Monday, February 29, 2016

అగంతకుడివి నీవు





















నీవే నా అన్నీను .... నిన్నటివరకూ
అలా అనుకోవడం లోని ఆనందం అనుభూతి
నీవూ అంతే అనుకుని ....
నాది కేవలం భ్రమే అని తెలిసేవరకూ

ఎదపూర్తిగా నిన్నే ప్రేమించాను.
నీతిమయం నియమంగా లోతుగా
సమర్పణాభావనతో
సమర్ధించుకున్నాను తప్పని తెలిసినా

నీవు నోరు జారినప్పుడు
ఎంతో భావోద్వేగురాలినయ్యేదాన్ని
నీవు నన్ను ముద్దాడినప్పుడు
నీ నవ్వు వెన్నెల్లో అమృతాన్ని చూస్తుండేదాన్ని.

ఆ నా ప్రేమంతా లిప్త పాటులో కోల్పోయాను
నీవు నన్ను కాదనుకుని
ఒంటరిని చేసి దూరంగా వెళ్ళిపోయి
విధ్వంసం, సర్వనాశం జీవత్శవాన్ని చేసినప్పుడు

నీతో పాటు తీసుకుని పోయావు
ఎంతో అమూల్యమైన నా ఆత్మను
నేనో మనిషిననైనా గుర్తుండేది
ఆ ఆత్మ అంతర్గతంగా నాలో ఉన్నప్పుడు

ఆగంతకుడివి నీవు ఆత్మను అపహరించావు.
నా ఆత్మ నాకు కావాలి ఇప్పుడు
నా కోరిక .... మళ్ళీ ప్రేమించాలని
మళ్ళీ భావుకురాలినై మళ్ళీ ప్రేమించబడాలని

ఆ ప్రేమించేవాడు నీలాంటి వాడవ్వరాదని
నిజం! ఎప్పటికీ గుర్తుండే అనుభవం నీవు
ఎప్పటికీ మార్పురాని ఒక మారని
నికృష్ట, నీచ, అధమ ఒంటరి ఆగంతకుడివి నీవు

Saturday, February 27, 2016

అవసరమా



అవిగో మల్లియలు అవిగో గులాబీలు
నీ చేతికి అందే అంత దూరం గా
నిన్నటివరకూ ....
నీ ముందే అందాలను కురుస్తూ
పరిమళాలను పరుస్తూ

నీవే చూడటం లేదు
ఇప్పుడు
అవి అక్కడ లేవు
వడలి రాలిపోయాయి 



ఎందుకీ నెమ్మదితనం తాత్సారం
అవి వడలి రాలేవరకూ
నీ కళ్ళ ముందే
అందుబాటులోని అందం
పరిమళాలను స్వాగతించేందుకు

మనసు విప్పి
మనో ఆహ్లాదం భావనలను
చెప్పేందుకు 
ఎందుకీ సందేహం బిడియం
ఆ బిడియమే అలసటై
పరితాపం గా మారుతూ

కదా



ఎంత మంచితనం
గడించామని
ఈ దోష బురద
దూళి మయ జీవితాలను
ఈది
ఏ ఆనందానికీ
మనం
అర్హులం కాకుండా

Monday, February 22, 2016

అమూల్యత ఆపాదించుకునేందుకు



ఎక్కడని కనుగొనగలను
నా అనుభూతుల ప్రతిధ్వనులను

నీ హృదయం లోనా
ఎక్కడ .... ఉనికిని కోల్పోయానో
అక్కడ .... లేక,
నీ కనుపాపల్లో నా
నాకు నేను స్పష్టంగా కనిపిస్తానా 
చూడగలనా ....
మూసిన నీ చేతులను విప్పి
లేక,
ఆ మూసిన చేతులే
నాకు స్వేచ్చను ప్రధానించునా



ఎక్కడని శోధించను
నీ నా స్వరాల ప్రతిద్వనులను
వినగలను .... ఎక్కడని చూడగలను.

