Thursday, April 30, 2015

ప్రస్తావన


నా మనసంతా నీవే అని ప్రేమించానని చెప్పాలని కాదు
ఉన్నది ఉన్నట్లు చెప్పాలని,
నేనెక్కడున్నానో ఏమిటో నాకు తెలుసు
అన్నీ మరిచిపో! నేను చెప్పబోతుంది జాగ్రత్తగా విను
నీవు ఇక్కడకు వచ్చెయ్యి
అన్నీ విడమర్చుతాను నీకు అవగతం అయ్యేట్లు
అర్ధం చేసుకునేలా .... స్పష్టంగా
ఎంత నమ్మకమో .... నీవు, ఇక్కడ నా పక్కనుంటావని

అచేతనంగా, నిస్తేజంగా ఉక్కబోస్తున్నట్లు అనిపించి
జీవితం లో ఎవరైనా తోడుండాలనిపించిన క్షణాల్లో
వెనుదిరిగి చూసుకుంటుంటాను.
ఆ రహదారిలో దూరంగా నీవే కనిపిస్తుంటావు .... ఎప్పుడూ
నీరసపడి, నిరాశక్తతకు లోనైన సమయాల్లోనూ
ఆ ఆలోచన నీతొనే ప్రస్తావించాలనిపిస్తుంది .... ఎందుకో
నీవు నాతోనే ఉంటావనే నమ్మకమో ఏమో

నీవు కానీ భయస్తురాలివైనా కంగారుపడకు
నీకు కావల్సిన మనో ధైర్యం, శక్తి నా వద్దున్నాయి.
నీ స్థితిగతులకు ప్రాముఖ్యత లేదు .... నా దృష్టిలో
నీ సామాన్యతంటే అంత ఇష్టం నాకు
నీ, నా కలయిక .... నా కల ఫలించడం కోసం
నేను చెయ్యలేనిది ఏమీ లేదు.
నీవు ఇక్కడకు వచ్చెయ్యి విడమర్చుతాను.
సహజీవన యానం లోని మాధుర్యం కలిసి చవిచూసేందుకు 


ఔననో కాదనో ఒక నిర్ణయం తీసుకో
దూరంగా ఉండేందుకైనా, కలిసి జీవించేందుకైనా
ఏదైనా, కలిసేందుకే అయితే .... ఇప్పుడూ ఎప్పుడూ అనుకో
అందమైన అవకాశం అనుకున్నా జీవనావసరమే అనుకున్నా
నేను మాత్రం అదృష్టవంతుడ్ననే అనుకుంటాను.
సౌందర్యమా! నా హృదయం తలుపులు తెరిచి ఉంచుతున్నాను.
నీ హృదయం అద్దంలో నన్ను నేను చూసుకుందుకు ఎదురుచూస్తూ, .
అనుకూలమే కదూ నా పక్కనే నా జత లా ఉండేందుకు .... !

