Sunday, June 30, 2013

అదే నీవైతే?


నేను
ముక్కలయ్యానని తెలుసుకునేసరికి,
ఆలశ్యం అయ్యింది.
నా మనసుకు,
అయినా .....
ప్రేమ మొలక, తొలి వలపు
సాంగత్యం గురించే బోధిస్తున్నాను.

అవే జలాల్లోకి,
మళ్ళీ అదే వరద .....
బురద లోకి .... అదే బాటలో
వయసులో ఉన్నప్పుడు ....
నేను చేసిన పొరపాటు ను
భిన్నంగా ఫలితం చూడాలని,
చూసేందుకు ప్రయత్నిస్తున్నాను.

ఊబిలో
శరీరం కూరుకుపోయి
ఎటూ కదల్లేని,
దూరంగా పారిపోలేని,
స్తిమిత పడలేని స్థితి లో .....
భావనలు, భయాలు మాత్రం
మబ్బులై కమ్ముకుంటున్నాయి.

నేను తప్పేమో!
మనసు పారేసుకుని,
ఎంతదూరం వెళ్ళగలను?
ఇక్కడ నిన్నొంటరిగా ఒదిలేసి
దూరంగా పారిపోగలనా?
ఔనూ .... శిలలా బ్రతక గలనా?
నిజం చెప్పు!? .... అదే నీవైతే ఏం చేస్తావో?

తపిస్తున్నా



ప్రేమ కావాలి, ప్రేమించేవారు కావాలి
నీకు తెలుసు నా ప్రేమవు నీవని
నిజాన్నే చెబుతున్నాను
అర్ధం చేసుకుని అంతరంగానివి కా ప్రియా!

ప్రేమించేందుకు ఎవరైనా
కొత్తగా
ప్రేమను పంచేందుకు
నీ వంటి ఎవరైనా చేరవస్తారని .... ఈ తపన!

నిన్ను ప్రేమిస్తూ
నిజం నా అభిమతం అని నిజం చెబుతూ
కోరుకుంటున్నా చేర రమ్మని
నన్ను ప్రేమించేందుకు,
ఔను .... నాతో జీవించేందుకు,
నాలో సగానివై నన్ను ప్రేమించేందుకు!

నీ ప్రేమ



నీ పేరు
చెక్కు కున్నా
శిల లాంటి
నా గుండె
పేజీల మీద.

ఒక నిరంతరమైన
నది లా
నీ ప్రేమ
కొనసాగుతూనే ఉంది
ప్రవాహం లా!

నా భయం



నాలో భయం
కవితలు రాస్తున్నప్పుడు
వస్తున్న ఆలోచనలు
నా మనస్సులో .... విస్తరించుకుని,
వీలు కావడం లేదు తగ్గించేందుకు
పదాలుగా ....

ఇది భయం మాత్రమే కాదు!
వాస్తవం! 

మంచిని ఆలోచిస్తే ....



అనుకున్నది నెరవేరని
కోపం, ఉక్రోషం, నీరసం ....
నిస్సత్తువ నన్నావహించినప్పుడు,
ఒంటరిగా పెరట్లో .... తోటలో
అరుగుమీద కూర్చుంటాను.
అందమైన పూలు, ఆ పరిమళాలు
ఆశించకుండా పంచే ....
లక్షణాన్ని ఆలోచిస్తుంటాను.
ఆ దేవుని మంచితనాన్ని!
నేనూ ఎందుకు ఓ మంచిపనిని ....
తలపెట్టకూడదూ అని,
అంతే! .... నాలో నీరసం నిస్సత్తువ ఎగిరిపోతాయి.

Saturday, June 29, 2013

చూపు లేని శరీరాలు|



ఎంతకాలం పడుతుందో నీకు
నా హృదయంలో స్థానం లేదని
చూసుకునేందుకు, తెలుసుకునేందుకు ....
మనం పక్కపక్కనే నడుస్తూ ఉన్నా
ఒంటరి ప్రయాణికులము అని

ఈ జగతిలో
మనం అందరమూ ఒంటరులమే
గుండె లోతుల్లోకి చూసుకుంటే ....
చూడలేకపోతున్నాము,
ఎముకలు కప్పిన చర్మపు గూడులం మనం అని

అను క్షణం జీవనంలో, ఆలోచనల్లో
గౌరవం కోల్పోయి .... అదే భాగ్యమని
సరిపెట్టుకుంటున్నాము, చూడలేకపోతున్నాము
ఓ పిల్లా! వొదిలేసెయ్యి కలల ఆశల్ని
నీ నిస్సహాయ పారవశ్యం గమ్యం అని,

ఊహల, రెక్కలు అమర్చుకుని
స్వర్గం లో .... ఒకరినొకరము ముద్దాడాలని,
మట్టిని, భూమిని, సముద్రాన్నీ ....
నాకు బదులు నన్ననుకుని .... ముద్దాడాలనే
నీ కోరికను చూసేందుకు .... నీ గుండెకు కళ్ళు లేవు.

మనం, మన హృదయాలలో
అంతర్లీనంగా .... మనకు మాత్రమే తెలుసు!
మనం చూడలేకపోతున్నామని,
మనం .... ఎముకలపై చర్మం ముసుగేసుకున్న
కృత్రిమ వ్యక్తిత్వాలం, అంతర్చక్షువులవసరమని,

Thursday, June 27, 2013

అరణ్యం!




