Monday, February 9, 2015

స్వగతం


నా అలసిన క్షణాల ఊరట నీవని నీకూ తెలుసు
గుర్తుందా! మన మొదటికలయిక
నీ ప్రపంచం లో నీవు నా ప్రపంచం లో నేను
ఒంటరి ఇద్దరం
ఒకరిపట్ల ఒకరం ఆకర్షితులమై
అన్ని అడ్డంకులూ నియమాలూ ఉల్లంఘించి
ఎవరి కోపాలకూ ఎవరి హెచ్చరికలకు భయపడకుండా
నా ఇష్టం నీ ఇష్టమనే తొందరలో నేను
మెల్లగా నింపాదిగా ఆలోచించి, సమయం తీసుకుని
ఏకీభావన తెలిపి నీవు కావాలనుకుని ఒక్కరమై
ప్రేమ కోసం, ప్రేమ సాఫల్యత కోసం
పడిన కష్టాలు .... ఆ గతించిన అనుభూతులు
మంచికే జరిగిన ఒక సామాజిక అనుభవం కదూ!?
కలిసి మొగ్గలు పువ్వులమై పరిమళించి
మన ప్రతి రేపు లోనూ ఒక నిన్నను గమనించి
నిజంగా ఒక పాటలా సాగింది కదూ మన జీవనయానం!
ఎప్పుడూ చొరవ తీసుకునే నేను
బిడియపడినా ఆలోచించే నిర్ణయం తీసుకునే నీవు.
ప్రేమకై, తపించి జపించిన క్షణాల జీవనయానం  
ఇప్పుడేమో
ఒక గుర్తుంచుకోదగిన సహజీవన అనుభూతుల్లా
అక్షరాల్లో భావాల్లో మాత్రమే జీవిస్తూ
నీవూ ఒప్పుకుంటావు .... విశ్రమ వేళకు దగ్గరయ్యాము
ఒకప్పటి మనుష్యులం కాదు మనం అని
దానికదే తిరుగుతున్నా ప్రపంచం లో
ఎవరికీ నిన్నూ నన్నూ పట్టించుకునేంత సమయం లేదు 
వయసు కరిగి వృద్దాప్యం నీడలో ఈ మసకబారిన కళ్ళు
మూడుకాళ్ళ జీవితమే మిగిలి ఉన్నది.
ఒకప్పటి నన్ను తెలిసిన నీకు
నేను నా ధైర్యం కోల్పోవడం చూస్తే
కాస్త బాధ ఆశ్చర్యం సహజమే
ఒకప్పటి వాగుడుకాయను కాకపోయినా
ఇలా పదాలను కోల్పోవడం? తడబడటం
అదీ ఇంత ముఖ్యమైన విషయం
మన సహజీవనయానం ను నెమరువేసుకుంటూ

No comments:

Post a Comment