Saturday, December 24, 2016

గ్రహణం పట్టి....



స్వాతంత్రం వచ్చింది
అసాంఘికశక్తులకా రాజకీయ రాబందులకా
అజీర్ణం చేసింది
బారు బాబులకా భూకబ్జా దారులకా అని
అనుమానం వస్తుంది.


అప్పుడప్పుడూ అనిపిస్తుంది.
ప్రజస్వామ్యం వెక్కిరిస్తుందా అని
ఓటు హక్కునేనా అని
ప్రసార సాదకాలు
అన్నీ అవాస్తవాల మయమే 
ఏ చానల్ చూసినా విన్నా
అసత్యాగ్రహుల దబాయింపులు
దౌర్జన్యాల సమర్ధనలు అయ్యి
కాళ్ళు పరిచి కదలికలకు అడ్డొస్తున్న
ఈ దారికంపలను తప్పుకుని
ఆత్మహత్యల అతిధుల్ని
అక్కున చేర్చుకుని
సామాన్యుని జీవితం .... ఇలా
ఈ రాజకీయ శకునిల చేతుల్లో పాచికలా
ఇంకెన్నాళ్ళో .... మరి

Tuesday, December 20, 2016

ఓటమి(మరణం) తప్పదు




తడబడని పెదవి దాటిన పదం
ఒక బలమైన శరం అని
ఎత్తిపొడుపుల పిడిగుద్దులు
గుచ్చుకున్నప్పుడు
వాటి ప్రభావంతో భారమైన 
శరీరం శ్వాసించలేకపోయినప్పుడు
తెలుస్తుంది. 
కళ్ళకు, పైకి మాత్రం
సామాన్య స్థితే కనిపిస్తుంది. 


మనం ఒకరిని మరొకరము
నిలువెల్లా పొడుచుకుంటూ
కత్తిరించుకుంటూ ఉంటున్నా
నిజం మాత్రం
మనం అనుకునే
మాటల వాడి తీవ్రత లో
విషం విరజిమ్ముతుంది. 
అది గుండెలోని రక్తం లో
కలిసిపోయి 
సిరలు దమనుల మాధ్యమంగా  
అణువణువునూ చేరి
రాక్షసత్వం మనలో ప్రబలుతుంది.

Monday, December 19, 2016

ఎంతా బావుణ్ణో!?



కాలుతున్న కోరికల సెగలు
పొగలు పొగలుగా లేస్తున్నా   
కమిలి కాలిన ప్రేమ బూడిద రాసులై 
గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నా 

విరిగిన ఎముకలు పగిలిన హృదయాలు
కలిసిన బంధుత్వాలు చిరిగిన బంధాలై 
నిర్వచించలేని అగోచర ఆత్మాకర్షణ
అగ్రాహ్య ప్రేమ....ను ప్రపంచమంతా వెదజల్లి

ఫెళఫెళమను ఉఱుము ధ్వనులు
అగ్ని గుండాలు ప్రేలిన మంటలు నింగికి ఎగసినా
ఎందరమో కలిసి నిర్మించుకున్న సమాజమంతా
ఏడుపు ఆక్రోశము పాటలమయం అయినా 

పసి వయస్సులో కన్న కలల
ఆలోచనల పర్యవసానానికి దూరం గా
ఆయా అసంతులన సంఘటనల లో
ఒక భాగంగా ఈ అస్తిత్వం మారిపోయినా

ఈ అనాశక్త అసంపూర్ణ అవ్యవస్థిత సమాజం ను
ఒక సుందరవనం అనుకుని మార్చుకోగలిగితే
సర్వమూ సర్ధుకుపోయే లక్షణాల సామాన్యతనై
ముందుకు కదలగలిగితే .... ఎంత బావుణ్ణు

