Monday, September 30, 2013

రక్త నాళ స్పందనలు

నిమ్మళం, అరమరికల్లేని ఆనందం
హృది నిండి .... వినిపిస్తున్న గుసగుసలు,
చెలీ .... అవి, నీ హృదయం నా హృదయం తో
మాటలాడుతున్న మనో భావనలు.
నా ఆశలు, హృదయ నాళస్పందనలు.

అంతా భ్రమే!


అద్దం లో ఎదురుగా ఒక రూపం
నేను కాని ఒక యువరాజు
అందంగా ....
రింగులు, వంకర ....
రంగు జుట్టు
కళ్ళు .... నిర్మల భావనలు ప్రసరిస్తూ,
మోకాళ్ళవరకూ సాగి .... తెల్లని పొడుగాటి చేతులు
నున్నని నూలు వస్త్రాలు 
ఆ తల చుట్టూ వెలుగులు విస్తరిస్తూ .... ఏదో దైవత్వం
అది ఒక అద్భుతమైన భ్రమ
ఒక కల యేమో లా,
అద్దం ఆవల చూసాను. బాధ్యతల దిన సూచిక!

నన్ను మించిన భారం


పుట్టినప్పటినుంచీ
ఎన్నో విషయాలు,
ఇంకెన్నో సంగతులు
ఇప్పటికీ మరిచిపోలేక 
మది పొరల్లో భద్రంగా దాచి
అవసరం లేనివి కూడా
కొన్నింటిని ....
ముఖ్యమైనవి పక్కన పెట్టి .... మరీ.

విఫల, అవాస్తవ కలలు కొన్ని త్యజించి,
దూరంగా ఉంచాల్సిన వాటిని
వెంటేసుకుని,
భారంగా కదులుతూ,
ఇప్పుడు నేను .... ఏ గమ్యమూ లేని
ఒంటరిని .... ఇక్కడ అగమ్యంగా
నేనుగా కట్టుకున్న అబద్దపు
కోటగోడల బురుజుల చాటున నిలబడి.

నాకు,
చాలా విషయాలు గుర్తున్నాయి.
నాకు నేను
సిగ్గుపడి, తలొంచుకుని
లోలో నేను
దురదృష్టం ఒడిసెలు తగిలిన
నిర్లక్ష్య ప్రేమికుడ్ని....లా ఒంటరినై
నిరుపయోగ జ్ఞాపకాల
మదిభారం మోస్తూ ఉన్నాను.

Sunday, September 29, 2013

పరిమళం

ఇదే మిగిలిన  
లక్షణం,
వృక్షం నుండి తెంపబడి 
కుదుటపడని ఒంటరితనం.
క్షీణిస్తూ నిశ్శబ్ద వేదన.

నగర నాగరికతనా చుట్టూ
యాంత్రికంగా కదులుతూ
ఉరుకు పరుగుల జనం హడావిడీ
అయినా ఒంటరితనమే నాలో,
నిశ్చలన .... ఊపిరి భారమై,
ఘనీభవించిన జడపదార్ధాన్నిలా
ఎవరూ
నన్ను వినలేని విధంగా .... నేను.
నా పేరెవరికీ తెలియదు.
సిగ్గు
ఉదాసీనత లను మోస్తూ
పీడకలల్ని మోస్తూ జీవిస్తున్నాను.

ఆకలి లేదు,
అనుభూతించాలని.
దుఃఖ్ఖించాలని లేదు.
అంతా శూన్యం లా
నిద్ర కూడా నన్ను పునరుద్ధరింలేని రీతిలో 
నాలో ఆలోచనల కదలికలు
కొన్ని నిజాలు, కొన్ని కల్పనలు
ఎందరో చుట్టూ కదులుతూ ఉన్నా
నాకు నేనే లా
నగర జీవనం, చమక్కుల్లో
నా జీవితం పై నాకు ఆశ కలగడం లేదు
స్థిరత్వం ఉంటుందనే ఊహైనా రావడం లేదు.

Saturday, September 28, 2013

ఒక అద్భుతానివి నీవు


నీ కళ్ళలోకి చూస్తున్నా!
నీలి తడి లో .... నీలి ఆకాసంలో మెరిసే చుక్కల్లా, 
పరావర్తనం చెందుతూ ప్రకాశం
పరుచుకుంటూ కాంతి పుంజాలు, 
చురుక్కున గుచ్చుకుంటూ కొంటె కిరణం. 
రెచ్చగొట్టినట్లు
బలహీన క్షణాల దురదృష్టకర స్థితి 
శరీరం .... నొప్పి, వేదనా మయం అయి
నిద్రించాల్సిన గడియల్లో ఒక భూకంపము లా
చెల్లాచెదురైన కలలు
కొన్ని జ్ఞాపకాల మధుర భావనలు ....
అన్నీ కలబోసినట్లు కలిసి పోయి, 
అడ్రస్ లు కోల్పోయి ....
ఏదో నొప్పి తాలూకు సమస్య
అందులో కొన్ని ఒడ్డుకు చేరిన 
అద్భుత అనుభవాలు అనుభూతులు ....
గుర్తుకొస్తూ, 
ఒక చిత్రమైన ఉపశమనం. 
కారణం .... నా ఎదురుగా .... నీవు వుండటమే!

నేన్నిన్ను కోల్పోతాననే


సూర్యాస్తమానానికి చాలా సమయం ఉంది.
అప్పటివరకూ నీతో జీవించాలి.
నిన్నటి జ్ఞాపకాలలోంచి నిద్దుర లేచి ఆలోచిస్తున్నాను
నువ్వొచ్చావు.
ఒక నూతన ఉదయం లా,
వర్తమానం, చాలా కాలం క్రితం కన్న కల,
ఒక తిరస్కరించరాని క్షణాల అవకాశం లా.
కల, మరో ఉదయం .... నమ్మకం, అనిశ్చయం
అందుకే, నేడే నిండు గా జీవించాలనుకుంటున్నా .... నీతో

Friday, September 27, 2013

ఏ జన్మ పాపమో .... ఈ పీడకల


నిద్దుర లేని, కలలు రాని రాత్రులు
నిజంగా అంత కోపమా .... నన్నే వెంటాడను
ప్రశాంతత లేని, రెప్పలు మూయలేని
అభద్రతాభావం పెరిగిపోయి,
అణువణువూ అలుముకుపోయిన భయం .... నిలువెల్లా,
దయలేని నీడలా అంధకారం నా సమీపం లో
నా వెనుక, నా పక్కన, నేను లా ....

అంతా చీకటే! కళ్ళు చికిలించి చూసినా
కళ్ళు తప్ప వేరేదీ కనపడని
అనంత పైశాచిక భవనావరణలో ఉన్నాన్నేను.
శరీరం గడ్డకట్టి, గొంతు పిడచకట్టుకుపోయి
వక్రరూపమేదో మనసు గోడపై కార్వింగ్ చెయ్యబడినట్లు
దాని ప్రభావం నుండి తప్పించుకోలేక ....
రాని నిద్దుర కోసం .... తపిస్తూ, ఏడుస్తూ
ఆశావహమైన విశ్రాంతి, కాంతి కోసం ప్రార్ధిస్తూ.

పీక్కుపోయిన నల్లటి చారల .... డొల్ల కళ్ళు,
అసభ్యకర కదలికలతో ఆరున్నర చేతుల ఆటలు.
ఒక రాక్షసో, ఒక దెయ్యమో, ఒక శాపమో లా
చావురాని నరకానికెందుకో లాక్కెళ్ళాలనుకుంటున్నట్లు
ఆ గుణాన్నీ, ఆ రసాన్నీ, ఆ రాగాన్నీ .... అది ఏ లక్షణమో
అర్థం చేసుకోలేని దుర్ధశ లో .... కొట్టుకుంటూ,

భయంగా ఉంది! ఎప్పటికీ ఈ భయం ఇలాగే ఉంటుందేమో
ఈ పీడకలలు ఇలానే నన్ను వెంటాడుతూ ఉంటాయేమో,
ఆ చీకటి వక్రరూపం నన్ను పగబట్టే ఉంటుందేమో అని.
భయం నన్ను అవిటివాడ్ని చేసి,
చూసే కళ్ళకు .... నేను
శూన్యం లోకి పిచ్చిచూపులు చూస్తున్న పిచ్చి వాడ్నై.
అదే భావన, అదే భయం నాలో ఇంకిపోయి,
ఈ పీడకల .... ఏ జన్మ పాపమో! ఏ పాప పరిణామమో కదా!

