Thursday, January 17, 2019

ఆవేశం ముగ్గు



అతి సులభమే రాయడం
కవిత్వం
ద్యాసగా కళ్ళు మూసుకుని
అసరళీకృతమైనా సరే అని
రాస్తే

రాయాలి
బాధ ఆవేశాలను చూసి
అనుభూతి చెంది

నెమరువేసుకోవడాలు
స్వయం జ్ఞాపకాలు జ్ఞప్తి తెచ్చుకుని
ప్రతి రచనలోనూ తన్ను తాను
ప్రతిష్టించుకోవడాలు
నిఘంటుశోధనలు
నానార్థ పదాలకై పరితపనలు
లేకుండా

వ్యాకరణం భావ స్వేచ్చను ....
ఆవేశాన్ని కట్టడి చేసి 
బాధ భావనానుభూతి
ప్రవహించదు
ముందుకు కదలదు
ఎదగదు
అక్కడే కూర్చుండిపోయి
కేవలం అందంగా
ఆంతర్యం తత్వరహితంగా మిగిలి
మరిచిపోయే
ఒక గతమైపోతుందే కాని 

అందుకే
ఒక్కసారి చదివి
వెంటనే మర్చిపోయే
ఎన్నో అసంఖ్యాక కాగితాలలో
కాగితంలా మిగిలిపోని
కథలు, కవితలు సాహిత్యం
రాయాలని ఉంటే ....
కేవలం కావ్య సరళి లోనే
రాయాలని రాయడం
మానెయ్యాలి

Tuesday, January 1, 2019

రాత్తిరి




చీకటి మాటలాడుతుందని
అనిపిస్తుంది. 
తనలో....తను

వంకరటింకరగా
మెలికలు తిరిగిన
సిరలు ధమనుల్లో
ప్రవహిస్తున్న రక్తం లా
శబ్దం చేస్తూ 

అన్నవాహికల్లో
జీర్ణించబడని పదార్ధాలు
ఆరనిమంటల
చితి రహశ్యాల్లా 
భూస్తాపితం కాబోతూ 

ఏ స్పృశించే
మైకపు భావనల
కలల కవ్వింపులు
అరుపుల్లా  
ఆర్తనాదాలౌతూ   

ఎక్కడో .... మెరిసే
మిణుగురుల తళతళల్లో
కీచురాళ్ళ ద్వనుల్లో
నెమ్మదిగా నిశ్శబ్దం
తోమబడుతున్నట్లు

ఉరమని మెరుపు
భయంలా
స్వాగతించని కష్టాలు
శ్రుతివ్యత్యయంగా వినిపించిన
పిడేలు రాగంలా 

మార్గమధ్యంలో
భూతమేదో అడ్డం వచ్చి
బలంగా డీకొట్టి 
కదులుతున్న వాహనం
ఆగిన అరుపులా

ఆగి,
అంతలోనే ఏమీజరగనట్లు
నాజూకు గా
నీడగా మారి
జారుతున్న ప్రవాహంలా 

పొడుగ్గా పెరిగిన గోళ్ళతో
చావు శిలాక్షరాలను
సుందరంగా చెక్కుతూ
అంతలోనే
పిచ్చిగీతలేవో గీస్తున్నట్లు

పాతాళం లోంచి ఏ స్త్రీమూర్తో
బలహీన స్వరంతో
భీతావహురాలై చేసిన 
విషాధాలాపన లా
చీకటి మాటలాడుతున్నట్లు