Tuesday, September 27, 2016

పర్వాలేదు అనే అనిపిస్తుంది


నీవు అనే కల కలతై 
మనం అందరమూ
ఒంటరులమే అని అనిపించినా
ఒక్కో సందర్భం లో
ఆత్మవంచన అవహేళనై మిగిలినా  

చరిత్ర అదే అదే మళ్ళీ మళ్ళీ
పునరావృతమై 
బాల్య దశ భారంగా గడిచి
రేపు అనే అనిశ్చితి కళ్ళ ముందు
అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నా

వాయిద్యాలు మూగవోయి
ఫలించని చేతి రాతల
పరామర్శలు
నీ పేరు నీడలో
సమాధి చెయ్యబడినా  ఎన్నో గడిచిన సంవత్సరాల 
మారని రాలని పొడి కన్నీళ్ళ 
అబద్ధాల కురుక్షేత్రం లో
తొడలు విరిచెయ్యబడినా 
ఒంటరినని మది ఆక్రోసించినా 

అప్పుడే నేల రాలిన అహంకారపు
నా అనంత జ్ఞాపకాల అవశేషాలు 
గుండె ఆకారపు శవపేటికలో
అసంబద్ధ పదజాలమై పేరుకుని
ప్రకోపనలుగా మారిపోతున్నా

నీ పేరు మాత్రం అందంగా రంగుల్లో 
నా పెళుసు మనస్సు పొరలపై 
చిత్రించబడి .... అంతలోనే
అకారణం గా విసిరెయ్యబడ్డ
ఏ ఒంటరి అనాసక్తతో అయ్యి విలపిస్తున్నా