమె అలా

Saturday, November 29, 2014

ప్రేమామృతం


నిర్మలం గా పలుకరించి
తియ్యగా, రుచిగా అమాయకంగా
మమైకమైపోయి
ప్రేమ ....
ఒక రస వాహిని
ఏ స్వర్గపు ఆకాశ హర్మ్యాల నుండో
జల్లిన అమృతపు చినుకుల అమరత్వం లా

ప్రేమ, కాదనుకోవడం .... మధ్య
ఒక లక్ష్మణ రేఖ
ఒక సన్నని అనుమానం పిచ్చి గీత చాలు
ప్రేమను కోల్పోయి
గుండెలు ద్వేషం తో ప్రతిధ్వనించి
మది ఒత్తిడికి లోను కావడానికి


జీవితాన్ని జయిస్తుంది ప్రేమ
హృదయం
విధేయం గా ఉంటే చాలు
బంగారం తో చెయ్యబడినది 
శరమే అయినా పంజరమే అయినా
కలలు కూలిపోక తప్పదు.

పరితాపం


తోడూ నీడ
ఆసరా ను కోల్పోయిన
ఒక సగటు స్త్రీ ....
ఆమె
జీవితం ఎడారిలో
ప్రేమ దాహం తీర్చుకునేందుకు
మమకారాన్ని కాదనుకుని
కావాలనుకున్న వాడితో
ముందుకు కదిలి
అకస్మాత్తు విపత్తు లో
సంరక్షణను కోల్పోయి
నిర్భాగ్యురాలై,
నొప్పి మాత్రమే మిగిలిన
జీవత్శవం .... 


ఏ మోహాపేక్ష లేని
నిష్కల్మష ఆలోచనలే తోడుగా
విశ్వాసమే బలం గా
సాక్ష్యం గా ..... ఒంటరిగా
జీవన సమరానికి సిద్దమయ్యి
ప్రశ్నించిన సమాజానికి
బదులిచ్చింది
కత్తి తో గుండెను చీల్చుకుని .... మరీ
ఎవరూ నమ్మలేదు.
అందరూ దూరం గా జరిగిపోయారు.
నిజాన్ని చూసే ఇష్టం లేకో
చిరిగిన అర్ధ నగ్నత్వాన్ని మాత్రమే చూసో
వేట ఆరంభం అయ్యింది.
విట కీచక విన్యాసాలు
వలలు, దౌర్జన్యాలు
ఒంటరి పోరాటం లో
అసహాయురాలు ఆమె
చివరికి .... పరిణామం
రాక్షసత్వపు ఎంగిలి తడి తాకిన
పెదాలు కుట్టేసుకుని ....
సమాధుల శకలాల మధ్య
గాయపడిన పావురం లా ....
సంరక్షించలేని సమాజానికి
ప్రశ్నించే అధికారమా అని!?
ప్రశ్నల సెగలను వీస్తూ
అనాద ప్రేతం లా
ప్రశాంతతే .... నిద్దుర లో

ప్రేమలోనే పిచ్చి ఉందా?


నాకు తెలియకుండానే 
నా హృదయం పిచ్చిదైపోయింది.
లయబద్దంగా కొట్టుకోవడం మానేసి
నీది ద్రోహ చింతన తెలిసి

అయినా
పిచ్చి నమ్మకమే
అలవికాని ప్రేమే ఇంకా
అపార్ధం చేసుకుంటున్నానేమో అని 


అందుకే
సిరలను తెరుచుకుని రక్తం....తో
శ్రమ స్వేదం....తో
నీ ఆకలి తీర్చాలని
నిన్ను రక్షించుకోవాలని .... ఉంది.

