Monday, October 29, 2012

చంద్రశేఖర్ వేములపల్లి || జడ్జిమెంట్! ||

ఒక ఆరంభం,
ఒక అంత్యము,
మధ్యలో మనుగడ జీవితం! 
వీటి ఉనికిని తెలుసుకోవాలని
ఎందుకంటే ...
నా ఆలోచనల కలుపుమొక్కల మదిని,
ఉరితియ్యాలని ...
మొదట్లో కానీ,
ముగింపులో కానీ,
వార్డ్ రోబ్ లో హాంగర్ కు ... చొక్కాలా

నేనో కవిని! భావుకుడ్ని!కవిని
ప్రేమ, బాధ, కన్నీరు, ఆవేశం నాలో
సంఘర్షణ అక్షర రూపం
అనురాగం నా పద పేర్పిడి

కోల్పోతుంటాను.
అప్పుడప్పుడూ,
నన్ను నేను, నా కవితల్లో ...
తిరిగి వాస్తవంలోకి రాలేనంతగా,

ఆ భావనల్లో ...
పాత్రను నేనే అయినట్లు,
మరో ఊహా ప్రపంచంలో ...
జీవితం గూడు కట్టుకుని ... కాపురం చేస్తూ,

అస్తిత్వం లేని,
తెలియని దారిలో,
ఎరగని గమ్యం వైపు ...
ఆవేశం కత్తి అంచు మీద నడుస్తూ,

ఒక భావన, ఒక కవిత ...
కవిత తరువాత మరో కవిత రాస్తూ,
లోతుగా భావ అఘాదాల్ని తట్టుతూ,
మరింతగా నన్ను నేను కోల్పోతున్నాను.

నేనో కవిని!
కవిత రాసేప్పుడు,
నా అస్తిత్వాన్ని నా కవితలో ... కోల్పోతుంటాను!
వెనుదిరిగి రాలేనంతగా ...

Sunday, October 28, 2012

అందరిలో నీవూ ఒకడివివయసే వస్తుంది సాధించింది లేదు అని వెరుపు!
వెరుపెందుకు నేస్తం?
అందరిలో నీవూ ఒకడివని మరిచిపోకు.
ఈనాడు
బలంగా, ఆరోగ్యంగా, ఉన్నతంగా కనిపిస్తున్న మనుషులు,
దృఢ చిత్తంతో కార్పోరేట్ సంస్థల్ని, దేశాల్ని ఏలుతున్న మహిళలు
ఒకప్పుడు ...
వారి వారి భయం, భంగపాట్లను, ఎదుర్కొన్న వారే ...
కృంగిపోకుండా, భయాన్ని, నీరసాన్ని ... సామాజిక నిర్లక్ష్యాన్నీ
పట్టించుకోకుండా స్వేదించి, పట్టుదలతో ...
పడిన ప్రతిసారీ అనుభవాల్ని, ఏరుకుని ... లేచి నిలబడ్డవారే
వీరి గెలుపు కు పునాధి, సమశ్యను సూటిగా చూసే ... సంఘర్షణా తత్వమే.

బీదవాడ్ని! బహుజనుడ్ని! దాచుకోలేను అస్తిత్వం అని ... సిగ్గు!
సిగ్గెందుకు నేస్తం?
ఎందరిలోనో నీవూ ఒకడివని మరువకు.
నీ సామాజిక సోదరులు ... స్వేదిస్తేనే కూడు జీవితాలు
ఉదర పోషణార్ధం వృత్తుల ఆదారంగా బ్రతికే ఎందరో సగటు జీవులు
ఒకప్పటి ... దుమ్ము, దూళి, మడ్డి శరీరం మనుష్యులు
ఇప్పుడు దేశాన్నేలే ఉద్యోగిస్వామ్యం, ప్రజాస్వామ్యం ... మంత్రులు, మేదావులు!
నిన్న బట్టలుతికే చాకలి నర్సన్న నేడు ముఖ్యమంత్రి
నిన్న వీదులూడ్చిన గృహిణి రావులమ్మ నేడు గృహ మంత్రి
ఏదీ ఊరికినే రాలేదు వారి వారి స్వేదం, కృషి
వారి అమర ఆకాంక్ష ఫలితమే వారి వారి విజయ కేతనాల రెపరెపలు

ఆలోచించి చూడు నేస్తం! ... అందరమూ కారణ జన్ములమే
ప్రతి పుట్టుక వెనుక ఓ ఉద్దేశ్యం, ఓ కారణం ఉంది
ఈ సంసారం నీది ...
మరిచిపోకు విశ్వమానవాళి కుటుంబంలో నీవో నిర్ణయానివే అని
చెట్టూ, చేమ, జంతువులు ఉభయచరాలు ... అన్నీ మన సహజీవాలే
జీవించడం ప్రవాహం! ... జీవం ప్రకృతి ప్రసాదం!
పంచభూతాల ఆస్వాదన ... ప్రతి ప్రాణి సామాజిక హక్కు
స్వాగతించుదాం! అసంపూర్ణతతలెన్నున్నా ...
మనం జన్మించిన ప్రపంచాన్ని ... మనను స్వాగతించిన నేస్తాన్ని!

Friday, October 26, 2012

భూమిని మోస్తున్న భావన నాలోఒంటిరితనం మోపులా బారమై ... తలమీద
బలహీన, దుర్బల శరీరం
నిస్తేజం అవుతున్నప్పుడు
ఆశ్చర్యం అద్భుతం సాన్నిహిత్య మహిమ

ఒకవేళ ఒంటరితనానికే తూనికుంటె,
నేను మోస్తున్న ... బారం 
ఇప్పుడు నేను మునిగున్న ఒంటరి మౌనం ...
వెయ్యి రెట్లుంటుంది

ఎంతద్భుతమో సాటి మనిషి స్నేహం వెచ్చదనం
ఎంత తేలిక చేస్తుందో మనసును
ఉల్లాసం కలిగిస్తుందో హృదయంలో
ఎంత సంకటం లోనూ ... ఎంతటి జీవన సంక్షోభంలోనూ

నాలో ఒంటరితనం దూరమై బరువు కోల్పోయిన ఉల్లాసం
ప్రేమరాగం పల్లవించిన వసంత ఋతువులా
బారమంతా దిగిపోయిన భావన
తోడుగా నీవున్నావనే ఆలోచనలో ... నీ సాన్నిహిత్యంలో

Wednesday, October 24, 2012

సంసారం!నాలో అగ్ని,
ఆవేశం, ఉద్వేగం
వెచ్చదనం మనోసాంగత్యం
కామక్రోధాదిగుణరసం!

నాలో మంచు,
చలి, సీతలత్వం
ద్వేషం విషం
వైమనస్యం మనసు విరుగు లక్షణం!

నేను
సూర్యుడ్నైతే
ఉల్లాసము, ఉత్సాహము, చైతన్యం
నేను
చంద్రుడ్నైతే
విచారము, వ్యాకులము చీకటి దొరతనము!

నేను, ఆమె
మా ఇద్దరి మధ్య సన్నని మార్గం లో
ఇద్దరం కలిసి నడుస్తున్నాము
సంప్రదింపుల సమాలోచనలు చేస్తూ
..........
మా ఇద్దరికీ తెలుసు
మానవాళి యావత్తూ
సృష్ఠి, స్థితి, లయ అనే
భిన్న దశల చైతన్యమే అని
ప్రేమ, ద్వేషం
నిప్పు, మంచు ... జీవన సాగర మదనంలో
మజిలీలే అని ...
ఉష్ణాన్నీ, చలినీ
అవసరేత్యా ఆశ్వాదిస్తూ ... జీవించి ఉంటూ,
ఎదుగుతూ, రేపటి పౌరుల జన్మలకు కారణం మేమే అని

Tuesday, October 23, 2012

చంద్రశేఖర్ వేములపల్లి || ప్రేమే జీవనం! ||

నా నిశ్చల మనోభీష్టం
గాలినై, నీ శ్వాసనై ...
నీ గుండెను చేరాలని,
రక్తాణువులను శుద్ది చెయ్యాలని 
ఉప్పొంగే వరదలా,
దమనులు సిరల్లో కదలికనై
నీ ప్రతి అణువులో ఆక్సీజన్ నై
నూతన చైతన్యం,
ఉల్లాసం ఆహ్లాదాన్నై
అమర ఆనందాన్నై
ఉండిపోవాలని ... నీ జీవితంలో

వాగునై,
వరదనీరునై,
నదీ ప్రవాహం
కదలికలో వడినై ...
ప్రేమ సడినై,
హోరునై వినపడాలని
నా హృదయపు విరహతాపం
బలవంతపు దాపరికం
బయటపడుతూ దాచుకుంటున్న
మోహరాగం మొండిపట్టుదలను
ఆశను విరహపు
నిశ్శబ్ద గడియల ఆవేశాన్నీ
నిబద్దం చేసుకుంటూ సాగాలని

పూర్ణగ్రహణం
మనసును పట్టి
ప్రేమకు పరీక్షై
నిస్థైర్యం చెందే క్షణం
నీ ఆకర్షణే బలం!
నీ కళ్ళ అత్యుత్సాహం
చూపుల సూదులే ఆయుధం!
నీ తలపుల్లో
నక్షత్రాన్ని నేనై
తళతళమని మెరిసే
ప్రేమ కిరణాల స్పర్శ ... తో
జీవితం స్వర్గదామం కావాలని ...

2012, అక్టోబర్ 24, బుదవారం ఉదయం 11.30 గంటలు

Monday, October 22, 2012

ఆరాటం!
ఈ మధ్యనే
నీవు నాకు పరిచయం అయ్యింది
కానీ
నా మనసు భావనల్లో
ఎన్నో జన్మల అనుబంధం అనిపిస్తుంది

ఉల్లాసమో
వొణుకో నాలో
నిన్ను స్పర్శించాలనే ఆలోచన
నీ చెయ్యందుకుని
అలాగే ఉండిపోవాలని అభిలాష

ఆనందమో
మురిపెమో వెలుగై నాలో
నీ సాన్నిహిత్యం
మనోవాంచై
ఎప్పటికీ నీతోనే ఉండిపోవాలని

మోకాళ్ళలో తడబాటు
నిలబడలేని అలసట,
నీరసం ... గాల్లో తేలిపోతున్నట్లు
నీ కౌగిలి చేరి
కలకాలం సేదదీరుతూ అలానే ఉండిపోవాలని

నీ ముద్దు
నిశ్వాసల వేడికి నా నుదురు
శరీరం ... ఆవిరై
అద్దిన ఆ పెదాలు
అలానే ముద్దై మిగిలిపోవాలని

హృదయం ఊగిసలాడుతుంది
నీ ఆత్మీయత
చిరునవ్వు కోసం
కొలత కందని
నీ మనొజ్ఞ ప్రేమ కోసం!

నా ఆలోచనల్లో


నిద్దుర రావడం లేదు
మనసు నిండిన నీ ఆలోచనలు
మరిచిపోలేను ... నిన్ను
నీకైనా తెలుసా మరుపెలాగో

ప్రతి రాత్రి నిద్దురలో
నా కలలు నీ, నా చుట్టూ
నీవూ నేనూ కలిసున్నట్లు
కలిసి జీవిస్తున్నట్లు ... కల నిజమయ్యేనా అనిపిస్తూ ...

కాళ్ళూ చేతులూ ఆడని
అసమర్ధజీవిని ... నా తలలో, మెదడులో
నీవులేని క్షణాల్లో ... ప్రతి రాత్రీ ఆలోచన్లు
నీ గురించే ... ఉలిక్కిపడి లేచి కూర్చుని మరీ,

నా పక్కన నీవున్నప్పుడు
నీ సాన్నిహిత్యం ఊపిరాడనట్లు ... శ్వాసించలేను
అయినా ఇష్టమే ... నీతోనే నీలోనే ఉండిపోవాలని
అనుక్షణమూ అను నిత్యమూ ...

