Tuesday, February 10, 2015

ఊపిరాడ్డంలేదు.



ఉలిక్కిపడి నిద్రలేచి నన్ను నేను చూసుకున్నాను. శరీరం కంపిస్తుంది.

చెమటతో తడిచిన ముఖంతో ఎడతెగని ఉక్కబోత, ఊపిరికోసం తడుముకోవాల్సిన స్థితి, చీదర చీదరగా ఉంది.

ఒణుకుతున్న చేతులతో ముఖాన్ని తడుముకున్నాను. జ్ఞాపకాలను దూరంగా నెట్టేయ్యాలనిపించింది. ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. జ్ఞాపకాలను అణగద్రొక్కలేకపోయాను. తెల్లవారుజాము కలలా వచ్చి పలుకరిస్తున్నాయి, కలత నిద్దుర కల కాదు అది .... నిజం!

చీకటి లో ఎవరివో అరుపులు, ఎడతెరపని బుల్లెట్టు శబ్దాలు .... భూమి బ్రద్దలయ్యినట్లు బాంబు ప్రేలుళ్ళు .... ఎందరో సహచరులు బాటసారుల ఆర్తనాదాలు గాయాలై స్పృహ కోల్పోయిన శరీరాలు చెల్లా చెదురుగా విసిరేసినట్లు .... పిచ్చివాడ్నిలా కదులుతూ ఉన్నాను. రద్దీగా ఉన్న నగర నాలుగురోడ్ల కూడలి లో సాయంత్రం వేళ జరిగిన అమానుష చర్య అది. ఉగ్రవాదుల దాడి.

విధ్యుత్తు స్తంబాలు ద్వంసమయ్యాయి. అంతా చీకటి. తొక్కిసలాట. ఎవరు ఎవరిని తొక్కుతున్నారో ఏమైపోతుందో .... నన్నైనా నేను రక్షించుకోగలనా అనే పెనుగులాట క్షణాలవి ....



ఆ జ్ఞాపకాలు ఆ సంఘటనలు ఇప్పుడు దృశ్యాలుగా కళ్ళముందు కదులాడుతూ .... గుండెను మెలితిప్పేసే ఆ భయానక క్షణాలు ఆ భీతావహమైన దృశ్యాలు కలలోకి వచ్చి పలుకరిస్తుంటే చూడలేక చూడక తప్పని స్థితి.

కొన్ని కొన్ని సంఘటనలు అంతే! కలలోనూ జీవితంలోనూ నీడలా వెన్నంటి ఉంటాయి. వాటిని దూరం చేసుకోవడానికి కొంత సమయం అవసరం.

ఎటు చూసినా రక్తమూ, ముక్కలైన శరీరావయవాలతో ఆ ప్రదేశమంతా రక్తశిక్తమై భీతావహమై కళ్ళు మూసినా తెరిచినా అసహాయంగా ....
మానవత్వం నన్ను పరిహసిస్తున్నట్లు .... మరణించి కొందరు, అవయవాలను కోల్పోయి కొందరు ....
రక్తకన్నీరు బొట్టొకటి నా బుగ్గపై జారి కనపడకుండా తుడిచేసుకోవాలనిపించింది.

ఎన్నాళ్ళుగానో నా ఈ ప్రయత్నం .... ఈ జ్ఞాపకాలను మరిచిపోవాలని. మదిలోని చీకటిపొరల్లోకి జ్ఞాపకాలను తోసేసి కట్టుదిట్టం చెయ్యాలని.

కానీ నిష్ప్రయోజనం. యుద్ధం చేస్తున్నట్లు నా బలహీనత పై జ్ఞాపకాలు దాడి చేస్తూనే ఉన్నాయి.

నేనో సగటు మనిషిని.  గొప్ప మనిషిని కాకపోయినా నా దృష్టిలోనైనా దుర్మార్గుడ్ని కాకపోతే చాలు అని ఉంది. అయినా ఎందుకో మృత్యుదేవత హస్తాల్లో మానవత్వం ముక్కలు చెక్కలవుతుంటే స్వార్ధపరుడ్నై పారిపోయొచ్చిన పిరికివాడ్ననే బాధ ఏదో .... నన్ను ఆనాటి నుంచీ వెంటాడుతూనే ఉంది. ఆ ఆర్తనాదాలు, గాయపడి ప్రాణం కోసం అల్లల్లాడుతూ చిరిగి మసేసిపోయిన బట్టలతో అవయవాలు కోల్పోయిన ఆ ముఖాలు. ఎవరు తెలిసిన వారో ఎవరు తెలియని వారో తెలియని ఆదుస్థితి.

సర్వం కళ్ళముందు కదులుతూ మరిచిపోదగని గతం అది. మరిచిపోవాలనే ప్రయత్నం నాది. ఇప్పుడే అర్ధం అయ్యింది. నాది విఫల ప్రయత్నం మాత్రమే అని.

No comments:

Post a Comment