Saturday, February 28, 2015

మంచు ముసిరిన వేళ


నగర సివార్లనుంచి నగరంలోకి
దట్టంగా కమ్ముకుని ఉద్యమిస్తూ చిక్కటి మేఘాలు
ఆమె, ఆమె గదిలో ఒంటరిగా
మంచును మింగేసిన గాలి అతి శీతలంగా,
వీధుల్లో మంచు కురుస్తూ,
జీవితం చరమాంకపు వెలితి ముసిరిన కాంతి లేని గదిలో
నలుపు కర్టెన్లు నీలం రంగు గోడల
అన్ని వేళలూ రాత్రి వేళలు లా కనిపించే చీకటి గదిలో,
ఎన్ని రాత్రులో,
ఎన్ని పగళ్ళో ఆమె అలా
నీ కోసం వేచి చూస్తూ
కొవ్వొత్తిలా కరుగుతూ,
కన్నీరు కురుస్తూ,
నిస్సత్తువలో నానుతూ
కిటికీ గ్లాసు మీద మంచు లా, 
రాత్రనక పగలనక అలా వేచి చూస్తూ ....
నీ కోసం ఇప్పుడు
జీవితం చరమాంకపు వెలితి ముసురులో,
నీరసంగా దూరమైన నిన్నే తలచుకుంటూ,

వెన్నెల తాపం


నీదీ నాదీ అనుకున్న
నీ, నా జ్ఞాపకాల మంచం పై 
నన్ను వదిలేసి .... ఎందుకలా
ఈ చిరునవ్వు బూడిదలో
దొర్లమని
నాటి నీ నవ్వును అనుభూతి
చెందమన్నట్లు నువ్వెళ్ళిపోయావో
నేనెరుగని తీరాలకు.

మనవద్ద రెండు జీవిత కాలాల
సమయం ఉందనుకున్నానే కానీ
అరమరికలు లేని
పొగ .... అల్లుకుపోయే అనురాగం
నీ సాంగత్యం, మృధుత్వం
సుఖ దుఃఖాల ముద్దులలు
దూరమౌతాను అని అనుకోక
భద్రంగా దాచుకో లేదు.
సమయం సరిపోదనుకోలేదు.

ఇప్పుడు నేను నా ఆలోచనలలో
నిన్ను వదిలి జీవించాలని
కాలుతున్న యౌవ్వనం లో
కరిగి మనిషినయ్యి
నీవులేని వేదన జీవనంలో
వడలి రాలిన
నా నవ్వు బూడిదలో పొర్లి
నీ జ్ఞాపకాల అనుభూతిని చెందాలని

Friday, February 27, 2015

ఆమె నేను


నా మౌనం, నిశ్శబ్దం మాటలను క్రీడీకరించి
ప్రపంచానికి వినిపించిన నేస్తం .... ఆమె,
నేను తడబడినప్పుడు, నా కన్నీళ్ళకు
నవ్వులు అద్ది, అవి పువ్వులయ్యేట్లు
ఆసరాగా నా పక్కనే నిలబడి
ధైర్యం చెప్పిన బలం .... ఆమె,
నేను అతి బలహీనుడ్నైన వేళల్లో
ఉత్తేజం ఉల్లాసం నింపి .... నాలో, నాకు
ఎప్పుడైనా .... ఏ అనాలోచిత ఉలికిపాటు
తత్తరపాటు రోగమో వస్తే నయం చేసిన
ప్రకృతి లేపనం ఆమె.
తుఫానుకు ముందు మౌనం వహించిన
శక్తివంతమైన నిండు ప్రశాంతత
నేను కోల్పోలేని నా విశ్వాసం ఆమె.
ఈ అశాశ్వత నశ్వర ప్రపంచం లో
పసి మనసుతో నిండుగా
నిష్కల్మషంగా నవ్వులు త్రుళ్ళించి, కళ్ళతో
నా ఆలోచనలకు కొత్త గమ్యాలను నిర్దేశించి
ప్రతిగా, ఎప్పటికీ జతుంటాననే నమ్మకాన్నిచ్చి 


నా ప్రేమను స్వీకరించిన ఔదార్యం.... ఆమె.
ఆమె జతలో, భయాన్ని తరిమేసి .... నవ్వుతూ నేను.

