Wednesday, November 28, 2012

కవిత రాస్తున్నాను.



ఒంటరిని
నా చిన్ననాటి జ్ఞాపకాల
వెచ్చదనం ఆశ్వాదిస్తున్నా!
ఉత్సుకత ...
పసితనంలోకి వెళ్ళిపోవాలని ...
స్కూలు కాలేజి రోజులే
స్వర్గం లా కళ్ళ ముందు ... కలలా
పసితనం అల్లరి, మొట్టికాయలు తిన్న జ్ఞాపకాలు 
వెచ్చని అనుభూతుల కోశాగారం ... బాల్యం

ధ్యానం
నా గుండె మీద సముద్ర వైశిష్ట్యం
ఒంటరితనం పై ... ఒక కవిత రాస్తున్నా ...
నన్ను నేను ఉత్తెజపరచుకునేందుకు
ఒంటరి క్షణాల ప్రపంచం ...
ఒక శ్మశానం కాబట్టే కవిత రాస్తున్నాను.
ఒంటరితనాన్ని భావాలతో నింపెయ్యాలని
చీకటి నిశ్శబ్దాన్ని పారద్రోలెయ్యాలని

Tuesday, November 27, 2012

నేను ఒంటరిని కాను



ప్రేమను నమ్ముతున్నాను.
నేను ఒంటరిగా లేను.
రాత్రి వేళ సీతల వాతావరణంలో
నిశ్శబ్దం, మౌనం, ఒంటరితనం
గాలి గుసగుసలు ...
శరీరాన్ని తాకుతున్నప్పుడు
నాకు తెలుసు
నేను ఒంటరిని కానని
ఆమె నన్నింకా ప్రేమిస్తూనే ఉందని
ఇద్దరం దూరం అయినా,
ఎవరో మధ్యలో వచ్చిపోతూ ఉన్నా,
నాకు తెలుసు
నా చెలి నన్ను మరిచిపోదని
నన్నింకా ప్రేమిస్తూనేఉందని
నేను ఒంటరిని కానని
దేశమంతా తిరిగొచ్చాను
ఎన్నో ముఖాలు
ఎన్నో అనుబంధాలు
ఎన్నో సహవాసాలు ... నా జీవితంలో
అయినా
నాకు తెలుసు
ఆమె నన్ను ద్వేషించట్లేదని
ఏ ప్రేమా ఆమె ప్రేమ అంత నిజం కాదని
నాకు తెలుసు.
ఆమె అవసరం నా జీవితానికి
ఇంతే ... అని మాటల్లో చెప్పలేనని
ఆమె కోసమే జీవిస్తున్నాను కనుక
నేను ఆమెను, ప్రేమను ...
నమ్ముతున్నాను ... ప్రేమిస్తున్నాను కనుక

Monday, November 26, 2012

మనసు పరితాపం!

మనసు పరితాపం!

నీదృష్టిలో పడాలని నీవు నన్ను గమనించి,
గుర్తించాలని నా మనసు ఆశ
నీ ఆనందం చూడడం కోసం
నీవు ఇష్టపడటం కోసం ... ఏదో చెయ్యాలని
జుట్టు స్టైల్ మార్చుకోవాలని?
విచిత్రధారణ చెయ్యాలని?
నడక లో వడిని నాణ్యతను పెంచాలని?
మాట్లాడేప్పుడు పదాల స్పష్టతను మృధుత్వాన్ని పెంచాలని

ఎన్ని నాళ్ళ నుంచో ...
ఎన్ని జన్మలబంధమో నీదీ నాదీ అన్నట్లు,
నా మనసు భావన ...
నా ప్రేరణా శక్తివి నీవని అనుకుంటుంటాను.
నీవు మాత్రం నన్ను సహచరుడిగానే చూస్తున్నావు.
నా భావనల నిజ అస్తిత్వం కానీ, నేను కానీ ... నీకు తెలియదు.
సముద్రమంత లోతు ప్రేమ నీవంటే నాకు అని కానీ,
నా మనసెప్పుడూ ... మనోభావనలు
నీకు మాత్రమే తెలియాలని అనుకుంటుంది అని కానీ,
నువ్వేదో వస్తువైనట్లు నిన్ను సొంతం చేసుకోవాలని ...
నా మనో వాంచ అని కానీ ... నీకు తెలియదు.

