Sunday, September 4, 2016

నేనూ, నా గతం




నా దృష్టిలో నేనిప్పుడు
ఏ అవహేళన ఆచారంతోనో
చుట్టెయ్యబడిన చేదును
ఏ పుచ్చిన వృక్షం క్రిందో
గాలికి కొట్టుకుంటున్న
ఒంటరి అలజడి
చిరు పసరిక మొక్కను 
ఏ వంగిన పూలరేకుల మీంచో
రాలని ఆవిరైన
వర్షపు నీటి బొట్టును
ఎవరి మాదకద్రవ్యావసరాల
పెరటి మెట్ల క్రిందో గాయపడి
బాధతో మూలుగుతున్న వేశ్యను
ప్రతిదీ ఈ జీవన పుస్తక
అధ్యాయాలే అనుకుని 
చర్మము, ఎముకలు
కోరికల భ్రష్టతతో కూడిన ఒడిదుడుకుల
చిరుజల్లులే జీవనం అని
ఎన్నో పాటించలేని వాగ్దానాల
వాయిదాల విసుగును పంచుతున్న
సోమరి పసితనాన్ని   





నేనేమిటో
నీతో జత కలిసిన
మనమేమిటో తెలుసుకున్న
ఒక తీరని ప్రేమ
తీపి మూలుగును
నేను నీవు కాకపోయినా
అన్ని ప్రమాణికాలు గానూ
నమ్మకమైన సేవకుని
బలహీనపడుతున్న విశ్వాసాన్ని 
నువ్వే నేను అనుకునే
ఒక నమ్మకాన్ని
ఎన్నినాళ్ళు గానో
మనం వెంబడించుతూ వచ్చిన
ఆశలు రాలుతున్న నక్షత్రాలను చూసి 
అన్నీ మరిచిపోయిన నిన్నూ
గతాన్ని
విషాదాన్ని మరిచిపోలేని ....
విషాద చ్ఛాయలను కమ్మేసుకున్న
గతపు వర్తమానాన్ని నేను

No comments:

Post a Comment