మానవత్వమే తోడుగా


ఆశిధిల శకలాలలోంచి బయటపడి గాలి పీల్చుతూ కుప్పకూలిపోయాను. నన్ను బయటకు తీసిన సైనికులను విదిలించుకుని దూరంగా పారిపోవాలనుకున్నాను.
శరీరం సహకరించ లేదు. నడుముకు, వెన్నెముకకు, కాళ్ళకు, తలకు దెబ్బలు తగిలినట్లు తెలుస్తూనే మళ్ళీ కూలబడిపోయాను.
వైద్య నిపుణులయ్యుంటుంది. నన్ను స్ట్రెచ్చర్ మీదకు ఎక్కిస్తూ,
అరుపులు పెడబొబ్బలు వినిపిస్తున్నాయి.
రాళ్ళక్రింద, మట్టిపెళ్ళలు, ఇంటిపెంకులు, సిమెంట్ గోడలక్రింద ఎందరు సజీవ సమాధి అయ్యారో
ఊపిరి ఆడటం మానేసింది.
ఆక్సీజన్ పైపుల్తో ముఖాన్ని ఎవరో మూసేస్తున్నారు. పక్కన ఏడుస్తూ ఎవరో గట్టిగా పట్టుకున్నారు. గాలి పీల్చు అందరమూ సేఫ్ గానే ఉన్నాము గద్గద స్వరాలు.
నాకేమీ అర్ధం కావడం లేదు ఊపిరితిత్తులు బ్రద్దలౌతున్నట్లు ఉంది.
అయ్యేది ఎలాగూ అవుతుంది అని ఆలోచనల్లోంచి బయటికొచ్చేసాను.
ఊపిరి ఆడటం మొదలెట్టింది. సహకరించని శరీరం భాగాలు నొప్పి సంకేతాలను పంపించసాగాయి.
గుండె స్థిమిత పడసాగింది.
అమ్మా నాన్న ఎలా ఎక్కడ ఉన్నారో .... నా భార్య, కూతురు కొడుకు ఎక్కడ ఎలా ఉన్నారో
క్షేమంగానే ఉన్నారా? నాలానే ....
ఆలోచించలేకపోయాను.
అంతలోనే ఏదో నమ్మకం వారంతా క్షేమంగానే ఉన్నారని, నా కోసమే కలవరిస్తున్నారని ....
బహుశ వారే అయ్యుంటుంది ఇంతకు ముందు నాతో మాట్లాడింది. మేమంతా క్షేమంగానే ఉన్నామని అన్నది.
నా గుండెలో శక్తి సంఘటితం కాసాగింది.
అప్పటివరకూ తలుపు వద్ద తలక్రిందులుగా వ్రేలాడుతూ పలుకరిస్తూ వీలైతే తోడౌదామనుకున్న మరణం భావనను అలక్ష్యం గా చూసాను.
ఏదో అయ్యింది. ఆ తరువాత ఏమయ్యిందో తెలియదు.
ఒళ్ళంతా బ్యాండేజీలతో హాస్పిటల్ లో కోలుకున్నాక మాత్రమే తెలిసింది అప్పుడు నేను కోమాలోకి జారిపోయానని.
విశ్వ మానవత్వమే ఆపత్ సమయం లో తోడుండి నా జాతిని సంరక్షించిందని.

Wednesday, April 29, 2015

వెంటిలేటర్ మీద


తెలపని పదాలు కొన్ని
మాటలు గాలిలో వ్రేలాడుతూ
నీడలు విస్తరించి మీద మీదకు వస్తున్నట్లు
అస్తిత్వం ను కలతపరుస్తూ
దబ్బనాల్లాంటి గోళ్ళతో రాక్షసి పక్షొకటి
అడవి దిశగా దిగివస్తూ
నా ఆత్మను చేరేందుకు
రక్తం తో కలిసిన కన్నీరు బుగ్గలపైకి జారుతూ
ఏదో పోగొట్టుకోబోతున్నాను
చేజార్చుకుంటున్నానని తెలుస్తుంది
శూన్యంలో సంలీనమయ్యే గడియ
ఆసన్నమయ్యిందని అనిపిస్తూ

Saturday, April 25, 2015

మనోవేదన


నీ అంతట నీవే దూరంగా జరగిపోతున్నావు
నన్నిలా ఒంటరిగా ఒదిలి ఏమీ జరగనట్లు
నలుగుర్లోనూ కలిసిపోగలుగుతున్నావు
నా ఆలోచనలకు స్పష్టత చేకూర్చకుండానే
నీకూ తెలుసు, నీ కోసమే నేను జీవిస్తున్నాను అని
అందుకే అర్ధిస్తున్నాను
ఒక్కసారైనా వెనుదిరిగి చూడు
నా కళ్ళలోకి సూటిగా అని
నీపై పెంచుకున్న ఆశలను చూసైనా
నీవు నాతో ఆట ఆడుకున్నావనైనా చెబుతావని 

నీ కోసం నేను పిచ్చివాడ్నిలా తిరుగుతూ,
అలమటిస్తూ,
లోలోన క్షీణించి దహించుకుపోతూ ....
మరణిస్తున్నానేమో అనిపిస్తుంది.
మార్గం అంటూ ఏమీ కనిపించడం లేదు.
నా హృదయం నా మాట వినడం లేదు.
సగభాగం నీవై ఉంటేనేనని
అచేతనమైపోయి మొరాయిస్తుంది,
మనసేమో పేలిపోయేందుకు సిద్ధం గా
ఇప్పుడో అప్పుడో అన్నట్లు ఉంది.