రాక్షసత్వం పనుల
చెడు ఆలోచనలనుంచి .... నిన్ను
కాపాడుకోవాలని
తెలియని ఓ వింత తపన .... ఇంకా నాలో

Friday, November 28, 2014

రావా పిల్లా! దరివై .... ఎదురు


నన్ను నేను కనుగొనేందుకు,
నా తొలి అడుగులు
తప్పులు దిద్దుకునేందుకు
అవగతం చేసుకుందుకు.
రావా పిల్లా! .... దరికి
తెలుసుకుందుకు
జన్మజన్మల అందమైన బాంధవ్యాన్ని 
నీవు నన్నెరుగుదువనే నిజాన్ని
కేవలం నీకు మాత్రమే తెలిసి
నీవే అని తెలియని గమ్యం వైపు
తడబాటు అడుగులు వేస్తున్నానని

మూసుకొనలేని కళ్ళను 
తెరుచుకునున్న హృదయ ద్వారాలను
భావుకుడ్నై ఉద్వేగం
ఉత్సుకత తపన చెందుతున్న క్షణాల్లో
అది నీ కోసమే అని తెలియక
నీ మార్గదర్శకత్వం కై మది ....
అలమటిస్తున్న క్షణాల్లో
రావా పిల్లా! దరికి ....
నన్ను కదిలించేందుకు
నీ నా నీడలను ఒకటి చేసేందుకు


ఆకర్షిత అయి నా ఎద నీ పట్ల ....
నీ దరి చేరాలని ఊగిసలాడే క్షణాల్లో....
తుళ్ళిపడకుండా ఉండేందుకు
పసి నడక నేర్చుకుంటూ
రాసుకుంటున్న సాహిత్యపు
ప్రేమ రాగం, జీవ మాధుర్యం భావం
నీవై నీ దరి చేరువవుతున్నట్లు
నేను కంటున్నది కల కాదని
నా జీవన గమ్యం .... కారణం
నీవని నమ్ముకుంటున్న క్షణాలలో
రావా పిల్లా!
భావుకత్వపరం గా నీవాడినే అని ....
నీవు లేని సంపూర్ణత లేదని .... నాకు

ఎదురుగా ఉంటే చాలు నీవు
ఆలోచనలే రావు
మనసే లేనట్లు
అంతా కలే అన్నట్లు
ఏదో వింత
అదో పిచ్చి .... అయినా
అదే అనుభూతి కావాలనిపిస్తూ,
నిన్ను మాత్రమే నేను .... ఎరిగున్నట్లు
కోరుకుంటున్నట్లు
ఆ కోరికే నా సంతృప్తి అన్నట్లు

రావా పిల్లా! దరికి ఇప్పటికైనా
చేతులు బార్లా చాచి
గుండెను తెరిచి ....
నన్ను కట్టిపడేసిన
ఏ తెలియని బంధం కోసమో ....
నా జీవసాగరం దరి నీవను బ్రమ లో
నీవైపుకే కదులుతూ
స్వేదానందం చెందుతూ 
నీవైపుకే చేరవస్తున్న నాకు ....
రావా పిల్లా .... దరివై .... ఎదురు

వెన్నెల కరిచిన రాత్తిరి


ఎంతో అందమైన రాత్తిరి
తియ్యని
వింత గగురుపాటు నరకపు చలి లో
విపత్తును మోసుకునొచ్చినట్లు
గాలి వాసన

చంద్రుడి ఆకర్షణా శక్తి కి
ముఖం పై
ముసుగు పొరలు
తొలగిపోయి

తప్పలేదు నాకు
పొద్దుతిరుగుడు పువ్వు నై
గాలి కి ఎదురు వెళ్ళక
ఎగరక ....
ఆ రాత్రి అందంలో ఈదులాడక

శూన్యమే ఆకాశమై
భూమికి ఆకాశానికీ మధ్య
ఇంత అందమైన వాతావరణం లో
కామదేనువు గర్భం లో లా
ఓ వింత అనుభూతి

దేవతావస్త్రాలేవో లా
నా ముఖం మీదనుంచి కదులుతూ
గాలి వింజామరులు .... చలి విపత్తు
అయినా
స్వాగతించాలనిపించే మార్పు సుమా!Thursday, November 27, 2014