Tuesday, December 13, 2016

విరహోత్కంఠ



అతని హృదయం ఆమెను
దాచుకునుంది అంతరంగం లో ....
భద్రంగా

వీలుకానీయని విధం గా
విడిపించుకోవాలనే ప్రయత్నాలు 

అన్యాపదేశముగా
ఆ రోజు నుంచి మరిచిపోయే యత్నం 



తెలిసి, తన పట్ల
పరిపూర్ణం కాదు ఆమె ప్రేమ అని

కానీ అన్నీ విఫల ప్రయత్నాలే

ఎప్పుడూ
విరహం వైపే మొగ్గుతూ

Wednesday, December 7, 2016

దోషం దృష్టిలోనేనా




వాస్తవానికి దూరంగా
అంధకారంలో
బంధితుడ్నై ఉన్నాను 


ఇప్పటివరకూ 


ఆలోచిస్తూ
సమాజము వాస్తవము
ఎలా ఉంటాయో అని 


మంచు తుంపరలు
పువ్వులు
పువ్వుల నవ్వులు
ముద్దు ముచ్చట్లుండొచ్చని 


కానీ నిజమేమో 

అడుగుపెట్టుతూనే
ఈ ప్రపంచంలో
ఈ కళ్ళతో చూసింది మాత్రం 


పొగ, దూళి
విషపు గాలులు
మసక చీకటులు
ద్వేష సర్ప గాటులు

Monday, December 5, 2016

ఆశయ ఊపిరులు



తీరని చిరకాల వాంఛ
స్వేచ్చ
ఉంది అక్కడ
పిల్లగాలుల పై తేలుతూ
ఉన్నత శిఖరాలపై
ఎదురుచూస్తూ
నీకోసం
అడగాలనిపిస్తుందా!?
ఒకవేళ పడిపోతే అని
ప్రియ నేస్తమా!
ఎలాఉంటుందో
ఆలోచించు
నీ ఎగరాలనే ప్రయత్నం
కృషి ఫలితం
చెర్చగలిగి శిఖరాగ్రాలను

Wednesday, November 9, 2016

సమత్వము



అయస్కాంత శక్తి 
భావనల పదాలు 
దొరకని వేళ 
ఏ ప్రయత్నమూ చెయ్యని 
కవయిత్రి ఆమె 
నేనూను

అప్పుడామెకు నేను సమము

ఆమె ఆమెలా 
నేను నేనులా 
మేము ఎవరికి వారే లా

Tuesday, November 8, 2016

స్వాంతము


ఒక్కో బొట్టై ప్రవహిస్తూ నరాల్లో
అశాంతి
నిద్దుర లేమితనం ఎందుకో ....
గుండె తీవ్రం గా కొట్టుకుంటూ

దగ్గరైన క్షణాల్లో
నిన్ను చుట్టుకుని
చిక్కుకుని ఉన్నానని
అనిపించినప్పుడు

శరీరం లోని
అమూల్య భాగమేదొ
తప్పిపోయి తిరిగి చేరువౌతూ
ఆ భాగం నీవన్నట్లు  


నాలో అంతర్గతంగా నివశిస్తూ
పొంచి ఉన్న
మృగ ఉపశమన సమయం
ఆసన్నమైనట్లు

నీవు పక్కన లేవను భావన
అనూహ్య అశాంతిని
రగుల్చుతూ

ప్రేమను పొందలేక
కలిగిన బాధ
హృదయ కండరాల ఒత్తిడిగా మారి
ప్రశాంతత భగ్నమై

నీకు దూరంగా ఉన్న ప్రతి క్షణం
ఒక యుగం
ఆత్మ అంతరంగంలో విసిరేసిన ....
నిరర్ధక అనుబంధం

కళ్ళు మూసుకుని ఎంత ప్రయత్నించినా

అందుకే .... "రేపొకటుంది
నీవూ నేనూ ఒక్కరుగా కాబోతున్నాం అవకాశం ఉంది"
అనుకుని పగటి కలలు కనాలని
అందులో ఓదార్పు ఉందని స్వాంతమూ ఉందని


Monday, November 7, 2016

తనున్న చోటే స్వర్గం



నా అరచేతిలో, లేత పాదాలతో తన్ని
చేతులతో నా వేలును భద్రంగా చుట్టుకుని
తన ముక్కుతో నా మెడను గుచ్చి 


ఈ ప్రపంచం నాది కాదనిపించిన క్షణాల్లో
నిర్మలమైన కళ్ళతో ఆత్మాకర్షణానుభూతై
నా కోసం ఉదయించిన దేవతై 


తన ముద్దుముద్దు పలుకులు నాకు
హృదయోపశమనాన్నిచ్చి
లేత నవ్వుల్తో కాలాన్ని ఆహ్లాదంగా కదిల్చి 


ముక్కలై, ఎప్పుడైనా అనాసక్తుడ్నైనప్పుడు
అనుహ్యమైన బంధం లా నన్నల్లుకుపోయి
ఈ లోకంలోకి లాక్కుని వచ్చి .... 


