Monday, June 3, 2013

ఎప్పుడూ .... ఆ జ్ఞాపకాలు అలానే



ఆకాశం నిండా
మబ్బుల ఏనుగులు కమ్ముకొస్తూ 
ప్రపంచం కాంతిహీనం గా మారి
అపరిచితులు ఒకరినొకరు కలుస్తూ
నవ్వులు పూసుకుంటూ
చేసుకుంటున్న కరచాలనాల పరామర్శలు
ఒకనాటికి జ్ఞాపకాలుగా గుర్తొస్తుంటే

ఎక్కడినుండో
హెచ్చరిక ధ్వనులు
ఎవరూ వినలేని గుసగుసలు
ఎత్తైన హర్మ్యాలు కొండల్ని తాకి
ప్రతిద్వనించి .... నిశ్శబ్దం
విచ్చిన్నం అవుతున్న వార్తలై
ఏదో ఒక రోజు
ఎప్పుడో విన్నట్లు అనిపిస్తుంటే

అన్నీ దోచుకుని
దాచుకోవాలనే మానవనైజం
తాపత్రయం గా మారి దాచుకునేందుకు
తనకంటూ స్వంతంగా
ఓ చోటు లేదని తెలిసి
ఎప్పుడో వొకప్పుడు దొంగతనం దొరికి
దర్శనమిస్తూ తల అవనతమైన క్షణాల్లో

కేవలం
నిర్దిష్ట సమయంలో
నిద్రాభంగం చేస్తూ .... సామాజిక రక్షణ పేరుతో
గగ్గోలుమని అరుస్తూ
కీచు మని ఆగే ఆ పోలీసు సైరన్ లు
అర్ధరాత్రి విశ్రాంతిని మరిచి
ఎవరో పారిపోతున్నట్లు అడుగుల శబ్దాలు
వీధంతా బ్రాడ్కాస్టింగ్ చేస్తూ
వెంటాడిన పోలీసు జీపు జ్ఞాపకాలు

కాలిబాటన
అడుగులో అడుగు .... మరొక అడుగు
ముందుకు వేస్తూ,
పురోగమనమే అనుకుని 
స్థిమిత పడాలనుకునేంతలో ....
ఓ పాతకథ
ఓ పాత జ్ఞాపకం మరుపును
కాలం లోతుగా తవ్వి గుర్తుచేస్తుంటుంటే

అడవులు
లోయలు కొండచరియలు
పల్లెలు పట్టణాలు
విధ్యుద్దీపాలతో అలంకరించుకుని
మూడొంతుల నీటితో నిండిన
భూమిని ఆకాశం నుండి చూస్తుంటే
చీకటి లో భూమి, ఓ తార లా ప్రకాశిస్తూ ....
ఆ జ్ఞాపకాల గతంలోంచి బయటికొచ్చేదెలా?

No comments:

Post a Comment