ఊళ .... గాలి, కొమ్మలు, చెట్లు .... చుట్టుముట్టి
నిశ్శబ్దం అడవి లో
భయానకం ఈ ప్రకృతి

ఏదైనా


ఏదైనా ప్రేమే
కొందరికి ....
జీవితం .... పై,
కుక్క పై,
చిత్రలేఖనం పై,
దేవుడు పై,
సీతాకోకచిలుకలు పై,
సెక్స్ .... పై,
డబ్బు పై,
తెలియంది ఏదో పొందడం పై,
ప్రేమ ....
తియ్యని ఏవో మాటలు వినాలని,
ఏదో అనుభూతిని పొందాలని,
లోలోతు విషయాలు తెలుసుకోవాలని,
ముందుగా తనకే తెలియాలని,
లింగభేదం లేని,
బంధం .... ప్రేమ!
జీవించినంత కాలం
కేవలం జీవితం కోసం కాని
గుండె సన్నాయిరాగాలు ఆనందించి,
అన్ని విధాలుగా ప్రేమించేదే ప్రేమ ....!

అది ప్రేమే!



ఊహల నిట్టూర్పు,
తీవ్రమైన భావావేశము,
ఒక లైంగిక, అలైంగిక ఆవేశం
ఒక లేత సున్నిత ప్రియ భావన .... ప్రేమ!

స్వేచ్చాజీవన ఆహ్లాదం,
అంతర్లీనంగా లోలో రగులు జ్వాల,
నటన కాని నిజం
ఎప్పటికీ ఒకేలా ఉండే భావన .... ప్రేమ!

క్రమంతప్పని మనో వికల్పం,
ప్రేరణాత్మకం,
ఎంతో ప్రత్యేకం
ఎప్పటికీ మిగిలిపోయే అమర లక్షణం .... ప్రేమ!

ఈ బంధం బలపడనీ



వంచన లేకుండా
ఒక తపస్వి పాడుకునే శ్లోకం లా,
పవిత్రమైన పదానివి కా!
పరిపూర్ణ మానవుని ఉచ్చారణలా,
ప్రపంచంపై ఆధిపత్యము నీకు తప్పని సరి.
ద్వేషపూరితం నా జాతి ....
స్వార్ధపు ఆలోచనల్ని ముంచెత్తుతూ, 
నీవే నిజం అనే నిజాన్ని ....
సామాన్యుడి నుదిటిమీద రాయి. 
సముద్రాల్ని సాధించి .... శాసిస్తూ,
నరకం వరకూ,
విస్తరించు నీ బాహువుల్ని!
నిన్ను తన్ని తోసేసిన వారిని కూడా చేరదియ్యి! 
మార్గనిర్దేశం చెయ్యి!
మాట్లాడటము, మాటల మలుపుల్లో ....
మన్నింపు మాధుర్యాన్ని పెంచుకునేలా,
ఆనంద, ఆహ్లాద నర్తనలు చేసేలా చెయ్యి!
ప్రేమా! మనిషి మనిషి మధ్య ఈ బంధం బలపడనీ!

Wednesday, June 26, 2013

భయంగా ఉంది


నన్ను క్రిందకు లాగకు.
ఊహల నిచ్చెన మీంచి
నా కలల అలల
నా ఆశల
సింహాసనం మీంచి,
నన్ను క్రిందకు లాగెయ్యకు!

ప్రతిసారీ అనుకుంటుంటా!
అన్నికోణాల్నీ
నీవు చూస్తావని,
కానీ ....
నీవు మేలుకొని ఉండవు.
మత్తులోనే ఎప్పుడూ.

ఒంటరితనంలో
చలిలో మమ్మల్నొదిలి,
నువ్వెళ్ళిపోతుంటావు.
ఏదీ అనుకున్నట్లు, కలగన్నట్లు జరగదు.
ఏదైనా నీవు
తేలిగ్గా తీసుకోవడమే కారణం!

నిజం! నా నమ్మకం చెప్పనా!
ఓ మగడా!
నమ్మినందుకు నన్ను
నట్టేట ముంచేస్తావని భయం!
నా ఆశల
సింహాసనం మీంచి
నన్ను క్రిందకు లాగేస్తావని భయం! నిజం!!


ఒక కల .... జీవితం


జీవితం ఒక కల
నిద్దుర కన్నులు మూసుకుపోతూ,
రెప్పల మాటున మరొక కల ....
తీపి ఊహల నీటి లోకి
లోతుగా మరింత లోతుగా
ఆనందం ఆహ్లాదం భావాలను నింపుతూ
ముంగిళ్ళలో సంతోషం వెల్లివిరిసేందుకు,

Tuesday, June 25, 2013

నేనూ పుట్టాను

అది నాలుగురోడ్ల కూడలి.
అక్కడ అతను, ఆమె .... జీవనము, ఆంతర్యము
"నేను ఏ దారిని వెళ్ళను?" ఆతను.
"నీవు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు?" ఆమె.
"నాకు తెలీదు," అతని సమాధానం.
"అలాంటప్పుడు," ఆమె "పట్టింపు లేదు. ఏ దారైనా వెళ్ళొచ్చు" అంది.

ఒక అమ్మ

తియ్యటి స్వరం
ప్రేమ, అనురాగం
అమూల్యం
కుటుంబం మొత్తం
ఒక నాటుకున్న పాదు
అమ్మ ప్రేమ!

చేదు నిజం!


అద్దంలోకి చూస్తే
నిజం
నగ్నంగా
నిర్మొహమాటంగా
అడక్కుండా విడమర్చి
తరచుగా
ఎంత బాధాకరమో నిజం!