జ్ఞాపకాల అద్దకాలు

జీవితం .... తప్పులతడకే ఎప్పుడూ,
తప్పులు చెయ్యడం దిద్దుకోవడంతోనే సరి
ఒక్కోసారి ....
అర్ధవంతమైన మార్పుకు అర్ధమే లేక
అయోమయాన్నే నమ్ముతాము.
అక్కడ ఉండేది జ్ఞాపకాల రంగులు మాత్రమే
మనిషి తనను తాను అందంగా చూసుకోవడానికి
సృష్టించుకోవడానికి.
కొన్ని రంగులు .... భావనల ఆధారంగానూ
కొన్ని రంగులు జ్ఞాపకాలు, భావోద్వేగాలు ఆధారంగానూ
పైన పూసుకున్నదంతా రంగులని
వాటిని కనపడకుండా ఉంచాలని చూస్తాము.
ఎన్నో విఫల ప్రయత్నాలు
గతాన్ని నటనాత్మకతనూ సమాధి చేద్దామని
చాలా సార్లు వాటిని కాల్చేసేద్దామని .... తపిస్తాం.
కానీ అవి ఎప్పుడూ మెల్లమెల్లగా .... మదిలోకి తిరిగి చేరి
ఒకటి పిదప ఒకటిగా నియంత్రించలేని విధంగా ....
జ్ఞాపకాలనే కాదు.
మనిషి తనను తాను నియంత్రించుకోలేని స్థితి లో
వివిధ రంగుల సామూహిక పరమాణువులు వాటి షేడ్స్ ....
జ్ఞాపకాలు అద్దకాల్లా
గతం అనుభూతుల జల్లులు కురిసి
ఇంద్రధనస్సు రంగులు .... మనిషి మనో వినీలాకాశం లో

Thursday, September 26, 2013

నువ్వున్నావనేనీవున్నావనే
లేత పెదవులు
ఆశ, ఆపేక్షల ప్రత్యామ్నాయం కై
వెదుకులాట నిలిపివేసాయి.
మనస్సు
పరిభ్రమించడం మనేసింది
ఒణుకు మాత్రం
తెరలుతెరలుగా శరిరాన్నావహించి 
నన్ను కుదిపేస్తుంది.

అన్యాయం!

ఆత్మ లో లోతుల్లో
బంధించబడి వాంఛ,
నా శ్వాస నీ నిశ్వాసన లో పొందుపరచబడి,
నీ ప్రాణ నది రక్తం లో
తేలియాడుతున్నా ....
నా సాన్నిహిత్యం,
నన్నెరగను అనడం .... న్యాయమా ప్రియతమా!

కనుల అద్దం లో


కళ్ళు అబద్ధం ఆడలేవు.
నిజం మాత్రమే చెబుతాయి.
ఆత్మ గురించి,
హృదయ నిర్మలత్వం గురించి ....
జీవితం ఆటుపోటులు,
లోతుల గురించి .... నిజాలు చెబుతాయి.
ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది.
నీ .... ఏ దృష్టి, ఏ కళ్ళు
నీకు సంబంధించిన ఏ జీవన సత్యం ....
నన్ను బంధీని చేసిందీ అని,
నన్ను నేను మరిచిపోయేలా చేసిందీ అని.

స్వేచ్చా విహంగం


ఒక కొత్త కవిత ను.
నేను ....
ఒక విపరీత శ్రావ్య రాగాన్ని
రసభరిత, ఉద్వేగ భావన్నై ....
నీ గుండె లో
నేను ....
ఒక దివ్య, మనోహర, సామరస్య కపోతాన్ని
ఉల్లాస, ఉత్సాహ, శాంతి భావన్నై ....
వీ గుండె లో
నేను .... ఒక బాధ, ఆవేదనాభావన్ని ....
నీ ఊహాలోకంలో .... ఒక స్వేచ్చా విహంగ భావన్ని.

Wednesday, September 25, 2013

చెలీ నీకిది న్యాయమా!

నా నుంచి ....
కలల్ని దొంగిలించడం,
కొంటె పిల్లగాలులు నాటి మన జ్ఞాపకాల ....
ప్రణయ భావనల పరిమళాలను మోసుకు రావడం,
ఈ రాత్తిరి వేళలో .... న్యాయమా!
న్యాయమా చెలీ!
నీకింకా .... వయసుతనం రోజులు గుర్తున్నాయా?
ఈ పరిమళాల పరామర్శలు
గుర్తుకొచ్చి, బలహీనుడ్నవుతున్నాను.
నేనూ నీవూ కలిసి నిద్దుర చెయ్యక తప్పదా అని ....
కలలో, ఈ రేత్తిరి.

రోడ్డు పక్క శవం


అమర్యాద పదాల నాట్యం,
దైవదూషణ చేస్తున్న ఓ వింత నాగరికత
చీకటి బ్రతుకులు ....
ఆ ఆకాశం దీవించిన అమాయకపు బిడ్డల జీవితాలే
అవార్డులకు వస్తువులుగా ....
అప్పుడెప్పుడో 
ఎయిర్ కండిషండ్ రూములో కూర్చుని
బలహీన వర్గాల జీవితాల పై రాసిన 
ఒక సుదీర్ఘ కవితలో ఆ కవిసామ్రాట్టు 
విసిరిన ఒక అలంకారం 
"ఒక పదం" లా 
రోడ్డు పక్కన ఎవరూ పట్టించుకోని 
ఒక అనామకుడి శవం 
మున్సిపాలిటీ గౌరవం కోసం ఎదురుచూస్తూ .... 

Tuesday, September 24, 2013

నిబద్దించిన దృష్టికోణం


ఒక వెఱ్ఱి నిరాశ లో
అచ్చు, మూస
తార్కిక వాస్తవ రూపం కోసం
ముందు
అలవాట్లు అపశృతులు
అక్షరాలు కూర్చి
పదాలు పంక్తుల లోపల
వర్ణాలు దిద్ది
పరిణామం
ఒక అవాస్తవిక దృష్టికోణం 

జీవించని జీవితం

భగ భగమని రగిలిన మంటలు ఆగి, బూడిద చల్లారి, 
లూబ్రికేషన్ లేని కాల చక్రం ఇరుసు కీచుమంటూ ....
అలుముకున్న పొగ, ఆ పరిసరాల్లో పలుచనయ్యి, అక్కడే .... 
అక్షర సత్యం లా, ఒక అనుభవం .... ఒక అర్ధం పక్కనే ఉంటుంది.

సాహసంతో కూడిన నిర్ణయం .... జీవితంలో ఒంటరిని చేసి   
నిశ్శబ్దం చుట్టుముట్టి, ఉక్కిరిబిక్కిరి అయి, కాల సాహచర్యం లో  
కుదుటబడ్డ .... సామాన్య వాతావరణం లో .... ఊహించని రీతిలో
మంచి తనం, నిజం అబద్దం బంధ సారాంశం చరిత్ర పుట లా ముందుంటుంది.

తొందర, వేగం లో నియంత్రణ కష్టం. నెమ్మది నెమ్మదిగా 
జాగ్రత్తగా జీవితం పేజీలు తిప్పక తప్పదు.
బోల్డ్ అక్షరాల్లో ఎదుగుదల అనో, పురోగమనం అనో ఎక్కడో రాసుంటుంది. 
చదవాలి. ముందుకు కదిలేందుకు, టోల్ గేట్ లో మూల్యం చెల్లించాలి.

జీవితం అంతా ఈ అనుభవాల అంతర్యుద్ధాల మయమే    
ఆశలు, నిర్ణయాలు, పట్టుదలలు .... అవహేళనలుగా పరిణామం చెంది 
ఆ ఒంటరి రహదారి లో .... ఎన్ని అరుపులు, ఎన్ని అవహేళనలో 
జీవించని ఆశల నిట్టూర్పులో .... నిండుగా జీవించాలనే తపనలో ....

వైరం, దూరం సమాధి చేద్దాం!


నాకూ ఇష్టమే!
నిజంగా మన మధ్య దూరం
ప్రబలిన వైరం ....
తగ్గే అవకాశం ఉంటే
గుండె గోడల్లోకి యింకి
సిర ధమనుల్లో వ్యాపించినా
భ్రమలో ముందుకు నడవాలని లేదు.
సమశ్యను ఝటిలం చెయ్యాలని లేదు
నీవే అన్నావు.
ఈ వైరం, దూరం ను సమాధి చేద్దాం! అని
పెరక్కుండా ఉంటే నే నయం
ఇద్దరికీ మంచిది అని
అందుకు అవసరం అయితే విడైనా పోదాం అని.
నీ కోరిక ప్రకారమే అంతా జరిగింది.
వైరం, దూరం తగ్గించుకునే నెపం లో ....
ఒకరికొకరం ఏమీ కాకుండా పోయాము.
ఇప్పుడు,
నీవు నీ ముఖం పై చిరునవ్వు తో
నేను నా గుండెలో ఆరని అగ్ని అశాంతి తో
రెండు హృదయాల బంధం సమాధి చేసాం!

అన్ని తెలిసిన నీకు విన్నవించుకుంటున్నా!