కళ్ళు మూసుకున్న ప్రతిసారీ
నీ చిరునవ్వు నిర్మలత్వం ... నీ ముఖమే కనిపిస్తుంది.
అందాల బరిణల్ని, వయసు చమక్కుల్ని,
అతివలెందర్నో చూసా ... కానీ
నీలో ... నీ నడవడికలో ఏదో ...
నాకు మాత్రమే చెందిన ఐశ్వర్యం ఉన్నట్లు
ప్రత్యేకతల్లా ... మనసు ఊరటల్లా నీ సహజీవిలా,
కలిసి పనిచేస్తున్న నీ కొలీగ్ గా నీ సాన్నిహిత్యం.
నామ మాత్రపు స్నేహితుడిగా మాత్రమే తెలుసు నీకు నేను
కానీ, నేను నీవు వదులుకోలేని స్నేహాన్ని
అంతకు మించి ఏమీ కాని మనోభావాన్ని కూడా ...

మరీ ముందుకు కదలలేను ...
భయం ...
పరితాపం చెందాల్సొస్తుందేమో అని,
అందుకే
ప్రస్తుతానికి నీ స్నేహం చాలనుకుంటున్నా!
అతిగా ఆశించి ...
నిన్నూ,
నీ నా బంధాన్ని ప్రశ్నార్ధకం చెయ్యాలని లేదు.
నా ప్రేమను నాలోనే దాచుకుంటా!
గాంభీర్యం ముసుగులో నన్ను నేను దాచుకుంటా!

ఓ రోజొస్తుందని నమ్మకం ...
మనసు బృందావనంలో
చెట్టాపట్టలేసుకుని నీవూ నేనూ కలిసి తిరిగే రోజు
నేను నీకోసం నీవు నా కోసమే అని నీవూ అనుకునే రోజు
అప్పటివరకూ
ఎదురుచూపుల తపస్సు ఇలాగే చేస్తుంటాను.
ఒంటికాలు మీదే అయినా ...
కనులు కాయలు కాసినా ... చూస్తూనే ఉంటాను
ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతానేమో అని
వెళ్ళేలోపు నా మనసు పరితాపం నువ్వు గుర్తించాలని ...

Sunday, November 25, 2012

బంధం

బంధం

నీవంటే ప్రేమ, నీ నవ్వంటే ఇష్టం,
నా మనసంతా వ్యామోహం పొంగుతూ
నా గుండెలనిండా నీవు ...

తియ్యని బాధ, మోహన రాగం ... కోరికలా,
నా శరీరం ఝలదరిస్తూ ...
నీ ఊసుల గుసగుసలే ఏకాంతంలో నాలో 

నా కళ్ళముందు సౌందర్య రాసివి నీవు.
నీవే నిజం నిండుతనం అన్నట్లు ... జగమంతా శూన్యం
కోమల, పక్వ ... పరిపూర్ణత్వం నీలో చూస్తున్నాను.

నా అదరాలు అదురుతున్నాయి.
పదాలతో నీతో ... ముద్దులముచ్చట్లాడాలని,
ఆశ, ఆవేశం నాలో ... నన్ను నేను కోల్పోవాలని,

నీలోనూ ఇదే స్థితిని,
రెండు గుండెలు, శరీరాలు, ఆత్మలు
ఒక్కటైన నిజాన్ని ... అనుభవిస్తూ చూస్తున్నాను

Saturday, November 17, 2012

నిజమైన ప్రేమ



జీవన భాగస్వామ్యం
సాహచర్యం  
భావన మాత్రమే సరిపోదు

ఒకే ... భావం, శరీరం
ఒక్కరిలా ...
ఆవేశము, ఆలోచన
ఉద్రేకం, ఉద్వేగం
శ్వాసించడం, గుండె కొట్టుకోవడం
ఏక దృష్టి ... సాధన అయి ... కలిసుండటం
ఒకరిలో వొకరు వొక్కరై ఉండగలగడం
... సంసారాధారము

Thursday, November 15, 2012

జీవన సార్ధకత!


ఎంతో సుందరము ...
చిన్నది జీవితం,
ఉన్నది
బురదలో అయినా, తివాచీ పైనైనా ...
చైతన్యం
కొనలేని యౌవ్వనం
పరిమళిస్తూ ఉంటెనే ...