Thursday, February 26, 2015

పగలని నీటి బుడగవిరిగిన, ముక్కల హృదయంతో
ఒక సగటుమనిషిని .... నేను
నీకు ఎదురుపడ్డప్పుడు .
నయం చెయ్యగలవనుకోలేదు.
ఆశ్చర్యపోయానే కాని
నా లోపలి గాయాలను
నిజంగా చూడగలవనుకోలేదు.

ఉపశమనం కోసం విశ్రమిస్తున్నానని
నా చూపుల్లో
నీవు గమనించే వుంటావు
గమనించే వుంటావు .... ఈ యాంత్రిక
జీవన ప్రయాణానుమతి పత్రాన్ని
ఒక ఆనందాతిరేకపు మెరుపును,
రోజువారీ క్షణికానంద లక్షణాన్ని .... నాలో,

ఆ బ్రహ్మ రాసిన విషాద జీవితం ఇది,
నేను ఒక గొప్ప పాత్రను
సవాలునై,
విచ్ఛిన్నమయ్యిందని
విరిగిన నా హృదయాన్ని గుర్తించడం లో
విఫలమైన నీవు, నయం చేసే ప్రయత్నం లో
శూన్యతనే మిగల్చగలగడం .... తియ్యని వాస్తవమైతే


Tuesday, February 24, 2015

నువ్వొస్తావని


తూరుపు కొండల్లో ఉదయించిన నూతన ఉద్యమమా .... చైతన్యమా!
బిడ్డడినై .... నీ ఒడిలో తెలతెలవారాలని, నిన్నే గుర్తుచేసేలా
అగ్నిశిఖ లా జీవించేందుకు, పోట్లాడబడి దండించబడాల్సొచ్చినా
ఈ శూన్య ఆలోచనల అస్థిర తెలిమబ్బులకు దూరంగా జరిగిపోవాలని

నేనొక పనిముట్టునైనా కాలేకపోతున్నానే అని, నీ కిరణాల్ని తాకలేకున్నానే అని
నీ వెచ్చదనం నన్ను పొదువుకోవాలనుంటుంది .... నీవే నేను లా,
ఓ పురోగమనమా! నా అయోమయ, నిస్తేజ, లక్షణాలన్నీ చైతన్యవంతమయ్యి
సోమరితనం ను అదుపులో ఉంచుకునేలా క్రమశిక్షణకు మారుపేరును కావాలనుంటుంది.

నువ్వేదైనా నాకు చెప్పాలనుకునుంటే, నేను చేసేలా .... నువ్వే చేసెయ్యి
ఈ మందపు శరీరంలోకి ఇంకడం చాలా కష్టం! నువ్వే నెమ్మదిగానో, సున్నితంగానో
నా ఆలోచనల్లోకి దూరి, మది పత్రహరితాని వై .... నన్నొదిలి వెళ్ళాలనిపించే లో గా
క్రూర అనైతికమైన .... ఈ జీవన రణనంలో, నాకు నేను జాగ్రత్తపడేలా హితభోద చెయ్యి

ప్రతిరోజూ తూరుపుకొండల్లో వెలుగువై ఉదయించి సంసారాన్నంతా చుట్టి పలుకరించి
విధిగా సంద్య వేళ అస్తమించే కాల సౌందర్యమా! నీవేమిటో నాకు తెలుసు
నా మాటల్లో నీకు అసాధారణత అనాసక్తత యాంత్రికత నే కనిపిస్తున్నాయనిపించినా సరే
నీ చైతన్య కిరణ వర్షంలో తడిచే అదృష్టం, జ్ఞానోదయం పొందే భాగ్యం ఆకాంక్షిస్తున్నాను.


జన సమూహాలకు, ముగింపు లేని వాదనల విసుగు విసురుళ్ళకూ దూరంగా
విసిరేయబడిన అవిజ్ఞత మొక్కను .... ఈ చీకటి లోయల్లో వృక్షమై విస్తరిల్లి
కీచురాళ్ళు, గబ్బిలాల రెక్కల చప్పుళ్ళ అసంబద్ద నిరుపయోగ లక్షణాన్నై
ఎదురుచూస్తున్నా! పురోగమనం, చైతన్యం తోడుపొందే ఆరాటం లో .... ఆశగా నీ కోసం

Monday, February 23, 2015

చేరువవ్వాలనుంది, నీకు


నీవెరుగుదువనుకోను. నా మనోవేదన
జతగా నీవు లేని క్షణాల నా దుర్దశ 
నీకు అర్ధమౌతుందనుకోను.
నాలో అంతర్మదనం
ఏనాడూ నీకు ఎదురుపడని ఈ అలసత్వం