మదిగతం తట్టి
దుఃఖసూచక గమనికేదో
గాలిలో వేలాడి
వెంటనే
ఎటో వెళ్ళిపోయి
ఆలోచనల అజాగ్రత్తే .... అది
వేడి వాడి
విషపుకోరల కాలం కాటుతో
భవిష్యత్తు ఓడి
వధించబడుతూ

నిలువునా


శాశ్వతత్వం ఆలోచన
జివితం లోతు
తెలియకే 
సౌకర్యమే
విజ్ఞత, గమ్యం లా 
కాలం కదులుతూ

Friday, November 21, 2014

ఆలోచనల లో


ఆమె,
ప్రతి ఆలోచన 
తీపి వాక్యం
రుచి ....
అనుభూతుల
జ్ఞాపకాల పుటల్లో
తియ్యని బాధను
అక్కడే
ఒదిగి ఉన్న
అక్షర సంపద
ఉనికిని .... నేను

విరుద్ధస్వభావిని


నేను, నాలాంటి మరికొందరి లా
అందరిలోనూ ఒక్కడిని కాని
ఒక వ్యర్థ ఆలోచనను
అసహజ, విలక్షణ వ్యక్తిత్వాన్నై

నీవు నన్ను ప్రేమించడమే
చిత్రం ..... చపలచిత్తమని తెలిసీ
ప్రాముఖ్యత ఇస్తున్నావెందుకో
అని .... అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది

ఎందరి ఆలోచనల్లోనో
నేను ఒక సమశ్యను
నిజం! నిజమూ కావచ్చు
వారి దృష్టి కోణ లోపమూ కావచ్చు


అందరిలా ....
నేనూ ఉండాలని ఎదురుచూడటం
న్యాయమా అన్న ప్రశ్నకు
లేదు సమాధానం నా వద్ద

మంచిదయ్యిందనుకుంటాను
నీకు నేను నచ్చడం
కానీ నాకూ నీవు నచ్చాలని
అనుకోవడమే అస్వాభావికం

నా ఆనంద ఉల్లాసాలను చూడాలని
నీ అబిమతం .... చిత్రంగా
నాలో ప్రశ్నలుగా మారుతూ
ఒక చపలచిత్తుడ్ని లా .... నేను

అయినా నీకు ఇష్టం నేను
ఆ నిజం తెలిసి
ఆనందంతో నేను గాలిలో తేలిపోతూ
వరప్రసాదంగా భావించాలని

నీ నమ్మకం, ఇప్పుడు
నా ఆలోచనలన్నీ
నీవు ఇష్టపడ్డావని తెలిసి
నీచుట్టేనే పరిభ్రమిస్తున్నాయని

అంతులేని నీ ఈ ఆలోచనల
ఊహల రహదారి లో పయనిస్తూ
మరిచిపోయావు సుమా
నాది విరుద్ధస్వభావం అని

Thursday, November 20, 2014

చిక్కుముడి


పదుగురిని అనుసరించేందుకు
అది ....
నడిచే రహదారి కాదు
ఎలాంటి సౌలభ్యమూ లేని
ఒక వల, ఒక అల్లిక
అనర్ధాలతో కూడిన
ఒక చిక్కుముడి
వ్యక్తి తనను తాను కోల్పోయి,
నిశ్చేష్టుడయ్యే
ఒక గందరగోళం స్థితి 


అది ....
అస్తవ్యస్త అసాధారణ ఘటన
ఒక అభిరుచి,
ఒక ఆసక్తి
ఉత్సాహాల మయమైన .... లక్షణం
ప్రేమ, ఒక చిక్కుముడి

Wednesday, November 19, 2014

ఎదలో...


నీకు విలువ కట్టలేనని
తెలిసింది
నేనూ నా ప్రపంచమూ సంపుర్ణంగా మారి
నా ప్రతి పనీ నీకోసమే
నిన్ను ఆకర్షించేందుకేనేమో అని
అనిపించాక
ఎందుకో
ఆ నక్షత్రాలను ఏరుకునైనా రావాలి
నిన్ను మెప్పించాలి అని
.......