నీవు అనుకుంటే ఏమైనా చెయ్యగలవు. 
నా ప్రపంచాన్ని చిద్రం చెయ్యగలవు. 
నాకొక కొత్త ఆరంభం ఆనందం పంచనూ గలవు.  
ఎంత చిత్రమో
అన్నీ క్రిందికీ పైకీ అవుతూ 
దొరకని కనబడని దేనికోసమో 
తెలిసీ వెతుక్కుంటూ పోరాడుతుండటం.
.....
నీ కళ్ళలోకి చూస్తే నిజమేమైనా 
తెలుస్తుందేమో .... నీవు నాతోనే ఎప్పటికీ అని  
ఏదో అనుమానం పీడ ....
ఇప్పటికే నిన్ను కోల్పోయానేమో అని. 
ఈ గాలి ఈ వాతావరణం లో
ఏదో లోపం ఉంది. 
నేను నిమిత్త మాత్రుడ్ని! ఒక ప్రేక్షకుడ్ని!
నేను తెల్సుకోవాలనుకుంటున్న .... కోరిక 
నీ మనసు లో రూపం నేనా కాదా అనే
నేను చెవిటి, మూగ, గుడ్డి....వాడ్ని గా 
నన్ను నేను భావించి బాధపడలేకపోతున్నా.

ఎంత సేపూ నటనే!


నేను
సిద్దం గా
సర్వసన్నద్దంగా ఉన్నాను.
ఎప్పటికీ ....
ఆ చిరునవ్వును అలానే పూయిస్తూ
బలవంతపు నిర్మలత్వం తో నవ్వగలుగుతున్నాను.

దెబ్బ తగిలి
గుండె నొప్పి
నా అస్తిత్వాని ధిక్కరిస్తున్నా ....
ఆశ ఏదో అంతరంగంలో .... అతను నిన్ను ప్రేమించాలని, 
నేను నిన్ను ప్రేమిస్తున్నంత కన్నా మిన్నగా!

Monday, September 23, 2013

కమ్మని చెమర్పు


శీతల .... తీపి భావనల కదలిక
మంద మారుతం పలుకరింపు
ప్రభావితం చేస్తూ,
హృదయ ఉద్వేగం
మదిని తాకుతూ
కొమ్మలు, ఆకుపచ్చ ఆకుల పై రాలి
చెల్లాచెదరైన మంచుతుంపరల్లా
బుగ్గలపై తేమ .... కమ్మని చెమర్పొకటి

ఆకాశం గొడుగు నీడలో


ఉదయిస్తూ సూర్యుడు 
తూరుపు కొండల్లోంచి
భూమి, సముద్రం .... సూక్ష పరిశోధనలు 
పిదప
నక్షత్రాల కాంతి మొదళ్ళను 
పక్కకు నెట్టి
రాత్రి తెర దిగుతూ
అంతటితో నిన్న అయిపోయింది. 
నేడు మొదలు 
జీవితం మళ్ళీ ఆరంభం
నూతన ఎత్తుగడల్తో.

దయలేని దేవతా

నాకు తెలుసు 
నీకు పట్టించుకోవల్సిన అవసరం లేదు. 
ఇది ఎంతో స్పష్టం 
నీకూ తెలుసు 
మరమ్మత్తుకు 
సాధ్యం కానంతగా నేను పాడయ్యానని 
ఎముకలపై చర్మం 
ముసుగేసిన రూపాన్ని మాత్రమే నేనని

నీకు మనసుందని తెలుసు 
నాకు సహాయం అందించవనీ తెలుసు!? 
చిన్ననాటి సాన్నిహిత్యం 
గుర్తుకు రావని
అనుకూలంగా ఒక్క మాటైనా అనవని, 
సందేహానికి తావు యివ్వకుండా  
మన స్నేహం నకిలీ కాదని అనవని.

నేను అనుకుంటున్నా .... ఎప్పుడూ, 
నీవు నా సంక్షేమాన్నే ఆలోచిస్తావని 
కానీ, ముక్కలైన నా హృదయానికి తెలుసు 
అది అబద్దం అని 
ఔను కదూ? 
జీవితం .... నల్ల బోర్డ్ మీద తెల్లక్షరాల భావం కాదు కదూ! 
తెలిసీ ఉపశమనం లేని 
నా హృదయం ఎంతగా రోధించినా ఫలితం శూన్యం కదూ!

తొలి సారి, నిన్ను కలిసినప్పుడు నాలో కుతూహలం
కలలు, కోరికలు, ఆకాంక్షలై 
ముద్దబోయి తడబడిన మాటలు నిన్ను నవ్విస్తే.
ఊపిరి ఆగిపొయినట్లనిపించేది. 
ఆ ఊపిరి నువ్వే అని
నా ఆనందం ఆ ఊపిరిలోనే వుందనిపిస్తూ,
నిన్ను నా తలపుల్లోనే దాచుకోవాలని .... అనిపించేది. 


Sunday, September 22, 2013

ఒక రాలిన జీవితం


నిలువెల్లా వొలిచిచూస్తున్న 
కోరికల చూపుల 
వడగాలి కి,
వికసించిన మనసు గులాబి 
ఒకటి ....
కలల రేకులు రాలి,
అసహాయనై 
గిరగిరా తిరిగి, 
నేల రాలి 
ఆ మోహపు గాలి తాకిడికి, 
చెల్లాచెదురై .... 
ఆ పరిమళం 
చరిత్ర పుటల్లో ....
ఇప్పుడు ఒక జ్ఞాపకం 

Saturday, September 21, 2013

సాటి మనసు


లోతైన బాధ
నుంచి
మనిషి పొందే
అంతర్దృష్టి
"చిరిగిన మనస్సుల్లో"
బాధను
అర్థం చేసుకొనే
శక్తి
అపారమని తెలిసిరావడం!

నా కోరిక...


రాలుతున్న మంచుబిందువును కావాలని 
గడ్డిపువ్వుల్ని పలుకరించి .... 
సుతారంగా ఆకులమీదకు జారి, 
కిరణాలకు ఆవిరినై ....
అమ్మ ఒడి చేరిన పాపలా, 
నవ్వుతూ గాలిలో కలిసిపోవాలని. 
ఉల్లాసం, మందమారుతాన్నై తిరుగుతూ,
ఇంద్రధనస్సు ను దగ్గరగా చూడాలని ....
చీకటి వేళల్లో ఆ వెన్నెల కిరణాలతో ఆడుకుని, 
ఒక ప్రియురాలికిచ్చిన మాట లా ....
ఒక వాగ్దానం లా కోడికూయకముందే లేచి, 
కురుస్తున్న మంచులో ఒక బిందువునై ....
మళ్ళీ నిన్ను పలుకరించేందుకు రావాలని.

కలుపు


సామర్ధ్యం లోపల 
బలం పునాది కావడం 
రహశ్యం

ఆలోచనల్లో 
గెలుపే కావాలనుకోవడం 
దుర్బలత్వం

శేష శోధన


జీవితం చిత్రం లో
అంతంలేని ఆలోచనలు
తేలుతున్న
నిరాశల తీగలు,
వెర్రి కూతలు, అరుపులు
వెర్రిచూపులు,
జుట్టు పీక్కోవడం,
కూలబడిపోయి
అరచేతులు చరుచుకోవడం,
చేతులు చాచి యాచించడం,
నిర్ణాయక సాక్ష్యం,
ఇదేనా? ప్రాపంచిక న్యాయం,
అంతులేని ప్రశ్నలు
చిందరవందర చేస్తూ
ఎటుచూసినా అవశేషాలే,
ఆత్మ పోరాటాలే
రేపటి కోసం, అది
ఆత్మబలిదానమే అని తెలిసీ ....

ఈ చీకటి తెల్లవారేనా!


ఆమె చుట్టూ చీకటి. ఆమెలో లోలో
ఏవో వంకరటింకరి, నులిపురుగులు, పొడుగాటి మీసాలతో
పీకల దాకా ఎక్కిన మత్తు .... డోక్కుంటూ,
మనసిచ్చి మనువాడిన చోట అతనెందుకలా ....?
సమాధానంలేని అన్వేషక ప్రశ్న,
ఎన్నో దుఃఖకర భావనల్లో ఒక భావన.
కలలో కూడా పిచ్చి పిచ్చి అరుపులు, ఏవో పొలి కేకలు
మనిషి చర్మాన్ని పోలిన ఒక విధమైన గుడ్డ ను ముసుగులా ....
భయం, అసహ్యం, దౌర్భాగ్య తాండవం చేస్తూ,
రెండు చేతుల్లో సరిగా పట్టుకోలేకపోయిన కక్కును మెల్లగా ఊడ్చి, శుభ్రపరుస్తూ
పరస్పర విరుద్ధమైన పొసగని వాద్యం కీచు కీచుమని భూమిని రాసుకుంటున్న ధ్వనుల్ని వింటూ
ఆ జిగట, ఆ బంధనంలో జారుతూ జీవితం అంచుల్ని 
వేళ్ళతో, తాఁకుతూ .... కుళ్ళిన గాయాన్ని గీకుతున్నట్లు
ఓ ఇల్లాలి అణగద్రొక్కబడిన ఆలోచనలు అరవలేని అరుపులు, ఆర్తనాదాల్లా
నరకం, అగాధం, సముద్రగర్భం లోతుల వరకూ వ్యాపిస్తూ .... ఇంకా ఏమీ పట్టనట్లు ఆ కాలచక్రం.