నమ్మకం


క్రింద
భూమ్మీద
స్వార్ధ భావనల అగ్నిపర్వతం
పైన
గ్రహాతీత
స్వర్గ లోకం శ్మశానము
మధ్య
ప్రేమ అనే
ఒక జాలి మేఘ సమూహం
ద్రవించేందుకు సిద్దంగా ఉందని

Monday, June 24, 2013

శూన్యంలో పదనిసలు


అవి గుస గుసలు
రాయని పదాలు .... ఆమె కోసం
ఆమె ఎప్పటికీ కోరని,
నా మది చీకటి భావనలు.
నా ఎద తోటలో,
వికసించని మందారపు మొగ్గలు. 

Saturday, June 22, 2013

పిల్లా విను!



పిల్లా విను!
అబద్దం ఆడేందుకు
కారణం కనిపించడం లేదు.
నీ ఆలోచనల
వెనుకా ముందూ
చూస్తున్నా!
నిజం చెబుతున్నా!

కలిసి పొందుదాం ....
దేన్నైనా
నిన్ను,
నీవు నాకు కోల్పొయే ముందే
కలిసి పొందుదాం రా!
పిల్లా!
సహజీవన మాధుర్యం!!

మోకాలు మీద
కూర్చుని పువ్వందుకొమ్మంటున్నాను.
మరణం అంటే భయం లేదు.
నీ తోడులో,
నా చర్యలతో
నిన్ను ఆనందించేందుకు
నా ప్రాణం వొదిలెయ్యొచ్చనిపిస్తుంది.

పిల్లా! నాకు తెలుసు
నేను నీకు అపరిచితుడ్నని,
నీ మనసు పొందడం
అంత సులభం కాదని,
అయినా నా జీవన సరళి ఇదే
ఎన్నడూ ఎక్కువగా ఆలోచించలేను
కారణాలకు భయపడను.

పిల్లా విను!
అబద్దం ఆడాల్సిన
కారణం కనిపించడం లేదు.
సమీకరణాలు
ఉండాల్సిన చోట లేవు.
అంతే! .... సర్ధుకుంటే సరి
ప్రేమించడం నేరం కాదుగా!

అన్నీ కలిసి పొందుదాం రా!
నిన్ను
నీవు నాకు కోల్పొయేముందే
కలిసి పొందుదాం రా!
పిల్లా
మనసులొకటైన మధురానుభూతిని,
సహజీవన మాధుర్యాన్ని!




వింత!


కొత్త అనుభవం, కొత్త ఆనందం
నేనే ఆ చంద్రుడు,
నేనే ఆ సూర్యుడు అయితే
నీ జీవితంలో ....

అదీ కేవలం
ఇక్కడ కూర్చొని
పదాలు రాయడం ద్వారా సాధ్యపడితే
అదో వింత అనుభవం, వింత భావోల్లాసం! 

Friday, June 21, 2013

సుందరాంగుడు



ఒకదానితో ఒకటి కలిసిపోయి
మచ్చలు, నా చర్మంపై ....
నేను సరిగా లేనని ....
గుర్తుచేస్తూ,
ఎవరికీ, సమాజానికీ సరి కాదని,
గగ్గోలుపెడుతూ ....

ఒక .... అలసట,
అసంతృప్తి,
ఆయాసం నొప్పి,
గుండె పగిలి కాదు
నేను, చెత్తబుట్టలో విస్తరిని .... కాదు,
నాది దుర్వినియోగ బాల్యం కాదు!

ఈ అలసట
అసంతృప్తి,
ఆయాసం నొప్పి,
నా లోనే మొదలయ్యింది
నా నీడను చూసుకున్న ప్రతిసారీ
ఒక స్థిరమైన మేలుకొలుపు లా,

ఎప్పటికప్పుడు
నన్ను హెచ్చరిస్తూ,
తట్టి నిద్ర లేపుతూ
బాహ్యంగా నేను అందగాడివి కానని,
అందంగా
నన్ను చూడటానికి అంతర్నయనాలు కావాలని.








Thursday, June 20, 2013

నేను


ఒక మంచి మనిషిని
సగటు మనిషిని
నా దారినే నడుస్తాను
కొత్త మార్గాలు వెదకను
కారణం
నేను ....
కేవలం ఒక పిరికివాడిని.

నిజం!


నవ్వుతున్నా
బిగ్గరగా
పక్కన ఎవరితోనో ఉన్నట్లు
మర్చిపోయేందుకు
భయం
నా ఒంటరితనం.

ప్రేయసీ రావా!



నీ కళ్ళ మెరుపును మరిపించే
కాంతి ప్రసరిస్తున్న
నక్షత్రాల వెలుగులు లేని చీకటి రాత్రి
నా భావనల్ని పరుస్తున్నాను.
నీ ముందు .... నీకు తెలియాలని,
నా ఊహల్లో తారవు నీవని,

నీవు .... నా ప్రేయసివి కావొచ్చుగా!
నా హృదయం తలుపులు
తెరిచుంచుతా .... ఎప్పటికీ నీ కోసం.
ప్రేయసీ! .... నన్ను మన్నించు!
నా గుండె గదిలో నిర్బంధించాలని,
నిన్ను ఖైదు చెయ్యాల్నుకుంటున్నందుకు.

నేను పంపిన
నా భావనల, ఆశల
లతలల్లిన పూలు
నీ సిగనింకా చేరలేదు.
అవి అర్ధవంతంగా ఉండాల్సిన చోటు అదే!
నేను నిన్ను కలిసిందొక్కసారే
కానీ, ప్రేయసీ .... నా జీవితానికి సర్వం నీవే!