తెలియదు ....
నీ ప్రభావం
నాపై ఇంతగా ఉంది అని
అనుకున్నది
నెరవేర్చుకునే పట్టుదల
నాలో లానే నీలోనూ అని
నాది ఇష్టమూ
నీది పట్టుదల అని
......
నిజంగా,
సూర్యకాంతి లేకుండా బ్రతకడం
గుండె కొట్టుకోకుండా ప్రేమించడం
మరి
నీవులేని నేను లేననే
ఈ భావనేలనో నాలో ....
బ్రతకలేననే
అల్లకల్లోలతలు ఏలనో ఎదలో

Tuesday, November 18, 2014

సముద్రపు హోరు


నీతో కలిసి .... గమ్యం చేరే ప్రయత్నం లో
ఆ విశాల సాగర అనంతపయనం లో
సుదూరంగా కనిపించిన
విశాల శిఖరాన్ని చూస్తున్నప్పుడు .... చిత్రంగా,
అలల సవ్వడి చెవులను
నీటి తుంపరలు శరీరము ను తాకి
నీవూ, నేనూ మమైకమైన క్షణాల లో
నేను నిన్ను భద్రంగా పొదువుకునున్నప్పుడు
మన ప్రేమానుభూతుల జ్ఞాపకాల నెమరు,
ఆ సముద్రపు హోరులో కలిసి కరిగిపోయిMonday, November 17, 2014

సంఘర్షణ


వెళ్ళిపోదాము అనే ఆలోచనకు ప్రశ్నార్ధకం గా
వెనక్కు లాగుతూ ఉంది నా హృదయం .... నీ వద్దకు
ఎంత నడిచానో
బయలుదేరిన చోటే ఉండిపోతూ
శరీరం ముందుకు లాగుతూ
అవయవాలు సహకరించక అక్కడే ఉండిపోయి

అది సామర్థ్యలోపం అనుకోలేను.
నీనుంచి దూరంగా కదలలేని, ఆత్మ
నీ ప్రేమాకర్షణకు లోనైన ఎద
నీ ప్రతి శ్వాసలోని
నీ ప్రతి నిట్టూర్పు లోని
గోరువెచ్చని వెసులుబాటులా నన్ను ఆవరించి

కామ, మోహ ఆకర్షణలు ఏవో
నన్ను ప్రలోబపెడుతూ .... నాలో తత్తరపాటు
నీ కళ్ళు మెరుస్తున్నాయి .... నీవు
నా అంతర్మదనాన్ని చూస్తున్న భావన
నా హృదయం, నీ హృదయాన్ని చేరేందుకు
ఉబలాట పడటం, నీవు గమనిస్తున్నట్లు ....


చిక్కని చీకటి .... చుట్టూ
కారు మబ్బులు చంద్రుడ్ని కమ్మేసి
ఆకాశం నల్లగా .... ఆరుతున్న దీపాల్లా నక్షత్రాలు
మసక మసకగా మారుతూ
ఓ చెలీ! నా ఆశ .... తియ్యని నీ ప్రేమతో
నువ్వొస్తావనే, నా ప్రేమ ప్రపంచం లోకి

ఘనమైన ఆనందం


నా పేరును ఎవరో పిలుస్తూ
ఎక్కడినుంచో ఒక ఘనమైన ఆహ్వానం
ఆనుభూతి, ఆత్మానందం చేరువ కాబోతూ
బ్రమ కాని, మాయ కాని
విధి నాటకం .... అది.
ఏ తెలియని లోకం నుంచో
ఎవరో నన్ను పిలుస్తూ ....
నేను ఆకర్షితుడ్నౌతూన్నట్లు, 


ఒకప్పటికీ, ఇప్పటికీ భిన్నంగా
అప్పుడే ఒకప్పటిలా, ఎప్పటిలా
రూపాంతరం చెందీ చెందని మనోఃస్థితి లో
చేరాల్సిన గమ్యం ఎక్కడో ఉండి
అక్కడికే చేరుకుంటున్న
ఆత్మ విముక్తికి చెయ్యందిస్తూ
ఎవరో నన్ను పిలుస్తూ, ఆ ఆంతర్యం
ఘనమైన ఆనందమేదో ప్రసాదిస్తున్నట్లు

