Sunday, December 30, 2018

ఊపిరాడ్డం లేదుబహు భారమై .... శ్వాస నిశ్వాసలు
ప్రభావితమై ఊపిరితిత్తులు
బలహీనంగా కొట్టుకుంటున్న
గుండె ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయా  

మరిచిపోయిన పాట శ్రావ్యంగా పాడలేని
ఆకాశం నుండి నేల రాలిన
ఆ బక్క బలహీన పక్షి
ఓటి రెక్కలు చేస్తున్న శబ్దం వినిపిస్తుందా

ఏనాడో రాలి ఎండిపోయిన జ్ఞాపకాలు
భావనలు .... అంతరంగ అసంపూర్ణతలు
అక్షీకరించలేని .... ఆ మరణించిన కలం
సగం కాలి రాలిన సిగరెట్టు నుసి శబ్దం ....

శూన్యత యొక్క బూడిద మిగిల్చిన
నిశబ్దం శబ్దపు అశాంతి నీడలు
మాటలు రాని అంతరంగం
ఆత్మ జ్యోతిని కమ్ముకుపోవడాన్ని ....

గాల్లో దీపం లా అనుక్షణం కొట్టుకుంటూ
కాలం అడుగుజాడల్లో కదిలి
రోడ్డురోలరంత భారాన్ని మోసి
నలిగిన ఆత్మను .... కమ్మిన నీడలను ....

లోకమంతా ఎంతో ప్రశాంతంగా నిదురిస్తూ
నేలతల్లి ఒడే దిండుగా,
గాలి దుప్పటి కప్పుకుని .... మరి
ఈ ఊపిరితిత్తులే ఎందుకో శ్వాసించలేకపోతూ

Monday, November 5, 2018

నమ్మాలి మరినొప్పి పొరలల్లుకున్న
మనోభావనలతో
అస్తిపంజరంలా నడుస్తూ ఉన్న
ఒక
జీవఛ్ఛవం తో పడ్డాను
ప్రేమలో అని .... అంటే
నమ్మాలి మరి 


మాట్లాడుతున్న
ప్రతి సారీ
కృత్రిమ నవ్వొకటి
ముఖాన పులుముకున్నాననంటే
నేనెవర్నీ ద్వేషించడం లేదని
ప్రేమకు చావులేదని
అంటే ఒకవేళ 


నేన్నీగురించి ఆలోచించడం లేదని
ప్రేమ శక్తే
తృతీయ నేత్రమై
తెరుచుకుందనంటే నమ్మాలి మరి

Tuesday, October 30, 2018

ఏమో మరి
నిజంగా స్వర్గం నరకం అని
విడిగా ఉన్నాయా
ఉంటే ....
ఆలోచించాల్సిన
విషయం ఒకటుంది. 

అక్కడ
కవులు రచయితలకు
ప్రత్యేక స్థలం అంటూ ఉందా 
.....
నదులు వాగులు
సిరాతో పారుతూ

కలం గళంతో గర్జించే
ఎందరో మహానుభావులు
కవులు రచయితలు .... అక్కడ
విలువలు దారం తో
కుడుతూ, సమాజాన్ని 
మేలుకొలుపుతుంటారా

Friday, October 26, 2018

నూతనత్వంనిట్టూర్పుకు
విరుద్ధాంశం
కవిత్వం అనిపిస్తూ

అప్పుడప్పుడూ

ఎదను ఆవహించిన
యదార్ధత

ఆశ్చర్యంగా

ఉద్రిక్తతారహిత
ప్రవాహంలా

ఉద్వేగము
బాధ
రూపుదిద్దుకున్న
బాషై

కలం సిరా
కదలికల గాఢతై

నూతనావిర్భావ  
సంగీతం లా

వినూత్నత

ఎద స్పందనలు
పరిసరాలు
ప్రభావితం చేస్తూ

Sunday, September 30, 2018

తరచి చూస్తేనాకు తెలిసింది చాలా తక్కువ
స్వేదం ఇంకిన ముఖాలు
ఆ అరిగిన పాదరక్షలు
గోడలపై ఆ రాతలు
ఏ శిల్పో అందంగా చెక్కిన
అర్ధం కాని ఆ అపురూప చిత్రాలు
శోధించాల్సిన రహశ్యాలు ఎన్నో
కాలం ఖారాగారంలో
నేను అనుభూతి చెందీ ....
పాడలేని ఆలాపనల్లా

అబంధనబావోద్వేగం ఒక సాగరం
పునర్జన్మిస్తూ ....
ఒక ప్రేమలా,
ఒక ద్వేషంలా,
ఒక విలాపంలా,
ఆపలేము ....
అడ్డుకట్ట కట్టలేము.
ఆపాలనే
ప్రయత్నం ఫలించదు.
ఏ మాటా వినపడదు.
ఏ మాటకూ అందనంత దూరంగా ....
సంకెళ్ళను తెంచుకున్న
స్వేచ్చా తరంగిణి లా