మనం కలిసి కదులుతున్నప్పుడు
నాలో వొణుకు ... మాటలు రాని మౌనం
శరీరాన్ని అల్లుకుపోయి శ్వాస వేగం పెరిగి ... ఉద్వేగం
అయినా ... స్తిమితపడి అన్ని భయాలు ఆవిరై పోయి ఆ స్థితే కావాలని ఆశ!

నీ కళ్ళలోకి చూసినప్పుడు
నన్ను నేను కోల్పోయిన భావన
నీతో ఉండటం కోసం దేన్నైనా
మూల్యం చెల్లించాలని అనిపించే లక్షణం ... ఆవేశం!

నా ఆలోచనల్లో ... నాకు నేను
పిచ్చివాడ్నైపోతున్నానేమో అనిపించే అచేతనావస్థ అది
నా హృదయం మెదడును శాసిస్తున్న క్షణం
నిన్ను నేను ఘాడంగా ప్రేమిస్తున్ననని సంకేతాలిస్తూ నిర్దేశించే గుణం!

నీపై మోహం ఎందుకో!?


నీపై మోహం ఎందుకో అని మీమాంస
దేన్నైనా చెప్పాలనిపించే ... వినే నిండుతనానివి నీవు!
నన్నెప్పుడూ సమర్ధిస్తున్నట్లు ... నీ చూపులు
ఎంత మాట్లాడినా ... ఆసక్తే ఆ కళ్ళల్లో
నీ కళ్ళు, చిరునవ్వు ... నీ మృదు శరీరం స్పర్శ నాకిష్టం!
కాలం తెలియని మన పార్కుల కదలికలు
వెన్నెల గుసగుసలు ... నెమ్మది మాటలు
మరిచిపోలేదు ... మరిచిపోలేని క్షణాలవి
ఒక వెన్నెల సాయంత్రం ఎదురెదురుగా నీవూ నేనూ
నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నీవన్నావు ...
"నేనంటే ఇష్టమని! నన్ను ఘాడంగా ప్రేమిస్తున్నానని"
నేను పరిపూర్ణుడ్నని నీవన్నట్లనిపించిన క్షణాలవి!
నీ దృక్పథం, నీ వ్యక్తిత్వం నాకిష్టం!
నీవు నాపక్కనున్నప్పుడు జీవితం వరంలా అనిపిస్తుంది
నిన్ను నిన్నుగా ప్రేమిస్తా! నన్ను నన్నుగా ప్రేమించూ అని
ఒకరికివొకరం సమభావం, సాన్నిహిత్యం ... జీవన సహచరులం కావాలని
మాటల్లో చెప్పలేని విడమర్చలేని మోహ భావనల మౌనరాగం!

ప్రేమ రాగాలాపనలో


మార్పు, ప్రేమ, ప్రియురాలంటే భయం
అయినా ప్రేమిస్తున్నాను
సాంప్రదాయాల గోడలు ... దూకాలని లేదు
అయినా దూకుతున్నాను
పెద్దలున్నారు ... మంచీ చెడూ విడమరుస్తూ
అయినా చెడువైపే కదులుతున్నాను
పెద్దలంటే గౌరవం .... నీవంటే ప్రేమ
అయినా నిన్నే ప్రేమిస్తున్నాను
మారిపోయాను  
సాంప్రదాయాల గోడలు దూకాను
పెద్దల మాటల్ని దాటాను
అయినా నాకు తెలుసు
నేడో రేపో స్వేచ్చావాయువుల్ని పీలుస్తా అని
ఆకాశం తలకప్పవుతుందని
పంచభూతాల సాక్షులై
నూతనధ్యాయం మొదలని
ఆలోచిస్తేనే
పులకరింపు, పరవశం, ఆనందం నిలువెల్లా
సిగ్గొదిలి నర్తించాలని
కారణం తెలియని నీ సాన్నిహిత్య మధురిమలో
ప్రేమ రాగాలాపనలో
మనసుకెందుకో అప్పుదప్పుదూ భయపదుతుంది
నిన్ను కోల్పోతానేమో అని
నీవు నా ఆనంద పారవశ్య పులకరింపుల
సమభావం ఇష్టపడవేమో అని
నవ్విస్తావో ఏడిపిస్తావో
అసంపూర్ణంగా వదిలేస్తావో
పరిపూర్ణత్వాన్నిస్తావో తెలియనితనంలో ఉన్నాను
నీవో పువ్వువి ... నేనా పిల్లనగ్రోవినిసుమా!!

కలలు నేల జారి ...


ఆ మూల
ఆకాశాన
ఒక నక్షత్రం
ఒక దేవత నా కోసం
స్వర్గాన్నొదిలి
స్వేత వస్త్రాలతో
తెల్లని మంచులా
పాల మీగడ సౌందర్యం
సాక్షాత్కరించింది
మరువలేని మల్లియనవ్వును ముఖాన అద్దుకుని

ఒక
ప్రేమ దేవత
దైవ సాన్నిధ్యాన్ని
గుడినొదిలి
నా కోసం
ఆశల్ని, ఆనందాన్ని
ఊహలసారం ప్రేమను
ఒడినింపుకుని
తెల్లని రెక్కలు ఊపుతూ దిగి వచ్చింది
ఆశల సుగందాన్ని వెదజల్లుతూ

ఒక
అదృష్టం
కోరని వరమై
స్వర్గాన్నొదిలి
నా ఇష్టాల మట్టి ముద్దై
రంగులు పులుముకుని
ప్రత్యక్షమయ్యింది
చెయ్యి చాచి చెయ్యందిస్తున్నంతలోనే
మాయమైపోయింది నా కల మెలుకువై నేల జారి మరీ

నన్నొదిలెళ్ళకు!?


మబ్బులు రాసుకున్న మెరుపు
ఉరుమై
... హృదయం
బ్రద్దలైన శబ్దం
భరించలేని నొప్పి కన్నీరు ...
గొంతు గద్గదమై

మొదటి మేఘ మదనం
తొలిప్రేమ
మహా మాయ
జల్లై కురుస్తున్నప్పుడు
ఒణుకు, తడబాటు
నేనెరుగను
ఎడబాటు ఇంత కష్టమని

భయం నా చుట్టూ అల్లుకుపోయి
సముద్రంలో అల్పపీడనమై
వెంటాడుతుంది
ఆశ, ప్రార్ధన
ఇలాంటి రాపిడి తగదని
నీవు నాతోనే ఉండాలని

మళ్ళీ కురుస్తానని
తిరిగొస్తానని
ఇంద్రదనస్సై అలరిస్తానని
మాటిస్తున్నావు
నా కెలా తెలుస్తుంది
ఎక్కడ, ఎలా, ఏక్షణంలో అని

చీకటి ఊహల్లో,
అనుమానాల్లో వదిలెయ్యకు
తొలకరిచినుకు
సాహచర్యపు మధురిమ
మరిచిపోలేని పుట్టుమచ్చ
అనుక్షణమూ ... కళ్ళముందే కదులుతుంటే ...

అనుభుతుల అల్లిక


ఆకాశం మంచంపై కప్పుకున్న
దుప్పటి మీద నక్షత్రాలు ... నా కన్నీళ్ళు
అలసి విశ్రమించే ...
బాధలు, సంతోషాలు,
విజయాలు, అపజయాలు నెమరువేసేది
కారుమబ్బుల తలదిండులోనే ...
తల దాచుకుని విలపించేది, ఆనందించేది.
ఉద్వేగాలు చల్లారి,
శరీరం కంపించడం మానాక,
హృదయం చంద్రుడి మెత్త ... ఆ లేత మేఘాలు
సముద్రపు నీరే అంతా ... నా మంచం అంచుల్లో ...
ఆకలి మంచానికి ఎవరో రావాలని
చూడాల్సిన అవసరం లేదు!
నా కన్నీళ్ళే ఆహారం!
ఆకలికి ఆహారాన్నౌతూ ... ఆలోచనలు
మది శూన్యంలోకి చూస్తూ ...
ఆలోచనలు క్రిందికీ, పైకీ ఊగిసలాటలు!
క్రమశిక్షణ లేకుండా ...
సంతోషాన్ని మాత్రమే ...
ఆలోచనల టేప్ రికార్డర్లో
రివైండ్ చేసుకునే వీలుందేమో అని ...
వెదికి, చూసి భంగపడ్డాను
మంచాన్ని అతుక్కుని ... నేను
ఆశ, ఆపేక్ష లేని మాంసపు ముద్దను!
నా రాలిన కన్నీళ్ళు ... ప్రత్యేకం!
తారలు, నక్షత్రాలు ...
అనుభూతులు వదులుకోలేను! మరిచిపోలేను ...
నెమరువేసుకుంటూనే ఉంటాను ...
ఆకాశం మంచంపై
కప్పుకున్న దుప్పటి మీద
తారలు, నక్షత్రాలు నా కన్నీళ్ళు
అలసి విశ్రమించాక ... అనుభుతులు తపనల అల్లిక నేను!

నిదుర రాదు!
కొన్ని రాత్రులు రాలేక, 
నిదురమ్మ సిగ్గుపడి ... దూరంగా, వొదిగి.
అలక్ష్యమో, గర్వమో, తిరస్కార భావమో!

కపటం, కుతంత్రాల విఫలప్రయత్నానంతరం
నిదురమ్మను నమ్మించలేక ... అహం
దెబ్బతిని అవామానం...తో నిదురమ్మను చేరలేకే ...

నేనే నీవనుకునేవు!


నేనే నీవు అనుకునేవు
నీలో నన్ను పోగొట్టుకున్నాననుకునేవు
పోగొట్టుకోలేదు ... అనుకున్నానే కాని
అడవి కాసిన వెన్నెల్ని,
సముద్రాన కురిసిన మంచును,
మండుటెండలో వెలిగించిన కొవ్వొత్తిని ... కావాలని

నీవు నన్ను ఇష్టపడుతున్నావు!
ప్రేమిస్తున్నావు ...
చూస్తూనే వున్నాను ... నిన్ను
అందం వికశిస్తూ, నీ ప్రాణం, నీ ఆత్మ ను
అయినా, ఎందుకో ... నేను నేనే!
వెలుతురులో వెలుతురు నై పోవాలని అశించానే ... కాని

ప్రేమ మోహావేశంలో లోతుగా మునిగి
నాడి, జ్ఞానం, స్పర్స అన్నీ కోల్పోయి
మూగవాడ్నై, గుడ్డివాడ్నైపోవాలని  
నీ ప్రేమ తుఫాను, గాలివానలో
కొట్టుకుపోవాలని,
గడ్డిపూచనై, ఆకునై ... అరటినై ప్రియతమా!

నీతోనే ఉన్నాను!


సమాధిలా ...
నా సమాధిని పలుకరిస్తున్నావు!
సమాధి పక్కన నిలబడి విలపిస్తున్నావు!
సమాధి...లో నేను లేను.
అలసిపోయి ... సేదదీరడం లేదు.

గాలిలో ... తలలూపే చెట్ల,
కొమ్మల, ఆకుల ... సవ్వడిలో ...
మంచు కురుస్తున్న పర్వతాల తెల్లని
ఆచ్చాదనం మీద,
పరావర్తించే మెరుపు లక్షణాన్నై ఉన్నాను!

మంచు తుంపరులు
కడిగిన,
ఆకుల పత్రహరితాన్నై ...
సున్నితంగా తట్టి లేపే
శరత్కాలం వర్షాన్నై ... నీతోనే ఉన్నాను!

ఉదయపు దినచర్యల హడావిడీలో
పురోగమన ఆలోచనల ప్రేరేపకాన్నై ...
కోకిల గానాన్నై
చికటి రాత్రుల్లో ...
వెలుగులు కిరణాలు వెదజల్లే తారనై ఉన్నాను.

సమాధిలా ...
నా సమాధిని పలుకరిస్తున్నావు!
పక్కన నిలబడి విలపిస్తున్నావు!
సమాధిలో నేను లేను.
నిజానికి నేను మరణించిలేను.

నేనక్కడ నీ పక్కన ...