ఆత్మను ఆవహించే
మత్తు, మాదకద్రవ్యాల
నిద్రలోకి ... జారకుండా,
అమ్ముకోకుండా
జీవితాన్ని మృత్యువు
ఇష్టాఇష్టాలకు వొదిలెయ్యకుండా ఉంటేనే

మనిషి ఆట మొదలు
పుట్టుకతూనే
అమ్మ ఒడిలో నే
మమతానురాగం బహుమానం పొంది
పరువం ప్రకృతి నిర్దేశం
సరైన మార్గం లో
పురోగమిస్తూ ఉంటేనే జీవనం

2012, నవంబర్ 16, శుక్రవారం ఉదయం 7.30 గంటలు

Tuesday, November 13, 2012

ఒంటరిని నేను

ఒంటరిని నేను

జనసమూహాల మధ్య ఒంటరిలా నడుస్తుంటాను.
నా గుండె బిగ్గరగా కొట్టుకుంటూ ...
గాయం సలుపుతూ ఉంటుంది.
చీకటి రాత్రులు ... వీదుల్లో నీడలా నడుస్తుంటాను.
నాకు నా అనే వారు,
బాధ నుంచి, ఉపశమనం ఇచ్చే వారు,
చూరు నీరు వర్షంలా కారే కన్నీటిని ఆపేవారు లేరు.
ఆలోచిస్తూ నవ్వుకుంటుంటాను.
నడుస్తుంటూ ఒంటరిగా,
నాలో నేను ... మాటలాడుకుంటుంటాను.
కారుతున్న కన్నీళ్ళ చారలు
పగిలిన గుండె ముక్కల్ని కలపలేక,
పిచ్చివాడ్ని దిష్టిబొమ్మని లా ... ఒంటరిలా.

Sunday, November 11, 2012

ఆశ!

 || ఆశ! ||

చించి, చీల్చి, విడదీసి, పగలగొట్టినట్లు ... హృదయం!
నా భావనల అనిశ్చితి ... సహాయంకోసం చూస్తూ,
ఎవరైనా
నా గుండెలో లోతుగా దిగిన
అపనమ్మకం తుపాకిగుండును
క్లినికల్ టచ్ తో తీసేసి నమ్మకం కలిగిస్తారని

నీరసం నిస్సత్తువ నిలబడలేనితనం ...
పడిపోకుండా పట్టుకునే
ఆసరాగా
ఎవరో రావాలని ఆశ,
నొప్పి, బాధ అశక్తత ... అసంతులనల గతం ... పీడను
ఆ ... సాహచర్యంలో బంగాళాఖాతంలోకి విసిరేద్దామని

బయటికి మాత్రం ఏమీ జరగనట్లు డాబు ...
నటిస్తున్నా
అపనమ్మకం నొప్పి,
బాధ భరించలేక లోలో తల్లడిల్లుతున్నా
పూర్తి శశక్తుడ్నై, ఆత్మస్తైర్యం పొందాలని ... ప్రయత్నిస్తున్నా
నా హృదయం తాళముచెవి నమ్మకం కొక్కెంకు తగిలించి మరీ

అల్లకల్లోలంగా ఉన్న,
నా హృదయం ప్రేమ మందిరం లో
గోడలనిండా ఆమెకు మాత్రమే అర్ధం అయ్యేలా
మోడ్రన్ ఆర్ట్
నా మనసు భావనల పిచ్చిగీతలు ... విసిరేసిన రంగుల్లా
ఆమె సాహచర్యంలోనే అది సుందర అమూల్య సంపద.

ఒత్తిడి పెరిగి, తత్తరపాటు చీకాకు ఎక్కువై
మహామారి లా ... ఆబ,
నా రొగానికి మందు ...
ఆమె నవ్వు, ఆమె కౌగిలే అయినట్లు
ఎన్నెన్నో భావాలు, సంబందం లేని అస్పష్టత ...
శరీరం అలిసిపోయి కదల్లేని స్థితి ... శూన్యాక్షరాల్లా

ఎవరూ ... పంచుకోలేని, ప్రయత్నించని, పోటీలేని
ఏ గతమూ గుర్తు రాని ...
తిరిగి పలుకరించలేని
ఏకాంతం, సహజీవనం ఆరంభించాలని మనోబిలాష
ఆశ ... నేను ఆమె ఒకరికొకరం కావాలని

అలసట తీరి,
ఒత్తిడి తగ్గి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నట్లు ...
జీవితం
సర్వం మసకమసగ్గా కనిపిస్తుంది
ఆమె నేను చేసుకున్న బాసలు గుర్తుకొస్తున్నాయి
నమ్మకం ... ఇప్పుడు నిద్దురలో ప్రతిసారీ ఆమె ముఖం నిర్మలంగా

కలిసి
ఆమె నేను ఇద్దరం
ఏక దృష్టితో గమ్యం
భవిష్యత్తును, ప్రపంచాన్నీ ... ఒక్కటిగా చూస్తున్నట్లు
మేమిద్దరం మాత్రమే ప్రకృతి వసంతంలా ...
పల్లవించి ఫలిస్తున్నట్లు ... ఇప్పుడు మనసెంతో ప్రశాంతంగా ఉంది.

