Thursday, October 24, 2019

మాటపెదవి దాటాక 
అది
విల్లు విడిచిన శరం
అతి శక్తివంతమైన
ప్రాకృతిక
ఆవేశం శాపం   

ఒక విధ్వంసం సృష్టి  
విధ్వంసం పోషణ
నీరు లా ప్రవహించి
నిప్పు లా దహించి 
ఎముకలా ఊతనిస్తుంది.  
పువ్వులా మృదు
సున్నితత్వాన్నీ ఇస్తూ

మండించి
శుద్ధీ చేస్తుంది
మరిచిపొయేలా చేసి
చీకాకూ
కలిగిస్తుంది

ఒకవైపు
నిర్వీర్యుడ్ని చేసి
అనాశ్రయ భావనను
కలిగిస్తూ 
మరోవైపు
మంత్రముగ్ధుడ్ని చేసి
ఆశాజీవుడ్నిగానూ 
మారు
స్తూ

Monday, October 21, 2019

విధ్వంసనము


శత్రుత్వాలు, యుద్ధాలే కాదు
మాయని గాయాలు
ఆరని మంటలకు కారణం
ద్వంద్వం, కలహం, అసూయ
మోస, కపట కృత్యపు
కముకుదెబ్బలు .... అంటురోగాల్లా
సమాజాన్ని పీడిస్తున్నంత కాలం 


స్వస్థచిత్తతకోసం స్వయంలో జరిగే
మానసిక పెనుగులాటలో
కంది, కమిలి మిగిలిపోతాయి.
మనస్సు మరుగున తిష్టవేసిన
ఒకనాటి జ్ఞాపకాల్లోని
అన్యాయ అధర్మ అవశేషాలు 


యుద్ధమే అక్కర్లేదు.
కుటిలత్వము, అధర్మ అహంకార
చేష్టల ప్రభావం .... చాలు
విషపరిణామమై
జీవత్శవ బంధాలు ఆత్మీయతలు
విధ్వంసకరమయ్యేందుకు

చివరికినీవే కనుక వెళ్ళిపోతే
నిజంగా
ఆకశ్మికంగా
ఏ అనంతంలోకో
నాదంటూ నాకు
ఏమీ మిగిలి ఉండదు

కేవలం

నేను ధరించని
నీవు బహూకరించిన గడియారం తప్ప
నేను చదవని
నీవు మిగిల్చిన
మన జీవితం పుస్తకం (నీ డైరీ) తప్ప
ముక్కలై పగిలి
చికిత్సకు ఏమాత్రం
అవకాశం లేని
ఈ హృదయం తప్ప

అలా అని నేను
వెంటనే నేల రాలిపోను
రాలిపొవాలనుకోను
కానీ
లేచి నిలబడనూలేను

మసకేసిపొతా.
మెల్లమెల్లగా
ఏదీ పొందని ఏదీ అందని
నిర్లిప్త అశక్తుడ్నై, చివరికి

Friday, June 14, 2019

అలసత్వం
ఎంత చిట్లించుకుని చూసినా 
కళ్ళముందు
అస్పష్ట అంధకారమే 
నిక్కబొడుచుకుని
విందామని చూసినా
స్తబ్ధ అస్పష్టతే
మోసపోయి
తిరస్కరించబడి
విశ్వాస ఘాతుక ప్రవాహంలో
కొట్టుకుపోతున్నప్పటి 
భీతావహత ఆవహించినట్లు
ఎంత బాధాకరమో
ఈ నొప్పిని భరించడం
దురదృష్టం అనుకోనా
కేవలం విశ్వసనీయత
లోపించడం వల్లే అనుకోనా
ఒకవేళ
కన్నీళ్ళే మాట్లాడగలిగితే ....
గుండె కవాటాల్ని పగులగొట్టి 
నొప్పిని స్థానభ్రంశము చెయ్యగలనేమో  
గుండె శిల కాకపొతే
మరమ్మత్తు చేసి!?
సాధ్యం కాదని తెలిసీ 
నమ్మకం నశించిన చోట
నమ్మకం పొందె యోగ్యత లేని చోట
పెనం మీద మాడిన వంటకు
మాననీయతను కలిగించడం లాంటి
నిరర్ధక పరిచర్యలు