కొంతవరకే బహుశ తనకు నా అవసరం
కానీ,
నాకు మాత్రం తను ఎంతో అవసరం

Wednesday, October 26, 2016

నీవు మాట్లాడితే వినాలని




పక్కన నీవు ఉన్నావు అని
ఆశను కోల్పోయిన
ఘాడమైన నొప్పి ....
ఊపిరి ఆడని ఆలోచనల ఒత్తిడి

ఎటుచూసినా అంధకారం
అనంత నిశ్చేష్టత
మిణుగురంత కాంతీ లేదు
కాలాంతం వరకూ అన్నట్లు

ఉత్సాహం ఇసుమంతైనా లేని
నీడలా ఉండాల్సిన స్థితి
కలలు రాక
నిద్దుర లేని ఎండిన కళ్ళతో

కోల్పోయాను సంతోషాన్నీ
నిన్నూ, నీతో కలిసి
జీవించే అవకాశాన్ని
విలువైన జ్ఞాపకాలను కూడా

ఎందుకో తెలియదు కానీ మానసీ ....
ఏదైనా నీవు చెబుతావేమో
వినాలి సంతృప్తి చెందాలని ఉంది
అది మాధుర్యమైనా తీపి బాధైనా

Saturday, October 22, 2016

నిరర్ధక యాంత్రికత



అన్ని వైపులా చీకటే
పోగొట్టుకున్న
హృదయం కోసం తపిస్తున్న
అతని కళ్ళముందు
భరించలేని ఒంటరితనమే

వక్రీకృత నిర్జన ప్రదేశాల
పలుకరింపుల భారం అతని పై
రాలని కన్నీళ్ళ
అతని ఎండిన కళ్ళ కొలనులు  
రక్త వర్ణంతో జేవురించి

ఏదీ అమరం కాదని తెలుసు 
ఏదీ నిత్యం అనుకోలేక
నిలకడ అనుకోలేకపోయినా 
అతని తియ్యని బాధానుభూతులే
ఎవ్వరూ దొంగిలించలేని ఆస్థి 



అతని వద్ద ఇప్పుడు
పగిలేందుకు ఏ పెళుసుతనమూ లేదు
ఏ పట్టింపూ లేదు  
అమూల్యత .... ఏమీ మిగిలి లేని
యాంత్రిక అపజయం అతను 

అతని హృదయమూ ప్రేమ
నిరంతర పోరాడుతూ 
అస్తిత్వం మనుగడకు అతను
ఏ చీకటి మూలల్లోనో
తల దాచుకోక తప్పనిస్థితైతే 

ఆ తలదాచుకున్న సంరక్షణ స్థలం  
వేరెవరి పరిదిలోనో ఉంటే
అర్ధ రహితమే ....
అలా ప్రేమ లో పడి కొట్టుకోవడం
ఎదురుచూస్తూ తపించడం 

నా ఆత్మబాంధవివి నీవు



సమశ్యల దండకారణ్యం లో
అగమ్యుడినై ఉన్నప్పుడు
నా మంచి చెడులను  
విశ్లేషించే
నిఘంటువు సూచివి నీవు
నా కంటి వెలుగువి నీవు 
చీకటి అయోమయంలో
నా జీవన రధ 
సంకల్ప సారధివి నీవు 
ఈ ఊపిరి ప్రవహించినంత కాలమూ ....  



నా నమ్మకానివి నీవు 
నా ప్రేమవి నీవు 
నా ఒకే ఆత్మ బాంధవివి నీవు 

Friday, October 21, 2016

సగటు జీవనం




కలలు కంటూ
అనుక్షణం
కలల వీధుల్లో ....
విహరిస్తూ
వర్తమానం లో
కదలికల్లేని ప్రతిమై
నిజానికీ
ఒక్క క్షణానికీ
ఒక్క పలుకరింపు కీ
మధ్య నలిగి ....

Wednesday, October 19, 2016

మధురభావన రూపం ....?