Wednesday, November 12, 2014

నీకన్నీ తెలుసనే .... ఓ చెలీ


ఎన్నిసార్లు జరిగిందో అలా
జీవన రహదారి లో
పరుగులు తీస్తూ
అర్ధరాత్రిళ్ళ లో
సూర్యుడ్ని పరామర్శించేందుకని
కాళ్ళకు చక్రాలు కట్టుకుని
పచార్లు చేస్తున్నప్పుడు 
నీవు గుర్తుకు వస్తుండటం
నీ అవిశ్రాంత హృదయం
నీ ఒంటరితనం
నీవు నిద్దుర రాక పొర్లుతుంటుండం
ఊహకు వచ్చి నవ్వుకుంటాను.
ఇదిగో చెలీ,
నా ప్రేమనంతా మూటకట్టి
నా పైనుంచి కదులుతున్న
ఈ మేఘాలపై పంపిస్తున్నా
నీ వెసులుబాటు కోసం

ఎందరో చెబుతుంటారు.
ఎన్నో విధాలుగా
జీవితం ఎంతో అమూల్యమని
రహదారి లో చేసేది కాదు.
సంసారం అని,
నిజం చెప్పు!?
నీవూ నేనూ కాదా
కలిసి జీవించాల్సింది,
ప్రేమను పంచుకోవాల్సింది.
పద్దతి, పరిపుర్ణత ఉన్నవారే
జీవించేందుకు అర్హులు అని
ఇలాగే నడుచుకోవాలి అని
అంటుంటారే ....
న్యాయమా ఓ చెలీ!
నా వెనుక నీవు నిలబడుండు చాలు
విదేయుడ్నయ్యి
నీ ముందుంటాను ఎప్పటికీ


గాలిలో ఎగరడం
గ్లోబులో .... మోటర్ సైకిల్
ఫీట్స్ చెయ్యడం
శరీరం మీద
పెట్రోల్ పోసుకుని
నన్ను నేను వెలిగించుకుని
నలబై అడుగుల క్రింద
నీటిలోకి దూకడం
తీగ మీద నడవడం
ఆకాశం కప్పు క్రింద సర్కస్
చెయ్యడం విదూషకత్వం
సాటివారిని నవ్వించేందుకే
స్థలమూ, సమయమూ
మార్చి మార్చి ప్రదర్శన
నా వృత్తి ధర్మం అది
ఆశ్చర్యమేస్తుంటుంది ఎప్పుడైనా
ఎక్కడ ఉన్నాను?
ఏమి చేస్తున్నాను?
ఎందుకలా? నీవు లేకుండా అని!?

ప్రేమించి
దూరంగా ఉండటం
సులభం అనుకోను.
ప్రేమ అనుభూతే అంత
ఇద్దరం అపరిచితులు లా
మళ్ళీ
ఒకరినొకరు కనుగొనే ప్రయత్నం
ప్రేమే
మాధ్యమంగా చేసుకుని
ఆనందాన్ని పొందుతుండటం
ఓ చెలీ!
నా వెనుక
నీవు నిలబడున్నావనే
నేనెంత విదేయుడ్నో
నీకు తెలుసనే
ఎంత విశ్వసనీయుడ్నో
ఎప్పటికీ ఎలా
ఎందుకు నీ వాడినో
నీకు తెలుసనే .... ఓ చెలీ!

