Friday, November 2, 2012

ప్రేమ పూజారి


సగ జీవితం గడిచిపోయింది
నేను కోరుకున్నవాళ్ళు నన్నిష్టపడక
నన్నిష్టపడ్డవారిని నేనిష్టపడక
జీవన బాగస్వామిని నిన్ను వెతకడంకోసం
ఒక జీవితం చాలదేమో అనుకున్నాను

పెద్దలు కుదిర్చిన అనుబంధం
అగ్ని సాక్షిగా పొందిన నీ సాహచర్యం
నిన్ను కాదనుకుని పోగొట్టుకున్నాకే తెలిసింది
అందం వేరు సౌందర్యం వేరని
కళ్ళు మోసం చేస్తాయి మనసుతో చూడాలని

అందంగా సీరియల్ లో అమ్మాయిలా లేవని
నిన్ను కాదనుకున్నాను నీతో జీవించలేనని నిర్ణయించుకున్నాను
అసహ్యించుకున్నాను ... నీవెంత బ్రతిమాలినా ససేమిరా అని
గుమ్మంలోంచి తోసేసాను ... మళ్ళీ రావొద్దని బలవంతంగా
చివరికి నీవు దూరమయ్యి కనుపించనంతవరకూ ... పట్టుబట్టి మరీ

ఏ పాఠం జీవితం నాకు నేర్పాలనుకుందో ఏమో

అద్దంలో నా ముఖం ... లో అవాంచనీయమైన మార్పులు
నాకు నేను వికృతంగా ... ఔనూ నేనేనా ... నేనెందుకిలా అవుతున్నానా అనిపిస్తూ
కాదనుకున్న నీవు దూరమయ్యావుగా ... మాయమయ్యావుగా
ఉత్సాహం, ఉల్లాసం ఉరకలెందుకెయ్యడం లేదో
మనసెందుకు నన్నెందుకిలా బాధిస్తుందీ అని ... మనోవేదన

అద్దంలో చూస్తున్నాను ... పరీక్షగా
నాలో ... లోలో ... ఏవో రకరకాల రాక్షస రూపాలు
ద్వేషం, వ్యాకులత, బాధ ... నేనులా
నేనులు ... వీటన్నిటి నీడలో నిర్భావంగా నిలబడ్డ నీవలా
సగటు స్త్రీని గృహిణిని నిన్ను చూసి తొట్రుపడ్డాను ... ఇక్కడా నీవేనా అని

నేలకూలాను ... రోగమేదో పీడై ... నిలువెల్లా నీరసం
అశక్తత తో కార్పోరెట్ హాస్పిటల్లో బెడ్ మీద నేను ...
ఊపిరాడని స్థితి ... సమాజం నన్ను ఏవగించుకుంటున్నట్లు ... సీరియల్స్ ల్లో
సమశ్యల ఉప్పెన కష్టాలన్నీ ఒకదాని తరువాత ఒకటొచ్చినట్లు
నర్సులు అటెండర్ల కళ్ళలో చికాకు అసహ్యం ... డబ్బుతో మారే ముఖ కవళికలవి

మళ్ళీ నీవొచ్చావు. ఆహ్వానించకుండానే ... బాధ్యతేదో నీదే అన్నట్లు
పుండైపోయిన శరీరాన్ని బద్రంగా తడిమావు తుడిచావు
మరణించడమే మేలేమో అనుకున్న క్షణాల్లో
అమృత హస్తంలా నమ్మకానివై పడిపోతున్న ప్రతిసారీ పడకుండా
చేయూత నిచ్చి వెచ్చని నీ సాన్నిహిత్యం సపర్యలతో తోడై ఉన్నావు

సిగ్గేస్తుంది సిగ్గు ... నేను విదిల్చేసిన నువ్వలా నన్ను ఆదరిస్తుంటే
చచ్చెందుకుపోలేదా ... బ్రతికెందుకున్నానా అని భావనలతో ... మనసు
నమ్మకమో, మేలుకొలుపో ఇప్పుడు నేను కోలుకున్నాను.
మనసు కళ్ళతో చూడగలుగుతున్నాను ... నా ఆలోచనల్లో పశ్చాత్తాపము
నాలోని రాక్షస రూపాలు ఒక్కొక్కటే మాయమై ... రాక్షసత్వం స్థానే నా నీడలా ఉన్న నీ ప్రేమ పూజారినై

No comments:

Post a Comment