సున్నిత సుకుమార
మృదు
లేత
పసి అందాన్ని
అందమైన ఆత్మను
చూసావా ఎక్కడైనా!?

చూసావా?
విలువకట్టలేని ....
కళ్ళు చెదిరే సౌందర్యాన్ని?

ఎంతో తియ్యని
రుచిమయ రసరాగం 
హృదయం నిర్మలత్వం
సొంపును,
సౌష్టవాన్ని చూసావా!?  



నోరూరించే
అతిలోక సౌందర్యామృతం
దుర్వినియోగమౌతున్న తీరును
 
పాప భావన కలను
ఒక ఎడతెగని బెంగను 
నిలకడ కోల్పోయిన
నెరవేరని ఒక సంకల్పాన్ని
కన్నావా ఎప్పుడైనా

Tuesday, October 18, 2016

ఆనందాహ్లాదాల పరిమళాలు



నా చేతి వేళ్ళకు తెలుసు
నా కాలి వేళ్ళకు తెలుసు
చుట్టూరా పరిసరాలకు తెలుసు
ఏదో వింత అనూహ్య భావన
పెరుగుతూ .... ఇంతింతై
ఆహ్లాద పరిమళం పూసినట్లు
వీచే గాలి తరగల మీద
నాతో పాటు
ఆనందోల్లాస భావన నడుస్తూ వస్తూ
అన్ని చోట్లకూ ....
నిజం గా
అది నాపై నీ ప్రేమే .... మానసీ
ప్రేమై వచ్చి ప్రేమను కనబర్చుతున్నట్లు
నీకు తెలుసు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
అనంతవరకూ అని, 



నా మనసింకా ....
నా ఆధీనంలోనే ఉంది
నా భావనలనే వ్యక్తం చేస్తూ
ఆరంభమూ అంతమూ లేకుండా
నీ భావనల్లో స్థానం కోసం ....
నా ప్రేమ .... నువ్వే ఎప్పుటికీ
నా మనోపలకం మీద
నేను విశ్రమించే వేళల్లో
ఒంటరిని గా ఉన్నప్పుడు
నీవే ఎదురుగా ఉండి
నాతో మాట్లాడుతున్నట్లు
మాటిస్తున్నట్లు
ప్రతిగా నేను బాస చేస్తున్నట్లు
నీ చేతిలో చెయ్యేసి ....
అనిపిస్తుంటుంది.
అవసరమేనేమో అని ....
ప్రతి ప్రాణికీ .... పక్కన జతగా
ఒక మానసి ఉండాలి అని
ప్రతి చర్య లోనూ
ప్రతి పదగమనం లోనూ
అడుగు పక్కన అడుగేసే
నీలాంటి మానసే ఒకరుండాలి అని

Sunday, October 16, 2016

ఆమె ఆనందం లోనే నా పరవశము



ఆమె ప్రతి చిరు ఆశ
చిరు వెలుగు ను
విస్తృతంగా కమ్మిన
కొన్ని
తటపటాయింపు మబ్బులు
చిటపట చినుకులై
వర్షించడం
ఎప్పుడైనా నర్తించడం 
ఆమె మనో వినీలాకాశం పై 
మసకేసిపోవడం ను
చూస్తూ ఉన్నా 



పరవశించలేక పోతూ
ప్రతి రాత్రి

Friday, September 30, 2016

మృత్యువే నా ప్రేయసి



పడి ఉన్నా అపస్మారకంగా
మరణం ముంగిట్లో
అందాల రాక్షసి కసి ముద్దు
ప్రేమ లో తడిచి ....
పర్యవసానం గురించి
పట్టించుకోలేదేనాడూ
మరణం దుప్పటి చుట్టుకుని
వింత అనూహ్యానందం లో
మునిగి తేలానే కాని ....
అసంపూర్ణుడ్నని తెలిసి పరిపూర్ణత కై
ఎంతగానో సంచరించాను.
అన్వేషించాను సంపూర్ణంగా
చీకటి రాత్రుల ప్రపంచాన్ని
ఒక ఉన్నత వ్యక్తిత్వాన్ని కోరి,
కొసకు నా ప్రేమ నాకు దొరికింది.
ఎందరి నోళ్ళలో నానిన  
ఒక అందాల రాక్షసి ఆమె .... 