నా ప్రేయసివి, సహచరివి
జీవన భాగస్వామివి కావా!
నీ చిరునవ్వు,
నీ ఆనందం కావాలి.
నా ప్రపంచంలో ....
నేను ప్రేమ జీవసామ్రాట్టును.
నీవు తోడుంటేనే .... ఓ ప్రియా!

నీకోసం నేను .... ఇక్కడ,
నాకోసం నీవు .... అక్కడ
అని ... కలకంటున్నా!
గమ్యాన్ని చేరాలనుకుంటున్నా!
ఓ ప్రేయసీ రావా .... కలిసుందాం!
కాలాంతం వరకూ .... శ్వాసించినంతవరకూ,

Wednesday, June 19, 2013

తియ్యని బాధ


నా మది
సరస్సులో అలజడి
ఈ రాత్తిరి .... ఆకాశం లోకి
కొట్టుకుని వచ్చిన ముత్యం
ఆ తేలియాడు చంద్రుడు,
జారుతున్న ఓ తియ్యని జ్ఞాపకం
ఎద పలుకు .... ఆ కన్నీటి బొట్టు

బాసలు విరిగి



స్పష్టంగా, నీలాకాశం ....
ఎగురుతూ, తిరుగుతూ
ఒక చిలుకా, ఒక గోరింకా
జతపడని దురదృష్టం
గాలి వాటం
దారం తెగి .... గాలిపటం లు
విరిగిన బాసలు .... ప్రేమ భావోద్వేగాలు 

Monday, June 17, 2013

విచారం




దిగులు
కన్నీళ్ల రక్తస్రావం
కత్తి గాయాల విలాపం
ముక్కలైన,
ఆ భారీ .... ఉల్లాసం,
ఆ వ్యాకులపాటు,
ఆ పిసినారితనమే బాధపడటం!

Saturday, June 15, 2013

ఊపిరి



ఒక రోజు .... నీవు ముద్దాడతావు.
ఎవరు లేకుండా
నీవు శ్వాసించలేవో ....
ఆ ప్రియురాలిని.
అప్పుడే
తెలుస్తుంది నీకు ....
ప్రాణిగా శ్వాసకన్నా ముఖ్యమైందొకటుందని.

సంకోచించనెందుకు?



సంకోచించకు!
నీవు విసురుతున్న ఆ చిరునవ్వు
ఓ నమ్మకం
నేనూ ఉన్నాను నీతో .... అనే భావం, స్నేహం!
ఒక బహుమానం
ఒక అందమైన అనుభవం.

ప్రేమ



అది ఒక అణగని, వశపడని .... గడుసు శక్తి.
నియంత్రించాలనుకుంటే,
నాశనం చేస్తుంది.
ఖైదు చెయ్యాలనుకుంటే,
బానిసను చేస్తుంది.
అర్థం చేసుకోవాలనుకుంటే,
అమూల్యమైన ఎన్నో
కోల్పోయిన గందరగోళం భావనను కలిగిస్తుంది.

Friday, June 14, 2013

యౌవ్వనం పట్టభద్రత!



కొత్తగా వచ్చాను.
పట్టణం .... డాక్టరేట్ కోసం
పర్యావరణం ....
రుచి చూద్దామని
నేను,
ఒక అపరిచితుడ్ని, పట్టభద్రుడ్ని!

ఆకాశ హర్మ్యాలు కాదు.
మురికి వాడలు,
రైల్వే ట్రాక్ ల పక్కన ....
కదులాడే,
చీకటి జీవితాల నీడల్ని
కలుసుకుందామని.

నాకు
ఒక మురికి పిల్ల
అవసరం!
నేను
ఒక మురికి అనాగరిక
జీవితాన్ని అధ్యయనం చెయ్యాలి.

ఈ భాగ్యనగరం
మానవ మృగ అరణ్యంలో
యాంత్రిక జీవనాల్లో
కృత్రిమ రసాయనాలు
పూసుకోని ముఖం
అలంకరణ లేని ప్రకృతిరూపం కావాలి.

నాలో నాకు
ఓ నిజమైన మనిషిని,
రాతి స్వభావాన్ని గుర్తుచేసే
పిల్ల కావాలి.
ఓ పిల్లా!
నా ఆలోచనలకు స్వేచ్చ కావాలి.

నాకు .... నా డాక్టరేట్ కు,
ఈ నగర వాడ ల్లోని
సాధారణ, మాసిన
ప్రకృతి సౌందర్యం అవసరం!
ఒక అర్ధంకాని అనాగరిక
అతివ కావాలి .... పరిశోధనకు.

Thursday, June 13, 2013

సమశ్య!



ఒక ....
అతను, ఆమె
గతం తవ్వు ప్రయత్నం లో
ఒక మాజీ

అంతా
గజిబిజి హడావిడీ
ఒక స్నేహితురాలు మాత్రము
సమశ్య పరిష్కారం దిశలో .... ఆశతో

Wednesday, June 12, 2013

ఊపిరాడ్డంలేదు


చల్లని సాయంత్రపు గాలులు
సున్నితంగా వీస్తూ,
చంద్రకాంతి
వెన్నెలతో వెలుగుతున్న ఆకాశం,
ఎక్కడో రాలుతున్న తార
నా హృదయ రోధన
నీకు వినపడే అవకాశం లేదు.

ఇక్కడ క్రింద
ఈ చెట్లు చేమ గుర్తించలేవు
నా మనోవేధన బాధ
వయ్యరంగా మెలికలు తిరుగుతూ
సాగే ఆ నదులు
ఎగిరిపడే అలల విధ్యుత్ కాంతుల్లో
నా ముఖ రాగాలు గమనించలేవు.