నీవూ నేను

నీవూ నేను

నేను భయపడ్డానని కాదు
నిన్ను పోగొట్టుకుంటానని
వివరించడానికంటూ కారణం లేదు
నీవు ఏడిస్తేనో ... నేను ఒంటరిగా ఉంటేనో తప్ప
ఇంకా పట్టింపు లేదు
నిజం నా గొంతులోనే అదిమేయబడి ఉంది.
నీవు పాడే పాటల్లో తొలగించబడి ఉంది.

నీలో దృష్టి లోపం లేదు
పనికట్టుకుని నన్ను పట్టించుకోవు
నీకు ఎంతో ఉపయోగం అవసరం ఐతే తప్ప!
ఒంటరిగా ఉన్నా కూడా
అతిగా ఆలోచించవు
నా ఆలోచనలు నా భావనలు నీతో
ఒంటరితనాన్ని కోరుకుంటాయని తెలిసి కూడా

కాలుతున్న కొవ్వొత్తులు
పుట్టినరోజు పండుగలు
కాలాల్సిన గంధము చెక్కల జ్వాలలు
దాల్చిన చెక్కల మంటలు
మెల్లగా వేడెక్కి
ద్రవరూపమో బూడిద రూపాంతరమో
చెందాకైనా నీవు నన్ను కలుస్తావా
అనే మీమాంసలో నన్నుంచావు

ఇక్కడ ఒంటరిగా నేను
అక్కడ ఒంటరిగా నీవు
హృదయాలు తగలబడుతున్నాయి.
రక్తం ఉడికి ఉవ్వెత్తున లేస్తుంది.
గుండె వేగంగా కొట్టుకుంటుంది.
మనసొకటి తపిస్తూనే ఉంది
నీతో ఒంటరితనం కోసం

కొవ్వొత్తులు కరుగుతున్నాయి
హృదయాలు కాలుతున్నాయి
నొప్పి ...
ఎండిపోయిన రక్తం చిట్లుతూ
భరించలేనంత బాధ చావకుండానే
నరాలు కండరాల ఏడుపులు
సహజీవనం సాంగత్యం ...
నీతో ఒంటరితనం గుసగుసలాడ్డం కోసం.

అంత సులభం కాదని ... తెలుసు 
అవసరానికి మించి అక్షరమైనా
ఎక్కువ తెలియని స్థితి నాదని
నిజాన్నీ ఎన్నాళ్ళో దాయలేమని
నీవు దాచుకున్న నిజం ఎన్నాళ్ళో దాగదు ... అని
చెబుతాను అన్నావు.
నమ్మాను.
నా కోరికా అవసరం కూడా కనుకే

అయినా ...
ఎందుకో
ఆలోచిస్తుంటే
ఇప్పుడు ... నీవు అంగీకరించాక
ఉండాలనిపించడం లేదు
ఒంటరిగా నీతో

పోరాటం జీవితం ... సాహిత్యం!

చంద్రశేఖర్ వేములపల్లి || పోరాటం జీవితం ... సాహిత్యం! ||

పుట్టడం ప్రాకృత్యం
సమాజంలో జీవించడానికి పోరాడటం అవసరం
ఇల్లు ఉన్నా, సంసారం ఉన్నా, సన్నిహితులున్నా
జీవితం అస్పష్టమే!
కాలంతో కలిసి కదలడంలో
అలసిన ఎందరొకో

ప్రపంచం బహు విస్తారం
చదువు, డబ్బు, గౌరవం ఉన్నా
క్లిష్టమైన ప్రశ్న జీవితం అనిపిస్తుంది
పోగొట్టుకున్నది తిరిగి పొందాలని,
జీవన రహస్యాల్ని చేదించాలని
ప్రతి ఒక్కరి ఆలోచనల సారాంశం ఉద్దేశ్యం

నాగరిక సమాజ నిర్మాణం,
జీవన సరళి, సామాజిక వేదికల పై
భావ ప్రకటనల తో ... పై పై సంతృప్తిని పొందుతున్నా
వాస్తవ సంతృప్తి పొందలేక, జీవితాలు లోతైన శున్యం
ఖాళీ దుఖ్ఖం నిజానుభూతై ...
స్పష్టంగా నెరవేరే అవసరాలు
సంతృప్తిచెందని ... తీరని ఎడారి దాహం మనిషిది

ఒకరూ లేక అందరూ
లోతుగా ఆలోచించాల్సిన జీవన ఆశయం సారాంశం
మతం బోధనల సారం కాంతిలో ... తత్వంలో
ప్రకృతి నడిపించే మార్గంలో,
సాహిత్య కళాకారులే
శాశ్వత ప్రశ్నలకు సమాధానం యివ్వాల్సింది.