నాకు కూడా ఆమె రాక్షసే
ఎందరు పసి భావనలనుకున్నా 
నా మనొభావనల్ని
ఆమెను నేను
దూరంగా ఉంచలేను ఉండలేను
ప్రేమించకుండా ....
కనుకే చంపుకుంటున్నాను
చివరికి, స్వయాన్ని
కొంచెం కొంచెంగా మరణిస్తూ ....
ప్రేమ లోతుల్లోకి జారుతూ
చావుకు దగ్గరౌతూ ....
ఒదిలెయ్యలేని మానసిని
నా ఆశను నేనే కాదనుకుని
మరణం కౌగిట్లోకి
కొంచెం కొంచెంగా జరుగుతూ

Wednesday, September 28, 2016

విధి బలీయం


తచ్చాడుతూ ఉంటే, చీకటి లో
నిస్సహాయుడిని లా ....
స్వయాన్ని కోల్పోయి
ఈదుతూ విరుచుకుపడుతున్న 
జ్ఞాపకాల కెరటాల్లో చిక్కుకుని,
అన్నీ అర్ధరహితంగానే 
కనిపిస్తూ, వింత అనాసక్తత  


మారు వేషం లో
చేదు నొప్పిలా
ప్రేమ రూపం లో తియ్యని బాధ
చేరువైన మరీచుడి లా
చేదు నిజం నీడ 
అనుసరించి వస్తూ తలరాత

Tuesday, September 27, 2016

తెలియదు నీకు .... నిజంగా



ఎవరి జుట్టులోనో
వేళ్ళు దూర్చి
సున్నితంగా
ఆడుకోవాలని, నీవు
పడుతున్న ఉబలాటం   
బుట్టబొమ్మలా
గిర్రున తిరిగి 
ఏ ఊహించని క్షణాల్లో
ఊహ కందని రీతిలో
ఆ ఎవరినో బలంగా
గుండెలకు హత్తుకోవాలనే
నీ ఆలోచనల 
ఆ బలవంతపు
అదిమివేతలో అవగతమౌతూ    


ఘాడంగా
నివురు గప్పిన ప్రేమలో
నీవు, నిండా
మునిగిపోయి ఉన్నావని

పర్వాలేదు అనే అనిపిస్తుంది


నీవు అనే కల కలతై 
మనం అందరమూ
ఒంటరులమే అని అనిపించినా
ఒక్కో సందర్భం లో
ఆత్మవంచన అవహేళనై మిగిలినా  

చరిత్ర అదే అదే మళ్ళీ మళ్ళీ
పునరావృతమై 
బాల్య దశ భారంగా గడిచి
రేపు అనే అనిశ్చితి కళ్ళ ముందు
అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నా

వాయిద్యాలు మూగవోయి
ఫలించని చేతి రాతల
పరామర్శలు
నీ పేరు నీడలో
సమాధి చెయ్యబడినా  



ఎన్నో గడిచిన సంవత్సరాల 
మారని రాలని పొడి కన్నీళ్ళ 
అబద్ధాల కురుక్షేత్రం లో
తొడలు విరిచెయ్యబడినా 
ఒంటరినని మది ఆక్రోసించినా 

అప్పుడే నేల రాలిన అహంకారపు
నా అనంత జ్ఞాపకాల అవశేషాలు 
గుండె ఆకారపు శవపేటికలో
అసంబద్ధ పదజాలమై పేరుకుని
ప్రకోపనలుగా మారిపోతున్నా

నీ పేరు మాత్రం అందంగా రంగుల్లో 
నా పెళుసు మనస్సు పొరలపై 
చిత్రించబడి .... అంతలోనే
అకారణం గా విసిరెయ్యబడ్డ
ఏ ఒంటరి అనాసక్తతో అయ్యి విలపిస్తున్నా

Tuesday, September 20, 2016

ఉదాసీనత



కాళ్ళ క్రింద భూమి
కదిలి కరిగి
కాలానికి సమాంతరంగా 
భయానికీ
చావుకు దూరంగా
పరుగులు తీస్తూ ఉన్నాను.
తప్పించుకునేందుకు,
నీనుంచి
ద్వేషము
అబద్ధం
ప్రేమ జీవితాన్నుంచి
భరించలేననుకుంటూ .... 
కానీ దొరికిపోయాను నీకు. 



