Tuesday, February 24, 2015

నువ్వొస్తావని


తూరుపు కొండల్లో ఉదయించిన నూతన ఉద్యమమా .... చైతన్యమా!
బిడ్డడినై .... నీ ఒడిలో తెలతెలవారాలని, నిన్నే గుర్తుచేసేలా
అగ్నిశిఖ లా జీవించేందుకు, పోట్లాడబడి దండించబడాల్సొచ్చినా
ఈ శూన్య ఆలోచనల అస్థిర తెలిమబ్బులకు దూరంగా జరిగిపోవాలని

నేనొక పనిముట్టునైనా కాలేకపోతున్నానే అని, నీ కిరణాల్ని తాకలేకున్నానే అని
నీ వెచ్చదనం నన్ను పొదువుకోవాలనుంటుంది .... నీవే నేను లా,
ఓ పురోగమనమా! నా అయోమయ, నిస్తేజ, లక్షణాలన్నీ చైతన్యవంతమయ్యి
సోమరితనం ను అదుపులో ఉంచుకునేలా క్రమశిక్షణకు మారుపేరును కావాలనుంటుంది.

నువ్వేదైనా నాకు చెప్పాలనుకునుంటే, నేను చేసేలా .... నువ్వే చేసెయ్యి
ఈ మందపు శరీరంలోకి ఇంకడం చాలా కష్టం! నువ్వే నెమ్మదిగానో, సున్నితంగానో
నా ఆలోచనల్లోకి దూరి, మది పత్రహరితాని వై .... నన్నొదిలి వెళ్ళాలనిపించే లో గా
క్రూర అనైతికమైన .... ఈ జీవన రణనంలో, నాకు నేను జాగ్రత్తపడేలా హితభోద చెయ్యి

ప్రతిరోజూ తూరుపుకొండల్లో వెలుగువై ఉదయించి సంసారాన్నంతా చుట్టి పలుకరించి
విధిగా సంద్య వేళ అస్తమించే కాల సౌందర్యమా! నీవేమిటో నాకు తెలుసు
నా మాటల్లో నీకు అసాధారణత అనాసక్తత యాంత్రికత నే కనిపిస్తున్నాయనిపించినా సరే
నీ చైతన్య కిరణ వర్షంలో తడిచే అదృష్టం, జ్ఞానోదయం పొందే భాగ్యం ఆకాంక్షిస్తున్నాను.


జన సమూహాలకు, ముగింపు లేని వాదనల విసుగు విసురుళ్ళకూ దూరంగా
విసిరేయబడిన అవిజ్ఞత మొక్కను .... ఈ చీకటి లోయల్లో వృక్షమై విస్తరిల్లి
కీచురాళ్ళు, గబ్బిలాల రెక్కల చప్పుళ్ళ అసంబద్ద నిరుపయోగ లక్షణాన్నై
ఎదురుచూస్తున్నా! పురోగమనం, చైతన్యం తోడుపొందే ఆరాటం లో .... ఆశగా నీ కోసం

No comments:

Post a Comment