కాదనుకుని నానుంచి నీవు దూరంగా జరిగినప్పుడు
నా మోకాళ్ళలో ఎందుకో ఒణుకు
వెన్నెముకలో చలి, భయాందోళనలు, అలజడి
చైతన్యం నీ జత తోనే సాధ్యం అన్నట్లు
నిజంగా అలా ఒక దృశ్యం లా నీవు జరిగిపోవాలనుకుంటే 
కనీసం భోదించనైనా భోదించాలి.
నా మది సంక్షోబాన్ని ఎలా తట్టుకుని ఎదుర్కోవాలో
ఈ నొప్పి ఈ బాధ ఈ వైరాగ్యం దూరం ఎలా చేసుకోవాలో
నీ మనసుకు అలా అనిపిస్తున్నట్లు
నీకదలికల్లో తెలియడం లేదు
అర్ధం చేసుకుంటావనుకుంటున్నాను, నా మనోవేదన ....
ఇప్పటికైనా దురంగా జరిగిపోనని మాటిస్తూ

చివరి స్వేదబ్బొట్టు


అనుకున్నంత సులువు కాని
ప్రణాళికల కార్యాచరణల ఒత్తిడిలో 
నిలువునా దహించబడుతున్న కలల, 
ఆకాంక్షల, 
ఆనందపు ఛాయల అంచుల్లో 
నిశ్చేష్టత నిండిన పిచ్చితనం పులుముకుని 
ముగింపు సమీపిస్తున్న అనుభూతుల జీవితంలో 
సంబంధం లేని ఆత్మ శరీరాన్ని వొదిలి 
నివశించేందుకు .... శూన్యం లోకి అదృశ్యమై 
జీవించేందుకు శ్వాసించాలనే ప్రయత్నం 
గాలి లేక .... 
గుండె ఉక్కిరిబిక్కిరై, రక్తం స్రవించి 
ప్రశ్నల మయమై ....
ఎందుకిలా? జరుగుతుందీ అని,
నల్లనేల, చీకటిలోకి 
ఆఖరి చెమట బొట్టు జారి, ఇంకి 
మాయం అయిపోయి ....
నెమ్మదిగా, అన్నివైపుల్నుంచీ కమ్ముకొచ్చి 
చంపేస్తున్న బాధతో .... 
పోరాడాలనే భావన 
అణువణువునా ఆవేశంలా ప్రతి ప్రాణిలో

ఈ పరుగులన్నీ .... నీ కోసమే


ఒంటరిగా అవిశ్రామంగా 
కాలమే కదలడంలేదు అన్నఅంత వేగంగా 
నేను మాత్రమే పరుగులు తీస్తూ ఆలోచిస్తున్నాను.
ఎందుకో ఈ తొందర అని
ఎప్పుడూ ఏదో వెతుక్కుంటూన్నట్లు

బహుశ, నీ నామాన్నేననుకుంటా
మచ్చగానైనా గుర్తుంచుకున్నానా పెదవులపై అనేనేమో
నిజమే .... అందుకోసమేనేమో ఈ వెంపర్లాట
అస్థిమితంగా ఉన్నాను.
ఒకనాటి నీతో కలిసున్నప్పటి కేరింతలు ఆహ్లాదం
తిరిగి అనుభూతి చెందలేనేనేమో నననుకుంటా

ఒక్కరిమైపోయాము అనుకున్న క్షణాలను వెదుక్కుంటూ
సిగ్గు, ఆనందము అభిమానం కలిసి
అందనట్లే అందిన అనుభూతులతో ఆకాశంలోకి తేలిపోయినట్లు
ఒక చిన్న ముద్దు లాంటి ఓ వరం పొందిన ఉత్సాహం
రెక్కలై అమరి ఎగిరి నీతోపాటు నేనూ ఆ స్వర్గం వైపు ....
ఊహల్లో నీతో కలిసి నడిచేస్తున్నట్లు ఊహించుకుంటూ  