ఆద్భుతమే కాని


చాలా కష్టం
సుమమే కదా అని
సున్నితంగా
ముద్దాడటం
ఒక బ్రహ్మ(ముండ్ల)జెముఁడు ను 
ఎంత వికసించినా
వర్షంలో
విస్తరిస్తున్న
ముళ్ళవనంలో 

Saturday, February 20, 2016

అస్పష్టతను నేను


నీ తోడనే ఉన్నాను ఎప్పుడూ
నీ ఆలోచనల్లోనే నీ వెంటే నడుస్తూ
అప్పుడప్పుడూ
నన్ను చూసి నీవు భయపడేలా చేసే
నీ నీడను నేను

చీకటిలా ఉండి ప్రాకుతూ
చూసేందుకు నేను శూన్యాన్నే కానీ
నీతోనే ఉంటుంటాను ఎప్పుడూ
నిన్నే గమనిస్తూ ....
నీ వెనుకో, పక్కనో, ముందో కదులుతూ

ఎప్పుడూ నీకు తెలిసేలాగానే ఉంటాను.
ఒక్కోసారి అతి చిన్నగా ఒక్కోసారి అతిగా
ఎప్పుడూ నిన్ను ఆలోచింప చేస్తూ
ఎంతో దగ్గరగా ఉండి
ఎప్పుడు ఎలా భయపడాలో తెలుపుతూ

నీ ఇంటి గోడలమీద నర్తిస్తుంటాను.
ఒక నీడలా, ఒక ముదురు కళంకం లా
అసకమసక గా అక్కడే
నీ పక్కన .... ఒక అస్పష్ట అస్తిత్వాన్ని లా
నీ వైపే తదేకం గా చూస్తూ

ఒక ప్రచ్ఛాయను లా ఎప్పుడూ
నీ ఊహల్లో జీవిస్తూ
నీ చుట్టూ .... నీ నీడల్నే తిప్పుతూ
ఏ ఎత్తిపొడుపు శూన్యం లా నో
ఏ ఉపరితలం భూతం లా నో

మసకచీకటి మంద్రపడుతున్న
ఏ చీకటి అంధకారాన్నో అయ్యి
సగం జీవితం రాత్రిళ్ళు నీకు కనబడను కానీ
నేను అక్కడే ఉంటాను ఎప్పుడూ
నీ పక్కనే తచ్చాడుతూ

మసకను చూసి భయపడేవు
సున్నితంగా స్పర్శించి చూడు
ఎందుకంటే
నేను అనే నీడ .... నీ సృష్టే
నీవే కారణానివి .... బ్రహ్మవు నా జన్మకు

నిన్ను ఒదిలి నేను ఎటూ వెళ్ళను.
నీవు కృశించినా మరణించినా
నీ నీడనయ్యే ఉంటాను
నిన్నే గమనిస్తూ పరిబ్రమిస్తూ
రూపాంతరం చెందుతూ నీతోనే ఎప్పుడూ

Thursday, February 18, 2016

గులాబి ముల్లు గుచ్చుకున్నా



అదో వింత ఆనందము,
ఆహ్లాదము
ఎవరినో ప్రేమించడం లో
ఒకవేళ
ఆ ఎవరో తిరిగి
ప్రేమించే అవకాశమే
లేకపోయినా
ప్రేమించరని ముందే తెలిసినా
ఈ నొప్పి
ఈ తియ్యని బాధ చాలు
ఇంకా జీవించే ఉన్నానని
తెలుసుకునేందుకు

Wednesday, February 17, 2016

మంచితనాన్ని పెంచాలి


ఎందరో అలమటిస్తున్నారు ఇంకెందరో రోదిస్తున్నారు
తాళలేక మరణిస్తున్నారు పసిప్రాణులు కొన్ని
ఎండిన ప్రేగుల ఆఖలితో నిరాశలో మ్రగ్గుతూ
వారి జీవితాల్లో
సూర్యుడు ఉదయించాడే కాని ప్రకాశించడం లేదు.