నా కోరికే నేనక్కడుండాలని
శుభరాత్రి ముద్దుల బహుమతులందిస్తూ ...
నా కోరికే నేనక్కడుండాలని
నిన్ను కదలకుండా పొదివి పట్టుకుని, హత్తుకుని ...
నా కోరికే నేనక్కడుండాలని
నీ వికశిత ముఖం చూస్తూ, దివినుండి భువికి
నాకోసం దిగి వచ్చిన దేవకన్యవని ఆశ్చర్యపోతూ
నా కోరికే నేనక్కడుండాలని ... నీపక్కనుండాలని ...

నా కోరికే నేనక్కడుండాలని
రాత్రి తెల్లవారు జామయ్యేవరకూ
నా ప్రియ సఖీ ... నీ సరసనే కూర్చోవాలని
నా కోరికే నేనక్కడుండాలని ...
నీక్షేమమే, నా లక్ష్యమనే నిజం గుర్తుచేస్తూ,
నా కోరికే నేనక్కడుండాలని ... నీపక్కనుండాలని
నా హృదయం నీ మనసు పంజరంలో బంధీ అని  
అందులో దివ్య మనోహర రూపం నీవేనని నీకు చెప్పాలని ...
నా కోరికే నేనక్కడుండాలని ... నా కోరికే నీపక్కనుండాలని

అశరీరవాణి!


నిశ్శబ్ద నిశీధిలో
శిలలా,
అచేతనంగా,
బారంగా శ్వాసిస్తున్నా!

మెరుపులు, ఉరుములు ... సవ్వడి విని
ఉలిక్కిపడ్డాను.
ఆ మెరుపు వెలుగుల్లో,

అశరీరవాణి పలుకరించినట్లు,
సుమధుర శబ్దం!
"జన్మించినందుకు జీవించడం నీ బాధ్యత! అంటూ"

తల తిప్పి కనిపించని చీకట్లోకి,
కళ్ళార్పుతూ ప్రశ్నార్ధకంగా ...
నా చూపులు!

"మంచిని, మనుగడగలిగిన సమాజాన్ని,
మంచి ప్రపంచాన్నీ నిర్మించు!" అని ...

ఆశ్చర్యమేసింది.
ఎలా?
ఇంత విశాలమైన ప్రపంచంలో ...
అణుమాత్రం మనిషిని,
నా వల్ల ఏమౌతుందీ అని!?

పదాలు పెదాల్ని దాటకుండానే ...
విన్నట్లు,
మళ్ళీ అశరీరవాణి అంది.
మృదుమధుర స్వరంతో ...
"నిన్ను నీవు నిర్మలంగా, నిష్కల్మషంగా .. మనిషిగా మల్చుకో చాలు! అని

ప్రేమ రాగం!


నిశీధిలో వినీలాకాశంలో నక్షత్రాలను చూడు!
ఎన్నుంటాయంటావు?
నీ, నా దూరాన్ని కొలిస్తే ... వచ్చే క్షణాలంతైతే కాదు!

సముద్రపు వొడ్డున కొట్టొకొచ్చిన యిసుక రేణువుల్ని చూడు!
ఎన్నుంటాయంటావు?
నీ మీద నా నమ్మకాన్ని మించైతే లేవు!

సముద్రుడ్ని పలుకరించి చూడు!
ఎన్ని నీటి చుక్కలు కలిసి సముద్రమయ్యిందో అడుగు?
నేను నిన్ను ఆశించిన ... ఆశల సంఖ్యను మించి అని అనుకోను!

నీ హృదయం కొట్టుకుంటుంది చూడు!
ప్రతి స్పందననీ విను! ... ఎన్నిసార్లు స్పందిస్తుందో గణించు!
గణించలేవా! నేను చెప్పనా! ... నీపై నాకు ప్రేమ ఉన్నంత! ... నేస్తమా శుభోదయం!

మరువలేని ప్రేమ


నీతో మాట్లాడుతున్నప్పుడు
అంత ఆహ్లాదం, అంత ఉల్లాసం
నాలో ఎందుకో అని
ఆలోచిస్తూఉంటాను సదా ...
అంత అందంగా ఎలా ఉంటావో అని
పలువరస కనిపించేలా శబ్దం రాని నవ్వు
నీవు నవ్వుతున్నప్పుడు ...

ఆ నవ్వు నాకెంతో ఇష్టం
పగటికలలు నాలో నేను
నీతో గడుపుతున్నట్లు
నీ కోకిల స్వరం మాటలే తిరిగితిరిగి వినిపిస్తూ
నీ ప్రతి చర్యనూ కొనియాడుతున్నట్లు
నీ ముద్దుముఖాన్ని
కళ్ళుమూసి మరీ చూడగలుగుతున్నట్లు ...
ఆ కలలో ... నీవు నన్నే ఆపేక్షగా చూస్తున్నట్లు

అప్పుడప్పుడూ నాలో నేనే
నవ్వుకుంటుంటాను
నా పగటి కలల్ని గుర్తు తెచ్చుకుని
ఆశ్చర్యపోతుంటాను
ఏం జరుగుతుంది ... ఆ ఆనందాన్ని తట్టుకోగలనా
ఒకవేళ మనం ఒకటైతే అని ...
ఊహల్లో సంఘటనలు వాస్తవాలు కావని తెలిసీ ...

ఒక్కటి మాత్రం నిక్కచ్చిగా చెప్పగలను
నా ఆరాధన నీవేనని
నీ సాహచర్యమే గమ్యం ...
అందుకోసం
దేన్నీ లెక్క చెయ్యను
ప్రతిక్షణాన్నీ ఆశ్వాదిస్తాను
నీవు నాతో ఉన్న క్షణం క్షణాన్ని ... మధుర లక్షణాన్ని ...

సహజీవనం!


బద్దకం వొదిలి,
మేలుకొలుపు ఉదయాన
నేనే నీ ఆలోచనల్లో ...
మొదట్లో ... కాకతాళీయము, యాదృశ్చికము అనుకున్నావు.
ఇప్పుడే తెలిసింది నీకు ... అది ప్రేమే అని!

నే నెదురుపడ్డ ప్రతిసారీ నీది నవ్వుముఖం
నీకే తెలియకుండా ...
అంతం లేని ఆలోచనలే అను క్షణం ... నా గురించి
అచేతనురాలివి ... నా సాన్నిధ్యంలో
నా కళ్ళు నీ అంతరంగంలో చొరబడి అలజడి చేస్తున్నట్లు

ఏవరో ఏదో అనుకుంటారని
నీవెప్పుడూ నాకు దూరం కావాలనుకోలేదు
అనుక్షణం నాతోనే గడిపెయ్యాలనే చూసావు.
చూపుల సంగమం మాత్రమే చాలదని ...
నీదీ నాదీ ప్రేమే నని ... సహజీవనం నీ నా గమ్యమని ...

శాంతి కాముకులే


నిన్ను నిన్నుగా ప్రేమించి
నీకోసమే జీవించే
మనిషంటూ, మనసంటూ లేదా!
నీ జీవితం అసంపూర్ణమే!
నీవు నిరుపేదవే!
ప్రేమే ఆవేశం, భావం ... కనుక ...

జీవితానికి అవసరం ... ఎంతో ముఖ్యం ...
ప్రేమ జీవన నాణ్యతను పెంచి
వివేకాన్నీ వెలికితెస్తుంది.
జీవనసరళిని
నడవడికల్ని మార్పు వైపు ...
ఒకరి జీవితమ్నుంచి ఒకరు
నేర్చుకునే ప్రక్రియే ప్రేమ!

ప్రపంచంలోని అమూల్యమైన
ఎన్ని సమకూర్చుకున్నా ...
చిన్ని చిన్ని లోపాలున్న ఇద్దరు
ఎవరి జీవితం వారు జీవిస్తూ,
ఒకరి లోపాలు ఒకరు కవర్ చేస్తూ ఒక్కటై ...
సహగమనం సాగిస్తూ,
సంకల్పాన్ని విశదపర్చడమే ... ప్రేమ!

ప్రేమ ముఖ్యం ... ప్రేమ లేని జీవనం అసంపూర్ణం
ప్రేమ జంట ...
జీవితం సమర్థవంతం ...
ఎంతో సరస, సున్నిత సహగమనం ...
ప్రతిదీ పరామర్శించుకుని చర్చించుకుని ...
సాగే సహజ, సహకార యానం ...
సర్వం తెలిసిన ... శాంతి కాముకులే ప్రేమ జీవులు!

ఒంటరితనం!


విషాదం ఈ క్షణం నాలో
అర్ధం కాని ఏదో బాధ
వెంటాడుతూ
ఎవరూ తోడులేని ఒంటరితనం
వెలిసిపోయిన ఈ జీవితం!

నాకు తెలియదు నాకేంకావాలో
ఏవరో రావాలి.
ఈ హృదయం రక్తాన్ని ఓడ్చడం మానాలి.
నరనరాన్నీ పిండే బాధ ...
ఏ స్నేహ హస్తం ... ప్రేమ హస్తం అందించాలని,

నా హృదయం గాయపడింది.
నలిగిపోయింది.
సరి చేసే ఊరటకల్గించే సాహచర్యం
నాతో ఎవ్వరూ లేని ఈ క్షణం
నిన్ను నా సరసన చూడాలని ఉంది.

నా ఈ కన్నీళ్ళు నిజం!
నీకై ఏడ్చిన ... గురుతులు ... అబద్దాలు కాని నిజాలు
ఒంటరితనమే నన్నలా
విచక్షణ కోల్పోయేట్లు చేస్తుంది.
నిజానికి ఇప్పుడు నేను ప్రాణం ఉండీ లేని వాడ్ని!

ప్రత్యేకంగా ... నాకు కావాలి ... నీవు
ఈ క్షణమే ... నీతో
నేను మాట్లాడలేకపోతున్నాను.
ఏదో ఒకరోజు నీవే వస్తావని ఆశ ... నాతోనే ఉంటావని,
ఎదురుచూస్తున్నా ... నా కన్నీరు తుడుస్తావని ...

ప్రేమ దేవతా సుఖీ భవా!


నా జీవితానికి అర్ధం
నీవూ ... నీ చిలిపి చేష్టలు
నీలో బాగమై ... నాహృదయం
నీవే నా బలం
నీతో ముచ్చటించని క్షణాల్లొ జీవనం!

పడిపోయాననుకున్నప్పుడు,
ఆసరా నీవు ...

ఒంటరిగా ఉన్నప్పుడు,
నా ఆలోచనల మధురస్మృతివి నీవు ...

ప్రతి చర్యలోనూ,
వెలుతురు దారి పరిచినట్లు
నా హృదయం ...
ప్రేమమయమైన నీ ఆలోచనలతో
చైతన్యవంతమై ....

గాయపడ్డప్పుడు,
ప్రేమ లేపనం రాసినట్లు ...

బాధలో ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు,
బాం అయి ... హాయిని కల్పించినట్లు ...

హృదయానికి కాలం తోడు ...
గాయం మానడానికి!
ఆత్మకు హృదయం తోడు ...
భావనలు పెరగడానికి!

నీవు అన్నప్పుడు
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని

ఆ మాటలు
అశరిరవాణి మాటల్లా ...
మెరుపుల్లా, అద్భుతమైన ...
గాల్లో తేలిపోతున్న భావనల క్షణాలవి!

నేను శక్తివంతుడ్ని!
ప్రపంచమంతా ఒక్కటైనా,
ఎదిరించే బలం ... నా నరనరాల్లొ
నీ హృదయం లోంచి ప్రవహించడం మొదలయ్యింది ...
ఆ పదాలు నీ పెదాల్ని దాటిన క్షణం నుంచీ!

నీ సాన్నిహిత్యం ... ప్రేమ మహిమ
ఇప్పుడే నా హృదయం, నా ఆత్మల్ని
పరామర్శించి
ప్రేమ మళ్ళీ నీ హృదయాన్నే చేరింది
ప్రేమ దేవతా సుఖీ భవా!

చూడలేను ... నీ బాధను


చూడలేను
నీ బాధను
సొట్టలు పడాల్సిన బుగ్గలపై
జారిన కన్నీటి తడిని
నీలో అలజడిని
ఏడుస్తూ నీవు నా ముందు
నిలుచున్నట్లు ... ఊహించలేను!