నీ ముఖంపై ఆ ఆనందోత్సాహాల ముచ్చెమటలు 
సిగ్గు చాటున దాచుకోలేని చిరునవ్వు వెలుగుల ప్రకాశం సోకి
సంభ్రమంతో .... కళ్ళు మూసుకున్న ఆ క్షణాలు
ఆ కాంతి లో మసకేసిపోయిన వెన్నెల
ఆ వెన్నెలకోసం ఆకాశం లా హృదయం తలుపులు బార్లా తెరుచుకుని
నీ అంగీకారం కోసమే ఎదురుచూస్తూ .... జతనయ్యేందుకు నేను

నాకు దగ్గరగా వస్తున్నప్పుడు నీ వింత బెదురు చూపులు
నాలో ధైర్యాన్ని పెంచి, శూన్యం లో శూన్యాన్ని భర్తీ చేస్తూ
విస్తారంగా తెరుచుకునున్న నీ ఊహల్లోకి
నీ హృదయం లోకి
సంతోషం గా టీవీగా రాణివాసంలోకి నడిచి వస్తున్న
రారాజును లా వచ్చేందుకు సమాయత్తమౌతూ

Sunday, April 19, 2015

మాటిస్తున్నాను


పరిస్థితులు బలీయమై సమశ్యలు చేదించరానివై
కళ్ళలో నీళ్ళు ఉబికుబికి వస్తున్నప్పుడు
అబద్దాలు, రహశ్యాల పాములై చుట్టేసినప్పుడు

నేను నీ బలాన్ని, ఒక ఆశనై వస్తాను చెంతకు
నీలో నమ్మకం ఆత్మ విశ్వాసం పెంచేందుకు 
పక్కనే ఉండి, అవసరానికి అందుబాటులో .....

నిన్ను దగ్గరకు తీసుకుని, గుండెల్లో పొదువుకుంటాను
ఈ జీవితం నాదై ఉన్నంతకాలం ఒక ఆత్మీయుడి లా
ఒట్టేసి చెబుతున్నాను. నీటి మాట కాదు, ఇది నా ఎద మాటని 


ప్రతిఫల ఆపేక్ష లేని అనంత ప్రేమికుడ్ని లా 
ఎన్ని జన్మలుగా ప్రేమిస్తున్నానో .... ఇలా, నీతో చెబుతున్నా
ఎలాంటి బాధ, సమశ్య నీ దరికి రాకుండా చూసుకుంటా అని

ఒట్టేసి మరీ .... హృదయం సమర్పించుకుని
పోరాటాన్ని గెలిచిన ఆనందం .... బహుమానం ప్రేమే అని 
ఈ సందర్భంగా ప్రతిన చేస్తూ మరో సృష్టి ఆరంభం అని

ఒక్కసారి కళ్ళు మూసుకో! ఈ ప్రియమైన క్షణం 
ఈ భావన ఇలాగే పదిలంగా పదికాలాలుంటుందని
జీవితం అంచు వరకూ నీతోనే ప్రయాణమని మాటిస్తున్నా

మాటను మన్నిస్తావు కదూ! అందుకే ఎన్నిసార్లు క్రిందపడినా
నీవు పిలిచావనుకుని వెంటనే లేచి నిలబడుతున్నా
నీవు లేని క్షణాల జీవితం ను ఊహించలేక, శ్వాసించలేక

అన్నీ నీవే నాకు


ఓ పిల్లా! నీవే నాకు సర్వస్వమూ ను
ప్రేమైనా, అనుభూతైనా, ఆనందమైనా
వేరెవ్వరికీ స్థానము అవకాశమూ ఇవ్వని
నా మది లో
ఒక చిరునవ్వులా, ఒక అయస్కాంతానివి లా
మారు రూపం లో నాకై అరుదెంచిన దేవకన్యలా
అమరత్వం పొందిన కలలా 
అన్ని వేళలా ఓ పిల్లా, నా అన్నీ నీవై