Saturday, September 29, 2018

అంతా శూన్యం
ఏదో అగాధం
వెలితి
ఎక్కడో ఉన్నట్లు
ఏదో దూరం
ఏదో విరామం
అధివాస్తవికత
వాస్తవికతల మధ్య
మనస్సుకు,
అంతరిక్షానికి మధ్య
ఖాళీ ....
ఒకటి బంజరు
ఒకటి ఆకాశం
లేని సత్యం
గుండెలు హత్తుకోని నిజం
తప్పించుకోలేని
ఈ శూన్య
అగాధాల లోతుల్లో ....


Friday, September 28, 2018

చూసానుమెరుపు పులకరింపుల
ఉరుము ధ్వనుల
వసంతం లో .....

ఆనందిత హృదయ
ప్రేమ
ఆరాటం చూసాను 

ఆకాశం భూమి
లోతైన
ఆపేక్షానుబంధం చూసాను

కురిసిన
ఆత్మ
మకరందం  చూసాను

సర్వం
ఉపేక్షించి

Thursday, September 27, 2018

ఆఖరి మజిలీ
ఇదే నా ఆలోచన ఇదే నా నిర్ణయం
సాహసించి
పోరాడినవాడిదే జీవితం అని

జీవితంలో ఓడిపోయినా
ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా

గాయాలతో శరీరం రక్తశిక్తమై
దుర్భాషలెన్ని వినాల్సొచ్చినా

సమాజం వెలివేసి బెదిరించినా

ఇంకా ఎదగని మానసికతే అని
అస్తవ్యస్త అయోమయావస్థలో
ఉన్నానని అనుకున్నా ....

నీ నమ్మకం ఉంటే చాలు
నీ ప్రేమ ఉంటే చాలు
నీ చనువు చిరునవ్వుంటే చాలు

నీడను పంచుకునే నీ నా అనుబంధం
ఆరు అడుగుల భూమై .... అదే
జీవితం మిగిల్చిన మజిలీ అయినా

అపస్వరాల నీడలుఆలాపనలు కావు అవి
అలజడి రేకెత్తించే స్వరాలు

వస్తున్నాయి నా కోసమే
నావైపే
చేరువౌతూ ఉన్నాయి ....
ఇంకా ఇంకా

కళ్ళు మూసుకున్నాను.

అంధకారము శూన్యము
ఒంటరితనం .... అంతా

స్వరాల గొంతులు పెరుగుతూ
బిగ్గరగా .... ఇంకా బిగ్గరగా
కర్ణభేరీలు పగులు విస్పోటాల్లా
భరించలేనంతగా ....

పారిపోవాలనుకున్నాను
ఆ స్వరాలకు దూరంగా, కానీ

కాళ్ళు కదలడం లేదు.
అలజడి నిశ్శక్తత నీరసం

వలల్లా

ఆ వలల్లో చిక్కుకుని ....
నిరాలోచనుడ్ని లా

ఎవ్వరూ తోడులేక

నీడలా

వెంటాడే స్వరాల మధ్య
నిస్సహాయుడ్నై నేను

Monday, September 17, 2018

పడమటి పొద్దుభావోద్వేగాల భూతద్దంలోంచి
చూస్తున్నా .... నిన్ను
పగిలి చెదిరిన ముక్కల
శల్య అవాస్తవ వాస్తవికతను

చూస్తూ చూస్తూనే ఉన్నాను

నన్ను నేను కోల్పోతూ
కరిగిపోతున్నాను

శ్వాస ఆడటం లేదు.

ఔనూ .... ఎందుకు ఇలా జరుగుతుంది?
ఎందుకు ఈ విధ్వంసం?
ఎందుకు నేను నశించిపోతున్నాను?
ఎందుకు శూన్యమై పోతున్నాను?
ఎందుకు ఈ అయోమయ అసంతులన
భావనల్లో మునిగిపోతున్నాను? 
ఎందుకు
ఈ చిన్న కోరిక చిన్ని ఆశ

ఇప్పటికైనా
నీవు నాకు దూరంగా పారిపోవాలి అని
కనిపించనంత సూక్ష్మమై పోవాలని

బహుశ
ఊపిరి పీల్చుకోగలుగుతాననేమో 


Saturday, September 15, 2018

మొండిమదిలోనేను నా భావాలను
సలసల కాలే
కొలిమిలో పడేసి
కాల్చేయ్యాలి

మున్ముందు
ఎలాంటి
భావోద్వేగాలకు
చోటివ్వకూడదు

మొండితేఱిపోవాలి
ఈ చర్మం .... ఇనుము లా
ఎలాంటి ఆనందం పొందే
అవకాశం లేకుండా  

కానీ

ఒక వింత తపన, ఎందుకో
ఇంకా శేషంగా .... నాలో
నీవు నన్ను చూసి
చిరునవ్వు నవ్వడం చూడాలి అని 