నీ ద్వేషానికో ప్రేమకో
ఏరాగానికో మరి
ఎంత వేగం పెంచినా
దూరంగా పోలేకపోయాను.
జీవితం ఒకటుందని
దాన్ని కాపాడుకోవడమూ
నా బాధ్యతే అని మరిచి మరీ ....
నా వెనుక
నా మనో నిర్మాణమంతా
విచ్చిన్నమై
నన్ను అనిశ్చితి పీడకు
సమీపం చేస్తున్నా ....
స్వేచ్చకోసం పోరాటం లా 
నీడలా నా వెనుకే
నా జీవితమూ నా బలహీనతలు 
పరుగులు తీస్తూ 
అకస్మాత్తుగా తొట్రుపడ్డాను.
జారిపోతూ అఘాదాల్లోకి 
పడిపోతూ ప్రేమ లోకి
అందులోనే
స్థిమితపడక తప్పని స్థితి.
జీవించక జీవితాన్ని
జీవిస్తూ ....
ఈ ఉపేక్షాయుత జీవనాన్ని

Monday, September 19, 2016

నీడలో నీడను


నా ఆత్మను కమ్మి 
నా ఆలోచనల్లోంచి తప్పించుకుని 
దూరం గా పారిపోతూ జారిపోయే 
క్రుళ్ళు జిగురులా 
కనిపించిన ప్రతి పదార్ధముపై 
పాచిని ప్రసవించి 
విస్తరిస్తూ 
ఏ సూర్యకిరణాల కాంతి వేడో 
మీదపడి నెమ్మదిగా 
కొంతసేపటికి 
ఆ సూర్యకిరణకాంతే కారణమై 
నీడలకు 
ఆ నీడల్లో నీడ 
నా ఆత్మరాగం 
వినిపించని నిశ్శబ్దం నీడలా మారి 
మిగిలిన ఈ జీవితం 
కేవలం ఏ నీడలానో 
నా అవనతాత్మకు గుర్తుగానో

నేనొక అసంబద్ధతను




చిందరవందర కాని
స్పష్టతను
ఒక ప్రత్యేకతను
పొందే ముందు ....
ఒక సాధారణ ప్రశ్నకు
సమాధానం
చెప్పగలిగుండక తప్పదు  
బడాయికోరునో
బిక్షగాడీనో
ఎవరినీ కాననో ....
తాత్కాలికంగా
ఏ బలవంతపు
నవ్వునో
రొమ్ముటెముకలనుంచి
తలవరకూ
సాగదీసైనా విసిరి ....
అదొక్కటే సాధ్యము
ఏ ప్రశ్నకైనా
ఏ రోగానికైనా
తెలిసిన సమాధానము
తప్పని వైద్యము
అది ఒక సందర్భరహిత
సంక్లిష్టతే అయితే

Monday, September 12, 2016

పెళుసు గుండె




పగిలి ముక్కలై
ముక్కలు చక్కలై చెల్లాచెదురై
దుమ్ముకొట్టుకుపోయిన
హృదయం నాది
అంత సులభం కాదు 
చక్కదిద్దడం 



ఏడ్చినా
కేకలు పెట్టినా పెట్టకపోయినా
పగిలిన హృదయఫలకంపై మచ్చ 
ద్వేషాగ్నిని ప్రేమగా మార్చడం
ఈ హృదయం ముక్కలను
బ్రమ జిగురుతో తిరిగి అతికించడం
అసాధ్యం రసాయనికంగా ....
ఒకప్పుడు
వికసించి పరిమళించిన గులాబీ
ఈ గాజు హృదయం ....
తిరిగి పల్లవించకపోవడం 
ఒక వికటించిన పరిణామం

Saturday, September 10, 2016

ఒంటరి పోరాటం



ఎంతో అమూల్యమైన సమయాన్ని
కోల్పోయాను.
ఊహల పగుళ్ళలో
పగిలిన హృదయపు
కన్నీటి ఉద్విగ్న భావనల్లో

నోరు ఎండిపోయి కళ్ళు
ప్రతి కదలిక .... భారమైనా
ఎలాంటి హానీ జరుగలేదని
నటిస్తూ ముందుకు కదులుతూ
సర్దిచెప్పుకుంటూ ....