సాహిత్యం పుస్తకం ద్వారా
మానవ అనుభవాల్ని
మార్గ ప్రతిపాదనల్ని చెయ్యడం అవసరం
మనిషిలో ఆలోచనల్ని పెంచడానికి
పూర్తిగా సంతృప్తికర సంస్కృతిని
అనుసరించేలా చెయ్యడానికి

2012, నవంబర్ 11, ఆదివారం సాయంత్రం 3.45 గంటలు

పరివర్తన నాలోనే!

చంద్రశేఖర్ వేములపల్లి || పరివర్తన నాలోనే! ||

ఏదో ఆకర్షణ!
ప్రసన్నత నీ ముఖంలో
మంచిని మాత్రమే చూస్తున్న నీ వడపోత లక్షణం!
నీకు ఎదురుపడిన ఎందరిలో నేనూ ఒకడ్ని!
మొండివాడ్నని నాకే అర్ధం అయ్యేలా ...
సరళంగా, సున్నితంగా మధురంగా నీ ప్రవర్తన

నీలాగానే అందరూ ఇష్టపడే,
ఆకర్షణను కావాలని ఆశ, ఆవేశం!
అందరినీ ప్రేమించాలని, అరమరికల్లేకుండా ...
మంచి, స్నేహం, మానవత్వం పర్యాయపదాన్ని
కావాలని ఉంటుంది ... కానీ,
కాలం, అనుభవం నన్ను మార్చేసింది.
ఇప్పుడు ప్రతి ఒక్కరిలో నాకు చెడే కనపడుతుంది.
నీలోనూ చెడునే చూడాలని నా ప్రయత్నం!

నీలో చెడును చూసే ఉద్దేశ్యంలో
నా అస్తిత్వం కోల్పోయాను.
తెలియకుండానే నీ ప్రేమలో పడ్డాను.
నీ మాటలు, నీ లో మంచితనం
నీ లోని సేవాగుణం సహకారం
నీ మంచితనం వైశాల్యం కొలవలేని స్థితి నాది!
అయాచితంగానే కొట్టుకుంటున్నాను. నీ ప్రేమలో
కక్కి మింగలేని నిజం ... నా మది వరకే పరిమితం!

2012, నవంబర్ 11, ఆదివారం సాయంత్రం 3.30 గంటలు

Saturday, November 10, 2012

లుప్త ప్రేమ


ఎంతో కాలం వృధా అవుతుంది
ముదిరిన పిచ్చి తగ్గడానికి సమయం అవసరం
పెళుసైన, బలహీనమైన ప్రేమావేశం
ఆలస్యం చౌరాస్తా లో గమ్యం తెలియని పురోగమనం

ఆశ్చర్యకరంగా చిరిగిన తెల్ల కాగితం లా
నీ చెయ్యి ... నీ చేతిలోనే తెగి రక్తశిక్తమై
రక్తం కోల్పోయాకే ... బ్యాండ్ ఎయిడ్ కనబడినట్లు
గాయాన్ని అప్పుడు గట్టిగా, బిగువుగా చుట్టినట్లు

దైర్యం ఒక కారణం అక్కడ
స్పష్టమైన అభిప్రాయ ఉపసంహరణం 
మాయం కాదు నొప్పి ... నలుపుతూనే ఉంటుంది
మిగిలిపోయిన అపరిష్కృత సమశ్యలా

Wednesday, November 7, 2012

వెన్నెల వాతావరణం!




ఒక చల్లని వెన్నెల రాత్రి
ఆకాశాన్ని చూస్తూ నిద్దురలోకి జారినపుడు
అక్కడ ... తారలు, నక్షత్రాల సరసన నీవు ...
గోరువెచ్చని హాయిలా ... నన్ను పలుకరిస్తూ,  

నీవూ నేనూ పక్కపక్కన కూర్చున్న
గాలి దూరని సామీప్యం ... మంచు కురుస్తున్న చల్లదనంలో,
నేలపై పెరిగిన గడ్డిపరకల్లా ... మనం!
చల్లని చందమామ చూస్తూ, ఆహ్లాదం మారుతున్న అంతరంగాలు!

ఆరుబయట విశాలమైన ఆ నీలి ఆకాశం కప్పు ...
కింద వెన్నెల వెలుగుల ఆవరణలో చల్లదనపు ఆనందం!
గడ్డిపరకల్లా అటూ ఇటూ ఊగుతూ ఇరు మనసుల నాట్యం!
అది, గాలి బలంగా ఊళలు వేస్తున్న ఆత్మీయ రోదనం!