Monday, November 10, 2014

నిజాయితీగా ఉంటాను .... ఓ స్త్రీమూర్తీ


ఎవరైనా ఎందుకు అలా ఎలా ప్రవర్తిస్తారో
వారి గురించి వారు ఏమనుకుని
మరొకరి స్వచ్చ భావనల ప్రేమను పొంది
ప్రతిగా ఎందుకు అన్యాయం చేస్తారో ....
ఓ స్త్రీమూర్తీ! నాకు తెలుసు!
ఇప్పుడు నీ మనోస్థితి గందరగోళంగా ఉందని
నీ ఎద ముక్కలై,
నీ మది ఒంటరితనాన్ని కోరుకుంటుందని

ఎవరో అల్లిన అబద్ధాల, అబాండాల వలలో
ఉక్కిరిబిక్కిరై .... ఎందుకిలా జరిగిందీ అని,
మదనపడుతున్నావు. అవును,
అబద్ధాలు చెప్పేవారు చెబుతూనే ఉంటారు,
కూలుతున్న గోడలను కడుతూనే ఉంటారు.
తప్పదు వారికి! ఎందుకంటే,
ఆదీ అంతమూ లేనిది అబద్దం కాబట్టి ...

ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినా
చివరివరకూ నిలబడేదీ మాత్రం నిజమే ....
ఆ నిజమే నేను చెబుతాను .... అబద్దం చెప్పను.
నిజం నాలో నిక్షిప్తమై ఉంది కాబట్టే ....
ఓ స్త్రీమూర్తీ!
పుట్టింటి తలవంపులకు కారణమనుకోకు!?
వద్దు! వద్దు!! ఆరోపించుకోకు నేరాన్ని .... నీపై

జీవితం మధ్యలో వచ్చిన ఒక పురుషుడు చేసిన
ఒక పిరికి మాలిన నిర్ణయం,
ఒక పిచ్చివాడి చేష్టకు బలాన్ని చేకూర్చకు!
నీ మనసుకు నచ్చిన ఏ చోటుకైనా నేనూ వస్తాను .... నీతో కలిసి
నీకు సంతోషం కలిగించే పనులేవో తెలుసుకోవాల
ని, 
నా హృదయం లక్ష్యం .... నిన్ను ఉల్లాసంగా ఉంచాలని
నీ మనోపశమనానికి కారణం .... నే
ను కావాలని
అలా అని అబద్ధాలు చెప్పను
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, స్నేహిస్తున్నాను కాబట్టి .... అని,


వీడ్కోలు చెప్పను ఎప్పటికీ ....
నీవు ఒంటరితనం కోరుకోవడం కన్నీళ్ళు పెట్టడం సహించను
నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నానని ....
ఆ ప్రకృతి మాతకు మాత్రమే తెలుసు
నీకు చూసే కళ్ళుంటే 

నీవు నా ప్రేమను నా దృష్టి లో చూడగలవు
చూడగలవు .... నా జన్మకు పరమార్ధం నీవనే భావనను
నాకెలాంటి కారణాలూ లేవు ....
నిన్ను దూరం చేసుకునేందుకు
ఎంత బలమైన కారణం అయినా
నీతో నిజాయితీగానే ఉంటాను .... ఓ స్త్రీమూర్తీ

వింత ఆశ


చిత్రమైన ప్రశ్నలు .... అప్పుడప్పుడూ
నన్ను నేను ప్రశ్నించుకుంటూ
కొలను ఒడ్డున
నిశ్శబ్దంగా కూర్చుని
నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ
నిజమా? అని,

నేను చుస్తుంది
నిజంగా నన్నేనా అని
కొలను నీరు
నిజాన్ని చూడగలదా
నేను చూడగలిగినంతగా నన్ను అని
ఎన్నో సందర్భాల్లో ....


కొలనుకు ఆత్మావలోకనం చేసే శక్తే ఉంటే
ఎంత బాగుంటుందీ అని
ఆత్మల అందం ఆనందాల్ని 
ప్రతిబింబించి ప్రపంచానికి పరిచయం చేసెయ్యాలని
ఎందుకో
నా నన్ను ను ప్రతిబింబించితే చూడాలని

Friday, November 7, 2014

అభిమానాన్ని


ఇక్కడే, నిగూఢ స్థలంలో ....
భద్రంగా 
నీ ఆత్మ లో
లోతుగా, పాతిపెట్టబడి ....
నీ అహం తెర వెనుక


ఛేదించరాని గత చరిత్ర
పుటల గోడల
సంరక్షణలో
నమ్మకం కలించలేని
వాగ్దానాన్ని లా 


చెలీ,
నేను .... నీ అభిమానాన్ని

Thursday, November 6, 2014

విచ్ఛిన్నమై ....