నాలో ఏదైనా కోరిక ఇంకా
మిగిలి ఉంది అంటే
ఆ కోరిక
సంతోషంగా చూడాలి నిన్ను అని

Tuesday, September 11, 2018

తడబాటు జీవితం
దాదాపుగా దూరంగానే
ఉంటున్నాము అందరమూ
ఏ మనిషికీ మరో మనిషితో
సంబంధం లేదు.

వీడని భ్రమల్లో తేలుతూ
....
అకారణ ఆలోచనలతో
క్షణక్షణమూ
ప్రయోజనాన్నే ఆశిస్తూ 

ఏ ఇరువురమూ సమానం
కామని తెలిసినా
అసంతులన అస్థిరత్వం ....
చేరువయ్యేందుకు
సర్దుబాటుకు ఇష్టపడము.   

ఆలోచించాల్సిన అవసరం
లేని చోటే
అతిగా ఆలోచిస్తాము.
ఎన్నో విషయాలు
చివరివరకూ

చివరికి

రక్త వాహికలు
తట్టుకోలేని ప్రవాహం
ఒత్తిడి
గుండెపోటు అధికమై
పగిలే రక్తనాళాలు

మాట్లాడే పలుకులోనూ
అభద్రతా భావన ....
మన ప్రతి మాట, కూలబోయే
పునాదుల్లేని కట్టడపు
తప్పుల గాలి ఇటుకే

ప్రతి రోజూ ప్రతి క్షణమూ
చూస్తూనే ఉన్నాము ....
ఎన్నో తడబాటు చర్యల్ని
ఇంకో కొత్త బాధకు
ఇంకొన్ని కొత్త కారణాల్ని 

కొత్త ఊహాతీత లోకం
ఇదే సరైన సమయం ....
సరంజామా అంతా సర్దుకుని బయల్దేరేందుకు కొత్త లోకానికి  
ఈ వీధిలోనే .... ప్రయాణం
దూరంగా కొండైమీదనుంచి
ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు సూర్యుడు

మనిషి మనిషిలా సూర్యుడై
స్వయంప్రకాశం తో బ్రతికితే ఎంత బాగుంటుందో 

నేను వెళ్ళాలి అనుకునే .... ఊహాతీత ప్రపంచం అది
అక్కడ మనిషి శూన్యుడు సర్వమూ .... 
ఎక్కడో లేని ఇక్కడా కాని ప్రపంచం    
ప్రతి క్రియకూ ప్రతిక్రియే పర్యవసానం కాని
కాలానికి మాత్రమే తెలిసిన బంగారులోకం .... అది  
ఆకాశం మాత్రమే అనుభూతి చెందగలిగిన
అందమైన బంగారు లోకం 
మనిషి విపరీత ఆలోచనల విశిష్ట నిర్మాణం .... 
అందం వనమై ఆనందం తాండవం చేసే
ఒక నూతన అనుభూతుల ధామం .... అది

ప్రతిదీ ప్రతి ఒక్కరూ పట్టించుకోని
ఎవరు ఎవరినైనా
వారి జీవితం కంటే ఎక్కువగా ప్రేమించగలిగే 
ఏ సామాజిక కట్టుబాట్ల గోడలూ
ఎవరినీ ఇష్టానికి భిన్నంగా బంధించలేని ....

స్వేచ్చగా ఆలోచించగలిగే ....
ఎవరి కాళ్ళ మీద వారు నిలబడి నిండుగా శ్వాసించగలిగే
అస్పష్ట, నిరాకార, సూక్ష్మరూపులయ్యేలా  
కష్టాలు బాధలు అందువల్ల కలిగే నొప్పులు ను
శాశ్వతంగా వొదిలెయ్యగలిగేలా

ఆ ప్రపంచంలో మనిషి సమాధి స్థితి లో
తన్మయత్వం లో వ్రేలాడొచ్చు

బూత వర్తమానాల్లో మనిషి
మునిగి తెలుతూ ఊగిసలాడుతుండొచ్చు
చీకటి కాంతి తెరల మధ్య ....
అక్కడ తప్పులు దిద్దుకునేందుకు భూతం లోకి
వర్తమానం లోంచి .... ప్రయాణం సాధ్యమే 

