Friday, June 14, 2019

అలసత్వం




ఎంత చిట్లించుకుని చూసినా 
కళ్ళముందు
అస్పష్ట అంధకారమే 
నిక్కబొడుచుకుని
విందామని చూసినా
స్తబ్ధ అస్పష్టతే
మోసపోయి
తిరస్కరించబడి
విశ్వాస ఘాతుక ప్రవాహంలో
కొట్టుకుపోతున్నప్పటి 
భీతావహత ఆవహించినట్లు
ఎంత బాధాకరమో
ఈ నొప్పిని భరించడం
దురదృష్టం అనుకోనా
కేవలం విశ్వసనీయత
లోపించడం వల్లే అనుకోనా
ఒకవేళ
కన్నీళ్ళే మాట్లాడగలిగితే ....
గుండె కవాటాల్ని పగులగొట్టి 
నొప్పిని స్థానభ్రంశము చెయ్యగలనేమో  
గుండె శిల కాకపొతే
మరమ్మత్తు చేసి!?
సాధ్యం కాదని తెలిసీ 
నమ్మకం నశించిన చోట
నమ్మకం పొందె యోగ్యత లేని చోట
పెనం మీద మాడిన వంటకు
మాననీయతను కలిగించడం లాంటి
నిరర్ధక పరిచర్యలు

Monday, June 10, 2019

కన్నీటి చార





ఊటలా ....
ఎద ఉబికిన
కన్నీటి
అసంపూర్ణతానుభూతి
నేను

ఎండిన కనురెప్పలు
అసహనత కురిసి 
వేదన కరిచి  
ఎద గుచ్చిన
కోపోధృతి,
అస్తిత్వం మసకేసిన   
పెనుగులాట
భావోద్వేగం .... నాలో

అయినా

నిన్ను చూసేందుకు
నీకోసమే ఎదురుచూస్తూ
చిరునవ్వొకటి
విచ్చుకునే ఉంది

Saturday, June 8, 2019

సిరాతో ....




బొట్లు బొట్లుగా
ఊటలా
వేళ్ళలోంచి
సిరా ....

నా సిరలు
దమనులు
సిరామయం
అన్నట్లు 

ఎన్ని
చిరు కవితలో
కథలో 
కన్నీటి బొట్లుగా 

జారి
పారి 
ఈ మెదడు
కాల్వనుంచి