Friday, September 20, 2013

తిరిగిరాని పసితనం


నువ్వొస్తావని,
దయుంచి నన్ను కలుస్తావని
మార్గంలో ఎదురుచూస్తూ
ఒక మైలురాయి,
ఒక రావి చెట్టు, ఒక వేపచెట్టు
కాండాల పై చెక్కిన నా, నీ పేర్లు
అల్లుకుపోయి
పసితనం లోకి తిరిగి జారే దారి మూసేస్తూ
దట్టంగా ఎదిగి గడ్డి

జీవన దాహం!


నేస్తమా!
ఏ కట్టుబాట్ల తాళ్ళతోనూ కట్టెయ్యను నిన్ను.
ఏ హక్కూ నీ పై ఉందని అనుకోను.
ఏ సెంటిమెంట్ తోనూ చుట్టూ దడి కట్టలేను.

ప్రియతమా! ఒకనిజం చెప్పనా!
నాకు నీ స్నేహం, నీ ప్రేమ కావాలి,
నీ ఆత్మీయ, అనురాగ భావనల
ప్రవాహం లో కొట్టుకుపోవాలి నేను.

గుక్కెడు దాహం తీర్చుకుందుకు,
ఎంతో ఉన్నతము, ఎంతో స్వచ్చము అయిన
నీ ఆలోచనల ఆవేశంలోంచి జారే ఊట
ఆ మెరుపు భావనల నీటి దారలు తాగాలి.

ప్రియనేస్తమా! నీవంటే నాకు ఎంతో ఇష్టం!
ఎందుకో తెలియదు. నిన్ను ప్రేమిస్తున్నానా,
బంగారంలాంటి మెరుపేదో నీలో చూస్తున్నానా అని
నా దాహం నా ఆబ తీరుతుందని ఆశతో!

నీ ప్రేమ, నీ అభిమానం, బంగారం లాంటి
నీ మనోవికాసం .... ప్రతిగా పొందాలని కాదు.
నీ కంటిలో, ఆ నమ్మకం ఆ మెరుపు
ప్రకాశాన్ని దోచుకోవాలని కూడా కాదు.

కేవలం
నీ సాన్నిహిత్యం లో, నీ ప్రేమ నీడలో,
నీ స్నేహ ఆత్మీయ .... ప్రేమామృతం ను
నైవేద్యం లా పొందలేకపోతానా .... ఎప్పుడైనా అనే,

ఓ ఆరాధ్యభావమా!
నీ అనుబంధమే నా అస్తి, నా ఐశ్వర్యం ....
నీవే నా సూర్యోదయం, నా సూర్యాస్తమం ....
నీవే నాలో వెచ్చదనం నా వసంతం.

ఈ జీవన దాహం
నాలో ఘాడంగా పేరుకుపోయి
ఏదో అర్ధం కాని ప్రేమ .... ఎంత తాగినా తీరని ఆబ
ఆ భావ దాహం తీర్చుకునేందుకే జీవిస్తున్నానేమో అని.

Thursday, September 19, 2013

హతవిధీ!

పిల్లా! బలమైన కోరికను 
అదిమిపెట్టలేక పోతున్నా 
నిందల నీడ నీమీద పడొద్దని 
నీ వద్దకు వస్తున్నప్పుడు 
రాత్రిళ్ళప్పుడు, కలల రహదారి లో .... 
ఎవరైనా నన్ను చూసి

బెంగ!


జ్ఞాపకాలలో,
మది ఊహల్లో
అందని ద్రాక్షలు,
ఆ పెదవులపై ....

ఒక్కోసారి విచ్చుకుని,
స్వాగతిస్తూ,
ఒక్కోసారి మూసుకుపోయి
మానసిక ముభావం భావోద్వేగం ....

బలంగా లాక్కుని
ఘాడంగా గుండెలకు హత్తుకుని,
ఆ మెడమీదా
ఆ చెవుల క్రింద ముద్దులాడాలని ....

Wednesday, September 18, 2013

ఒక ఘనమైన ప్రేమఅప్పటికి ఎంతసేపయ్యిందో ....?
ఒంటరిగా నేను చీకట్లో
నా ఎదురుగా వచ్చి నిలబడి నీవు ....
నన్ను తట్టాకే వాస్తవం లోకి తిరిగి వొచ్చింది.
ఎంత అందంగా దోచుకున్నావో మనసు
నీకిదే నా వందనములు ప్రియా!

ఒత్తిడి తట్టుకోవాల్సిన
తొలి దశ లొ
ఒక తోడు లా వచ్చావు.
నీ ప్రేమను వ్యక్తం చేసి
నాకు జీవితం పై విశ్వాసం కలిగించావు.

నిజం చెప్పు ప్రియా!
ఘనమైన నీ ప్రేమకు నేను అర్హుడ్నా!
వృత్తిపరంగా నీవూ నేనూ వేరువేరు.
వేరు ప్రాంతం ఉద్యోగులం .... దూరంగానే ఉంటున్నాము.
ఒకవేళ కలిసి ఉండేందుకు సిద్దపడితే ....
ఇరువురము ఎన్నో కోల్పోవాల్సొస్తుంది.

నాకింకా గుర్తుంది.
నీవు నా కళ్ళలోకి తదేకంగా చూస్తూ అన్నావు ఆనాడు.
ఏ ఐశ్వర్యమూ, ఏ బంగారమూ
ఈ భూమి, చివరికి ఈ జీవితం .... కోల్పోవడానికైనా నేను సిద్దం అని,
నీవు చేతిలో చెయ్యేసి గట్టిగా పట్టుకుని
నా తోడుంటాననే .... నీ ప్రేమే నాకు ముఖ్యం అని.

నేనూ అంతే నేస్తం!
నాకు తెలిసిన ఒకే ఒక ఆనందం
నిన్ను పొంది కౌగిలిలో బంధించి ముద్దాడటంలోనే.
నీవు తోడుగా నా పక్కన ఉంటే ....
ఏ ఐశ్వర్యమూ పొందలేకపోయిన బాధ నాలో ఉండదు.
నీవేలేని నాడు నాలో ప్రేమ లేదు .... నా ప్రేమ నువ్వే కనుక.

ఓ ప్రేమదేవతా!
నిన్ను నా కోసమే ఆ బ్రహ్మ సృష్టించాడనుకుంటున్నా!!
నాకు సంపూర్ణత్వం కలిగించడం కోసమే నా జీవితంలోకి వచ్చావని 
నా హృదయానికి నీవు ఒక మెరెసే కవచానివి అని అనుకుంటున్నా!
పరిపూర్ణత్వం కోసం .... ఆ విధి కోసం మనం
ఎప్పటికీ ఒక్కరిమై ఈ ప్రేమను పోషించుకుందాం .... పరిమళించుకుందాం!

అవాంఛితం!

అజాగ్రత్త గా కదులుతున్నప్పుడు
హఠాత్తుగా ఎగిరి
విరుచుకుపడే పగ, ఈర్ష్యలు,
లోలో చెలరేగుతున్న
అత్యాశ లక్షణాలు,

ఫలితం,
పర్యవసానం ....  అశాంతి, అబద్రతాభావం
పెళుసు అద్దం అలంకారం
అహంకారం
కొని తెచ్చుకున్న అనర్ధం!
ఆత్మ అవలక్షణం మాత్రం కాదు.