నీ బాధల్నీ
కారుతున్న నీ కన్నీటిని
ఒక్క ముద్దుతో తుడిచెయ్యాలని ...
ప్రేమోల్లాసాన్నీ
పలుకరింపును ... వినాలని ...
మాటల్లో కాదు
కళ్ళతో, నీ హావభావాల్తో
ముచ్చట్లాడాలని ...


కాలం చేసిన
గాయాల్ని మాన్చే ప్రకృతినై
మనశ్శాంతినై
కష్ట సమయాల్లో నీ చెయ్యందుకుని
నీతో నీ మన్సులో
గూడు కట్టుకుని
శ్వాసనై ...
దైర్యాన్నై ...
ఒదిగి ఉండాలని ... 


చూడలేను
నీ ఏడుపును
ముద్దాడాల్సిన బుగ్గల్ని
చారలమయం చేసే
కన్నీటిని ...!

నీవే నా అన్నీ ...


నీవు లేని నేను
జీవించలేనని ...
నీవే
నా అన్నీ అని
నీవు దూరం కావడం వల్లే
అర్ధం అయ్యింది.

నీ బాద్యతలే
నిన్ను నాకు
దూరం చేసాయని తెలుసు!
ఎందుకో ...
నాకు ... ఈ దూరం
దూరమైన సమయం
క్షణాలు యుగాలైనట్లు ...

మనం
మాట్లాడుకోలేదు!
కొంత కాలంగా ...
నీవనుకోవచ్చు
ఒక్క రోజేగా అని ...
అనుకోలేకపోతున్నాను.
నాకుమాత్రం నెలలా ... ఏడాదిలా ...

నీ గొంతు వినాలని,
నీ స్పర్శ ... అనుభూతి చెందాలని ...
నీవు నీ ఒడిలో
నా తల ... జుట్టులో వేళ్ళు దూర్చి
ఆడుకుంటూ ... ఆ క్షణాలు
మన
ప్రతి ఐక్యంలోని ... భావనలు,
అనుభూతులు తిరగెయ్యాలని ...

నిన్ను కోల్పోయిన,
దూరం చేసుకున్న ...
విరహ వేధన
నన్ను విశ్రమించ,
నిలబడనియ్యడం లేదు
నిజం!
ఇదో తియ్యని తపన ...

నా ఆకాంక్ష ... మాత్రం
నీవూ నేనూ
విడదీయలేనట్లు ...
ఒక్కటై ...
ఒక్కచోటే ... ఉండాలని,
ఎదురుచూపుల హృదయభారాన్ని తగ్గించుకోవాలని ...
సమయం నీకూ నాకూ మద్య దూరం కారాదని ...

ఏనాడూ ...


ఏనాడూ అదురుతున్న
పెదాల
అల్లరి ఆహ్వానాన్ని
మన్నించలేదు!
ఆమె
అనురాగాన్ని, శరీరాన్ని,
పెదవుల్ని
చూపుడువేఅలితో తట్టలేదు!
ఆమె తో
పానుపు
సాహచర్యం ...
సేద దీరలేదు!

ఆలోచనల్లోలా,
ఊహల్లో లా,
లెక్కలకందనన్ని సార్లు
ఒక్కటైయ్యున్నట్లు ...!!
ఆమె
కళ్ళలోకి
పనిమాలా
చూడ లేదు!

ఆలోచనలు,
అల్లరి,
ఆవేశం ...
కలిసి చేస్తున్నా ...!
ఆమె ప్రేమ
సముద్రమంత ...
తేనె కంటే తియ్యన ...
అనురాగపూరితం అని తెలుసు!

ఆమె నేనూ ... ఒక్కటే!
శరీరాన్ని
తట్టకుండానే
తలపుల్నీ ...
మెదడును ...
హృదయాన్నీ ...
తట్టి లేపే ప్రేమ మాది!!

నాకు ... నీవున్నావు


పరిస్థితులు,
వాస్తవాలు ... కఠినంగా ఉండి,
ఆశ ఆవిరైపోతున్నప్పుడు ...
ముఖాన చిరునవ్వు అద్దలేక ...
బ్రతుకు దుర్బరమని అనిపించిన క్షణాల్లొ ...
నాకు ... నీవున్నావు సహకారం అందించడానికి ...
ముందుకు కదలడం ... బరువులు మొయ్యడంలో ఆసరాగా
నేను మళ్ళీ తేరుకునే వరకూ ... నీ శక్తిని ... నాశక్తిగా
నాకాళ్ళమీద నేను నడిచే వరకూ ... నాకు ఊతకర్రలా ...
నేను ఒంటరిని కానని గుర్తు చేస్తూ ...
పరిజనులు
స్థితులు ...
వాస్తవాలు ... కఠినంగా మారినప్పుడు ...
మారడం ప్రాకృతికం కనుక
నీవు నాతోనే ... నా చెంతనే
సహధర్మాన్నీ ... సహజీవనాన్నీ గుర్తు చేస్తూ ...

నీ ప్రేమ కోసం ...అలల ఫెళఫెళ ద్వనులతో సముద్రం
వన్నెల వెన్నెల రాక కోసం ముస్తాబయ్యే సంద్యారాగం
చెట్ల కొమ్మల ఆకుల గాలి గుసగుసలు
వయ్యారంగా  రాంప్ మీద నడుస్తున్నట్లు ... నది

వాడి చూపు రక్కసి రాబందుల ... గగన విహారం
చిరుతపులి లంఘింపులోని చురుకుదనం
ఎక్కడో ఆకాశంలోంచి నక్షత్రాలు రాలుతున్న దృశ్యం
కొండలు కోనల్లో ప్రతిద్వనించే శబ్దతరంగాలు

ఎర్రనేల బంగారం పై ఎదుగుతున్న గడ్డిపూల సొగసు
అరుణోదయ రాగపు కుళాయిల్లోంచి పారే చైతన్యం ... ఆవేశం
శ్రమ, సేద్యం సౌజన్యం పంటలు వెదజల్లే సౌభాగ్యం
రాత్రి పొదిగిన నల్ల రంగు నిద్దురలో పొందే ఊహల పరవశం

దైవాన్ని చూడగలిగిన స్వచ్చమైన పసిపిల్లల శ్వాస
పాలకడలి లాంటి అమ్మ మనసు అనురాగం మమకారం
ఉయ్యాలలో పసితనం కేరింతల నవ్వుల శబ్దం
కన్నతండ్రి గుబురు మీసాల మెరుపు ఆశల రూపం

మనసు కోరికలు ... అమూల్య సంపదలు
ప్రతి మనిషి జీవితపు ఆశ, లక్ష్యం.
నాకు మాత్రం ఎందుకో, మనోహరమైన నీ రూపం కోసం
ఈ క్షణంలో ... ఇవన్నీ వొదులుకోగలననిపిస్తుంది!

అక్కడ ... ఇక్కడెప్పుడు?సాయంత్రం కదిలి
చాప కింద నీరులా
చీకట్లు ముసురుతూ
చిత్రమైన భావనల
సామ్రాజ్యం ఆరంభమౌతుంది!

అక్కడ ...
మూసే నా కనురెప్పల
తలపుల వార్డ్ రోబ్ లో
హాంగర్స్ కు వేలాడుతూ
పక్కపక్కనే మనిద్దరం

అక్కడ ...
తెలిసీ తెలియని తనంలో
తప్పటడుగులు వేస్తే
అమాయకంగా మోసపోతే
సరిదిద్దడానికి
ధైర్యం ఆసరా గా నీవుంటావు.

అక్కడ ...
జీవితం అనుభవాలు
భరించలేని బాధలై
పుండై సలుపుతుంటే
శరీరం స్థిమిత పడలేకపోతున్నప్పుడు
ఓదార్పుగా నీవుంటావు.

అక్కడ ...
ప్రకృతి అందాన్ని,
ఎగిరే పక్షుల్నీ చూసి
నేను పరవశిస్తున్నప్పుడు
నా ఆనందం పంచుకోవడానికి
నా ప్రతి చిలిపిచేష్టల్ని
స్వాగతిస్తానికి నీవుంటావు.

అక్కడ ...
నా కలల
ఆదిమధ్యం వరకూ
ఉల్లాసంగా నాతో
ఆడుతూ పాడుతూ ... నీవుంటావు
అమూల్యమైన మధుర గడియల్ని పేరుస్తూ,

అప్పుడు ...
తూరుపు కొండల్లో
చైతన్యం అరుణరాగమై
ప్రపంచం నిద్దుర లేస్తుంది ...
మరోరోజు మరో ఆకలి పోరాటం
మనుగడ కోసం ఆరంభం అవుతుంది

అప్పుడు ...
నా తలపుల తలుపులు మూసుకుపోతాయి
నా కళ్ళల్లో వెలుగు విచ్చుకుంటుంది
నీవు నన్నొదిలి వెళ్ళిపోతావు
నిద్దురను నిన్నూ కోల్పోయి లేస్తాను
నా బాహువుల్లో నీవుండవు!

మరోసారి
మరో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కావాలి ...
నిన్ను చూడ్డానికి
నా ఊహల రాణి ... నీతో
నా ఆనందం ఆరంభం కావడానికి
 

నేను, ఆమె ... ప్రేమ!


కంట్లో నలుసులా కొంతకాలంగా నీవు
ఎన్నాళ్ళయ్యిందో ఆ చిరు మాయ
సొట్టబుగ్గల వెలుగుల్ని, నీ చిరునవ్వును చూసి
ఏ మాయామోహానికి లొంగి నిన్ను ప్రేమించానో ...
ఆ మాయ లాస్యం నాది కాదని తెలిసిందీ రోజు! ... ఏం చెయ్యమంటావు?

కలిసి తిరిగిన గతాన్ని,
అడుగులో అడుగై, ఒక్క మాట, ఒక్క చూపైన క్షణాల్నీ
మనసు గుడిలో నీవు ఉన్నప్పటి నీ ప్రేమ ప్రతిస్పందనల్నీ
సొట్టబుగ్గల్లోంచి జారిన నీ సిగ్గు మరిమళాల్నీ గుర్తుతెచ్చుకుని
నిదుర పట్టడంలేదు ... ఎందుకిలా అవుతుంది ... అదీ నాకే అని, అన్నీ ప్రశ్నలే!

ఉన్నంతలో ... లోపం లేకుండా చూస్తానని మాటిచ్చాను! అయినా!
ఆజానుబాహుడనా! ఆస్తిపరుడనా! అతన్నే ఎందుకు కావాలనుకున్నావు?
నా రక్తాణువుల్లో శక్తివి ... పరిశుద్దం చేసే ఆక్సీజన్ వి నీవని, నీకూ తెలుసు ...
నా అణువణువులో స్పందనవు, నా ఆలోచనల మబ్బుల్లో తారవు నీవే! అనీ నీకు తెలుసు ...
తెలిసీ ఇలా జరిగింది ... ప్రేమేమైనా నన్ను బుద్దిహీనుడ్ని గుడ్డివాడ్నీ చేసిందా!?.

ఇప్పుడు నేను కదలికల్లేని అబద్దాన్ని అయి పోయాను.
నిదురించలేను. ఆకలి లేదు. స్థిమితం లేదు. నా ప్రేమ వాగ్ధానాలను
కొంగుకు ముడేసానన్న నీ ముద్దుమాటలు నా చెవిలో ప్రతిద్వనిస్తున్నాయి.
మరిచిపోలేక, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా! ... కారణం నేనైతే కాదు కదా అని,
అనుమానంగా నా గుండె లోతుల్లో వెతుక్కుంటున్నాను! ... నాలో ఏ లక్షణం ఎడబాటుకు కారణం అయ్యిందీ అని,

పూదోటలో ఒకప్పుడు ... నీవూ నేనూ చెట్టపట్టాలేసుకుని తిరిగిన క్షణాల్ని
చిత్రంలా ... నా మనసు తెరమీద చూస్తున్నాను ... నీ అణకువతనాన్ని
నేను నీ చెవిలో గుసగుసలాడిన, వేరెవ్వరూ వినని పదాలు ... నీతో పాటు విన్న నెచ్చెలి, చిరుగాలి
అందుకే ... చిరుగాలిని సాక్ష్యం అడుగుతున్నా! కారణం నీకైనా తెలుసా నేస్తమా అని,
ఆ మధుర భావనల, మనసు బాసల, మేని పులకరింతల ... క్షణాల్ని నేనింకా మరిచిపోలేదు!