ఒంటరినై, మాయావలయంలో చిక్కుకుపోయినట్లు
కలలోనే నీకు చేరువవుతూ ....
ఆశ్చర్యం సంభ్రమం అనిపిస్తుంటుంది.
నా సాంగత్యం లో పొందలేని ఏ స్వేచ్చకోసమైనా
నిజ జీవితంలో .... అందని దూరంలో ఉండిపోయావా అని

నీవు, నా ప్రియురాలివి, నా నేస్తానివీ కాకపోవచ్చు
అయినా పిల్లా!
నా సర్వస్వం నీకే సమర్పించుకున్నాను.
నా జతనౌతావనే నమ్మకాన్ని
నీ చిరునవ్వులు అనుభూతుల
కారణం నేనయ్యే అవకాశాన్నిస్తావు చాలని 


కష్టంగా ఉంది.
జతగా నీవు పక్కన లేవన్న నిజం జీర్ణించుకోవడం
నీవున్నావనుకుని స్పర్శించేందుకు జాపిన చేతికి
శున్యానివై నైరాశ్యం చెందాల్సొచ్చినప్పుడు ....
ఈ హృదయానికి తెలియదు. చేరలేని దూరంలో నువ్వున్నావనే
అతిశీతల భావన నాలో లోలో
ఏ నీడనో భ్రమనో ఆసరాగా వ్రేలాడుతున్నట్లుంది.

నా హృదిలో కి స్వాగతించిందీ, త్రిశంకువులో వ్రేలాడుతుందీ
నీ భావనల్ని పట్టుకునే
అందుబాటులో లేని నీ ఆధరణను పొందేదెలా అనే 
నా ఈ పరితపన మూలం తెలుసుకునేదెలా అనే 
ఇది తొందరపాటో, పొరపాటో, తప్పుడు ఆవేశమో ....
పిల్లా! నిజం .... మది ఎదలనిండా ఇప్పుడు నా అన్నీ నువ్వే

Saturday, February 21, 2015

శూన్యం


ఇవ్వాలనుకుని. ఇచ్చేసా!
హృదయం

శూన్యం, నిశ్శబ్దం ....
యాంత్రికత అలవాటయ్యింది. 

బదులివ్వాలనుకున్నావు.

భయం! సమాధానం
ప్రతికూలమూ కావచ్చని

నిశ్శబ్దం
శున్యంగా ఉండటం నయం అని
చూస్తూ ఉండిపోయాను.

నువ్వెళ్ళిపోయావు.

ఇప్పుడు
ఒంటరి నైరాశ్యాన్ని శ్వాసిస్తున్నా
ఆవిర్లను నిశ్వాసిస్తూ

Friday, February 20, 2015

ఊపిరాడ్డం లేదుఎందుకు
ప్రాణాన్నీ, శ్వాసను 
నాకు కాకుండా 
చేస్తున్నావో .... ప్రతి క్షణమూ

దయచేసి 
ఒక్కసారే చంపెయ్యి
అలసి నిట్టూరుస్తున్న క్షణాల్లో 
అడగకుండానే

Thursday, February 19, 2015

విన్నపం వినవా


నేను కలకంటున్నది నిన్నే
ప్రతిరోజూ ప్రతి రాత్రీ
జీవితం లో .... నా కలలో
ఓ మానసీ! ఎవరి చెరసాలలోనో
నీవు బంధీవయ్యి వున్న
భావనే కలలా చూస్తున్నాను.

ఎప్పుడైనా నిజంగా నీవు
ఎవరినైనా కోరుకున్నావా?
ఏ వల....పు చెరసాలలోనైనా
బంధీవి అయ్యి .... ఎలాంటి అనుభూతి
ఆలోచనల వలలో చిక్కుకున్నావో
ఎలాంటి కలలొస్తున్నాయో నీకు అని 


నాకొక సహాయం చెయ్యి
నీ మనోభావనలను అర్ధం చేసుకోవాలనుంది
కలలో అనవరతమూ నీవు
అంత ఆకర్షణీయంగా కనిపిస్తుంటావు
ఏ అంకిత భావంతోనో తెలియదు.
నా మదిలో మాత్రం .... నా అన్నీ నీవే

నాకు తెలుసని నీకు తెలుసా?
నీ చిరునవ్వు మాటల మాధుర్యం రుచి
నీ కౌగిలింత కవ్వింపులోని కసి
ఏనాడూ నిన్ను హత్తుకోని
నీకు ఎదురుపడని .... నా ఆలోచనలూ నేనూ
ఎరుగని ఏ రహశ్య ప్రదేశాలకో జారిపోతుండటం