నీ ముందే నేను


నేను నీ కలను, 
నీ కోరికను, 
నీ ఊహానుభూతిని. 
నీ ఆశను, 
నీ ప్రేమను 
నీ ప్రతి అవసరాన్నీ. 
లోతుగా, ఘాడంగా, 
పీల్చే నా ప్రతి శ్వాసలోనూ 
నువ్వూ నీ ప్రేమే! .... 
ఎంతో స్థిరంగా నమ్మకంగా, 

ఒక కొత్త ఆరంభానికి 
నాంధి పలుకుదామనుంది. 
ఒక అందమైన 
లోతైన అర్ధంతో బ్రతుకుదామనుంది 
నీతో కలిసి ఆకాశం అంత ఎత్తుగా 
కనిపిస్తూ ఉండాలని
ఆ సముద్ర జలాలలో స్నానించాలని ....
నీతో కలిసి వెచ్చని ఆ సైకతాలపై 
వెల్లికిలా పరుండిపోవాలని 
ఆ ఆకాశమే విరిగి 
మీద పడేవరకూ అలానే ఉండిపోవాలని

ఆ తారలు ఆ వెన్నెల 
ప్రకాశంగా వెలుగుతూ 
ఆ నీలి ఆకాశం 
అందం ఇనుమడించుతున్నప్పుడు 
ఆ దేవతల్ని 
ఒక కోరిక కోరాలనుంది. 
నేననే వెలుగును 
స్వర్గానికి చేర్చుకుని
నా దేవిని .....
నిన్ను మనసుతీరా 
ఒక్కసారి ఏడిపించమని 
అడగాలనుంది.
ఆ ఆనంద భాష్పాలు .... 
నిండుతనం నీలో చూడాలనుంది

ఒంటరితనం చుట్టుముట్టిన 
ఒంటరి గడియల్లో 
నిన్ను కాపాడే ఓ అదృశ్య శక్తి 
ఉందనే నమ్మకం నీలో కలిగించాలని 
కన్నీళ్ళు నిన్ను కబళించేప్పుడు 
నీ పక్కన నేనో హిమవన్నఘంలా ....
ఓ ప్రియా! 
నీవు చూడలేకపోతున్నావు కదూ!
ఒట్టేసి చెబుతున్నాను. 
ఎంతటి క్లిష్ట సమయాల్లోనూ ....
కనులు మూసుకోకు! 
నీముందే నేనుంటా అని మరిచిపోకు. 

దూరపుటాలోచన

నేను ఎంతో ఇష్టపడే ఎన్నో ఉన్నాయి
ఈ గ్రామం లో .... నీవు కూడా ఒకరివి అందులో
..........
నేను అందరికీ తెలుసు
ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ....
మాయోడు, బుట్టలోకి లాగాడేమో
అమాయకురాలు ముగ్గులో పడిందననుకుంటారని
నీవే ఆగమన్నావు.
అందుకే .... ముందు అందరికీ తెలిసేలా
నేను వెళ్ళిపోతున్నా!
మరొక ఋతువులో వచ్చేస్తా!
ఒక కొత్త కారణాన్ని తోడు పెట్టుకుని మరీ,
అది నిన్ను సంతృప్తి పరుస్తుందని
నాకు తెలుసు .... పిల్లా!
నా తోడుండటమే నీ మనోభీష్టం కదూ .... అందుకని!

ప్రేమాక్షర క్రమంలో


సాన్నిహిత్యం 
అంతర్గత వెసులుబాటు క్రమం లో  
కొన్ని స్వాగత మర్యాదలు 
కొన్ని విస్పోటనల చాయలు  
ఈ గాయాలు 
ఈ కోరికలు 
అరుదుగా కురిసే ఈ వడగళ్ళు 
ఊహించని ఈ ఉద్వేగభరిత క్షణాలు 
నదిలా ఏవో ప్రతిధ్వనులు 
ఎన్నో సుడిగుండాలు 
తెరిచి, విరిసి 
పెరిగి, పగులుతూ పరిమళిస్తూ ఈ జీవ పరిణామ క్రమం

Tuesday, September 17, 2013

పిచ్చి ప్రేమికుడు

అతని 
ప్రతి కవితలో వస్తువు, 
ప్రతి ఆలోచనలో సారమూ 
ఆమే!

ప్రతి కలలో 
కలగన్నది, 
కలలో ఎదురుచూసింది 
ఆమెనే!

అతనికి ఒక గీతం లేదు 
రాగం రాదు 
అతని ప్రపంచం కు .... 
కేంద్రబిందువు ఆమె.

అతనిలో 
సమర్పణాభావం 
అన్నీ త్యజించాలని 
ఆమె కోసం!

ఇచ్చాడు. ఇస్తున్నాడు. 
ఇస్తూనే ఉన్నాడు. 
ఆమె తీసుకుంది. 
కావాలనుకున్నదీ కోరుకున్నదీ అయితే. 

ఆ బంధం అంతటితో ముగిసింది. 
ఇప్పుడతను విరహం లో కొట్టుకుంటున్నాడు. 
అది ఒకవైపు ప్రేమ అందామా .... 
అతనిది పిచ్చి ప్రేమ అందామా!

Monday, September 16, 2013

ఆవేశం లో మనిషి


నా జ్ఞాపకల లో వొక గన్నేరు పువ్వు
నీ నవ్వు,
ఒక పసుపు రంగు బల్లెం మొన
.........
ఒక సాహసానివి నీవు
బొట్లు బొట్లుగా కారుతూ
అది .... రక్తం స్వేదం కలిసిన జీవనం  
అగ్ని శరీరానికి పట్టువస్త్రాలా  
నీవు
నివసిస్తుందేమో లక్క గృహం లో

నా నమ్మకం

శ్రద్ధ, 
ధర్మం, 
నిష్ఠ 
.... సాకులు!
కాచుకొని, 
కనిపెట్టుకొని 
ఎవరోవస్తారని 
అద్భుతాలు జరగొచ్చని .... 
ఎదురుచూపులు  
పరిణామాలు 
ప్రపంచం అంటే భయంతో!
కానీ 
నా వరకు నాకు 
ధర్మం, 
కర్మం 
.... ముందుకు కదలడం 
కష్టాన్నే నమ్మడం!
మార్పు 
శక్తి, 
సామర్ధ్యం పై 
అచంచల విశ్వాసం!
మనుషి లో 
చేతనత్వం, బ్రతుకు .... 
ఆసక్తి పెంచడం దైవత్వం 
అది కనికట్టు కాదు 
అద్భుతం కాదు.

ప్రేమ జ్వాలలు


విరహం, బాధై 
కన్నీరు ప్రవాహమై 
ఈ అస్తిత్వం
ఒక నది అయినప్పటికీ
ప్రేమ జ్వాలల ను
అణచిపెట్టడం సాధ్యం అనుకోకు.

Sunday, September 15, 2013

నిస్సహాయంగా ....

పువ్వు 
రెక్కలు విచ్చుకుని 
విరిసిన 
ఆ తియ్యని చిరునవ్వు 
నీ పలుకరింపు. 

నీ ఖైదు లో 
పక్కటెముకలు రోదిస్తూ 
కోరిక గొలుసుల నిర్బంధంలో
నీ ప్రేమ కు .... 
బందీనై నిస్సహాయంగా .... నేను.

అసంకల్పితం


నిత్యావసరాల సరుకుల కొనుగోలు .... అని 
సందులోకి తిరిగానో లేదో 
స్వాగతిస్తూ ఈదురు గాలి, వర్షం. 
గొడుగు తెరుచుకుని నడుస్తున్నాను.
రెండడుగుల దూరం లో
మున్సిపాలిటీ కి కనపడని బురద గుంట.
బాధ్యతల్ని మొయ్యలేక తప్పక మోస్తున్న వొక స్త్రీ!
ఆమెను నేను పక్కకు లాగాను. 
సరిగ్గా .... ఆ చౌక ధరల కొట్టు సమీపం లోనే!

అలా జీవించాలని

ఏ సారమూ తూగని
ఏ పుష్పమూ
వికసించని పరిమళం
నా ప్రేమ మనోభావన లా
ఒక పుప్పొడి రేణువు లా
ఒక శ్వాస లా
ఒక చిన్న అణువు లా
ఏ శ్వాసక్రియలో నో
ఉత్సాహం, ప్రాణం ఎదుగుదల లా
కొత్త రూపం సంతరించుకుని
రూపాంతరాలు చెంది 
ఒక శాశ్వత రూపు
లక్షణం
ప్రకృతి స్పర్శ పులకరింపు లా
నిలువెల్లా నిండిపోయి
హృదయం లో
ఆత్మ లో
అస్తిత్వం లో
పొంగిపొర్లిపోయి
ఆనందం తో
కాంతి తో
ప్రేమ తో
తిరిగి యివ్వగలిగేలా
నీకు
పరిపక్వత యొక్క సంపూర్ణత్వాన్ని
ఒక ప్రేమ విత్తనం
మనసులో
అలా నాజూకుగా నాటాలని

Saturday, September 14, 2013

విధేయత


ఒక వ్యక్తి
సద్భావం, అమాయికత్వం
విధేయత తో ఉండటం
బహు అరుదు.
ఇప్పుడు ఈ రోజుల్లో .... అసత్యం!
నమ్మలేని మనోవైకల్యమే
ఒకవేళ కనుగొనబడితే.

జబ్బు!


కోపం, శాంతి
ఒకటి ముక్కు పై
మరోటి గుండెలో ....
రెండూ శ్వాస సంబంధితాలే
అవి .... దీర్ఘ జీవనావసరం అయి,
మళ్ళీ మళ్ళీ తిరిగి రావడం ....
కేవలం, నొప్పిని ప్రేరేపించడమే!

ఎగరాలని ఆశ


నడి రేత్తిరి ఉలిక్కిపాటు. 
కలలోంచి గదిలోకి లాక్కొచ్చిన 
విధ్యుత్ కోత .... నిద్రా భంగం! 
అయినా ఆ వింతవింత అనుభూతులు 
ఏవో శబ్ద తరంగాల్లా సున్నితంగా తలలో ....
ప్రతిద్వనిస్తూ, గుసగుసల ఆలాపనలు అలానే.