నీకూ తెలుసు నిన్ను ప్రేమించానని
నీవూ నన్ను ప్రేమిస్తున్నావని అనుకున్నా!
అతని పక్కన నవ్వుతూ నీవు నిలుచున్నప్పుడు,
నాకు మనం కలిసిన తొలిరోజు గుర్తొచ్చి, నీ నవ్వు నన్ను పరిహసిస్తున్నట్లు ...
నాకూ నవ్వొస్తుంది ... మనసారా ప్రేమిస్తున్నాను అన్న పదం ఉపయోగం ఇన్నిరకాలా అని,

మనసు పరిపరినీకు తెలుసో లేదో,
నేను మాత్రం నిన్ను మనసారా ప్రేమిస్తున్నా!
నా గుండెల్లో, ఆలోచనల్లో నీది ... ప్రత్యేక స్థానం
మధురూహలు ఆరంభం నాటి నుంచీ

అతనొచ్చాక, అతనే నీ ఊపిరి అని తెలిసాక,
సర్వనాశనం అయిపోయిన ... అసహాయత నాలో
ఎన్నో రాత్రులు మూగగా రోధించా ... నిద్దుర లేచి మరీ
వెంటనే నాకు నేను సర్ది చెప్పుకునేవాడ్ని ... అంతా సవ్యమే అని

రవంతైనా నీకు తెలియదు నా హృదయం నలిగిపోతూ ఉందని
ఆ రోజు ... కుమిలి, కన్నీరై ... నేను చచ్చిపోయానెమో అనే భావన
అతని సరసన నీవు ఎంతో అందంగా ఉన్నావు ... ప్రేమ మూర్తిలా
ఆ క్షణంలో నా కళ్ళకు నీవు ... స్వర్గం నుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపించావు

చెయ్యగలిగింది ఏమీ లేదని తెలుసు ...  హృదయ భావనల్ని అణిచి ముందుకు కదలడం
ఇప్పటికైనా నిన్ను మరొకరి మనోభావనల జీవన సహచరిగా గుర్తించడం తప్ప
ప్రయత్నిస్తున్నా! నాకు నేను చెప్పుకుంటున్నా! అయినా ... జీర్ణం కావడంలేదెందుకో
ఔనూ! నీ సహచరిని ... నేనెందుకు కాలేనూ అని ... అతనే ఎందుకు అని ... మొండి మనసు!

ప్రేమ వైరాగ్యంజీవితానికో ఉద్దేశ్యం, అర్ధం ...
ఉండదు!
గుండెలు ముక్కలై
చెల్లాచెదిరి పోతాయి

పదాలు, అక్షరాలు
భావాలకు, స్థానం ...
ఉండదు!
ప్రేమ సంభవించదు!

అవసరాలు తీరని ...
ఆత్మ ...
మరణం కోరుకుంటుంది!
ఉపశమన వాఖ్యలు ... వినపించవు.

జీవము, లక్ష్యమూ లేని ...
శిలను అవుతా
స్పర్శాజ్ఞానం,
ఉలికిపాటు ... ఉండదు!

మౌన రహశ్యాలు ...
గాలి గుసగుసలు ఉండవు!
కళ్ళు ఏడుస్తూ ...
కారుతూనే ఉంటాయి!

చిరు నవ్వు ... లాశ్యం
ఎడరి మాయ
ఎండమావే అవుతుంది
నీవు లేకుండా ...

నీ ... సహవాసం,
సాహచర్యం ...
ప్రేమ, అనురాగం లేని
చావు, నిశ్శబ్దం ... కోరుకుంటున్నా!

శరీరం ఆత్మ


ఎందుకో తెలియదు ... ప్రేమ ఎక్కువయ్యో ఏమో
పొంగి పొర్లుతుంటుంది అప్పుడప్పుడూ
ఎదురెదురుగా నిలబడి మధ్యమధ్యలో టాంక్ బండ్ లోకి చూస్తూ
దెప్పుడు బాష ... వాదులాటలు
నేను స్త్రీ జాతిపై, తను పురుష జాతిపై విసురుకుంటాము విసుర్లు
కాసింత మౌన విరామం తరువాత కూర్చుండిపోతాము పక్కపక్కనే
అవునూ ... ఈ కసి, ద్వేషం ఆవిర్లెందుకు నన్ను దహిస్తున్నాయీ అని

నా కసి ఆవేదనంతా ... నేను ఆమెను అతిగా ప్రేమిస్తున్నానని
అతిగా అవసరాన్ని మించి ... ఆమె గురించి ఆలోచిస్తున్నానని
ఎంతో అపురూపమైన అనుబంధం ... మాదని
ఆమె అర్ధం చేసుకోవడం లేదని ... కోపం
అప్పుడప్పుడూ ఆమె ప్రతిస్పందన తెలిసీ ... ఆమె వైపు చూస్తాను
ముఖ భావాలను చూడాలని ... నొచ్చుకుంటుంటే నా విసుర్లు
సూటిగా తగిలాయని తెలుసుకునేందుకు ... కానీ ఆమె ఉండదు

నాకే కాదు ఆమెకూ తెలుసు ... ఒక్క క్షణం కూడా
ప్రేమతోనే పోట్లాడుతూనో మాటలు ఆడకుండా ఉండలేను అని
ప్రతి రోజూ మెలుకువలో ఉన్నా ... ఆమె మందలింపు
గోరు వెచ్చని తేనీటి కోసం ... ఎదురుచూస్తుంటాను అని
ఆమె దెప్పుతున్నప్పుడు, రోషంతో పోట్లాడుతున్నప్పుడు
అష్టవంకర్లు తిరిగే ఆమె ముఖం ... నాకెంతో ఇష్టం అని
ఆమెతో ఆటో తగవో ... మాటలు లేకుండా నేనుండలేను అని

అనుమానం వస్తుంటుంది అప్పుడప్పుడూ ఆమె కూడా
నాలాగా నన్ను ప్రేమిస్తుందా అని ... ఆ కళ్ళలోకి చూస్తాను ...
నాకంటే స్వచ్చమైన ప్రేమ నాపై ఆమెకున్నట్లు ఆ కళ్ళలో కనిపిస్తుంది
ఎప్పుడైనా అతిగా హద్దులు దాటి మాట్లాడినప్పుడు
అవసరాన్ని మించి చొరవ తీసుకుని పేట్రేగి పోయినప్పుడు
ఆ కళ్ళలొ కోపం బదులు జాలినే చూసా ... మన్నించు అని ...
మరెప్పుడూ అలా ప్రవర్తించను అని ...
పోట్లాటలొద్దు ఇక మనకు అని ... అనాలనిపిస్తుంది

ఎందరో సాహచరిని బానిసలా చూసే ప్రబుద్దుల్ని చూసా ఈ సమాజంలో
బాధే ఐనా వాస్తవం ... ఆ లక్షణాలు నాలో కలిగే అవకాశం లేకపోయినా
ఆలోచించను కాడా లేను ... నా ప్రేమకు నా సహచరికి ... ఆ అవస్థను
నా సంబంధం నా స్త్రీతో ... అర్ధ శరీరం, గుండెలో స్థానం ... అనుకోను
నేనే ఆమె అనుకుంటాను ... నేనూ నా అంతరాత్మ అనుకుంటాను
పరిపూర్ణత్వం ... ప్రాణమున్నంతవరకూ విడదీయలేని
శరీరం ఆత్మ సంబంధం ... మా అనుబంధం అనుకుంటాను!

ఒకరికొకరం


నిన్నా, మొన్నా
అనుకోలేదు ... నేను
నేడు ... ప్రేమలో పడతానని,
నిన్ను కలిసాకే ... తెలిసుకున్నాను.

కనుల ఎదురుగానో, పక్కనో
నువ్వుంటే ... స్వర్గం, ఆహ్లాదకర జీవితం
సొంతం ... అవుతుందని,
ఆలోచనల్లేవు ... నిన్ను చూసేవరకూ ...

అందమైన మనసు
అమ్మాయి
నన్ను ప్రేమిస్తుందని,
అనుకోలేదేనాడూ ... నిన్ను కలిసేవరకూ

నిర్మల ఆకాశంలా ... నీ కళ్ళు
నీ చూపుల వెలుగు ...
నా శక్తి అవుతుందని ... అనుకోలేదు
ఏక్షణానా, నీ స్వాధీనం ... అయ్యేవరకూ

నిన్ను ప్రేమించడం ... నిన్ను పొందడం
ఇంత సులభం అవుతుంది అని,
అనుకోలేదు! నీతో కలిసి ...
అరమరికల్లేని నవ్వులు వెదజల్లేవరకూ

ప్రేమ ... రెండు హృదయాల, ఆత్మల,
ఆలోచనల సంగమమని ... తెలియదు
నీతో కలిసి ... కలల్ని కనేవరకూ
ఒకరికన్నీరొకరం ... తుడుచుకునేవరకూ

వెలుగు కిరణం


పరిక్షగా చూస్తే కానీ కనబడని రూపానివి
మా కళ్ళ ఆశవు ... మాకు అప్సరసవు
దివి నుండి ... భువి విశ్వమానవాళికోసం దిగివచ్చి
మా మనో వినీలాకాశంలో స్పష్టంగా మిగిలిన తారవు

అందం నిర్మలత్వం కలబోసి ... మృదుమనస్కురాలివి
దయ, ఆర్ధ్రత నీ చూపుల్లో
రెక్కల దేవతలా దిగొచ్చావు
ఆనందం, సంతోషం అమృతబాండాన్ని అందించాలని

మా హృదయాల్లో, ఆలోచనల్లో నీవే ఎప్పుడూ
మృదువైన తెల్లని మేఘాల్లా ఆ కురులు
మా నీడై మమ్ము వెలిగిస్తూ
ఆ కళ్ళు ఇంద్రనీలమణిలా చీకట్లో మార్గదర్శకం మాకు

బ్రతకాలనుకోవడానికి కారణం నీవు
పంచడం ఆనందం అని ... నిన్ను చూసి తెలిసుకున్నాము
మంచిని మాట్లాడి, చూసి ... ప్రోత్సహించే దేవతా
నీ లక్ష్యమే, ఉన్మత్తత స్థానే ప్రేమను బోధించడమే మా జీవితం!

నీ కంటి పాపను కావాలనిమిణుకు మిణుకు మనే
నక్షత్రాలు! మెరుస్తున్న నీ ... కళ్ళు!
మనసు పారేసుకునే మన్మదాస్త్రాలు ... అవి
 ప్రకృతి పదాల నెన్నో ... బాసలు పాఠాలుగా చెబుతున్నాయి.

ఆ వింత కాంతిలో,
నీ చూపు ... వెలుగు ప్రవాహం ... వరద లో,
ప్రాణం పణంగా పెట్టి ... ఎదురీదే చేపలా నేను ..
ఎదురీదే ప్రయత్నం చేస్తూనే కాలగతిని కొట్టుకుపోతున్నా!

వేల వేల జ్ఞాపకాలు పసితనపు ఆలోచనలు
ప్రేమ కథల్లా నా చుట్టూ పరిభ్రమిస్తూ,
చరిత్రలో అక్షరానివి కా అని ... మనసును  ప్రేరేపిస్తూ,
చిక్కటి నమ్మకం బలాన్నిస్తుంది ... కట్టుబాట్లను కాలరాసెయ్యమంటుంది.