మనం ఒకరి కళ్ళలోకి ఒకరం తదేకంగా చూస్తూ,
ఎదుటివారి ఆవేశాన్ని, ఆలోచనల్ని, అంచనావేస్తూ ...
తనలోలానే అయ్యుండొచ్చా అని ... ఆశ్చర్యపోతుంటే
ముచ్చటగా ... దట్టంగా పెరిగిన గడ్డిపరకలు మనల్ని తాకుతూ,

వెన్నెల కురుస్తున్న చల్లని తెల్లని రాత్రి
ప్రేమకోసం అస్తిత్వాలు కోల్పోయిన హృదయాల అంతరంగంలో మీమాంస,
నీవూ నేను కలిసి మనం మమైకం ఐనట్లా?
లేక చల్లని ఆహ్లాద వాతావరణం మోహనికి మోసపోయినట్లా ... అని,


Tuesday, November 6, 2012

సహజం!


మెరిస్తున్న ఆ కళ్ళు
ఆకాశాన నక్షత్రాలు
నిర్మలం, మబ్బుల్లేని
ఆకాశం ... ఆ ముఖం!

వెలకట్టలేని,
వెన్నెల పరిచిన చల్లదనం ... ఆమె చిరునవ్వు,
మధుర గందర్వ గానం
సున్నితంగా స్పర్శిస్తున్న గాలి గుసగుసలు

ఎటు చూసినా
ఆమే...లా ఆకాశం
నా మనసు భావనల్లో
ఆలోచనల్లో ... ఆమె నా సొంతం అని,

చల్లని గాలి
సుతారంగా స్మృతుల్ని తట్టి,
విరహ వేదన ...
గుండె వేగంగా కొట్టుకుంటూ,

ఒకప్పుడు నేను
ఎంతగానో పూజించి
ఆరాధించిన ఆమె చిరునవ్వే
కనిపిస్తుంది కళ్ళు మూస్తే,

నా కళ్ళు అయాచితంగా
కన్నీరు కారుతూ,
లోలో ... ఆత్మ
మౌనంగా రోధిస్తుంది.

పొందాల్సిన సమయంలో
పొందిన బహుమానం
ఆమె ప్రేమ
తృటిలో పోగొట్టుకున్న నిర్భాగ్యుడ్ని

ఆమె మళ్ళీ కనిపించింది.
మబ్బులు దాటిన ... వెన్నెల వెలుగై,
నా మనసు బృందావనంలో మల్లెలు 
పరిమళాలు ... మనసు పూజ అసహజమా!

Monday, November 5, 2012

పెరటి ఫలం



ఇవ్వాల్సినవి, ఫలించాల్సినవి ఎన్నో
తొట్రుపడటక తప్పదు ఎంతటివారికైనా
కష్టిస్తేనే జీవితం కనుక
నాకు నేను నా పరిధిలో
మహరాజులా కనిపించొచ్చు

ఎవరి జేబులోనూ చిరుగంటలు లేవు
అందరూ ఆస్తిపరులే ... ప్రకృతి ఆస్తి 
ఒకరి ఆనందంకోసం మరొకరిలో మార్పు రాదు
పరిస్తితుల్ని బట్టి తనను తాను మార్చుకుని
బ్రతకగలిగిన్నాడు ... జీవితం మధురానుభవమే

ప్రతి ఒక్కరిలో లోలో ఆత్మ సంఘర్షణ
తమ కలను నిజం చేసుకునే ప్రయత్నం
ఆశయంపైనే ఖచ్చితమైన దృష్టి ఉండడానికి
చెడు వైపును చెడు నీడల్నీ తొలగించుకోక తప్పదు

నిబంధనల్నీ మార్చుకోక తప్పదు
జీవితం ప్రతి ఖాళీ పేజీ మీద నిర్దిక్షక్షరాల్ని రాయాలి
సామాన్యుడ్ననుకో ... పాజిటివ్ ఆలోచనల్తో
కఠిన రహదారుల్ని మంచి మార్గాలుగా మార్చుకో

ఒక అద్భుతం, ఆనందం జీవితం అవుతుంది
నీవు నాటిన మొక్క ఫలాలు నీకే చెందుతాయనుకుంటే
మరి ఆలశ్యమెందుకు నేస్తం?
స్నేహం, సద్భావనా బీజాలు నాటుదాం ... ప్రతి పెరట్లో
మానవత్వం, మంచి మనుగడ ఫలాల్ని పొందుదాం!