ఎవరున్నారు?
వారిలో ఆశలు నింపడానికి
జీవించడానికి వారికో అవకాశం కల్పించడానికి
సంపాదించుకుని
వారి కాళ్ళమీద వారు నడవడానికి

ఏదైనా చెయ్యొచ్చుగా చేతనయ్యింది
మంచితనాన్ని సహాయంగా అందజేసి
ఏదైనా నీకు అనిపిస్తే .... వారికి అవసరమని
ఏదో నేనూ చేసాను అని
చెప్పుకోవడానికి కాకుండా చెయ్యొచ్చుగా 


మనలో కొందరున్నారు చెడునే ఆలోచిస్తూ
ఏదో లేకే చెయ్యలేకపోతున్నానే కాని
ఉంటే చేసేవాడిని అంటూ
అవి, వ్యర్ధ పదాలు .... వాడొద్దు
జీవ వాద్యసాధనాల తీగెతో ఆశల శ్రుతిని
వినిపించేందుకు ప్రయత్నించాలే కాని

బుద్ధిహీనత, కాలాన్ని వృదా చేసుకో తగదు.
ఏదైనా సహాయం చెయ్యాలి
సాటి మనిషి అవసరానికి చేదోడుగా మారి
వారి జీవితాల్లో కాసింత ప్రకాశం చోటుచేసుకునేలా
ప్రేమను కరుణను కాస్తంత పంచి

కూడు, గూడు, గుడ్డ అవసరాలే సుమా
కాసిన్ని డబ్బులు సంపాదించుకునేందుకు
వారికీ ఏదైనా అవకాశాన్ని
కొద్దిపనినైనా సమ కూర్చి
వారిలో ఆశను చిగురింపచెయ్యొచ్చుగా

Monday, February 15, 2016

ఒక తోడువైతే బావుణ్ణు(నీడలా కాక )



నీ పేరు నా పెదవంచు మీద 
నాట్యమాడుతూనే  ఉంటుందెప్పుడూ 
నిద్దురలోకి జారే ప్రయత్నంలో ఉన్న 
రాత్రి వేళల్లోనూ .... ఒక పలవరింత లా

అన్ని వైపులకూ పొర్లుతూ ఉంటావు
నా నాలుక మీద .... నీకు తెలుసు, 
ఈ బెట్టు ఈ పట్టుదల .... నీతో
ఏ పోరాటం లోనూ నేను గెలవలేనని 

నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ 
తెలియని ఏ భయానికో నేను లొంగిపోతూ 
నీవు మాత్రమే కాదు 
నీ చేదు ఉప్ప కన్నీరైనా చాలు  

Saturday, February 13, 2016

వీడ్కోలు చెబుతున్నా .... మన్నించవా



అంధకారం అలుముకునుంది .... హృదయం లో
జరుగుతున్న సంఘటనలు పరిణామాలతో
ఘాడంగా ప్రబలి .... ఇంత కాలమూ ఎలా భరిస్తూ వచ్చానో
సమీక్షించుకునేంత సావకాశం దొరకక
ఇన్నాళ్ళుగా భరిస్తూ వస్తున్న ఈ బాధకు కారణాన్ని

కాబట్టేనేమో అనుకుంటూ ఉన్నాను .... నీతో చెప్పాలని
వీడ్కోలు .... ఆఖరిసారి గా నైనా మనసు విప్పి
త్వరలోనే నేను మౌనిని, శూన్యాన్నీ, శిలను లా
ఎవ్వరూ ఊహించని రీతిలో .... మారాలనుకుంటున్నానని
అందరూ కోరుకుంటున్న విధం అదే అనుకునని

ఏ కారణాలతోనూ నేను సంఘర్షించలేను
అది ఒక్కటే మార్గం నాకు తెలిసినంతవరకూ అని
అనుకుంటున్నాను .... ఈ నొప్పిని మరిచిపోయేందుకు
భావనారహితుడ్నై ఉండేందుకు .... క్షమించవా నన్ను 
ఒకవేళ ఈ ప్రక్రియ నిన్ను గాయపరిస్తే మరింతగా 



బహుశ నీకు తెలిసే ఉంటుంది
నా కళ్ళలో, నా ప్రవర్తనలో గమనించే ఉంటావు
నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆరాదిస్తున్నానో
అతిగా నిన్ను ప్రేమించిన నీ సన్నిహితత్వాన్ని ....
మనఃపూర్వకంగా చెబుతున్నా .... తుది వీడ్కోలు

అంతరాంతరాల్లో .... అక్కడా అంతా శూన్యమే
అంధకారం శూన్యంలో ఎవరూ ఉండలేరని తెలుసు
ఇప్పుడు చెప్పలేను .... వెలుతురున్నప్పుడు ఏమయ్యిందో 
ఎంత ప్రయత్నించానో కత్తి అంచుమీద నడిచేందుకు 
ఆశ్చర్యంగా ఉంది .... ఇలా దూరంగా జరగాల్సి రావడం