ఒకరకంగా ... నేను అదృష్టజాతకుడ్నేనని అనుకుంటున్నా!
ప్రేమ జీవితాల సారమంతా గ్రోలిన,
చదివేసిన కథల కావ్యాల చిరునామాను కావాలని ఆకాంక్ష!
వెచ్చని నీ స్పర్శానుభవం పొందిన, నీ జీవన సహచరుడిగా మిగిలిపోవాలని ...

మన్మధుడి బాణం
మోహపు అంచు సూది మొన బలంగా గుండెల్లో దిగి,
ఏదో అయ్యింది నాకు  ... ప్రపంచమంతా దేధీప్యమానంగా,
సౌందర్యం సంతరించుకున్నట్లు ... నీ కళ్ళ ప్రకాశం నిర్మలత్వమే ఎటు చూసినా

ఉదయం కురిసిన మంచులా,
అసాధారణ, విలక్షణ అందం నీ కళ్ళలో ... నీలో చూస్తున్నా!
మనొహరంగా కొత్తగా చూస్తున్నట్లుంది ప్రపంచాన్ని ... నిన్ను
ఎటు చూసినా వసంతం ఆనందమే పురివిప్పి నర్తిస్తున్న నాట్య మయూరాల్లా

నీ కళ్ళలోకి చూసిన ప్రతిసారీ ...
మనసు కేదో అవుతుంది గాల్లోకి తేలిపోతున్నట్లుంటుంది.
అంతులేని ఏ జన్మానుబంధ జ్ఞాపకాల్లోకో జారిపోతున్నా!
నన్నూ నా నీడల్నీ నడుస్తున్న నా జీవన వాస్తవాల్నీ మరిచిపోతున్నా

నేనేమీ ఆశించదంలేదు!
ఆకాశాన్ని అందుకోవాలని లేదు ... నక్షత్రాలతో దోభూచులాడాలని లేదు.
నీ సహజీవిగా గుర్తించబడాలని, కలిసి సహజీవనం చెయ్యాలనుంది.
ఆ కంటి వెలుగు కు కారణం ... కంటి పాపను కావాలనుంది ...

ఒక దేవత ... నా స్నేహం


నీవంటే ప్రేమ అని
అందంగా కనిపిస్తున్నావని
నీవే ఎప్పటికీ నా సహచరుడివని
నీవు తప్ప నన్నెవ్వరూ రోధించేలా చెయ్యలేరని
నా చూపుల్లో చుక్కుకున్న వెన్నెల రాజువని
నీవు మాత్రమే అని ... ఒక దేవత నాతో ... తన మాటల్లో ...

ఆగు మానవా
నీ కోసం ఎన్ని గడియలు యుగాలైనా ఎదురుచూస్తా
నీ మనసు నన్ను కోరుకునే రోజొస్తుంది
ఆ మంచి రోజు గడియకోసం ఇక్కడే ఉంటాను
నిన్ను మనసారా ఇష్టపడుతున్నాను అని,
ఒక దేవత నాతో ... తన చూపుల్తో ...

నీ అవసరం నాకు
తలవొంచి ప్రార్ధిస్తున్నాను నన్నొదిలెళ్ళకు
నిన్ను నేను మబ్బుల పుష్పకంలో తిప్పుతాను
నిన్ను మానవుడ్లా కాదు దేవూడ్లా చూస్తాను
నన్నుద్దరించే దైవంలా
నిన్నే పూజిస్తా అని ... ఆ దేవత నాతో ... తన కదలికల్తో ...

నాకు తెలుసు
ఆమెకు నేనిష్టమని
నేను మాత్రం ఒక అభిప్రాయానికి రాలేదని
నా మనసు మరెక్కడో తారట్లాడుతుందని
నా మనసులో ఆమెకు స్థానం యివ్వలేనని  
మబ్బుల్లో దేవత ఊహలు కలలవరకే పరిమితం కావాలి
ఆమెలో సౌందర్యాన్నీ శ్రేయోభిలాషినే చూస్తున్నానని ...

అందుకే అంటున్నా! ... నీవంటే ఇష్టం
నీ సాన్నిహిత్యం ఇష్టం ... సాహచర్యం ... నీవు కోరుకున్నట్లు కాదు
నీవు నన్ను మరువాలి  ... సుందరీ
వాస్తవాల్ని చూడు ...
మన మంచికే ...
ఒట్టేసి చెబుతున్నాను ...
నేను నిన్ను ప్రేమిస్తున్నాను ...
నిన్నలా చూస్తూనే ఉండాలనుంది ఊహల్లో ... మంచిని కోరే నేస్తంలా నే!

ఒక జీవితం ... నిజం!
ఎప్పుడో వచ్చే రైలు ప్రేమ
అందుకో! ... ఆలశ్యం చెయ్యకు!
వచ్చినప్పుడే ఎక్కాలి
ఎవరి కోసమూ ఆగదు ... జీవితం రైలు!
కల, గమ్యం దిశగా పయనం
నీకు తెలియకుండా, నీవు చేరే ... స్వర్గం!
నమ్మాలి ఆత్మను
ఆత్మ విశ్వాసం అవసరం ... జీవించడానికి!

వెలుగెరగని జీవితం
నక్షత్రాల్ని చూడు! నిజాన్ని, ప్రేమ వెలుగును!
సచ్చీలం, నిజాయితీ ... కాంతి!
వాస్తవం ... ఈ ప్రేమ నీ కోసమే అని!
ప్రేమించనీ! ప్రేమను పోనీకు!
నీవెరుగని నీవు ... ప్రేమను పొందలేన్నాడు!
జీవితమంటేనే ... ప్రేమ, నీవు
నిన్ను చూడ్డానికే ఆ ... నక్షత్రాల వెలుగు!

మనోనేత్రాలతో చూడు
రాత్రుండదు! చీకట్లో, వెలుగును చూస్తావు
వెలుతురు వద్దనుకోకు
గట్టిగా హత్తుకో ... బెట్టుచేసే చెలియనుకో!
అన్నీ సవ్యమే
నా శేష జీవితమంతా ... నీతోనే!
ప్రేమిస్తావా! గౌరవిస్తావా!
పెళ్ళాడుతా నిన్ను ... మిగిలున్న జీవిత కాలం!

కెరటం


నొప్పి
పగిలిన హృదయం
ముక్కలు ముక్కలై రక్తమయమై

కన్నీరు
గాయాన్నీ చారల్ని కడిగేస్తూ

ఏడుపు ఆవిర్లు
ఊగిపోతూ శరీరం సెగ ... నీపై

మళ్ళీ
శక్తిని పుంజుకుంటాను
లేచి ... ముందుకు కదులుతాను
నీవు లేకుండానే
ఆనందంగా

ఏడుస్తూ
హృదయం ఆవిరి సెగలో జీవిస్తూ
కడలి కెరటాన్నై
 

జీవన సహచరి


నువ్వూ,
నీ నవ్వు తోడుండకపోతే,  
నా నిన్నటి రౌడీయిజం దౌర్జన్యం ...
చీకటి గతానికి వెలుగు మార్గం చూపించకపోయుంటే,  
కసితో జీవితాన్ని చెరశాల పాలు చేసుకోకాకుండా చేసుండకపోతే,  
అసలు నీవు ... జీవితంలోకే  వచ్చుండకపోతే ...

అవసరాలు,, ప్రాణం మీదకు తెచ్చుకుని తొందరపడాల్సొస్తే
నీడలా తోడుండి ... మంచీ చెడుల్ని విడమర్చావు.
సంబంధంలేని, నీవిష్టపడని విషయాల్లో కూడా ... నాతోనే ఉన్నావు.
నాకుగా నేను సృష్టించుకున్న ... సమశ్యల వలయం
ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు ... సులువుగా సమశ్యలను విడగొట్టావు.
అసలు నీవు ... జీవితంలో తోడుగా ఉండుండకపోతే ...

సముద్రంలో నీటి బొట్టు మనిషి జీవితం! ... విశ్వమానవాళిలో
మంచి చెడు తెలిసిన సజ్జనులు ... ఎందరో ఉన్నారు
నాకు మాత్రం ... నీడలా, తోడులా నీవు ...
కరుడుగట్టిన పాషాణం ... హృదయాన్ని ప్రేమతో నింపావు.
ఆ దేవుడు నా కోసం పంపిన ప్రేమ బహుమానానివేమో అని ...
నీవు నా జీవన భాగ్యానివి, ప్రేమ దేవతవు అనుకుంటా!

కోపాన్ని, ఆటవికతనాన్ని లాగేసుకుని ... ఒంటరిని చేసావు.
ఇప్పుడు నేను ... ఏమీ మిగలని మౌనాన్ని!
ప్రతి సమశ్యకు సమాధానంగా నా పక్కన ... నీవున్నావనే ధైర్యం!
బాధ, ఆవేశం చెందాల్సిన కారణాలు కనబడకుండా ... అడ్డున్నావు.
ఏ నీడ, ఏ భయం, ఏ చీకటి లక్షణాలు నా దరికి రాకుండా చేసావు.  
నీవు నా జీవన సాహచర్యానివి కావడం దైవనిర్ణయం అనుకుంటా!

మధువనిలో


నీ ప్రేమ హస్తాలు
మృదువుగా
నా గుండెలకు తాకుతూ
నీ కళ్ళు నా కళ్ళల్లో సూటిగా గుచ్చుకుంటుంటే ....
భయం ... ఎక్కడ నా కలల్లో నీవు రావడం మానేస్తావేమో అని

నీ చేతుల్ని తోసెయ్యడానికి చేతులు రావడంలేదు
మనసు మూగబోయి మాటలు పెగలడం లేదు ...
అయోమయం! నీ కళ్ళలోకి సూటిగా చూడొద్దని
చిటపటలాడుతూ ... ఏదో భావం
నా ఆలోచనల్ని పక్కదారిపట్టిస్తుంది

నాకు నీవంటే
ఎనలేని ప్రేమ, అంతులేని మోహం అని
తెలిసిపోతుందేమో, ఒప్పుకున్నట్లౌతుందని భయం ...
వ్యామోహం కాని, నిర్మలత్వం నా ప్రేమ ... స్వచ్చం నిజం ... అని నా మనసు భావన

చిక్కని చీకట్లో
వీదిదీపం కురుస్తున్న వెలుగు జల్లుల్లో
ఒకరి నడుము చుట్టూ ఒకరం చెయ్యేసి
నాట్యం చేస్తున్నప్పుడు ... గోరువెచ్చని మృదుత్వాలు శరీరాలు రాచుకున్నప్పుడు ... నన్ను నేను కోల్పోతున్ననేమో అని

నీ ప్రేమ హస్తాలు
మృదువుగా నన్ను తాకుతుంటే ...
మాటలు రావు ఊపిరి ఆడదు
అర్ధం కాని ఆర్థి ... మనసు తీరదు పక్కన నీవున్నా!
అనుక్షణం నీ ప్రేమ కోసం, నీ స్పర్శ కోసం తపించడం మినహా ...

అంధకారము


అలజడి ... ఆకాశంలో తీవ్రతరం అయినట్లు ...
నక్షత్రాలు నీరస పడినట్లు ...
గుండెలు మండి, మిణుకుమిణుకు మంటూ ఏడుస్తున్నట్లు ...
శరాల అంత్యశయ్యపై బీష్ముడిని చూస్తున్నట్లు ...
నక్షత్రాల నెచ్చెలి చీకటిని,
వీది దీపాల వెలుగు సూదులు హైవోల్టేజ్ లేజర్ లా,
వెంటాడుతూ ఆకాశాన్ని గుచ్చుకుంటున్నట్లు ...
చూడలేకపోతున్నాము కదూ!
అర్ధం చేసుకోలేక పోతున్నాము కదూ!
బొట్లు బొట్లుగా జారుతున్న నక్షత్రాల కన్నీటి మంచు వర్షాన్ని ...


సెటిలయ్యేవరకూ


అరుదైన ముత్యం
ఒక కన్నీటిబొట్టు
కళ్ళల్లోంచి ... కోరికలా జారింది
నీవుండాలని నా పక్కనే

నా మనసు ప్రశ్నల గూడై
నన్ను నిలదీస్తూనే ఉంది!
ఎందుకు? నీవు నన్నొదిలి
దూరంగా వెళ్ళడం! ... అవసరమా అని?