ఇప్పుడు, అలసటగా ఉంది. నిదురొస్తుంది.
ప్రార్ధిస్తున్నా. సమయం మించిపోలేదని
కలలోనైనా కరుణించి నువ్వొస్తావని
ఎవరికీ కట్టుబడని వ్యక్తిత్వానివై
తెరిచున్న ఈ హృదిలోకి రావాలని
నా మదిలో నా అన్నీ నీవే కావాలని

Friday, February 13, 2015

ఒంటరిని లా నిన్నటివరకూ నీతోనే ....
నీడలా
నిన్ను ప్రేమిస్తున్నాను అని
చెప్పక,
ఆలశ్యం చేసాను.
ఒక ఆనందపు క్షణం
అనుభూతిని,
నిన్ను కోల్పోయి నా మనోభావనల పదాలు
నిన్ను చేరక
నీ చిరునవ్వు
బహుమానం పొందక
ఇప్పుడు,
ఎప్పటికీ తెరుచుకోని
నీ కళ్ళనే చూడాల్సి 
తప్పించుకోలేని నిశ్శబ్దంలో

Wednesday, February 11, 2015

ఆమె


ఉదృతంగా ఉబికొస్తూ ఉన్న ....
కన్నీటి ఆటుపోట్ల
అనియంత్రణను ధిక్కరిస్తూ,
సముద్ర తటాన
భారమైన గుండె తో
తన తోడు ప్రయాణించిన పడవ కై
వేయి కళ్ళతో వేచి చూస్తూ ఉంది
ఆత్మబాంధవుడు
దూరమైపోయాడేమో అనే భయంతో

Tuesday, February 10, 2015

బొంగరంసమాజం పై
వ్యక్తిత్వ ప్రభావం ఉండేలా
ఏమీ కానని ఎవరూ అనుకోని
ఉపయోగకరంగా

కారణ జన్ముడినిలా
ఆ కారణం ఏదైనా

ఊహించని పొందిన
బహుమానం ఈ జీవితం
ఈ భూమి మీద
ఉనికి గుర్తుండేలా జీవించేందుకు

కారణం .... తల్లిదండ్రులో, స్నేహితులో
సమాజమో కాకుండా
నేను, నేనులా జీవించే
ఒక అవకాశం ఈ జీవితం

ఊపిరాడ్డంలేదు.ఉలిక్కిపడి నిద్రలేచి నన్ను నేను చూసుకున్నాను. శరీరం కంపిస్తుంది.

చెమటతో తడిచిన ముఖంతో ఎడతెగని ఉక్కబోత, ఊపిరికోసం తడుముకోవాల్సిన స్థితి, చీదర చీదరగా ఉంది.

ఒణుకుతున్న చేతులతో ముఖాన్ని తడుముకున్నాను. జ్ఞాపకాలను దూరంగా నెట్టేయ్యాలనిపించింది. ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. జ్ఞాపకాలను అణగద్రొక్కలేకపోయాను. తెల్లవారుజాము కలలా వచ్చి పలుకరిస్తున్నాయి, కలత నిద్దుర కల కాదు అది .... నిజం!

చీకటి లో ఎవరివో అరుపులు, ఎడతెరపని బుల్లెట్టు శబ్దాలు .... భూమి బ్రద్దలయ్యినట్లు బాంబు ప్రేలుళ్ళు .... ఎందరో సహచరులు బాటసారుల ఆర్తనాదాలు గాయాలై స్పృహ కోల్పోయిన శరీరాలు చెల్లా చెదురుగా విసిరేసినట్లు .... పిచ్చివాడ్నిలా కదులుతూ ఉన్నాను. రద్దీగా ఉన్న నగర నాలుగురోడ్ల కూడలి లో సాయంత్రం వేళ జరిగిన అమానుష చర్య అది. ఉగ్రవాదుల దాడి.

విధ్యుత్తు స్తంబాలు ద్వంసమయ్యాయి. అంతా చీకటి. తొక్కిసలాట. ఎవరు ఎవరిని తొక్కుతున్నారో ఏమైపోతుందో .... నన్నైనా నేను రక్షించుకోగలనా అనే పెనుగులాట క్షణాలవి ....ఆ జ్ఞాపకాలు ఆ సంఘటనలు ఇప్పుడు దృశ్యాలుగా కళ్ళముందు కదులాడుతూ .... గుండెను మెలితిప్పేసే ఆ భయానక క్షణాలు ఆ భీతావహమైన దృశ్యాలు కలలోకి వచ్చి పలుకరిస్తుంటే చూడలేక చూడక తప్పని స్థితి.