నెరవేరని కోరికలా ఒక కల కన్నా! 
రెక్కలమర్చుచుకుని ఎగరగలనని .... గగనం లోకి 
ఈ మహానగరం మీదుగా, 
హుస్సేన్ సాగర, బిర్లా టెంపుల్,
ఎత్తైన ఆకాశహర్మ్యాల మీదుగా,
ఆ ఆలాపనను వింటూ .... ఆ అద్భుతాన్ని చేరాలని.

సరిగ్గా అప్పుడు రేండో ఆట ముగిసి 
సినిమా హాళ్ళు వదిలేసే వేళ, 
కరంట్ పోయి, చల్లని స్వేదం తడి .... అసహనం! 
కలలు చెదిరి మంచం దిగాను. 
కిటికీలు బార్లా తెరిచాను. 
ఆ అద్భుత ఆలాపన లోని మాధుర్యాన్నీ 
అర్ధం కాని భావాన్ని ఆస్వాదిస్తూ ఆలోచిస్తూ,

నిజంగా ఎగిరిపోగలిగితే ఎంత బాగుణ్ణు! 
నా కలల ఆనందం గగనం లోకి ఎగిరి,
ఆ ఆలాపనను వెన్నడుతూ 
హైటెక్ సిటీ, నిలువెత్తు గణేశుని విగ్రహాలు దాటి, 
ఎప్పుడో నిజాము చక్రవర్తులు కట్టిన 
చారిత్రాత్మక మసీదుల మీదుగా, 
ఆ ఆలాపనను ఆ అద్భుతాన్నీ అనుసరిస్తూ,

బలమైన నా కోరికల రెక్కల సాయంతో 
ఈ మహా నగరాన్ని మళ్ళీ మళ్ళీ చుట్టెయ్యాలని 
హైవేస్, క్రషర్స్ లేపుతున్న దుమ్ము దూళి మీదుగా 
నీ ఆలాపనను స్వాగగీతికలా మార్చుకుని 
ఆ అద్భుతాన్ని, ఆనందం అంచుల్ని చూడాలని
నా కోరిక, నా మనోభిలాష .... నేను ఎగరాలని.

అగ్ని, అస్థికలు


నీకు నిజంగా ఆసక్తిగా ఉంటే,
నీ కోసం నేను ....
అస్థికల్ని చదువుతాను.
అగ్నిని చూపించు లేదా
బూడిదను చూపించు .... చాలు.

నల్లని బొగ్గు బూడిదయిన
చారల భాషను
అర్ధం చేసుకుని
నాలుకలు చాచి ఎగసే
ఎర్రని అగ్ని జ్వాలల్ని చదువుతాను.

అంతా కాల మహిమే అయితే 
కాల జ్ఞానం ప్రకారం
అగ్ని ఎలా వస్తుంది బడబాగ్ని జ్వాలలు
సముద్రం వరకూ సముద్రం లోకి
ఎలా నడుస్తాయో అని వివరించుతాను

నీ కోసం నేను
అస్థికల మర్మం
జీవనది లో కలిసి సముద్రం లోకి
స్వర్గం చేరేదెలాగో చెబుతాను.
నిజం గా నీకు ఆసక్తిగా ఉంటే

Friday, September 13, 2013

ఒక ఏడువు, నిట్టూర్పు


ఆమె, అతను
ఒకరి ఏడుపు .... మరొకరి నిట్టూర్పు
ఏడువు, నిట్టూర్పు, చిన్న విషయాలు కావు
మనిషి మనిషి సంబంధాల విశ్చిన్న శక్తులు
.....
ఆమైనా, అతనైనా
మరణించేందుకైనా సిద్దం
వాటి పరిమాణం కొలమానం గా!

ఒక తియ్యని బాధ


అకస్మాత్తు నిర్ణయం అది .... అన్నీ సర్దుకున్నావు. 
క్షణాల దూరంలో గడప దాటావు. నేనెంత విచ్ఛిన్నం అయ్యానో తెలుసా! 
అన్నీ నావే, మనవే అనుకున్న ఆలోచనల అంతస్తులమీంచి 
ఏదీ నాది కాదేమో అనే అదః పాతాళానికి జారిపోయాను. 
నాకు నీ అవసరం ఇంత అని ముందెన్నడూ అనుకోలేదు నేను.

కలిసి జీవిస్తున్నందుకైనా అర్ధం చేసుకుంటావనుకున్నా! 
నీవే తొందరపడి నిర్ణయించుకుంటావనుకోలేదు. 
నాకే కాదు నీకూ తెలుసు నీవే అన్నావు ఆనాడు అలా ....
నేను క్రమశిక్షణ లేక నరకం లో నరకప్రాయంగా జీవిస్తున్నానని, 
దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని .... అది నీవల్లే అవుతుందని.

నా ప్రతి లక్షణమూ, నా ఉద్రేక ఉద్వేగాలు నీకు తెలుసని, 
నాకు నీమీద అపరిమిత నమ్మకం! నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుందని ....
నేనెందుకు నిన్ను నానుంచి దూరంగా జారుకోనిచ్చాను అని. 
నీ ఆలోచనలు తోడు లేకుండా నేను ఒక రోజైనా ఉండలేనని తెలిసీ 
క్షణమైనా బ్రతకలేనని కొన్నాళ్ళ క్రితమే అనుభవం అయ్యిందని!

నిశ్శబ్దంగా రోదిస్తూ నాలోనే లోలోపల ఆశను కోల్పోయాను .... నేను 
ఆశను కోల్పోయాను నేను .... మళ్ళీ నీ ప్రేమ ఊపిరి ని ఎప్పటికీ తిరిగి పొందలేనని 
ఈ నొప్పికి ఈ బాధ కు ఈ వేదనకు కారణం నీవు పక్కన లేవనేనని 
ఈ జివితమంతా ఇకపై ప్రశ్నలు ఎదురుదెబ్బల క్షతాల మయమే అని 
నమ్మకాన్ని కోల్పోయాను. ఇకపై నాకు ఒంటరితనమే గతి అని

నిజం చెలీ! నన్నిప్పుడు నీవు చూడగలిగుంటే ఎంత బాగుంటుందో అని 
నీకూ అర్ధం అవుతుంది .... ఎడబాటు జ్వరం నన్నెంతగా ఉడికిస్తుందో గమనిస్తావు
ఎంత కష్టమో .... ఈ మనసేమి కోరుకుంటుందో, ఎంత ఆకాంక్షో .... నీవంటే అని
పురుషుడి మనోవ్యధ ప్రకృతి ని కోల్పోయి న నైరాశ్యం .... నా నుదుటంతా పిచ్చిగీతలే
ఆశ్చర్యం అనిపించట్లేదిప్పుడు .... ప్రేమ, సాహచర్యానికీ ఇంత సొగసుందా అని.

ఎన్నో నిద్రలేని రాత్రుల పిదప నమ్మకం కోల్పోయాక ఇప్పుడు అనిపిస్తుంది. 
మళ్ళీ ఈ ఆశలు కోరికలు దాచుకునేందుకు ఒక కొత్త తావి దొరుకుతుందా అని. 
వైరస్ లాంటి ఈ ఆలోచన ఎలా వచ్చింది .... అయ్యో! ఎవ్వరనా నాకు నచ్చ చెప్పరా! 
అనాలోచిత కోపం, పౌరుషం .... ఏ సమశ్యనూ పరిష్కరించ లేదని .... 
ఈ జీవితం లో అది అసాధ్యం అని .... నీ ఆలోచనల్ని దాటి నేను ముందుకు జరగలేనని.

మూడొంతుల జీవితం ముందుంది .... ఎప్పుడైనా నీవు నాకు తిరిగి కనిపిస్తే చాలు.  
ఏ క్షణంలో నైనా .... ఈ బాధ, ఈ విరహం, ఈ నొప్పిని .... పోగొట్టుకునేందుకు 
నీ దాకా వస్తాను. ఏ మాటిస్తానికైనా .... ఏమి చేస్తానికైనా సిద్దంగా ఉన్నాను. 
నాకు దూరంగా జరిగిపోనని .... నా మనసు మాట వింటానని మాటివ్వు చాలు! 
నీకే తెలుస్తుంది .... నీవు కూడా నా అంత ఘాడంగా నన్ను ప్రేమిస్తున్నావని .... చెలీ!

Thursday, September 12, 2013

ఆశ్వాసన!

వర్షం తుంపర 
రాలుతున్న వర్షం బిందువులు  
రా రమ్మని 
వృక్షం కొమ్మలు ఆకుల స్వాగతం పలుకులు 
..... రాలి
ఆకు మీద వేళ్ళాడుతూ వర్షం, బొట్లు 
ఆశగా, 
ఎదురు చూస్తూ 
వాటిలో కొన్నింటికే అదృష్టం 
ఆశ్వాసించబడి 

Tuesday, September 10, 2013

పొదరొంట్లో ....