నాకు తెలుసు
నీవూ ఆశ్చర్యపోయి
సమాధానపడే మీమాంస అది అని
నీవెందుకు జీవించాలి? ... నాకు దూరంగా అని!

మనం ఒక్కచోటే వెలుగు, నీడై
కలిసి ఉండగలిగితే ... నిజంగా,
ఆ ఆనందం ... ఎంత హృద్యమమో!
హృదయం అంతరాల ఆకాంక్ష నెరవేరి,

నాకు తెలుసు
ఆ రోజు ఎంతో దూరం లేదని,
జీవనావసరాల కోసమే దూరమౌతున్నామని,
ఆర్ధిక స్వాతంత్రం కోసం ... ఈ ఎడబాటు స్వీయనిర్ణయమని

అప్పటివరకూ, పెంచుకున్న
నా ఆశల్ని కాపాడుకోవాలని ...
భావనల రాగాల్ని హృదయంలోనో ...
కలం ద్వారా కవితల రూపంలోనో దాచుకోవాలని,

వెన్నెల రాత్రి ...


వెన్నెల
మంచులా కురుస్తూ
నర్తిస్తూ
చిరు అద్దులు నీ ముఖాన

చీకటిని
పక్కకు తోస్తూ
మెరుస్తూ పరావర్తనం చెందుతూ
నక్షత్రాలు నీ కళ్ళు

వాసంతం పువ్వు
వికసిస్తూ నీ ప్రేమ
సీతాకోకచిలకను వెంబడిస్తున్నట్లు
కుక్కపిల్లలా ఆ వసంత ఋతువు

ఊహల
రెక్కలు విప్పుతున్నా
కలిసొస్తావా నాతో స్వర్గానికి
ఎగురిపోదాం ఉల్లాసపదానికి

ఆహ్లాదం ఉత్తేజం
మనసు భావనల్ని
మృదువుగా
పెదాలపై అద్దుకుందాం

పదాలు జారే
పెదాల అన్యోన్యత పల్లవించి
బహుమానంగా
హృదయాలను పంచుకుందాం

నిర్మలం
నిష్కల్మషం
మధుర మనోహరం ... నీ ప్రేమ
నిజం నెచ్చెలీ

నీలి ఆకాశం
చంద్రుడే సాక్ష్యం
మాటిస్తున్నా ఈ క్షణం
నీ హృదయంలో విధ్యుత్తును నేనౌతానని ...

చెరగని మరక!


నామీద నాకు ... కోపం
శరీరం నొప్పులు ... ఆవేశం నిస్సహాయత
కార్చలేని కన్నీటి వర్షం ... మరిచిపోలేని నిజం!
రాత్రులంటే భయం! ...
తెల్లచొక్కా శాడిజం ... కొరడాదెబ్బల గుర్తులు
కోరికల పరాకాష్ట ... దూషణల బూతులు
మరిచిపోలేని మనసుపెట్టుమాటలు
వయసు రంగస్థలంపై ... నేను
ముఖమ్మీద కన్నిటిని చిదపలు చిదపలుగా
ఆయిల్ కలిపి రాసుకున్న అందం మేకప్పు
జీవితావసరాల కోసం అమ్ముకున్న శరీరం క్షణాలు
మరుసటి ఉదయం
సిగ్గుతో తడిచి
రంగులో సగం చెరిగి
ఆనవాలుగా మిగిలిన
నటించిన రేత్తిరి పాత్రను
మరిచిపోయే ప్రయత్నం
నన్ను నేను నానబెట్టుకుంటూ
అదివి నలిపేసిన అడవి పుష్పంలా
నా ముఖం నాకు కనిపిస్తూ
పీడ కలలా ... చెరగని రంగు మరకలా

పూర్ణపరివర్తన!


బంధించలేని
నల్లని విరబూసిన
చింపిరిజుట్టు
దొండపండు ఎర్రని పెదాలు
లోపల తెల్లని జపమాలికలా పళ్ళు
చాలు ...
నా నెచ్చెలికి
సన్యాసినిగా ఒంటరితనం గడపడానికి

బంధించలేని
ముఖం మీదకు జారే
షాంపూతో సుద్ది చేసిన విరభూసిన కురులు
దొండపండు ఎర్రని పెదాలు
లోపల దానిమ్మగింజల్లా మెరిసే పళ్ళు
చాలు ...
నా నెచ్చెలికి
ఆశ, వాంచ రేకెత్తడానికి ... రేకెత్తించడానికి

దొంగ!


నీ మనసును దొంగిలిస్తున్నా
నా గుండె గదిలో దాచుకుందామని
ఉంచుకుంటా ... నాతోనే, నీ మనసెప్పుడూ
నేను వెళ్ళిన అన్నిచోట్లా నీవూ వెళతావు
నీవెప్పుడూ నాతోనే ప్రియా!
నా ప్రతి చర్యకు
నేను మాత్రమే కాదు నీవూ కారణమే!
ఏ అదృష్టాన్నీ నమ్మను
నా అదృష్టానివి నీవే అని ... నా మనోహరీ
నాకీ ప్రపంచంతో పనిలేదు
అందం అద్భుతమైన నా నిజ ప్రపంచానివి
నా మానస ఆకాశంలో చందమామవు
నా జీవ చైతన్యపు అరుణరాగానివి ... నీవు
ఎవరికీ తెలియని నిజం ... చెప్పనా!
కలల ఆశల ఎత్తును దాటి
మెదడు ఆలోచనల్ని మించి
అస్తిత్వానికి బలం ప్రోద్బలం నీ ప్రేమ
హృదయంలో హృదయం, వేరులో వేరు, మొగ్గలో మొగ్గ
ఆకాశంలో ఆకాశం చెట్టు ... జీవితం అయ్యిన్నాడు
నక్షత్రాలతో స్నేహం చిత్రమేమీ కాదు నెచ్చెలీ
అందుకే
చెప్పకుండానే ... నీ మనసును దొంగిలిస్తున్నా
నా గుండె గదిలో దాచుకుందామని

ఒకటో తారీఖు!


నాలోని నిరుపేద

ప్రైవేట్ కంపినీలో గుమాస్తా

తనలో తానే గొణుక్కుంటున్నాడు

ఇన్సురెన్స్ గడువైపోయిందని  

గృహావసరాలు పిల్లల పరిక్షల ఫీజులు

పండుగ ఖర్చులు

ఇన్సురెన్స్ కని దాచిన సొమ్మును మింగేసాయి

 
సాటి ఉద్యోగి

జీతం డబ్బుల్ని అరువుగా

పక్షం రోజుల్లో

తిరిగిచ్చేస్తానని తీసుకున్నా

పెనాల్టీ లేకుండా కట్టాలనే ఆలోచన

మనసులో మాత్రం ... ఆశ

ఉన్న ఈ ఉద్యోగం చేజారితే

మరో ఉద్యోగం దొరుకదని తెలుసు ... అందుకే

స్నేహాన్నొకవైపు, ఉద్యోగాన్నొకవైపు కాపాడుకోవాలని

  
ఱంపపు అంచుమీద కూర్చున్నట్లుంది.

నాకు నేను ... నిజాయితీపరుడ్నైతే చాలదు

జీవన భారం సంసార సాగరం

కాలంతో పాటు ఈదే ప్రయత్నంలో

ఎప్పుడూ వెనకే ఉంటే ... ఆశించక తప్పదు.

ఎవరో ఒకరి చేయూతను ... ఎదురుచూడక తప్పదు.

ఒకటో తారీకెప్పుడొస్తుందో అని ... మాటమీద నిలబడగలనో లేదో అని,

అందుకే ... ఋణభారం తీర్చే సామర్ధ్యం ప్రసాదించమని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నా!

ఆశ!


ఆ ధైర్యము ... ఒంటరి పోరాటం
ఆ త్రికరణశుద్ధి ... నిర్మలత్వం
సూటిగా ఉన్నదున్నట్లు మాట్లాడే తత్వం
ప్రకాశమానం ఆ ఆత్మగౌరవం
నా మనసు అయస్కాంతాన్ని చేరే ఇనుప రజనయ్యింది
ఇష్టమనే భావన .... ఉత్సుకతై ప్రేమయ్యింది
ప్రేమలో పడ్డాను
సమాజానికి ... సందేహాలుండొచ్చు
ఆడదాన్నని మరిచిపోకూడదు
అలా మాట్లాడకూడదు అలా ప్రవర్తించకూడదు ...
వినయం అవసరం అనుకోవచ్చు
నిజానికి ఆమె ఆస్తి అదే
నాకు మాత్రం
స్నేహానురాగ బంధాలతో ... ఆమెతో
సహజీవనం ఆరంభించాలని,
ఆమెకు అభ్యంతరంలేకపోతే
ఆమెతో కలిసి ఒకే గమ్యాన్ని చూడాలని ... ఆశ!

ఆనందవికాసం!
వడిగా పారే ప్రవాహపు బలం
కలతచెందని మనసు ప్రశాంతత
ఆరోగ్యం, ఆనందం, కలిమి కలగలిపి
సామాజికంగా ఎదురుపడ్డ అందరికీ చెందాలని
అందరూ ఆనందంగా ఉండాలని ...

కారణజన్ములే ప్రతి ఒక్కరూ
ఎవరికి వారు వారిలోని శక్తి, నేర్పరితనం
అధికపక్షం సామర్ధ్యం ప్రదర్శించే అవకాశం
ఆనందించే ఆలోచనలు చెయ్యాలనే
ఆశావాదం నిజం కావాలని ...

సర్వోత్తత గురించి ఆలోచించి
సర్వశ్రేష్ఠత కోసం పనిచేసి
ప్రాముఖ్యతను పొందాలని
స్వీయ విజయాన్ని ఆశ్వాదించినంత
ఆనందంగా, ఉత్సాహపూరితంగా
ఇతరుల విజయాన్నీ ఆనందించాలని ...

గతం పొరపాట్లు, తొందరపాట్లు పునాధులై
సాధించబోయే రేపటి విజయాలు
మహత్తైన కార్యాలపై దృష్టిని పెట్టాలని
ఎప్పుడూ చెరగని ఆనందం ముఖభావమై
చిరునవ్వుతో అందరినీ పలుకరించాలని ...

ఎవర్నో విమర్శించే సమయం లేని
ఔన్నత్వం కోసం పరిశ్రమ గమ్యంగా
చింత, కోపం, భయంలేని
సేద్యం చేసే కష్ట జీవిలా
సమశ్యల్ని స్వాగతించే సమాధానాలు కావాలని ...

మంచిని మదించి ఆలోచించి
అరుపుల్తో కాక చేతల్తో
సమాజాన్ని నడిపించి
వెంట నడవాలనే విశ్వాసం పెంచి
నీతి, సత్యం, ఆనందవికాసం ... పొందాలని ...

జీవన ఆనందం!


కొమ్మకు కాపలా సూదిలా,
ఎదిగేకొద్దీ పదునౌతూ ... పువ్వు
సొగసు నీడలా రక్తం చిందించేలా ముల్లు
జీవించడం, ప్రేమించడం నీడలో
సమస్యల సూదులు తియ్యని అనుభవాల్లా ...
అయినా,
జీవిస్తూనే, ప్రేమిస్తూనే ఉన్నాం!
బాధలేని జీవితం లేదని తెలిసీ,
సమశ్యల సాగరం ఈదడం లో ఉంది ఆనందం!
అందుకే,
అందమైన గులాబీలాంటి గమ్యాన్ని చూద్దాం!
సమశ్యల ప్రశ్నల్లో నిలదీసే గడుచుతనం
ముల్లు చేసే కసి గాయం ... తియ్యదనాన్ని చూద్దాం!
ప్రేమ-మోహము కలిగించె నున్నని గులాబీ రేకుల
తియ్యని తేలివచ్చే పరిమళాల అనుభవం చూద్దాం!
అన్నీ తియ్యని గమ్యం చేర్చే అనుభవాలు ఆనందాలేగా!