గడ్డిపరకల్ని ముద్దాడుతూ,
మంచుబిందువులు ....
వాటి ఆనందంలో అవి.
దూరంగా మెరిసే ఆ నక్షత్రాలు
శ్వాస బారమై ఉక్కిరిబిక్కిరౌతున్న
హృదయాన్నీ, నా తెగి స్రవిస్తున్న ....
ప్రేమ రక్త నాళాల్ని చూడలేవు.

ఓ చల్లగాలీ
చెట్లతో .... ఆకులు, పూలతో
ఆడుకున్నంత సులభం కాదు.
మనసు అలజడిని అర్ధం చేసుకోవడం!
విషాదభరితమైన గుండెను
తట్టి పులకింపచేయడం!
సూక్ష్మ భావనల సెగలు
విరహాగ్నిని చల్లార్చడం!!

విచ్చిన్నమై విసిరేసినట్లు ....
అక్కడక్కడా మబ్బుల నీడలా,
పరుచుకునున్న వెన్నెలా ....
బొట్టుబొట్టుగా కారుతున్న
ఈ కన్నీటి వర్షం
నా మౌన రోధనకు సాక్ష్యం!
ఈ విచార నిట్టూర్పు భావన
హృదయ వీక్షణ సులభం కాదు.

ఈ పచ్చిక బయళ్ళ క్రింద
ఖననం చెయ్యబడ్డ ....
నా మనోభావనలు
ఒకనాటి రెండు శరీరాలు
ఒక్కటిగా అతికివున్న బాధ
ఈ నక్షత్రాల వెలుగులోనే కోల్పోయాను.
నా ఈ మది నిశ్శబ్దం భయం
జ్ఞాపకాల వెచ్చదనం .... మరుపు సాధ్యం అనుకోను

నా హృదయం ఆకాంక్షించడం లేదు
బ్రతిమాలుకోవడం లేదు.
ఏ పిల్లగాలుల్నీ,
చిరు జ్ఞాపకాల సవ్వడుల్నీ రమ్మని ....
ఓ చిరుగాలీ .... నా జ్ఞాపకాలతో,
నన్ను తడమొద్దు!
మనో భావనల్తో ఆటలాడుకోవద్దు!
నా ఎద చేరి శ్వాస ఆడకుండా ఆపెయ్యొద్దు!

Tuesday, June 11, 2013

జీవితం!



ముసలి కుక్క
అరుస్తూ ఉంది .... పెరట్లో
పడుకుని .... అశక్త శరీరం తో
ఉల్లాసం గా అది
ఇల్లంతా తోక ఊపుతూ తిరిగిన
పసితనం ఇంకా నా కళ్ళముందే ఉంది.

నీ స్పర్శ కావాలి!


ఈ రాత్రి
మదిని తట్టుతూ
మోహ అవసరాలు

కల 
నాలో అగ్ని కి
ఇందనం

నీ సాన్నిహిత్యం
నీ స్పర్శ
కోరిక ప్రబల్యమే .... సకలమూ!

నన్ను నేను


దాచుకుంటున్నా,
కొన్ని నిజాలు,
నగ్న భయంకర వాస్తవాలు
బయటికి కనిపించనీయకుండా ....
అందాలు,
ఎన్నో ప్రియమైన విషయాలు.

Monday, June 10, 2013

మనిషి లక్షణం!



ఎలా? ఏమని ప్రస్తుతించాలి?
జీవితతత్వం
మెరుపులు చూడాలని
వెలుగై జీవించాలనే .... లక్షణం 
ఆనందం, ఐశ్వర్యం
అధికారం కోసం తపన
జీవితం .... అశాశ్వతమని తెలిసీ.

ఒక చల్లని .... రాత్రి



వృద్దాశ్రమము వద్ద
ఆ రాత్రి,
వంటల అజమాయిషీ చేస్తూ
కత్తితో దోసకాయ
కాల్చి వంకాయ
తొక్కతీసిన వైనం చూస్తున్నట్లు
ఒక కొడుకు కోడలు .... ఓ ఎన్ ఆర్ ఐ ల కల

పల్లెలు ఆవిరౌతున్నాయి!



మంచు కరుగుతూ
చెట్ల ఆకులపై
ముత్యాలు
ఆవిరౌతూ
గ్రామం నిండా ....
పిల్లలు .... రేపటి ఎన్ ఆర్ ఐ లు!

ఈ ఉదయం



కలలు
అంతరాయం
ఆరంభ దశ
నిద్ర
నిర్మాణక్రమం లో
అలజడి
శబ్దం చైతన్యం ఆలశ్యంగా

Sunday, June 9, 2013

బీచ్ లో



తేలికపాటి గాలి వీస్తూ,
నా చూపులు సముద్రం వైపు
అనంతం,
అపరిమితం చూస్తున్న భావన .... నాలో

నక్షత్రాలు!



గుంపులు గుంపులుగా తారలు ప్రకాశిస్తూ,
మనోహరంగా మెరుస్తూ,
ప్రయాణం!
అతిపెద్ద పరిమాణం లో .... ఎంతో ఉన్నతంగా, 
ఒంటినిండా నగలతో, 
ఆకాశం లో!!