కొన్ని కొన్ని సంఘటనలు అంతే! కలలోనూ జీవితంలోనూ నీడలా వెన్నంటి ఉంటాయి. వాటిని దూరం చేసుకోవడానికి కొంత సమయం అవసరం.

ఎటు చూసినా రక్తమూ, ముక్కలైన శరీరావయవాలతో ఆ ప్రదేశమంతా రక్తశిక్తమై భీతావహమై కళ్ళు మూసినా తెరిచినా అసహాయంగా ....
మానవత్వం నన్ను పరిహసిస్తున్నట్లు .... మరణించి కొందరు, అవయవాలను కోల్పోయి కొందరు ....
రక్తకన్నీరు బొట్టొకటి నా బుగ్గపై జారి కనపడకుండా తుడిచేసుకోవాలనిపించింది.

ఎన్నాళ్ళుగానో నా ఈ ప్రయత్నం .... ఈ జ్ఞాపకాలను మరిచిపోవాలని. మదిలోని చీకటిపొరల్లోకి జ్ఞాపకాలను తోసేసి కట్టుదిట్టం చెయ్యాలని.

కానీ నిష్ప్రయోజనం. యుద్ధం చేస్తున్నట్లు నా బలహీనత పై జ్ఞాపకాలు దాడి చేస్తూనే ఉన్నాయి.

నేనో సగటు మనిషిని.  గొప్ప మనిషిని కాకపోయినా నా దృష్టిలోనైనా దుర్మార్గుడ్ని కాకపోతే చాలు అని ఉంది. అయినా ఎందుకో మృత్యుదేవత హస్తాల్లో మానవత్వం ముక్కలు చెక్కలవుతుంటే స్వార్ధపరుడ్నై పారిపోయొచ్చిన పిరికివాడ్ననే బాధ ఏదో .... నన్ను ఆనాటి నుంచీ వెంటాడుతూనే ఉంది. ఆ ఆర్తనాదాలు, గాయపడి ప్రాణం కోసం అల్లల్లాడుతూ చిరిగి మసేసిపోయిన బట్టలతో అవయవాలు కోల్పోయిన ఆ ముఖాలు. ఎవరు తెలిసిన వారో ఎవరు తెలియని వారో తెలియని ఆదుస్థితి.

సర్వం కళ్ళముందు కదులుతూ మరిచిపోదగని గతం అది. మరిచిపోవాలనే ప్రయత్నం నాది. ఇప్పుడే అర్ధం అయ్యింది. నాది విఫల ప్రయత్నం మాత్రమే అని.

Monday, February 9, 2015

స్వగతం


నా అలసిన క్షణాల ఊరట నీవని నీకూ తెలుసు
గుర్తుందా! మన మొదటికలయిక
నీ ప్రపంచం లో నీవు నా ప్రపంచం లో నేను
ఒంటరి ఇద్దరం
ఒకరిపట్ల ఒకరం ఆకర్షితులమై
అన్ని అడ్డంకులూ నియమాలూ ఉల్లంఘించి
ఎవరి కోపాలకూ ఎవరి హెచ్చరికలకు భయపడకుండా
నా ఇష్టం నీ ఇష్టమనే తొందరలో నేను
మెల్లగా నింపాదిగా ఆలోచించి, సమయం తీసుకుని
ఏకీభావన తెలిపి నీవు కావాలనుకుని ఒక్కరమై
ప్రేమ కోసం, ప్రేమ సాఫల్యత కోసం
పడిన కష్టాలు .... ఆ గతించిన అనుభూతులు
మంచికే జరిగిన ఒక సామాజిక అనుభవం కదూ!?
కలిసి మొగ్గలు పువ్వులమై పరిమళించి
మన ప్రతి రేపు లోనూ ఒక నిన్నను గమనించి
నిజంగా ఒక పాటలా సాగింది కదూ మన జీవనయానం!
ఎప్పుడూ చొరవ తీసుకునే నేను
బిడియపడినా ఆలోచించే నిర్ణయం తీసుకునే నీవు.
ప్రేమకై, తపించి జపించిన క్షణాల జీవనయానం  
ఇప్పుడేమో
ఒక గుర్తుంచుకోదగిన సహజీవన అనుభూతుల్లా
అక్షరాల్లో భావాల్లో మాత్రమే జీవిస్తూ
నీవూ ఒప్పుకుంటావు .... విశ్రమ వేళకు దగ్గరయ్యాము
ఒకప్పటి మనుష్యులం కాదు మనం అని
దానికదే తిరుగుతున్నా ప్రపంచం లో
ఎవరికీ నిన్నూ నన్నూ పట్టించుకునేంత సమయం లేదు 
వయసు కరిగి వృద్దాప్యం నీడలో ఈ మసకబారిన కళ్ళు
మూడుకాళ్ళ జీవితమే మిగిలి ఉన్నది.
ఒకప్పటి నన్ను తెలిసిన నీకు
నేను నా ధైర్యం కోల్పోవడం చూస్తే
కాస్త బాధ ఆశ్చర్యం సహజమే
ఒకప్పటి వాగుడుకాయను కాకపోయినా
ఇలా పదాలను కోల్పోవడం? తడబడటం
అదీ ఇంత ముఖ్యమైన విషయం
మన సహజీవనయానం ను నెమరువేసుకుంటూ