Saturday, November 3, 2012

మనోరోధన


నేను ఒంటరిని
ఒంటరిగా ... సాగుతూ నా నీడ

గాయం సలుపుతూ
చాలా తీవ్రంగా ... దుమ్ము కొట్టుకుపోయి పుండు

అవసరం తీరిన నిర్లక్ష్యం
చెత్తకుండీలో విసిరేసిన విస్తరాకు ... నేను

రక్షణ కవచం సెక్యూరిటీని
అవసరానికీ, ప్రాణానికీ ... తీరాక బారాన్ని

ఒంటరి తపన ... ఎవరూలేరని
సాన్నిహిత్యం, నొప్పి ... ఓదార్పు కోసం

మనో రోధన
ఎదురు చూసీ చూసీ ... ఆశ ఆవిరై పోయి

నేను ఒంటరిని ... ఒంటరితనాన్ని
మనిషి మరిచిన ... ఎవరూ పట్టించుకోని మానవత్వాన్ని

కోరిక!


ఎంతో సులభం ...
ఊహించడం
ఎంత అందంగా కనిపిస్తావో
నా కళ్ళకు నీవని

అద్భుతం, దైవసంకల్పమేమో
అనిపిస్తుంది ...
నీ చెయ్యందుకున్న ప్రతిసారీ
నాజూకైన నీ స్పర్శ

నీ పెదవులు రాలే పలుకు
మాధుర్యం ... ముత్యాల కోసం
కొట్టుకోవడం మానేసి
వెదుకుతుంది నా హృదయం

నా దృష్టి ...
శ్వాసించే గాలి కన్నా ... అమూల్యమైన
నీ పదాలు పూచే
ఆ అదర పరిమళాల పైనే

నా ప్రతి ఊహలో, కలలో
ఊరించే నక్షత్రానివి, ఆశవి
నా మనసును ఆకర్షించి,
కవ్వించే ... మోహ సుగందానివి.

తోడ్పాటును, శ్రమనై ...
నీతోనే ఉండాలని,
నీ ప్రతి కార్యాచరణలో ...
స్వేదబిందువు కావాలని ... కోరిక!

నా ... శరీరం,
నా హృదయం, నా ఆత్మ
నా ప్రతి ఆలోచనా ... నా ప్రతి ఆవేశం
నీ చుట్టూ నీ నీడలా ఉండాలని కాలాంతం వరకూ ... కోరిక!

Friday, November 2, 2012

ఏమని చెప్పను?



నీవు నా నమ్మకం
తోడుగా ఉన్నాననే భావం
నా నేస్తం
కష్టాలు, కన్నీళ్ళు,
ఉలికిపాటు బ్రతుకు లో
ఏమాశించావో
నీ మదిలో ఏముందో
అన్ని స్థితుల్లోనూ

నాతోనే ఉన్నావు
నా ఆత్మలా,

బాధతో నేను కొట్టుకుంటున్నప్పుడు
నన్నోదార్చే కాలం ...
నా పక్కన నీవు!
బాధ, ఆవేదన
భరించలేక అల్లాడిపోతున్నప్పుడు
మరిచిపోయేందుకు,
మనో నిబ్బరం పెంచేందుకు,
ఆనందాన్ని నింపేందుకు,
నన్ను కోల్పోయిన నాకు
చిరునవ్వు మాత్రవు!
ఊరట వు! దేవతవు!

జీవితం ఆనందాన్ని
అందాన్ని గుర్తుచేస్తూ
ఆశ ఆవిరై,
అసంభవం అనుకున్న క్షణాల్లో
సంభవమెలాగో విడమరుస్తూ,
సహేతుకంగా బలాన్నిస్తూ,
ఊతగా ...
రాత్రి నా కళ్ళు
మూతలు పడేవరకూ ,
ఆత్మబందువులా ఉన్నావు.

నన్నిప్పుడు డిస్చార్జ్ చేస్తున్నారు ...

కనిపించవేం నేస్తం?
నీవెక్కడ?
నా జీవితానికి నీడగా
నా తోడుగా ...
నా మనసంతా నీవే అని ...
నిన్ను నేను పూజిస్తున్నానని ...
ప్రేమిస్తున్నానని!
ఏమని చెప్పను!