హృదయం 
తలుపులు తెరుచుకుని 
వాకిట్లో 
స్వాగతాక్షరాలు వెదజల్లుతూ, 
పొదరింట్లో .... ఓ ప్రేమజంట
ఆమె, అతను. 
నిశ్శబ్దము అక్కడ 
సున్నిత పదబంధాలు, ముద్దులు 
మృదు మాటల వాగ్దానాలు.
పుష్పరాగమేదో 
గాలిపై తేలుతూ వచ్చి 
పరిమళాల్ని పుక్కిలించినట్లు, 
గుసగుసలు ఆ పొదలమధ్య .
రెండు మనసులు వొకటైన 
సమాగమనం సాక్ష్యం గా,
ఇరు శిరస్సులు కలిసిన 
మినిట్స్ రాస్తూ, 
ఆ కొమ్మలు ఆ ఆకులు.
భూమి సూర్యుడి చుట్టూ లా 
ఆ ఇరువురి మదిలో 
ఆలోచనల పరిభ్రమణ. 
రెండు గుండెలూ 
కొట్టుకుంటున్న శబ్దం వినిపిస్తూ,
తలలు రెండూ ఒక్కటై 
ప్రేమ మాత్రమే ఆ ఇద్దరి మధ్య. 
పొదరింట్లో శూన్యావస్థ అది. 
కాలచక్రం మాత్రం కదులుతూనే ఉంది.

http://vemulachandra.blogspot.in/2013/09/blog-post_4591.html

ఈ రోజుకు ఇంతే!


మిగిలుంది ఒక చిరునవ్వు, 
.... నేస్తమా! 
తీసుకో!
నాకీరోజిక అవసరం లేదు. 
....
విశ్రమించే వేళయ్యింది. 

అదృష్ట విషాదం


జీవితం.
....
రోజూ
ఒక సాహసకృత్యం.
చివరికి ఒక విషాదపు మలుపు 
మరణం.

Monday, September 9, 2013

చలిమంట


ఉజ్వల ప్రకాశం తో,
చల్లదనం పూస్తూ 
నెమ్మదిగా, 
సుతారంగా ....
గుట్టుగా, 
పరుచుకుంటూ, 
నా ఆత్మ ప్రమోదం చేకూరుస్తూ 
గోరువెచ్చని వెన్నెల .... నీవు.

ఒట్టేసి చెప్పుకుందాం!


నా హృదయం నీవద్దుంది. 
నీ హృదయం నా వద్దుంది. 
నా కలలో రాణివి నీవు 
నీ కలలో మహరాజును నేను!  
కలిసి ఉందామని 
మాట అనుకుందాం! 
కలకాలం 
మాట మీదే నిలబడదాము అని,
నాతో చెప్పు! 
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని, 
నా జీవితానికి నీవు అవసరం అని"
మాట మాత్రమే చాలదు. 
ఒట్టెయ్యి! 
నాతోనే కలిసుంటానని, 
కాలాంతం వరకూ.
మాటియ్యి! 
ఎప్పటికీ కలిసుంటా అని, 
ఒకటయ్యుందాం అని. 
నాకు నీవు కావాలి! 
నా జీవనావసరం నీవు.
అదే మాట చెబుతాను 
ఒట్టేసి నేనూ! 
కలిసి ప్రయాణం చేస్తున్నాము. 
కలిసి ప్రమాణమూ చేద్దాము. 
మనం .... ఒకరికొకరం 
ప్రేమ బంధమే అయినా 
ఒకరి అవసరాలను 
ఒకరం గుర్తుంచుకుందాం!

Sunday, September 8, 2013

అనిపించింది


చూపుల్తోనే
ఆకట్టుకునే రూపం!
నిన్ను తొలిసారి చూసి
అనిపించింది.
దేవతా కన్యవేమో అని,
నీ కళ్ళలో ఉదయిస్తున్న
ఆ ప్రకాశం
సూర్యోదయమేమో అని,
చీకటికి, శూన్యాకాశానికి
చంద్రుడ్ని,
ఆ తారల్ని వరంగా ఇచ్చి ....
నా కోసం
దివి నుంచి దిగి వచ్చిన
నా ప్రేయసివి నీవు అని,

లేత స్పర్శతో
కమిలిపోయే ....
పాలరాయి శిల్పం లా
నిన్ను తొలిసారి ....
తమకంతో ముద్దాడినప్పుడు
అనిపించింది.
నీ గుండె దడ,
నా గుండె వేగంతో
పోటీపడుతుందని,
వేటగాడి చేతికి చిక్కిన
పక్షికూనలా నీవు
అప్పుడు ....
నీలో కంపనం
నా ఇష్టమే నీ ఇష్టమని
వొదిగుండక తప్పక
వొదిగున్నట్లు

నీకు నేను
అర్ధం అయ్యి,
నేన్నిన్నర్ధం చేసుకున్నాక ....
ఏకాబిప్రాయం,
ఒక్కటవ్వడము న్యాయం
అనిపించింది.
నీ హృదయం
నాకెంతో చేరువలో
ఉన్నట్లు,
మన ఆనందం సంతోషం
పరిసరాల్ని ....
పరిమళాల్తో నింపుతున్నట్లు
మన ప్రేమ
కాలాంతంవరకు
అమరప్రేమై మిగులుతున్నట్లు
అనిపించింది.

Saturday, September 7, 2013

నేనూ నా నిశ్శబ్దం నీడలు


ఔనూ ఎవరన్నారు? 
చలికాలం లో నది నిచ్చలనమని, 
తుఫాను వేళల్లో మబ్బులు కదలవని, 
ఎవరన్నారు? మొరటోడికి ఏడుపు రాదని. 
ఒంటరికి ఒంటరితనం తోడుండదని, 

ఎవరూ అన్నట్లు వినలేదు నేను! 
మనిషికి విసుగే ఉండదని, 
ఒక్కసారి నా గుండెలోకి తొంగి చూడు. 
అక్కడ .... అంతా శూన్యమే,
మనసులో అక్కడ .... అంతా అయోమయమే, 

నేనన్నది నిజమే! 
నేను దూరంగా ఒంటరిగానే కూర్చునుంటానని,
నా మాటల్ని విపరీత అర్ధాలతో చూడకు 
దూరంగా వెళుతుంది .... నేను కాదు 
నా మనసు మాత్రమే 
కాసింత ఒంటరిసమయం కోసం

అన్ని విషయాల్ని ఒకే చోటుకు చేర్చుకుని, 
ఒక పద్దతిగా సర్దుకుని, 
నా ఒంటరి తనం లోకంలోకి అలా ....
నేను దూరంగా పోవడం ఎంతో అవసరం. 
నీకు నేనెందుకు భయపడుతున్నానో తెలిస్తే తట్టుకోలేవు. 
నేను పడుతున్న పీడ బాధ అవగాహన ఎవరికీ అర్ధం కావు.

దూరంగా కూర్చున్నాను. వెళ్ళిపోతున్నాను. 
దూరంగానే ఉంటాను. కూర్చుంటాను. కుదేలుపడతాను. 
నాకే ఎందుకు ఈ బౌతిక మానసిక భారం 
నేనెవ్వరి ప్రేమకూ అర్హుడ్ని కానట్లు, 
అందుకే వెళుతున్నాను దూరంగా 
నా భావనలతో నేను, ఒంటరిగా .... నిశ్శబ్దంలోకి,

కలలు


ప్రతి ఒక్కరి జీవితం లో
ప్రతిఒక్కరిలోనూ తీరని ఒక కోరిక
కలలా పరిణమించి ....
కలలు కనను అని చెప్పలేము.
జీవితం, మానుష ధర్మము కాదు నాది అని,

మనం మనలోకి చూసుకుని
అంతర్మదనం చేసుకుంటే,
ఎన్నో బలహీనతలు, ఎన్నో కోరికలు 
అవన్నీ మన కలలు
మనవద్ద లేనిది ఉండాలనే కోరికలు .... అవి.

ఒకవేళ 
కోరుకున్నఅన్ని అందుబాటులో ఉంటే
కనడానికి కలలు .... ఉండవు
ఉండవు .... జీవితాన్ని గురించిన ఆలోచనలు
ప్రేమ, అందమైన జీవన సరళిపై ఆకాంక్షలు.

అందరమూ
నీవూ, నేనూ కూడా కలలు కంటాము.
మనతో పాటే మన కలలు
మనము మాత్రమే మార్చగలిగిన
మన వాస్తవ జీవన లక్ష్యాలు.