యౌవ్వనావేశం!ఒక సుకుమార,
సున్నిత స్పర్శ
కోరిక, వాంచ నిండిన
గుసగుసల స్వర ఝరి
శరీరాల రాపిడితో ... ఊపిరాడని
బిగి కౌగిలి ... వెచ్చదనం
ప్రణయ రాగ రసం ఎగసి,
సెగ, మంటై ... కాల్చేస్తూ ప్రణయం

మౌనమే బాష
ఆ ఇద్దరి మధ్య
ఉద్వేగం, ఊపిరి వెచ్చదనం
మాటపై నెలబడలేని మనో స్థితే
శరీరాల పలుకులు ... పదాలు
కసి నిజాలే అన్నీ
వెనుదిరిగి చూడలేని
పశ్చాత్తాపము ఆలోచన రాని అలౌకికం

ఒకరినొకరు పొదువుకుంటూ
అది ఆశో, వాంచో, భ్రాంతో
అమూల్యమైన క్షణాల కాలం
పరుగులు తీస్తూ కవ్విస్తుంటే
ఆమె దేవత అతనికి
అతను దైవం ఆమెకు ...
సమర్పణాభావం ఇద్దరిలో
కర్పూరం హారతిలా కరుగుతూ ...
నిశ్శబ్దం, ఒంటరితనమే వారి నేరం

సమాధానం చెప్పుకోవాల్సిన
రేపొకటుంటుందని, పరిణామం
సిగ్గు మోహాల్ని దాచుకోలేనితనం
బాధై మిగులుతుందని
ఈ చీకటి రాత్రి బలహీనావస్థ లక్షణాలు
మోహపు మంటలు చల్లారాక
ప్రశ్నై మిగులుతాయని ఎద ఎరుగదు
వయసు వేడి చల్లారాగ్గానీ మనసుకు తెలియదు!
 

ప్రేమసంపద!నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో,
నా ఇష్టాన్ని ... మనసు భావాల్ని
చెప్పలేను పదాల్లో!
పలుకరింపుల్నీ, పులకరింపుల్నీ,
ఆనందాన్నీ, అనుబంధాన్నీ ... దాచుకుంది నీకోసమే అని

నా జీవితం ... బలహీన క్షణాల్లో,
మనుగడ కోసం తప్పని ...కాలంతో పరుగుపందెంలో,

సమశ్యల ఊబిలో కూరుకుపోయి, కదలలేక ... నీరసపడ్డప్పుడు
చెయ్యందించడానికి, ధైర్యం పంచడానికి ...
నీవూ నాతో ఉన్నావని వెన్నుతట్టే ప్రేరణవై సహకరిస్తున్నప్పుడు

నిద్దుర సేదదీరిన ... అరుణరాగం వేళ
జీవనావసరాల వేటలో అప్పుడప్పుడూ దొరికే విరామ వేళ
అనిశ్చితాల సుడిలో సతమత మయ్యే వేళ
మళ్ళీ విశ్రమించే చీకట్లు ముసిరిన వేళ
నా మదిలో ఆలోచనల్లో చైతన్యానివి నీవే

ఎదురుగా నీవు లేవని తెలుసు ... కానీ,
నా ఊహల్లో నీ రూపం చిత్రించుకుంటాను
ఎంతో సుందరమైన నీ చిరునవ్వును ... నా బలంగా
నాగరికంగా నిన్ను సుతారంగా స్పర్శించినట్లు
కౌగిలించుకున్నట్లు భావనల్లో మునుగుతూ ఉంటాను.

నా ప్రతి ఊహను అల్లరి ఆలోచనలను
ప్రేమావేశపు సరస భావనలను
పశ్చాత్తాపముతో విన్నపం లా కాకుండా,
అమూల్య సంపదలా ... నీతో పంచుకోవాలని ఉంటుంది
ఎందుకంటే,
నీవెప్పుడూ నా పక్షం నుంచే చూస్తున్నట్లుటుంది కనుక

అప్పుడప్పుడూ ఆ దైవానికి, ఈ ప్రకృతికి
నీ కన్నతల్లికి, సమాజానికీ
చెప్పుకోవాలనుంటుంది కృతజ్ఞతలు
నా సహచరిగా ... అమూల్యమైన ప్రేమసంపదను
నిన్ను పొందగలిగినందుకు ...

అందుకే,
నా మనసు భావం నిజం, వాస్తవం చెబుతున్నాను
నీవే నా జీవన బృందావనం రాధికవు హృదయ రాగానివి అని

సాంకేతికం మానసం


నీతో పరిచయం అయ్యాకే తెలిసింది
నా శ్వాస లో చల్లదనం ఇక ఉండదని.

కాలమంతా సాంకేతిక సమశ్యల ...
చదరంగం ఎత్తుల మయమై యిన్నాళ్ళూ
గుండె కొట్టుకోవడం లో నెమ్మదితనం
వాదించో నిరూపించో సాధించేవాడ్ని!

నీతో మనసుచాలనం చేసాకే తెలిసింది.
ఇన్నాళ్ళూ నా బాహువుల్లో,
నా ఆరాటం లో, నా ఆలోచనల్లో
శూన్యమే అంతా అని,

నా మది నీ ఆలోచనలతో ...
సతమతం అవ్వడం
తగలని గాయం సలపడం ... మొదలయ్యాకే
ఏమయ్యిందో ఏమో ... కూర్చోలేను నిలబడలేను!

జీవన చదరంగంలో నేనిప్పుడు
ఆటగాడ్ని కాదు ... ప్రేక్షకుడ్ని.

క్షణాలు, గడియలై ... గడియలు రోజులై ...
ఆలోచనల టైం అవుట్ అవుతూ ...
ఎదురుచూపుల కలవరం ...
నిన్న నిన్ను కలిసేవరకూ
ఆకాశంలో చంద్రుడు నక్షత్రాల మిణుకు మిణుకులు ...
తణుకులు చోద్యంగా చూసేవాడ్ని!

నిన్ను బిగి కౌగిలిలో బందించాకే
చూసాను ...  నక్షత్రాల మిణుకులు తణుకుల్ని
నీ కళ్ళలో!
ఆకలి భావన ఆహారంతో తీరని ఆబ
తీరని దాహం ముచ్చెమటలు పట్టడం
నీతో కలిసి తిని తాగి పంచుకునేవరకూ
సహకరించని శరీరం

నిన్న నిన్ను ఉద్యానవనంలో కలిసాకే ...
పరిపూర్ణత అంటే ఏమిటో
ఆకర్షణ కోల్పోవడంలో ఆనందం
అర్ధం తెలుసుకోవాలని అభిరుచి మెదలయ్యింది.

డిజైన్స్ చేసేప్పుడు రిడండన్సీ
ఫెయ్ ల్ ప్రూఫ్, క్రిటికాలిటీ, యాక్షన్ ప్లాన్
ఇత్యాదులే తెలుసు ... ఇన్నాళ్ళూ!

నీతో తొలిచూపు కలిపాకే
తొలి కలయిక అయస్కాంతంలా నా
ఆలోచనలన్నీ నిన్ను అంటుకు పోయాకే తెలిసింది
సుడిగాలి, చక్రవాతంలా మనశరీరాలు
ఆత్మలు ఒక్కటవ్వడమే
నా మనస్థితికి సమాధానం అని.

పదాలు కవితల్లా పెదాల్ని తాకి,
తియ్యని మధుర గీతంలా ... అలరించాకే
నా ఈ మనోభావన
ప్రియా! ప్రియతమా! ఎన్నాళ్ళింకా నా ఈ నిరీక్షణ  నీకై అని

ఒకరికొకరమేనా నీవూ నేనూ!?
అపరిచితుల్లా మొదలయ్యింది
నీ, నా స్నేహం
నువ్వన్నావు!
నివంటే ఇష్టం! నిన్ను ప్రేమిస్తున్నా ... అని
ఆ క్షణం ... ప్రతిస్పందించి,
స్వాగతించే స్థితిలో లేను నేను

రోజు రోజుకూ
మన పరిచయం పెరిగి ...
కలుసుకోవడం
ఆలోచనల్ని పంచుకోవడం
ఒకే దృష్టితో
సమస్యల్ని చూడ్డానికి ప్రయత్నించడం నిజం!

ఔనూ!
ఇద్దరు వ్యక్తులు స్త్రీ పురుషులు అయితే,
ఆ బంధాన్ని
ఇష్టం, ప్రేమే ... అని
ఎందుకనుకోవాలి?
స్నేహం, సామాజికం అనుకోవచ్చుగా అని అనుకున్నాము.

అలా ఆటలా,
పోటీ వాతావరణంలో మొదలయ్యింది
నీ, నా భావాల సంఘర్షణ
ఆటలో నిండా మునిగిపోయాము.
నాకు తెలియకుండానే
నేను మునిగింది ప్రేమలో అని
అప్పుడే తెలిసుకున్నాను

ఆ క్షణం నుంచి ...
మేలుకొన్న తరువాత,
చివరికి నిదురించేముందూ నేను చేస్తుంది.
నీ ఆలోచనల్నే!
నిన్నే నేనూ ప్రేమిస్తున్నానని,
నిన్ను వీడి నేనుండలేని జీవితం ...
కోరుకోవడం మొదలని అర్ధమయ్యిన క్షణాలవి!

మన ప్రతి కదలిక,
అర్ధరాత్రి ఆలోచనలు,
మూగసైగల పరిహాసాలు,
అనుపయుక్త చేతలు,
నవ్వుకోవడాలు
మరింతగా,
నీ ప్రేమలో నన్ను తడిపేసాయి.

నా మనసు
సీతాకోకచిలకలా
నీ ప్రతి తియ్యని
పలుకుల చుట్టూ
పరిభ్రమిస్తూ,
కాలం క్షణాల్లా ...
జీవితం సంధ్యావస్థలోకి

అప్పుడప్పుడూ ...
నిన్ను ప్రేమించని మనిషితో
ఉన్నట్లు ఉండే ... నీ ప్రవర్తనే ఆశ్చర్యం
నిజంగా, నీవూ నేనూ ఒకరి కొకరి మై పుట్టామా,
ప్రమాదవశాత్తు ఒకటయ్యామా,
లేక ... మనసు నైజమే అంతా అని
మనోవేధన కలవరం ... ప్రియతమా!

పొగొట్టుకున్నానునీవూ,
నేనూ కలిసిన
తొలిసారే
నన్ను నేను పోగొట్టుకున్నాను!

విశాలమైన
నీ కనుల ఆకర్షణలో
లోతైన నీ చూపుల
వెన్నెల సముద్రంలో .......

సిగ్గు బుగ్గ పై
సొట్ట మొగ్గ పల్లవించిన
వివర్ణమైన
రోజాపువ్వు సొగసులో .......

దూదిలా
సున్నితమైన
పాలరాతిలా నున్నని తెల్లనైన
నీ శరీర చాయలో .......

పెదాల చాటున
నవ్వినప్పుడూ, మాట్లాడుతున్నప్పుడూ
దోబూచులాడే ముత్యాలు
దానిమ్మ గింజల్లాంటి
పలువరస మెరుపులో .......

ఇష్టాల్నీ
మనోభీష్టాల్నీ
లాలసనీ దాచుకుని మరీ
నన్ను నేను కోల్పోయాను.

అన్నీ
సర్దుకుని
నమ్మించి, మౌనంగా
నువ్వు వెళ్ళిపోయావు.

ఇప్పుడు

లోతైన
నీ చూపుల
వెన్నెల సముద్రం లేదు.

పల్లవించిన
వివర్ణమైన
రోజాపువ్వు సొగసు లేదు.

పాలరాతిలా
నున్నని తెల్లనైన
నీ శరీర చాయ లేదు.

ముత్యాలు
దానిమ్మ గింజల్లాంటి
నీ పలువరస మెరుపు లేదు.

వలపెక్కడో వగపే అంతా!
నీ నీడలా ... నన్ను నేనే కోల్పోయాను
మనోవేదన, పశ్చాత్తాపం తియ్యని బాధై ....... నా హృదయంలో!