నీడలు పరుచుకుంటూ


నీ ఒట్టులు, నీ వాగ్దానాలు
కృత్రిమ
ఖాళీ పదాలు

నా ఆత్మను
ప్రభావితం చేస్తూ, అర్ధవంతంగా
నీవు జతకూర్చిన వాక్యాలు

వాక్కులో తేటతనం, వర్ణన
నీ జ్ఞాపకాలు
నా మదిపై ముద్రలై

మచ్చలమయమైన
కణజాలం
కణితిలై మొలకెత్తినట్లు

క్రొత్త ఆలోచనల పునఃసృష్టి
ప్రతి క్షణమూ, ఒక క్రొత్త వాగ్దానం
నీవు .... అబద్దానివి కానట్లు

Saturday, February 7, 2015

ఆమే నా గమ్యం


నేను ఆమెను ప్రేమించాను .... అమితంగా
మృత్యువును కాలం గుండెల్లో దాచుకున్నంతగా
తుఫానును సముద్రుడు ముద్దాడినప్పటి శాశ్వత బాంధవ్యం తడిని లా
ఆమె సాహచర్యాన్ని కోరుకుని
కానీ,
         
ఆమె నన్నొదిలి తిరిగిరాని తీరాలకు వెళ్ళిపోయింది.

అందుకనేనేమో
రాత్తిరికి స్ఫూర్తినిచ్చే నీడనుగా మారాలని
ఆటు పిదప పోటునులా మారి
గతం జ్ఞాపకాలను దూరంగా విసిరెయ్యాలని
ఆమె తరలెళ్ళిన శవపేటికను కన్నీటితో శుభ్రపరిచైనా
ఆమెతో కలిసి గమ్యం చేరలేకపోయానే అని అనిపిస్తుంది. 


ఆమంటే నాకు ఎంతో ఇష్టం ....
ఆమె నూ,
ఆమె జ్ఞాపకాలనూ ఊపిరిగా
కాలాంతంవరకూ శ్వాసించుతూ జీవించాలనుంది.

Thursday, February 5, 2015

పరకాయ ప్రవేశం
నా భయాలను అన్నింటినీ
చూర్ణం చేసి
తాగేసెయ్యాలని ఉంది

భయం గా ఉంది
గుండెలో బాధనంతా
ఏడ్చేసేందుకు

ఎందుకో
నాలోని పసితనంలోకి ఒక్కసారి
పరకాయ ప్రవేశం చేసెయ్యాలని ఉంది

Wednesday, February 4, 2015

తెలుసు! .... సాధ్యం కాదని,


తెలుసు,
ఒక విరిగిన గుండె నయం కాదని
అవగాహనే లేకపోతే
ఆ విరిగిన భాగాలను కలిపి కుట్టలేము అని
నమ్మకమూ, విశ్వాసమూ కోల్పోతే
ఆ ఎడబాటు లోతులను నింపుకోలేము అని 


రాలి, విచ్చిన్నమై
గల్లంతైన గుండెను
ప్రేమ మాటలు
ప్రేమ చేష్టలు తో భర్తీ చెయ్యగలమేమో 
కానీ,
పగిలిన హృదయం పల్లవించదు
ముక్కలు ఒక్కటవ్వవు అని
తెలుసు ....
బాధలోని తియ్యదనమే జత ఇక అని