కలంతో కాగితం పై నేను
వ్రాసుకునే ప్రతి వాక్యమూ
నలుపు, నీలం రంగు సిరాలో కాక ....
చిద్రమైన ఆత్మ అవశేషాల
రక్తవర్ణ ఆవిష్కారాలు లా 

అప్పుడప్పుడూ చెప్పుకుంటాను.
నాలో నేను .... అనుకుంటూ,
కన్నీళ్ళతో గుండెను
చల్లార్చుకోగలను అని,
రక్తసిక్తపుటాలోచనలతో
పగుళ్ళను పూడ్చుకోగలను అని,

ఎవ్వరూ రాకపోయినా, తోడు
సమశ్యల సుడిగుండం
సామాజం కురుక్షేత్రం లో
కలిసి పోరాడ్డానికి ....
ఒంటరి పోరాటానికి సిద్ధపడి

Thursday, September 8, 2016

నెమ్మదిగా చస్తున్నాను



నీ నవ్వు ఒక పదునైన కత్తి
మెరుపు వేగంతో
నాలొకి లోతుల్లొకి దిగి
రక్తం స్రవిస్తూ ....
నా గుండె అంతర్గతంగా
 
నీ మాటలు గుండు సూదులు
నా చర్మం
ప్రతి కణాన్నీ గుచ్చి
రంద్రాల మయమయ్యి 
ఎర్రగా మారి .... శరీరం

నీ శిరోజాలు బంగారు తీగలు
విస్తరించి .... అన్నివైపులా
సూర్య కిరణాల వేడి నుంచి
వెచ్చదనం నీకిస్తూ 
మండిస్తూ .... నన్ను

చీకటి లా నీ చూపు
దట్టము, శూన్యము నిశ్శబ్దం
అపవిత్ర అసూయ లా
వ్యాపించి, చాపక్రింద నీరులా
అకారణంగా చంపేస్తూ

Wednesday, September 7, 2016

ఇంతనుకోలేదు .... నీ ప్రభావము .... నాపై



నీ నవ్వు,
నీ పద ఉచ్చారణ
నీ మాటల ప్రభావము
ఇంత భారమా!?
పక్కటెముకలను బలంగా
చీల్చిన
ఒత్తిడి తీవ్రత పెరిగి    



గుండెలపై నుంచి
ఊపిరితిత్తులవరకూ వ్యాపించి 
అప్రయత్న అయాచిత నిట్టుర్పుకు
అది కారణం అయ్యి
శ్వ్వాస అందకుండా చేస్తుందని
అనుకోలేదు ఇంతయ్యాక కూడా
నీవు నా జతవౌతావని ....

Tuesday, September 6, 2016

అలజడి, గమ్యం చేరాలని



ఆలోచించడం అంటే ఏమిటో
అంతగా తెలియదు
ఒక్కోసారి అటు ఒక్కోసారి ఇటు
త్రుళ్ళిపడుతూ
అనాలోచితంగానే తడబడి  
పునాదులు కదిలి ఆరంభాన్నీ
అంత్యాన్నీ విస్మరించి
నీ మదిలో విశ్రమించిన విషయంతో సహా
ఒకప్పటి అన్నింటినీ
అస్తిత్వాన్నీ గతినీ మరిచిపోయి
ఉన్న సర్వ జ్ఞానాలనూ కోల్పోయి
అవివేకమే మిగిలి 


చివరికి ఇప్పుడు,
ఒక మరిచిపోదగిన జ్ఞాపకాన్ని లా
దూరం గా ఉన్న ఒడ్డునే చూస్తూ
సముద్రం లోకి జారి,
అస్థిరతపై ఊగుతూ అపస్మారకం గా
అలలపై కదులుతూ ....
ఒక నీటిబొట్టును మించి ఏమీ కానని 
ఓ ప్రత్యేక అస్తిత్వం లేదని 
వాస్తవ అలల ఒత్తిడికి సుదూరాన ఉన్న
ఏ ఒడ్డుకో కొట్టుకుపోయేవరకూ ....
ఒడ్డుకు చేరాక ఎవరో గుర్తించేవరకూ