Saturday, June 8, 2013

ప్రకృతి



ఎత్తు మడమల చెప్పులు
మోకాళ్ళు
పగబట్టినట్లు అక్కడ మొదలై
ఆమె
ఆ నల్లని కురుల త్రాసు
తొడలు
ఎత్తైన పిరుదులు
సన్నని తీగ నడుము మాధ్యమంగా పాకి
చెవుల్ని కప్పుతూ .... మేఘాలు కమ్ముకున్న ఆకాశం .... ఆమె

ప్రేమిస్తున్నా!



నాకు నీవంటే చచ్చేంత ఇష్టం!

నా ఇష్టం అర్ధం .... కేవలం
నేను బ్రతుకును ప్రేమిస్తున్నాననే,

మరి బ్రతుకంటే ....

నాకు సంబంధించి .... బ్రతుకు
కేవలం తోడు గా నీవుంటేనే .... నీవు,

నా సాహచర్యానికి ఇష్టపడితేనే ....

ప్రేమ ఒక జీవన విధానం



అది ఒక నిజం, నిజమైన ప్రేమ
ఒక భావన, భావనల వికాసం ప్రేమ
ప్రేమించిన వారిచే ప్రేమించబడాలనే కోరిక ప్రేమ

అది ఒక స్పర్శ, స్పర్శలో సున్నితత్వం ప్రేమ
ఒక కలయిక. కలయికలో ఆనందం ప్రేమ
ప్రేమించాను అని, నేనూ ప్రేమిస్తున్నా అనిపించుకోవడం ప్రేమ

ప్రేమ .... ఒక నువ్వు, ఒక నువ్వూ నేనూ
ఒకరినొకరం తెలుసుకోవడం ....
ఒకరినొకరం అర్ధం చేసుకోవడం .... ప్రేమ

అది ఒక స్వేచ్చ, స్వేచ్చగా కలిసుండటం
ప్రేమ .... ఒక జీవనం, జీవించడం లో ప్రేమ
ఒక అవసరం ఒక సహచర్యం ఒక తోడు చే ప్రేమించబడటం

అది ఒకరి అవసరం ఒకరికి ఉండి
ఒకరిస్వేచ్చను ఒకరు కోరుకోవడం
ఒకరినొకరు అర్ధంచేసుకోవడం, అర్ధం కావడం .... ప్రేమ

Friday, June 7, 2013

ఆశ



రాత్రి తారలు
నక్షత్రాలు వెదజల్లే
చల్లదనం ఆస్వాధనం లా
నీ లేత శరీరం
నాలో లోలో ప్రజ్వలిల్లే
గోరు వెచ్చని ప్రేమభావాన్ని 
నా చేతి స్పర్శ ద్వారా తీసుకోవాలని ....

Thursday, June 6, 2013

ఈ ఉదయం!


కనిపించి
వినిపిస్తున్న .... ఆ ప్రకృతి దృశ్యం
ఆ శబ్ధాలు
తూరుపు కొండల్లో ....
ఆ సూర్యోదయం వేడుకలు
ఆ పిచ్చుకల కిచకిచ శబ్ధాలు
చైతన్యం, సంచలనం!

నా జీవితం!



భయం ....
ఒత్తిడి పెరిగి, స్వేదం నా నుదుట
నా తలరాత అతను రాస్తున్నట్లు,
పదునైన కత్తి
బయటకు లాగబోతున్నట్లు,
ఆ అధికారి ముఖాన .... చిరునవ్వు!
ఔనూ!
నా జీవితాన్ని నేనెప్పుడు నిర్దేశించుకుంటానో!

ఒంటరితనం


ఉదయం
నిద్దుర లేస్తూ
ఎద .... పరిసరాల్ని తడుముతూ
ఆ భానుని
కిరణాల వెచ్చదనం
ఒంటరి శూన్యం తగిలింది .... చేతికి

ఒక్కొక్కటే

సూర్యోదయం, సూర్యాస్తమయం ప్రతి రోజూ,
వసంతం,
గ్రీష్మం,
శరద్, హేమంత ఋతువులు
ఏవో ఒక్కటే ఒంటరిగా నా జీవ మార్గంలో.

Wednesday, June 5, 2013

పల్లవిస్తూ


క్షణాలు, గంటలు గడుస్తూ,
రేకులు రాలుతూ
పువ్వుల పరిమళాలు
కొత్త ఆశలు
కొత్త గమ్యాలు
దాటి చూస్తున్నా .... అక్కడుంది ప్రేమ

మనిషి

ఒక ముసలి వ్యక్తి
ఉన్నత శిఖరాలు ఎక్కుతూ .... శ్రమిస్తూ
స్వేదించే ఒక యువకుడు!
ఒక యువకుడు
ఎటూ తేల్చుకోలేని క్షణాల్లో
వయస్సు మీదపడిన అచేతనుడు .... ముసలివాడు!

నది



భయం,
అనుమానం గోడలు
తొలగించి చూstea ....
అది .... ఒక ఆనందం నది
ఒక స్వేచ్చా ప్రవాహం
ప్రేమ!

స్వాగతం!



ప్రేమకు
భూమ్మీదకు ఆహ్వానం
గులాబీ పడకలతో
ఎర్ర తివాచీ ....
స్వాగతిస్తూ వసంతం!

లొంగిపోవటం



సుగంధ ద్రవ్యాల,
పరిమళం ....
సమ్మోహితుడ్ని చేసి,
స్వయంగా లొంగుబాటు ....
ప్రశాంతత కోసం.

