Wednesday, July 19, 2017

కోల్పోయాకే తెలిసిందివయసు మీద పడ్డాకైనా తప్పించుకోలేము .... గతపు పీడలనుంచి అని
పగిలి, విరిగి, నాశనమైన అస్తిత్వం పునాధులపై చదికిలపడాల్సొస్తుందని
కట్టెలపై భగ్గుమని మండాల్సిన
ఒకనాటి ఎండి రాలిన ఆశల కన్నీళ్ళ కలల శరీరావశేషాలపై
ఎంతో పటిష్టంగా నిర్మించుకున్న .... ఊహల సామ్రాజ్యమే
బానిస జీవనంగా అవిష్కారం ఔతుంది పరిణామక్రమంలో అని

ఎన్ని అవరోధాలు ఎన్ని ఎదురుదెబ్బలు ఎన్ని వినాశన చ్చాయలు
గతం లో, ఈ ఎద లో, శూన్యం అనేది లేని ఈ నగరపు ఒంటరితనంలో
ఈ నిరాశ నిస్పృహల్లోంచి నీతో కలిసి .... ఒకప్పటి గతం లో
పంచుకున్న ఆ ఆనందానుభూతుల జ్ఞాపకాల్లోకి జరగక తప్పక
మనము కలిసి గడిపిన నిన్నటి వేళల ఆ ఉన్నత ఆశయాల
ముద్దు ముచ్చట్ల పరిపూర్ణానందం .... విఫలపయత్నమే అని   ఎవరికోసమూ ఆగని కాలగమనంలో పునర్నిర్మాణావశ్యకత పెరిగి
జీవితానుభవసార అవసరాల కిటికీలోంచి చూడటంతో పాటు
నూతన సామాజిక ప్రాపంచిక మార్పుల ఆలోచనల గవాక్షంలోంచి
ప్రతిదీ నెమ్మదిగా సులోచనాలతో చూడటం ఆవశ్యకత అయ్యి
జీవన యానంలో కాలంతో పాటు  తప్పనిసరైన
మార్పు దిశగా పునర్పురోగమనానికి ఉపక్రమించక తప్పదు అని

Saturday, July 15, 2017

నా కలల్లో
పరవశ ఆనందాలం .... మనం
అన్ని వేళలా .... ఎక్కడ ఉన్నా
నా ఎదురుచూపులు .... అన్నీ
నిన్ను కనుగొనాలనే
నీకై పుట్టిన ప్రియభావనను నేను అని
నీ చెయ్యందుకుని
మృదువుగా నిన్ను స్పృశించాలనిపించే
నీ లోపలి .... వింత అనుభూతిని నేను
మంటల్లో కాలుతున్న విరహవేదనను పొందినా
బహుశ అందుకేనేమో ....
గొంతు పెగలని .... ఈ బలహీనత
నీవే నా ప్రేమ, నా ఆత్మ,
నీతోనే .... నా పరిపూర్ణత అనేనేమో
అన్నివేళలా అనురాగం తో
నిన్ను బంధీని చెయ్యాలి అనిపిస్తూ .....
కానీ మాట్లాడలేను.
అంతటి మదుర మనోజ్ఞతవు .... నీవు
నీవే నా స్వేచ్చవు, నా దానవు
నా వాస్తవాతీత గాథవు
కేవలం అది కలలో మాత్రమే అయినా

Sunday, July 9, 2017

కలలతో కలిసి విశ్రమిస్తే ....అరతెరిచిన కిటికీ లోంచి 
కలలు కొన్ని 
చిరు శబ్దం చేస్తూ 
వీధిలోకి జారుకున్నాయి  

నక్షత్రాల సమూహాలతో 
నిండిన ఆకాశం వైపు ....
బహుశ, ఆ నక్షత్రాల సరసన 
విశ్రమించేందుకనేనేమో  

అంతలోనే పిల్లగాలి తెరొకటి 
సున్నితంగా 
నా శరీరాన్ని తడిమి  
ఆత్మను తట్టింది 


నెమ్మదిలేని నా మదిని 
అభ్యుదయేచ్ఛతో నింపి ....
కలలపై ఇంద్రధనస్సు రంగు  
గమ్యాలను అద్ది  

కనీసం అందువల్లనైనా నేను 
స్థిమిత పడొచ్చని 
అక్కడ ఆ పక్కనే 
అదే అంతరిక్షం లో  సేదదీరితే     

సడిచెయ్యకుండా 
నిశ్శబ్దంగా 
ఆ నక్షత్రాలు, కలలతో కలిసి 
విశ్రమిస్తే ....