Thursday, September 5, 2013

నీవే నా ఆలోచన, సువాసన


నీ సాన్నిహిత్యం ఒక సూది ఔషధం లా
నా మలిన రక్తనాళాల్లో ప్రేమ భావాన్ని నింపుతుంది.
ఆ ఉపశమనం అనుభూతికి దూరమౌతాను. నీవు సమీపం లో లేనప్పుడు,
నీకూ తెలుసు! ఆ అనుభూతి కోసమే నేను ఎదురుచూస్తుందని,
నీకు కారణాలు కావాలి నన్ను చేరడానికి.
నాకు నీవు నన్నుచేరడం కావాలి.

నాది ఒక ఆకాంక్ష!
నా జీవితం లో పల్లవించి పరిమళించాలనుకుంటున్న
ఆనందం, నా కలల ప్రేమ సువాసన .... నీవే కావాలనుకోవడం.

నీ స్పర్శ .... గుండెల్ని సలుపుతున్న నొప్పిని దూరంచేస్తుంది.
అప్పుడప్పుడూ నేను .... ఏవో మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వ్యక్తిలా
పరుగులు తీస్తూ ఉంటాను .... మెదడు లేని పిచ్చోడిలా,
నీ గురించిన ఆలోచనల చుట్టూరా పరిభ్రమిస్తూ ఉంటాను,
నిజం! నాలో లోలో బలంగా పాతుకుపోయిన భావన మాత్రం ....
నీవే ఒక ఉపశమనమని .... నీ సాంగత్యం కోరుకునే బానిసను లా .... నేనని

Wednesday, September 4, 2013

అసమర్ధుడి భావనలు


నేను, ఎన్నో కోల్పోయా .... 
పసితనం లో ఆడుకునే బొమ్మల్ని, అమ్మ ముద్దుల్నీ, 
బామ్మ ముచ్చట్లనీ, పేదరాసి పెద్దమ్మ కథల్నీ, 
అమ్మ చేతి గోరు వెన్నెల ముద్దల్నీ, 
యౌవ్వనపు ఆవేశాన్నీ, 
ప్రేమను, స్నేహాన్నీ నేను ఎన్నో కోల్పోయాను.

ఆత్రుతే నాలో ఎప్పుడూ 
ఏ మేఘ సందేశమో 
ఏ ఉత్తరాల సమాచారమో 
ఏ ఈ మెయిలో 
ఏ బ్లాక్ బెర్రీ ఎస్ ఎం ఎస్సో 
రావాలని మనసు తహతహ 

ఆకాశం బ్రద్దలవ్వాలని 
ఉరుముల పిడిగులు వర్షమై కురవాలని 
సముద్రజలచరాల మనస్తత్వం నాలో పెంపొందాలని 
ఎదురుచూస్తూ ఉంటాను. 
జరగవని తెలిసీ నా ఆశల గమ్యం వైపు.

ఒక అద్దం పడి ముక్కలై 
నేను లక్షల రూపాల్లో కనిపించాలని 
నా ఆలోచనలు శాసనాలు కావాలని 
అనుకుంటాను. 
కానీ అనుభవానికి రాలేదు ఏనాడూ.

అనుమానాస్పదమే అన్నీ 
నడవలేను. 
నిచ్చెన ఎక్కలేను 
అన్నీ కోల్పోయానని 
మరిక ఏమీ కోల్పోలేననే భావన.

ఏదీ గ్రహించి కాదు.
ఎన్నో కోల్పోవడం వల్ల.
వస్తువుల్ని కోల్పోయి, జీవితం లో ఓడిపోయి ....
నేను ప్రకృతితో సమాజం తో 
సంబంధం కోల్పోతున్నానేమో అనే

ప్రతిదీ భూతద్దంలో చూస్తున్నట్లు 
అన్నీ అనుచితంగా, 
పెద్దగా, వికృతంగా 
విశ్పోటనల్లా కనిపిస్తూ .... 
ఎన్నో కోల్పోయి ఏమీ కోల్పోలేని స్థితి నాది.

Tuesday, September 3, 2013

అది షరతుల్లేని ప్రేమ


ఏ పదాలు, మాటల్లో వర్ణించ లేని
భౌతిక స్వాధీనత అవసరం లేని
అనిర్వచనం అది

ఒకే చోట కలిసి ఉంటూ
ఒకే ఆశతో ఒక్కరిలా
ఒకే కలను కలిసి కంటూ

వ్యక్తులు ఇద్దరయినా
మనసు ఒక్కటే అయి
ఒకే ఆత్మ ఒకే గుండె కావడం

చేతిలో చెయ్యేసుకుని
మరణం, శాశ్వతత్వం అంచు వరకూ
ఎప్పటికీ నమ్ముకుని జీవించడం

అదే .... ప్రేమ!

Monday, September 2, 2013

నన్ను ప్రేమించొద్దు .... అతిగా ప్రియా!


ఓ ప్రియా! నీ మనసంతా నేనే 
అన్నంత అతిగా నన్ను ప్రేమించమాకు.
దురదృష్ట జాతకుడ్ని! 
నన్నూ, జీవితాన్నీ .... కోల్పోయినవాడ్ని!
ఇచ్చేందుకు నా వద్ద ఏమీ లేవు. ఆ కన్నీళ్ళు తప్ప, 
నా కోల్పోయిన, ఆవేదన గతం 
ఎన్నో సంవత్సరాల యోజనాల అశ్రువులు తప్ప, 

నీపై నాకు ద్వేషం లేదు 
నా మనసెరిగిన ఒక్కగానొక్క చెలివి నీవి.
నేస్తమా! నీవంటే నాకు ఎంతో ఇష్టం  
నేను జీవిస్తుందే నీ కోసం అన్నంత 
అడుక్కునేవాడికి .... ఆశించే హక్కు ఉండదు.
ఖజానా ఖాళీ అయినా ఓడిపోయినట్లుకాదు.
నేను, ఒక రాయిని, ఒక నిశ్శబ్దాన్ని .... ఒక జ్ఞానిని. 
మాటకారిని కాను. శబ్ద గాంభీర్యాన్ని కాను. 
నన్నే కోల్పోయిన బికారిని, అన్నీ కోల్పోయి  
నీకు ఏమి ఇవ్వగలనో తెలియని అభాగ్యుడ్ని!?

అడిగి చూడు నీ కోసం ఒక్కసారి .... "చనిపో!" అని 
"ఒక చిరునవ్వు నవ్వవూ!" అన్నట్లుంటుంది నాకు. 
ప్రియా! విఫలమయ్యే ఆశల నమ్మకం .... కల్పించకు! 
నా హృదయ భావనల తో ఆడుకోకు! 
నీ ప్రేమ పరిమళం 
పరుచుకునే దూళినై ఉండాలనుకుంటున్నా! 
ఏడ్చి ఏడ్చి ఎండిన కళ్ళ మెరుపు వెనుక 
దాగిన ప్రేమ .... నీ సుఖమే కోరుకుంటుందని తెలుసుకో, 
ప్రియా! నీవు లేని లోకంలో నాకు జీవించాలని లేదు.

Sunday, September 1, 2013

విరహ వేధన

చంద్రశేఖర్ వేములపల్లి || విరహ వేధన ||

దిండు లో తలదూర్చిన వొక గుసగుస లా, 
శీతలాన్ని మైదానం లో వొదిలిన ఒంటరితనం 
పరుచుకుంటున్న ఉదయం 
మంచం పైనా మంచంచుట్టూ అంతా నిశ్శబ్దం లా 

నీ ఒక్క స్పర్శ నాలో మత్తును రగిలించి 
మూసుకున్న కనుల కలల్లోకి జారిపోతాను నేను 
అది ప్రియ భావన, ప్రేమే అవుతుంది. 
ఆ గడిచిన క్షణం పెల్లుబికిన ప్రణయానుభూతే అవుతుంది.

కానీ ఆ అనుభూతి క్షణాలకు నేను దూరమై 
ఆ ప్రియ, ప్రేమ భావనలు అలాగే మిగిలిపోయాయి. 
నీ స్పర్శ మాత్రం కాలం కదిలిపోయినా మనం ఒకరికొకరం తోడు 
అన్న భావనను కలిగిస్తుంది నీ హృదయం పందిరి నీడ లో

నిజం గా నా లోపలా, బయటా నేనో నీటి బొట్టును 
ఒక కన్నీటి చుక్కను .... నీ అరచేతి లో, 
నాకీ రోజు అన్నీ దుశ్శకునాలే! కలలు రావడం లేదు. 
నాది ప్రేమే అయినా తిరిగి పొందలేని దౌర్భాగ్యం అది.

ఒంటరినై ప్రేమ, నీవూ లేని నీరు లేని నదినై 
కదిలే వొయారాల అందాన్ని చూసే అదృష్టం కోల్పోయి 
సాయంత్రపు చిరు గాలి సుతారంగా స్పర్శించడాన్ని కోల్పోయి .... 
నా మనోభావన ఒక విరహ వేధనే అయ్యుంటుంది.

2013, సెప్టెంబర్ 01, ఆదివారం 7.40 గంటలు.