ఆమె - అతను



దాచినా
దాగని అందాలు
కొద్ది కొద్దిగా దాస్తూ .... నైటీ లో ఆమె
ఇనుమడిస్తున్న కోరిక ను
చూపుల్లో వెల్లడిస్తూ
ఆబగా ఆతను

Tuesday, June 4, 2013

నీవే


నీవే ఓ ప్రియా .... నీవే
నా కలల సాఫల్యం కారణం!
కొన్ని ముద్దులకు పూర్వం
నీవు నాతో అన్నావు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను ....
నీకు తెలియదా అని,
దూరంగా ఉండి, ఏ అదృష్ట దేవతో
నా చిరునామా చెప్పుండొచ్చనిపించింది.
ఆకాశం నుంచి నా కోసం
నక్షత్రాలు వర్షిస్తున్నాయనిపించింది.
నా ఆనందం థ్రిల్ ఉద్వేగం
కారణం చెప్పమని
అప్సరసలు అడిగినప్పుడు
నేను నీ గురించే చెప్పాను ....
నువ్వే అని .... నా జీవ సాఫల్యానివని.

మరుపురాని బంధం



ఏ రహదారిలో ఎక్కడో
అనామకుడిలా నేను
నింపాదిగా నడుస్తూ ఒకరోజు
ఏ సమూహం లోనో ఉన్న
ఏ మొహాన్నో చూసి
నువ్వనుకుని నవ్వుతాను
అప్పుడు
నా పెదాలపై ఒకప్పుడు
నీవు పూయించిన నవ్వులు
వాటి ప్రకంపనలు ....
బుగ్గలు సొట్టలు పడ్డ గతం
కళ్ళ ముందు కదులాడుతుంది.

దగ్గరకు రా!
నా కళ్ళలోకి చూడు!
ఆ కనుపాపల్లో .... సుందర దృశ్యాల్ని
అక్కడి అందాన్ని అద్భుతాల్నీ
ఆ పారదర్శకతను
నీ మాటల్లో వినాలనుంది.
నీవు వినాలనిపించేలా చెప్పాలి.
కాలంతో పాటు
హిమస్పటికంలా మారిన మన ప్రేమ
ఇద్దరూ ఆడి
ఇద్దరం విజేతలమైన వైనం
నాకింకా గుర్తుంది.
నన్ను ఓడించకుండానే నీవు గెలవడం

ఆనాటి ఉద్రేకం చైతన్యం
యౌవ్వనం ముదిరి
ఇటీవలి కాలంలో ....
ఆ ప్రేమాగ్ని నివురు కప్పుకు పోయి
ఆ పిదప
పిండి ఆరబోయని వెన్నెల రాత్రిళ్ళు
అనాసక్తిగా కాలం గడుస్తూ
గతం గుర్తుంచుకోవడం కష్టం అనిపించేది.
అయినా,
గుర్తు తెచ్చుకున్నాను.
మది పొరల్లో భద్రంగా
దాచుకున్నాను నిన్నూ .... నీ జ్ఞాపకాల్నీ!

ఎన్నో కొత్త సంవత్సరాలు.
వెంటనే పాతబడిపోయేవి.
మన జ్ఞాపకాలకు మాత్రం
వయస్సు రాలేదు.
మరింతగా బలోపేతమయ్యాయి.
ఎదను తట్టే ఆ జ్ఞాపకాలకు గుడ్ బై
చెప్పలేని స్థితే ఇప్పటికీ,
నిజమైన ప్రేమ ....
హిమవన్నఘం లా
కాలంతో పాటు గడ్డకట్టి రాయిలా మారింది.
ఆనాడు మనం ఆడి గెలిచి 
నేడు కాగితం పై
కదులుతున్న ప్రేమ భావనలం!
ఒకరికొకరు బహుమతులమైన ప్రత్యర్ధులం! 

Monday, June 3, 2013

ప్రేమ!



ఒక విషయం కాదు,
అర్ధం చేసుకునేందుకు.
అనుభూతి చెందేందుకు.
ఇచ్చి పుచ్చుకునేందుకు.
.....
శాశ్వత తత్వం .... ప్రేమ
అది శాశ్వతంగా .... స్వయంగా వరం!

నీ ప్రేమలో నివసిస్తా!



సముద్రంలో ....
సముద్రపు గడ్డి మొలిచినట్లు,
ప్రతి అల ఆరంభం పుట్టుక అయి ...
అదే అల ఎగిరి పడిపోతూ గిట్టుక అయినట్లు,
పసితనం నుంచి ....
నాలో పెంచుకునున్న నా కలల ఆత్మను
పరిశుభ్రం చేస్తాను.
నీ హృదయంతో కలిసి నా హృదయమూ కొట్టుకునేలా,
నీ ఆత్మ మార్గదర్శకంగా నా ఆత్మ అనుసరించేలా .... ఓ ప్రియతమా!

ఎంతగా


నేను నేనుగా
స్వేదం
పులిని
ఎంతగా
అనుభవిస్తున్నానో
నా కాలుతున్న కడుపుకు తెలుసు

ఎప్పుడూ .... ఆ జ్ఞాపకాలు అలానే



ఆకాశం నిండా
మబ్బుల ఏనుగులు కమ్ముకొస్తూ 
ప్రపంచం కాంతిహీనం గా మారి
అపరిచితులు ఒకరినొకరు కలుస్తూ
నవ్వులు పూసుకుంటూ
చేసుకుంటున్న కరచాలనాల పరామర్శలు
ఒకనాటికి జ్ఞాపకాలుగా గుర్తొస్తుంటే