ప్రేమ పూజారి


సగ జీవితం గడిచిపోయింది
నేను కోరుకున్నవాళ్ళు నన్నిష్టపడక
నన్నిష్టపడ్డవారిని నేనిష్టపడక
జీవన బాగస్వామిని నిన్ను వెతకడంకోసం
ఒక జీవితం చాలదేమో అనుకున్నాను

పెద్దలు కుదిర్చిన అనుబంధం
అగ్ని సాక్షిగా పొందిన నీ సాహచర్యం
నిన్ను కాదనుకుని పోగొట్టుకున్నాకే తెలిసింది
అందం వేరు సౌందర్యం వేరని
కళ్ళు మోసం చేస్తాయి మనసుతో చూడాలని

అందంగా సీరియల్ లో అమ్మాయిలా లేవని
నిన్ను కాదనుకున్నాను నీతో జీవించలేనని నిర్ణయించుకున్నాను
అసహ్యించుకున్నాను ... నీవెంత బ్రతిమాలినా ససేమిరా అని
గుమ్మంలోంచి తోసేసాను ... మళ్ళీ రావొద్దని బలవంతంగా
చివరికి నీవు దూరమయ్యి కనుపించనంతవరకూ ... పట్టుబట్టి మరీ

ఏ పాఠం జీవితం నాకు నేర్పాలనుకుందో ఏమో

అద్దంలో నా ముఖం ... లో అవాంచనీయమైన మార్పులు
నాకు నేను వికృతంగా ... ఔనూ నేనేనా ... నేనెందుకిలా అవుతున్నానా అనిపిస్తూ
కాదనుకున్న నీవు దూరమయ్యావుగా ... మాయమయ్యావుగా
ఉత్సాహం, ఉల్లాసం ఉరకలెందుకెయ్యడం లేదో
మనసెందుకు నన్నెందుకిలా బాధిస్తుందీ అని ... మనోవేదన

అద్దంలో చూస్తున్నాను ... పరీక్షగా
నాలో ... లోలో ... ఏవో రకరకాల రాక్షస రూపాలు
ద్వేషం, వ్యాకులత, బాధ ... నేనులా
నేనులు ... వీటన్నిటి నీడలో నిర్భావంగా నిలబడ్డ నీవలా
సగటు స్త్రీని గృహిణిని నిన్ను చూసి తొట్రుపడ్డాను ... ఇక్కడా నీవేనా అని

నేలకూలాను ... రోగమేదో పీడై ... నిలువెల్లా నీరసం
అశక్తత తో కార్పోరెట్ హాస్పిటల్లో బెడ్ మీద నేను ...
ఊపిరాడని స్థితి ... సమాజం నన్ను ఏవగించుకుంటున్నట్లు ... సీరియల్స్ ల్లో
సమశ్యల ఉప్పెన కష్టాలన్నీ ఒకదాని తరువాత ఒకటొచ్చినట్లు
నర్సులు అటెండర్ల కళ్ళలో చికాకు అసహ్యం ... డబ్బుతో మారే ముఖ కవళికలవి

మళ్ళీ నీవొచ్చావు. ఆహ్వానించకుండానే ... బాధ్యతేదో నీదే అన్నట్లు
పుండైపోయిన శరీరాన్ని బద్రంగా తడిమావు తుడిచావు
మరణించడమే మేలేమో అనుకున్న క్షణాల్లో
అమృత హస్తంలా నమ్మకానివై పడిపోతున్న ప్రతిసారీ పడకుండా
చేయూత నిచ్చి వెచ్చని నీ సాన్నిహిత్యం సపర్యలతో తోడై ఉన్నావు

సిగ్గేస్తుంది సిగ్గు ... నేను విదిల్చేసిన నువ్వలా నన్ను ఆదరిస్తుంటే
చచ్చెందుకుపోలేదా ... బ్రతికెందుకున్నానా అని భావనలతో ... మనసు
నమ్మకమో, మేలుకొలుపో ఇప్పుడు నేను కోలుకున్నాను.
మనసు కళ్ళతో చూడగలుగుతున్నాను ... నా ఆలోచనల్లో పశ్చాత్తాపము
నాలోని రాక్షస రూపాలు ఒక్కొక్కటే మాయమై ... రాక్షసత్వం స్థానే నా నీడలా ఉన్న నీ ప్రేమ పూజారినై

ఆఖరి క్షణం



ముగింపు ... అంచు ... ఆ చివర ...
అన్నింటికీ ఉంటుంది.
ఓ అద్భుతం ... కొన్ని క్షణాల అంచుల మీద
ఓ ఘోరం ...రోడ్డు ప్రమాదం అంచులో
శరీరానికి శక్తి ...చివరి ముద్ద
తాగేసిన కాఫీ ... అలసట ముగింపు
చివరి ప్రేమ
ఆమె రూపం ... హృదయం ఆసాంతం 
తుది ముద్దు
కరిగిపోయిన ఆ కడపటి కౌగిలి
నీవు రాసిన ముగింపు వ్యాఖ్య
తుది ... అంతిమ ... గడిచిన ... చాలిన ... చివర తప్పదు దేనికైనా

కానీ,
అతిదుష్టమైన ముగింపు, అంచు ... మాత్రం
చివరి శ్వాసే
ఆ పిదప మరణమే కనుక