Monday, June 10, 2019

కన్నీటి చార

ఊటలా ....
ఎద ఉబికిన
కన్నీటి
అసంపూర్ణతానుభూతి
నేను

ఎండిన కనురెప్పలు
అసహనత కురిసి 
వేదన కరిచి  
ఎద గుచ్చిన
కోపోధృతి,
అస్తిత్వం మసకేసిన   
పెనుగులాట
భావోద్వేగం .... నాలో

అయినా

నిన్ను చూసేందుకు
నీకోసమే ఎదురుచూస్తూ
చిరునవ్వొకటి
విచ్చుకునే ఉంది

Saturday, June 8, 2019

సిరాతో ....
బొట్లు బొట్లుగా
ఊటలా
వేళ్ళలోంచి
సిరా ....

నా సిరలు
దమనులు
సిరామయం
అన్నట్లు 

ఎన్ని
చిరు కవితలో
కథలో 
కన్నీటి బొట్లుగా 

జారి
పారి 
ఈ మెదడు
కాల్వనుంచి

Monday, May 13, 2019

తెలియని లోకం
దట్టంగా అలుముకున్న
అయోమయం
చీకటి రాత్రి 
అలసిన శరీరం
లొంగదీసుకోబడి 
బలవంతపు నిద్దురకు
లొంగి
అబలుడ్నై
గొణుక్కుంటూ
నన్నూ,
నా ఆలోచనల ప్రగాఢతను
దాచి ఉంచాల్సిన
అన్నీ బట్టబయల్చేస్తూ

Friday, April 12, 2019

చీకటి ముసుగునిశ్చల నిశ్శబ్ద క్షణాల్లో 
వినగలుగుతున్నాను ....
నీ మాటల్ని 
అవి ఒలికి, ఇంకి 
నా ఎముకల్లోకి
ఆత్మ సంబంధిత 
ఆవిర్లలొంచి చూడగలుగుతూ 
నీ ముఖం, 
నీ పెదవులు, 
ఆ దివ్యమైన ముద్దు ....
నా నుదురు, 
గుండెలు,
పాదాలను అద్ది ....
నీవు నన్ను 
నీ రెక్కల దివ్యత పై 
గగనతలంలోకి 
తీసుకెళ్ళుతూ
అందమైన నీ కళ్ళముందు 
మంచు మూసిన 
మనోమార్గం లా 
నేను ....
మౌనంగా 
నీ రెండు చేతులు 
నన్ను కనుగొంటే బాగుణ్ణని

Thursday, February 21, 2019

హృచ్ఛయ రాగంతియ్యని బాధ
తీరని దాహం
అభౌతిక స్పందన
మూలంగా
అల్లిన రచన 
నిజం
ఎద రాగమైతే
ఎంత కష్టమో
సంక్షిప్తీకరించడం
శీఘ్ర భావోద్వేగాల 
అక్షర,
పదరూపీకరణ 
ఏం రాసినా ....
సరి కాదనిపిస్తూ 
మరోలా రాయాలనిపించే
ఆ హృదయారాటమే ....
ప్రేమ
ప్రేమ, అనేక
ప్రతీక్ష, నిరీక్షణల
నిరంతర
అగమ్య ఆవేదన
కురచ కొమ్మలు
ఒకదానితో ఒకటి 
అందంగా
అంటు కట్టుకుని
అరణ్యంలా ఎదిగే
పరిణామక్రమం ....
విషమ పరిస్థితుల్ని
ఎన్నింటినో తట్టుకుని
ఎదురీది కాలానికి

Tuesday, February 19, 2019

అనంతభావన
ప్రేమకు తెలుసు
ప్రేమ, ప్రేమ ప్రేమను
గుర్తిస్తుంది.
పరిసరాల్లో
అణువు అణువులో
ఎక్కడ ఎలా ఉన్నా

ప్రేమ ప్రేమను
చూస్తుంది.
ఒక అద్దంలో
ప్రతిబింబం
రూపం చూసినట్లు

చూడటానికి కళ్ళు
అవసరం లేకపోయినా
గుడ్డిది కాదు
ప్రేమ ....
బహు విస్తృతం అది
సర్వత్రా విస్తరించి