ఒకవేళ నీకు గానీ నేను దూరమైపోతున్నాననిపిస్తే మన్నించు
ఆ ఉద్దేశ్యంతో చెయ్యడం లేదు .... నిన్ను బాధించాలని
నీకు దూరంగా వెళ్ళిపోవాలని
నీవే నా అత్యంత సన్నిహిత స్నేహితురాలివని నీకూ తెలుసు 
నాకే ఎందుకో నేను ఒంటరిననే భావన 

అది అబద్దం అని తెలిసినా ఆ ఒంటరిననే భావనే .... నాలో 
అందుకే జారిపోతున్నాను .... అన్నింటినీ నాతో తీసుకుని
కేవలం చిన్ని చిన్ని సంఘటనలు మినహా
నీ దృష్టికి, నీకూ, నీ ఆలోచనలకు దూరంగా
బహుశ ఆ జ్ఞాపకాలైనా కొంత ఉపశమనం కలిగించొచ్చనుకుంటూ
మనఃపూర్వకంగా మరోసారి కోరుతున్నా .... మన్నించమని

అట్లా చెప్పకు



అట్లా చెప్పకు అలా అర్ధనిర్ధారణ చెయ్యకు 
నా రాతలను చదివి .... నన్ను గురించి 
నేనింకా జీవితాన్ని సంపూర్ణంగా చదవలేదు 
ఏ పరిశోధనా పూర్ణంగా చెయ్యలేదు 
నేను చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. 

అట్లా వ్యాఖ్యానించకు .... నా గురించి 
నన్ను చూసి .... నీవు చూసిందే నిజం అనుకుని 
కళ్ళతో చూసి నిర్వచించడం కష్టం .... నన్ను 
నా ముఖంలో మనోభావనల్లో కనిపించను .... నేను
నీ చూపులు నిన్ను తప్పకుండా మోసగిస్తాయి.


నా ఆలోచనా సరళి ని చూసి 
ఆ ఆలోచనలే .... హద్దులనుకునేవు  
అప్పుడప్పుడూ, నా ఆలోచనలు పెడదారిని పడుతుంటాయి. 
క్షణక్షణమూ నేను మారుతుంటుంటాను,. 
జ్ఞాన సముపార్జనలో ఆలోచనల్లో ఆచరణలో 

స్పష్టం చెయ్యకు నన్ను .... మాట్లాడేప్పుడు విని
నీవు విన్న మాటలే నిజమనుకుని .... నా గురించి 
నిన్ను నీవు ప్రశ్నించుకో 
నన్ను నీవు నిజంగా అర్ధం చేసుకున్నావా అని లేదా 
ఏ నెమరువేయని జంతువునైనా అడిగి తెలుసుకో

అర్ధం అయ్యిందా .... ఇప్పుడైనా  
నేను చెప్పలనుకుందీ 
విడమర్చాలనుకుందీ 
జీవన సత్యం 
నన్ను గురించిన వాస్తవం .... ఏమిటో 

మరోసారి నా గురించి అతిగా ఆలోచించకు 
నేను ఏమి ఆలోచిస్తున్నానో, రాస్తున్నానో, 
ఏమి మాట్లాడుతున్నానో, ఎలా కనిపిస్తున్నానో అని
అడుగు నన్ను .... నీకు అస్పష్టంగా ఉంటే 
విడమర్చుతా నీకు .... నిర్ద్వందంగా, స్పష్టం గా

Monday, February 8, 2016

నేను సెక్యులర్ క్రియను


ఎవ్వరూ వెళ్ళలేరు దాటి .... నన్ను
నేను, ఆత్మల
అనుభవాల ఫలాలను
పరీక్షించి
నిర్ణయించే వేళ
నరకానికెవరు స్వర్గానికెవరో అని
......
దయ కరుణ
నా నిఘంటువులో లేవు
.........
చనిపోయిన వారిని
ఏ బల్లకట్టుపైనో
తపనల రేవు దాటిస్తుంటాను
వారి వారి కర్మల ఫలితం
మరో జన్మలోకి 