ఎక్కడినుండో
హెచ్చరిక ధ్వనులు
ఎవరూ వినలేని గుసగుసలు
ఎత్తైన హర్మ్యాలు కొండల్ని తాకి
ప్రతిద్వనించి .... నిశ్శబ్దం
విచ్చిన్నం అవుతున్న వార్తలై
ఏదో ఒక రోజు
ఎప్పుడో విన్నట్లు అనిపిస్తుంటే

అన్నీ దోచుకుని
దాచుకోవాలనే మానవనైజం
తాపత్రయం గా మారి దాచుకునేందుకు
తనకంటూ స్వంతంగా
ఓ చోటు లేదని తెలిసి
ఎప్పుడో వొకప్పుడు దొంగతనం దొరికి
దర్శనమిస్తూ తల అవనతమైన క్షణాల్లో

కేవలం
నిర్దిష్ట సమయంలో
నిద్రాభంగం చేస్తూ .... సామాజిక రక్షణ పేరుతో
గగ్గోలుమని అరుస్తూ
కీచు మని ఆగే ఆ పోలీసు సైరన్ లు
అర్ధరాత్రి విశ్రాంతిని మరిచి
ఎవరో పారిపోతున్నట్లు అడుగుల శబ్దాలు
వీధంతా బ్రాడ్కాస్టింగ్ చేస్తూ
వెంటాడిన పోలీసు జీపు జ్ఞాపకాలు

కాలిబాటన
అడుగులో అడుగు .... మరొక అడుగు
ముందుకు వేస్తూ,
పురోగమనమే అనుకుని 
స్థిమిత పడాలనుకునేంతలో ....
ఓ పాతకథ
ఓ పాత జ్ఞాపకం మరుపును
కాలం లోతుగా తవ్వి గుర్తుచేస్తుంటుంటే

అడవులు
లోయలు కొండచరియలు
పల్లెలు పట్టణాలు
విధ్యుద్దీపాలతో అలంకరించుకుని
మూడొంతుల నీటితో నిండిన
భూమిని ఆకాశం నుండి చూస్తుంటే
చీకటి లో భూమి, ఓ తార లా ప్రకాశిస్తూ ....
ఆ జ్ఞాపకాల గతంలోంచి బయటికొచ్చేదెలా?

Sunday, June 2, 2013

ఓహ్!

ఓహ్,
ఎంత శీతలం ....
ఎంత తీపి
నా మెడ మీద
నీ స్పర్శ
వేసవి లో
తొలకరి వర్షం ....
తొలిముద్దులా

నేను చూసాను



అడవి లోంచి
ఒక పెద్ద కొండచిలువ
ఊఅరు మీదకు
కదిలివొస్తున్నట్లు
శాసనం లా
ఉరుముతూ వసంతం రావడం

తొలకరి వర్షం



మీలో ఎవరైనా చూసారా?
ఆకాశం నుండి ....
జల్లులు
గాలి సాయంతో నడుస్తూ,
ఏటవాలుగా కురుస్తున్న దృశ్యం!

అనుభూతి



లోతైన సంతృప్తి....ని
గుండె, ఆత్మ ల సంఘటిత
భావాలను
మృదువైన కుంచెతో
అంతరాన్ని దిద్దుతున్నప్పుడు
వేసవి గాలి లాంటి వెచ్చని భావం!

మరిచిపోలేకపోతున్నా!



ప్రియతమా .... ఓ నా మది భావమా! నమ్మలేకపోతున్నా!
ఎద శూన్యం చేసి .... ఏ దూరతీరాలకో నన్నొదిలెళ్ళావని ....
నాకు నేను చెప్పుకుంటున్నా .... నీవింకా నాతోనే ఉన్నావని
అందుకే ఎంత పెద్ద సమశ్యనయినా ఎదుర్కోగలుగుతున్నానని
సమాధానాన్ని కాగలుగుతున్నానని .... నీవు పక్కన నా మనోబలానివైయ్యుంటే

ఎక్కడ ఉన్నా నీవు నన్ను గుర్తుంచుకోవడం మరిచిపోవని నమ్మకం!
నీవు నాతో పంచుకున్న అనుభూతులు .... మనోహరమైన క్షణాలు
గుర్తుంది ఇంకా .... నీ చిత్తరువుల ప్రదర్శనశాల నా హృదయం అని
నీ సాహచర్య క్షణాల జ్ఞాపకాల్ని .... కలిసి కట్టుకున్న కలల పిచ్చుకగూళ్ళ ను,
ఆ మధురానుభూతుల్ని, ఆ అల్లరి చిరు పోట్లాటల్ని .... మరిచిపోలేకపోతున్నా!

ఇక్కడ .... హాల్ లో, నా గుండె గది గోడకు .... వ్రేలాడుతూ
అందనంత ఎత్తులో .... అందుకో అని కవ్విస్తున్నట్లు ఆ కొంటె నవ్వులు
ఒక దేవతలా ఒక స్నేహలతలా .... నన్ను జాలిగా చూస్తున్నావు.
నా పరితాపం అర్ధమైన దానిలా .... నా ఆత్మ ప్రతిబింబం ఆరని జ్వాల అయి
జీవిత నాకిచ్చిన ఈ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నాను.
ఓ మది భావమా! నమ్మలేకపోతున్నా! ఎద శూన్యం చేసి .... దూరతీరాలకు వెళ్ళావని ....

వారు


విశ్వసనీయతకు హామీ .... 
ప్రచ్చన్న యుద్దంలో కూలిన 
ధైర్యం, సాహసం .... 
తిరిగిరాని సిపాయిలు 
వారికి శ్రద్దాంజలి గా
జాగ్రత్తగా మడిచిన .... 
అవనతమైన జాతీయజెండా!