అది ఒక వరద 
ఒక ఉప్పెన ....
తాకుతుంది
దాని ప్రతిచర్యా
సఫలతకై
రక్తాశృవులు చింది 

ఏ రంగు లేని
ఒక నీడ అని అనలేని
ఏ రూపమూ
ప్రత్యామ్నాయమూ కాని
చైతన్యం .... అది
ప్రతి శ్వాసద్వారా
ఆత్మను స్పర్శిస్తూ 

ప్రేమ కూడా
ప్రేమను ప్రేమిస్తుంది. 
అది ఒక అనంత అపార
మహోన్నత
అద్వితీయ
శాశ్వతత్వం శక్తి

అందుకే
మమైకం అవ్వాలి 
మనం .... ప్రేమతో ప్రేమలో
దేన్నైనా చూడగలిగిన
చెయ్యగలిగిన
అనంతఅస్తిత్వ పవిత్ర
ప్రేమభావనలో  


Thursday, January 17, 2019

ఆవేశం ముగ్గుఅతి సులభమే రాయడం
కవిత్వం
ద్యాసగా కళ్ళు మూసుకుని
అసరళీకృతమైనా సరే అని
రాస్తే

రాయాలి
బాధ ఆవేశాలను చూసి
అనుభూతి చెంది

నెమరువేసుకోవడాలు
స్వయం జ్ఞాపకాలు జ్ఞప్తి తెచ్చుకుని
ప్రతి రచనలోనూ తన్ను తాను
ప్రతిష్టించుకోవడాలు
నిఘంటుశోధనలు
నానార్థ పదాలకై పరితపనలు
లేకుండా

వ్యాకరణం భావ స్వేచ్చను ....
ఆవేశాన్ని కట్టడి చేసి 
బాధ భావనానుభూతి
ప్రవహించదు
ముందుకు కదలదు
ఎదగదు
అక్కడే కూర్చుండిపోయి
కేవలం అందంగా
ఆంతర్యం తత్వరహితంగా మిగిలి
మరిచిపోయే
ఒక గతమైపోతుందే కాని 

అందుకే
ఒక్కసారి చదివి
వెంటనే మర్చిపోయే
ఎన్నో అసంఖ్యాక కాగితాలలో
కాగితంలా మిగిలిపోని
కథలు, కవితలు సాహిత్యం
రాయాలని ఉంటే ....
కేవలం కావ్య సరళి లోనే
రాయాలని రాయడం
మానెయ్యాలి

Tuesday, January 1, 2019

రాత్తిరి
చీకటి మాటలాడుతుందని
అనిపిస్తుంది. 
తనలో....తను

వంకరటింకరగా
మెలికలు తిరిగిన
సిరలు ధమనుల్లో
ప్రవహిస్తున్న రక్తం లా
శబ్దం చేస్తూ 

అన్నవాహికల్లో
జీర్ణించబడని పదార్ధాలు
ఆరనిమంటల
చితి రహశ్యాల్లా 
భూస్తాపితం కాబోతూ 

ఏ స్పృశించే
మైకపు భావనల
కలల కవ్వింపులు
అరుపుల్లా  
ఆర్తనాదాలౌతూ   

ఎక్కడో .... మెరిసే
మిణుగురుల తళతళల్లో
కీచురాళ్ళ ద్వనుల్లో
నెమ్మదిగా నిశ్శబ్దం
తోమబడుతున్నట్లు

ఉరమని మెరుపు
భయంలా
స్వాగతించని కష్టాలు
శ్రుతివ్యత్యయంగా వినిపించిన
పిడేలు రాగంలా 

మార్గమధ్యంలో
భూతమేదో అడ్డం వచ్చి
బలంగా డీకొట్టి 
కదులుతున్న వాహనం
ఆగిన అరుపులా

ఆగి,
అంతలోనే ఏమీజరగనట్లు
నాజూకు గా
నీడగా మారి
జారుతున్న ప్రవాహంలా 

పొడుగ్గా పెరిగిన గోళ్ళతో
చావు శిలాక్షరాలను
సుందరంగా చెక్కుతూ
అంతలోనే
పిచ్చిగీతలేవో గీస్తున్నట్లు

పాతాళం లోంచి ఏ స్త్రీమూర్తో
బలహీన స్వరంతో
భీతావహురాలై చేసిన 
విషాధాలాపన లా
చీకటి మాటలాడుతున్నట్లు