Monday, September 10, 2018

నిరామయ(ప్రేమ)భావన
పోగొట్టుకోలేని
కావాలనుకుని పొందలేని
నిర్మలత్వం,
నిరాకారం నీవు     
ఎక్కడికి వెళ్ళినా
సర్వం నీవేలా ఉండి
ఆరంభమూ
అంతమూ కాని 
హృదయం
నిండిపోయిన
సమర్పణా భావన
అనుభూతివై  
ప్రతిచోటా ఉండి
కళ్ళతో చూడలేని
దైవత్వానివి, నీవు
గాలిలోనూ
నేలమీదా
అంతటా వ్యాపించిన 
బ్రహ్మాండం బ్రద్దలైన
నిశ్శబ్దం శబ్దానివి 

Monday, July 30, 2018

ప్రతిద్వనులుఉక్కిరిబిక్కిరిని చేస్తూ ఉన్నాయి
నీ ఆలోచనలు
కత్తుల్లా నా చర్మాన్ని కత్తిరించేస్తూ

గుసగుసల్లా వినిపించీ పించని
ఏవో పదాలు
నీ మాటలు
ఎర్రని ద్రవం లా ప్రవహిస్తూ
కొట్టుకుపోతూ ఉన్నా .... ఆ ప్రవాహం ఒరవడి లో   

ఎరుపెక్కిన కళ్ళలోంచి రక్తం
బొట్లు బొట్లై 
కరకు రాతి నేలమీద
రాలి గడ్డకట్టుకుపోతుంది. వేటకుక్కల్లా నీ జ్ఞాపకాలు కొన్ని
వెంటాడుతూ ఉన్నాయి నన్ను ....
ప్రతి క్షణమూ అప్రమత్తమై 
ముని వేళ్ళమీద ఉండక తప్పడం లేదు.

అర్ధరాత్రి వేళ కూడా మంచమీద
మేల్కొని ఉండక తప్పడం లేదు. 

నీ ప్రేమ
ఒక గొప్ప ఔషధం అనుకునేవాడిని

ఎప్పుడు నీవు నా పక్కన లేకపోయినా
ఒక అనర్ధ ప్రయాస అనిపిస్తూ ఈ జీవితం
అది నా సిరలు దమనుల్లో
మాదకద్రవం ప్రవాహం అవుతుందనుకోలేదు.

Sunday, July 22, 2018

దురలవాట్ల శయ్యరాక్షస పక్షి బొడ్డు కింద
వ్యసనాల ప్రాణినై 
వ్రేలాడుతున్నాను.
నేలను తాకలేక

అశక్తత
వింత అనాసక్తత
ప్రాణాలు పోతున్నట్లున్నా 

కాలం కాలి గోళ్ళ మధ్య
నలిగిపోతూ
ఊపిరి అందడం
దిక్కు తోచడం లేదు.

పైకి, ఇంకా పైకి ఆకాశం లోకి
మబ్బుల మధ్యకు
లాక్కుని వెళ్ళబడుతున్నా
శరీరం తేలికైపోతూ 


గాలి ఒరిపిడికి
మండుతున్నాయి కళ్ళు ....
కన్నీళ్లు కారుతూ
అయాచితంగానే

ప్రార్ధిస్తున్నాను.
పశ్చాత్తపరహితం గా
స్వేచ్చ కోసమో
సామాన్యత కోసమో మరి 

కానీ,  పోగొట్టుకున్న జీవితం
బలహీనతలు లక్ష్యంగా
కాలం
అగ్నిని ఉశ్వాసిస్తుంది.

నిర్దాక్షిణ్యంగా
నా వైపు
ఆబగా చూస్తూ

ఇప్పుడు
దాని దంతాల లాకెట్టు
నాకు
స్పష్టంగా కనిపిస్తుంది.

ఎవరు నిన్ను
నా నుండి రక్షిస్తారు
ఈరాత్రి ....
నేను విందు చేస్తుంటే అన్నట్లు

Friday, June 22, 2018

నిరీక్షణనీ కోసమే మౌనం గా
వేచి చూస్తూ ఉన్నా 
సహనం సన్నగిల్లిపోతూన్నా
గుండె చుట్టూ నీవు
నిర్మించుకున్న గోడల ద్వారాలు
తెరుస్తావేమో అని .....
ఆశతో నిశ్శబ్దంగా

ఈ భావోద్విగ్న మౌనవాసం లో
ఈ ఎదురుచూపుల ఏకాంతం లో
ఎంత కాలమో ....
ఇలా ఎన్ని ఆశ నిరాశల
సూర్యోదయ-అస్తమయాలో
ఎన్ని పరీక్షలో ....
కాలానికి మాత్రమే తెలిసిన
ఎన్ని నిర్లిప్తనిరీక్షణలో