నీ గురించిన ఆలోచనలే అన్నీ
నా ఎదురుగా ఉన్నప్పుడు .... ఎప్పుడూ
ప్రేమెక్కడ నీలో అని, చూసి కొలిచేదెలా అని
మది నిండా నీవై ఉక్కిరిబిక్కిరౌతూ
ఎన్నో అన్నావు వెళ్ళిపోతూ
అందని ఆనందం అనుభూతులు వరమిస్తానని
ఆ మాటల గోడలపైనే నడకలు అన్నీ 
కనురెప్పల క్రింద నీ ముఖచిత్రం ను ఎదలోనికి జరుపుతూ

వాస్తవాన్ని మించిన నిజమంటూ ఏదీ లేదు.
నాపై దయ ప్రేమై, నీ ప్రేమ నిజం కావాలని ఆశ,
నేనొక నిజాన్ని, నిజాన్నే ఎప్పుడూ ....
నీతో ఉన్నప్పుడు సమయాన్ని వృధా చెయ్యను.
నీ సమక్షాన్ని మించిన నిండుతనం ఉందనుకోను
ఇప్పుడు నా ఎద నిండా నీవే
అందుకే నిన్నే కోరుకుంటున్నా
ఒక మౌనినై ఆరాదిస్తూ, మనుగడ సాగించేందుకు

Saturday, April 18, 2015

రావాలనుంది


నీలోకి .... నీ భావం, నీ స్వభావం, నీ ధర్మం లోకి
జ్ఞాపకాల మది పొరల మరుగున పడిన
ప్రదేశాలలోకి
ఆ తీక్షణమైన చూపుల వెనుక
ఆలోచనల సంక్లిష్టతలలోకి
రసాయనతుల్యమైన .... ఆత్మ సాన్నిధ్యానికి
పరిపూర్ణ ప్రశాంతత లోకి
నీ లోకి రావాలనుంది
అభయారణ్యం లోనికి ప్రవేశించిన
ఒక తాపసిని లా
సంజీవినీ చెట్ల మధ్య ఊపిరితీసుకుంటున్న
వాయువును లా
కదిలే చైతన్యాన్ని లా
స్వాతనాన్ని చేకూర్చే ధన్వంతరిని లా
జీవితం నీనుంచి అతిగా ఆశించిన క్షణాల్లో
అండగా ఉండే ఒక జతను లా
రావాలనుంది .... నీ లోకి
నీ అంతరంగం లోకి 


ప్రేమించినవారికే పరిమతం కావాల్సిన
నీ హృదిలోకి
పరమ పవిత్రమైన .... ప్రేమ జలాల్లోకి
స్నానించేందుకు రావాలనుంది.
నివార్యము అనివార్యమై స్వాగతించబడి 
నీ స్త్రీత్వాన్ని అనుభూతి చెంది
అనంతాన్ని, అమరత్వాన్ని చూసే
దైవత్వపు అవకాశమును పొంది
ఏ ఒక్కరితోనో మాత్రమే పంచుకునే
నీ స్వచ్చతను, నిజాయితీని
ఆత్మ పరిశుద్ద రుచులను ఆస్వాదించేందుకు
నీలోకి, నీ ఆహ్వానం పొంది .... రావాలనుంది.
ఆ స్వర్గపు అంచులవరకూ,

Friday, April 17, 2015

వినాలని ఉంది.


ఏదైనా చెబుతావేమో, చెబితే వినాలనుంది.
చెబుతావనే నమ్మకం లేదు.
నీ గురించిన .... ఊపిరాడనియ్యని
ఎన్నో చీకటి వింత ఆలోచనలే .... అన్నీను,
ఏ మాత్రమూ కాంతి లేని,
ఆశ లేని, కలలైనా రాని దశలో ఉన్నానో ఏమో
కాలాంతం వరకూ
ఏ నీడలోనో నీడను లానే మిగిలిపోబోతున్నట్లు
విలువైన ఒకనాటి జ్ఞాపకాలలో మునిగిపోయున్నట్లు
సంతోషం సర్వం ఆ జ్ఞాపకాల్లోనే పారేసుకున్నట్లు


