Wednesday, September 4, 2013

అసమర్ధుడి భావనలు


నేను, ఎన్నో కోల్పోయా .... 
పసితనం లో ఆడుకునే బొమ్మల్ని, అమ్మ ముద్దుల్నీ, 
బామ్మ ముచ్చట్లనీ, పేదరాసి పెద్దమ్మ కథల్నీ, 
అమ్మ చేతి గోరు వెన్నెల ముద్దల్నీ, 
యౌవ్వనపు ఆవేశాన్నీ, 
ప్రేమను, స్నేహాన్నీ నేను ఎన్నో కోల్పోయాను.

ఆత్రుతే నాలో ఎప్పుడూ 
ఏ మేఘ సందేశమో 
ఏ ఉత్తరాల సమాచారమో 
ఏ ఈ మెయిలో 
ఏ బ్లాక్ బెర్రీ ఎస్ ఎం ఎస్సో 
రావాలని మనసు తహతహ 

ఆకాశం బ్రద్దలవ్వాలని 
ఉరుముల పిడిగులు వర్షమై కురవాలని 
సముద్రజలచరాల మనస్తత్వం నాలో పెంపొందాలని 
ఎదురుచూస్తూ ఉంటాను. 
జరగవని తెలిసీ నా ఆశల గమ్యం వైపు.

ఒక అద్దం పడి ముక్కలై 
నేను లక్షల రూపాల్లో కనిపించాలని 
నా ఆలోచనలు శాసనాలు కావాలని 
అనుకుంటాను. 
కానీ అనుభవానికి రాలేదు ఏనాడూ.

అనుమానాస్పదమే అన్నీ 
నడవలేను. 
నిచ్చెన ఎక్కలేను 
అన్నీ కోల్పోయానని 
మరిక ఏమీ కోల్పోలేననే భావన.

ఏదీ గ్రహించి కాదు.
ఎన్నో కోల్పోవడం వల్ల.
వస్తువుల్ని కోల్పోయి, జీవితం లో ఓడిపోయి ....
నేను ప్రకృతితో సమాజం తో 
సంబంధం కోల్పోతున్నానేమో అనే

ప్రతిదీ భూతద్దంలో చూస్తున్నట్లు 
అన్నీ అనుచితంగా, 
పెద్దగా, వికృతంగా 
విశ్పోటనల్లా కనిపిస్తూ .... 
ఎన్నో కోల్పోయి ఏమీ కోల్పోలేని స్థితి నాది.

No comments:

Post a Comment