అనుభూతి చెందు
నీ ముందే ఉన్నానని
ఒక జలగ ఒక గొంగళిపురుగు లా
అసహ్యకరంగా
నీ మెడచుట్టూ 
శీతల హస్తాలను బిగిస్తూ ....
.............
ఎవ్వరికీ నేను కనపడను
................
ఎవ్వరూ మోసం చెయ్యలేరు
నా శ్రమ ఫలితాన్ని చెల్లించకుండా
ఎక్కడికీ పారిపోలేరు.
నాకు డబ్బు అక్కర్లేదు
ఆస్తులు సిరులక్కర్లేదు.
నీ ఆత్మను కాపాడుకో చాలు
.................
ఏ ఉపకారం అక్కర్లేదు
ఎలాంటి కోరికలూ లేవు 
నేనే తుది శ్వాసను.
నేను ధనిక, పేద,
కుల, మత రంగు బేధాల్లేని
నిజమైన సెక్యులర్ క్రియను
మృత్యువును .... నేను

Sunday, February 7, 2016

భగ్న ప్రేమ లో



అస్పష్ట అగ్రాహ్య నిరాకార అంధకారం 
ఊపిరి తిప్పకుండా చేస్తూ 
స్రవిస్తూ ఉంది ....
విశ్వాసఘాతక హృదయం 

రక్తిమవర్ణపు ధమనులు సిరలు 
వంకరటింకర నాళాలలో 
రక్త ప్రవాహం ఒత్తిడిపెరిగిన శబ్దం  
గాయపడిన ఓటి చప్పుడు తో

నీనుంచి దూరంగా జరిగిన ప్రతి అడుగూ 
ఓ తడబాటే, పగిలిన ఆత్మ అశ్రువులే 
వడిగా రసాయనాశ్రువులుగా మారి
మరకతముల్లాంటి కళ్ళలోంచి ప్రవాహం లా 

ఎలాంటి ఆశావహ తారా లేదు 
అక్కడ ఎలాంటి వెలుతురూ లేదు 
రహదారంతా చీకటి మయం 
నీ ముఖం కానరాకే
అన్నీ తడబడ్డాలే .... అగమ్యుడ్నిలా 

వెనుదిరగలేని స్థితి ముందుకే కదలాలి 
మాడ్చి వేస్తున్న మనోభావనల్ని 
తట్టుకోవాలి 
అలవాటు చేసుకోవాలి నేర్చుకోవాలి 

అందుకేనేమో అనిపిస్తుంటుంటుంది 
ఇంతకన్నా దయచేసి 
నేను చనిపోయినా నీ చేతిలో  
ఎంత బాగుంటుందో అని  

Thursday, February 4, 2016

అగమ్యులము


స్వస్థచిత్తులమై ఏ బీచ్ లోనో కూర్చుని,
నింపాదిగా మనం
ప్రయత్నిస్తూ ఉంటాము.

వ్యాకులపడి తపిస్తూ
అస్తిత్వ ఔన్నత్యాన్ని 
భూమ్యాకాశల మధ్య విస్తరించుకునేందుకు 


ఈ లోపల
ఏ ప్రలాపపు మతిభ్రంశపు చినుకో
భయాందోళన అలై

నల్లని ఆ అంధకార, అస్పష్ట
నిశ్చల సాగరం లోకి
నిర్దయగా అస్తిత్వాన్ని కడిగెయ్యకుండా

Monday, February 1, 2016

ఒక స్వేచ్చా గీతిక


నాకు ఎంతో ఇష్టం
ముక్కలైన వాక్యాలను చదవాలని
పెళుసు, పేద .... పదాల 
అపశబ్దాల లోతుల్లోని
స్వేదం ముత్యాలు చూడాలని
పచ్చి, అపక్వ ....
ముడిపదార్ధాలను స్పర్శించాలని
ఎన్నో నిన్నటి
సమృద్ధ ఫలవంత వాస్తవాలను
జీర్ణించుకోలేని అస్తిత్వ ఆవేశం
పిచ్చితనం .... ముదిరిన మది బంధాలను
ఇంద్రియ, జ్ఞాన నిలకడత్వాలను 
సంహరించుకునేందుకు జరుగుతున్న యుద్ధం 
అనుభవం మిగిల్చిన
ఆఖరి ఊపిరి  
ఇప్పుడు నోరుతెరుచుకుని చూస్తుంది.
పాడేందుకు, ఒక స్వేచ్చాగీతికను