ఎప్పుడైనా సరే .... వింటూ ఉండాలని,
నీవు ఏది చెప్పినా
యౌవ్వనం, గతం జ్ఞాపకాలను నీ నోట వినాలనో ....
అంతకు మించిన మధుర భావనలు వున్నాయనో ....
మరి కొంత అమూల్యతను పొంది. దాచుకోవాలనో ....
ఎందుకో తెలియదు. వినాలని మాత్రం ఉంది. 
మాటల్లో చెప్పలేను..... నువ్వేమి చెప్పాలో
కానీ, నీ పలుకుల మృదు తరంగాలలో కరిగి,
తియ్యని పరిమళాన్నై తిరిగి నిన్నే చేరాలనుంది.

Monday, April 13, 2015

వింత ఆవేశం!?


ఓ చెలీ .... నీవు చిరునవ్వులు పూచి
స్వచ్చ పరిమళాలు వెదజల్లినట్లు అనిపించిన క్షణాల్లో,
నా ఊపిరి ఆగిపోతుంది. .... ఎన్నో క్షణాల పాటు
అప్పుడు నేను ఏ సప్తసముద్రాల ఆవల ఉన్నా

ప్రేమ విషం కషాయం పేగు గోడల్లో జారి
విచ్ఛిన్నం సంగటితమైన అణు పరమాణువులు విద్యుత్తై
నా మదిలో, నా ఎదలో, నా నరనరాల్లో .... నా పరిసరాల్లో
ఒక వరదై, ఒక ప్రవహమై ..... నన్ను ప్రాభావితం చేస్తూ


మరణం ఆవల, జీవితం పిదప ఏముందో కానీ
నిన్ను చూడకుండా సమీపించకుండా ఉండలేని భావనలే అన్నీ 
శరీరాన్నొదిలిన ఆత్మలుగానైనా మనం ప్రేమించుకుంటూనే ఉండాలని
వాస్తవ ప్రపంచపు కష్టాలు అడ్డంకుల్నన్నింటికీ దూరంగా

ఏ రోజైనా ఒక్కసారైనా ఒక్క క్షణమైనా
ఎవ్వరికీ కనపడకుండా దాచుకునున్న సంపదవు లా నైనా
నా ప్రేమను, నిన్ను కలిసి .... నన్ను లా పలుకరించుకోవాలని
ఈ లోకమే కానక్కరలేదు ఏ లోకం అయినా అలానే ఉండిపోవాలని

Friday, April 3, 2015

మనోగతం


పగలంతా కురిసిన సూర్య కిరణాలు,
కాసింత తీక్షణత తగ్గించుకుని
పశ్చిమాన
మబ్బుల చాటుకు చేరి
గులాబీ రంగును అద్దిన పిదపే

ఏదో అపసవ్యత
ఏదో వెలితి
పదాల్లో పెట్టలేని
మది గోడలపై గిలిగింతలా
ఊహాచిత్రాలు ఇంద్రధనస్సులా ఆశలు

అదో వింత ఆలోచన
నీవు
నా పక్కన పవ్వళించాలని
నా మెదడులోని రెండవ అర్ధభాగం అంతా
నిండి ఉన్నావు కనుకే అని


నెరవేరని కోరికలు, మనోగతాలై
కేవలం, ఒక్కసారైనా
నీవూ, నేను
పక్క పక్కన
ఒక్కరులా ఉండిపోవాలి అని

నీవు నిదురిస్తూ ఉన్నప్పుడు
చూడాలి అని ....
చూడాలి ఆ నిర్మలత్వం అని .... లేస్తూనే
అలానే చూస్తూనే ఉండిపోవాలి అని,
నీ నోట తన్మయత్వ పదాలను వినాలని

అలాగే ఉండిపోవాలని
వెల్లికిలా పక్కపక్కన పడుకుని
ఎప్పటికీ .... లా
నీ చేతిని నా చేతిలోకి తీసుకుని
అలాగే .... అలా నీ కళ్ళలోకి చూస్తూ ....