రెండు గా ముక్కలైన గుండె
విఫలమైన ప్రేమ
సగం, ఆమె కోసం ....
శ్వాస అందక మిగిలిన సగం
కొట్టుకో లేక .... లయబద్దం గా
ఎప్పటికీ 


కలవని
ఆ పగుళ్ళ రసి
వికటించిన ఆ ప్రేమ భావనే
కారుతూ ....
ఆమె కై, పశ్చాత్తాపం చుక్కల్లా

Tuesday, November 4, 2014

పండుగ వేళ


నిండు పున్నమి చంద్రుడు
ఆకాశమంతా నిండి
రాత్తిరిని
ఆలింగనం చేసుకున్న పరవశం
వెన్నెల ప్రకాశం
ఆ ఆనంద తాండవం సొగసులు
మేఘాలను చీల్చుకుని
పరావర్తనం చెందుతూ విశ్వమంతా 

Monday, November 3, 2014

వెసులుబాటు బాటలో


రోజువారీ ఒత్తిడుల
జీవ పోరాటం లో
సమశ్యల లో కూరుకుపోయిన
అసహనం
మాటలలో ఆప్యాయతలు దొర్లని
అపార్ధాలమయ జీవితం 

ఓ చెలీ!
ఎవరి గురించి పట్టించుకునేందుకు
సమయం లేదు ఎవరికీ
ఈ బాధ ఈ ఒంటరితనం భావన
ఎవరో ఎప్పుడో కనపరిచే
అనురాగాన్ని కనలేకే

ఈ చీకటి
అయోమయాంధకారం
చేధించాల్సిన సమశ్యల
కందకాలు .... కూరుకుపోయి
ముసురుకుంటున్న 
గందరగోళం భావోద్వేగాలు

జీవన విధానంపై .... ఖచ్చితంగా
ప్రభావం చూపిస్తూ
గాయపరుస్తూ, అప్పుడప్పుడూ
వికటించి
మనిషినీ మనసునీ
మానవాళిని ఒకరికొకర్ని దూరం చేస్తూ

ఎన్నిజన్మాల బంధమో నాదీ నీదీ
కలిసి ఇన్నినాళ్ళూ
సాగించిన జీవనం లో
అంతా సౌకర్యవంతంగానే సాగింది.
అన్ని విధాల ఒకరినొకరం
అర్ధం చేసుకుని అనుకూలంగానే

అందుకే .... చెలీ!
ఈ జ్ఞాపకాల అనుభవాల ఆసరాగా
అవగాహనా లోపాలుంటే .... సరిదిద్దుకుని
ఏక దృష్టి తో కదిలేందుకు,
కలిసి
ప్రయత్నిద్దాం! జీవించేందుకు
కాసింత వెసులుబాటు తోడుగా

Sunday, November 2, 2014

అవశేషాల్లా
బూడిద కప్పిన నిప్పుముద్దలు
ఆసరా కోల్పోయిన
బొగ్గు పూలు
పూల రేకులు
బొంగురుపోయిన గొంతులు
అనంతమైన చీకటి సొరంగాల లో
పుణ్యక్షేత్రాల లో
నదీసంగమ స్థలాలలో
ఆఖరి కర్మలు
పోయిన అయిన పుణ్యాత్ముల
ఆత్మల శాంతి కోసం
అప్రయత్నంగా జారిన కన్నీరు
రాకాసిముల్లు అంచునుంచి జారిన
మంచుబిందువులు
ఏదో ఒత్తిడి
గుండె భారం
శ్వాస కష్టమై పెగలని గొంతుకలో
ముళ్ళకాయ
స్వార్ధం కమిలి
సిరలలోకి దారలా
ప్రవహిస్తూ
స్వచ్చమైన అవశేషాలు .... కొన్ని