Saturday, October 31, 2015

హృదయోద్వేగం


జీవితాన్ని శ్వాసించేందుకు
నేనిప్పుడు క్రిందకు దిగి వస్తున్నాను.
నిద్దుర లేచి చాలా సేపే అయ్యింది
వేసారిపోయినా ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నా
నేనే కిరీటాన్నీ ధరించలేదు,
ఏ పాటా రాయలేదు. కానీ
ఆమని పాటొకటి లోతుల్లోంచి వినిపిస్తూ
సాయంత్రపు చల్లగాలుల కోసమో
నీ కోసమో లా
నా హృదయం కిటికీలు తెరుచుకుంటూ

నిన్నూ, నీ పై ప్రేమను శ్వాసిస్తున్నాను.
నా ఊపిరితిత్తులు నిండి .... ఆపై
రక్తనాళాల గొంతు వరకూ ....
నీ రాగం తో 
నీ భావం తో
నీ పట్ల ప్రేమతో నొప్పి అని
అనిపించి హృదయం కురిసి 
ఆ వర్షం లో తడిసిన తియ్యదనం 
బాధ నన్ను తడిముద్దను చేసే వరకూ

ప్రయత్నిస్తున్నాను. నిన్ను పొందుదామని
నిజం ప్రేమంటే ఏమిటో తెలుసుకుందామని
లోతుల్లోకి వెళ్ళి .... తెర వెనుక ఆకాశాన్ని
నక్షత్రాల సంభరాన్నీ చూసొద్దామని
కళ్ళు మంటలు, హృదయం నిట్టూర్పులు
బాధ, నొప్పి, భారం ....
అతి దుర్భర స్థితుల్ని దాటి 
అవి తీవ్రమై లోలో
నన్ను నేను కోల్పోతూ మరణిస్తున్నట్లున్నా
నా జీవితం పావై సంరక్షణను కోల్పోతున్నట్లున్నా 


నిన్ను ఘాడంగా ప్రేమిస్తున్నాను.
నీ అస్తిత్వాన్నీ, నీ ప్రేమనూ శ్వాసిస్తున్నాను.
కాలంతో పాటు మనుషులూ ప్రేమలూ
అర్ధాలూ అన్నీ మారిపోతూ, అవి స్థిరం కాకపోయినా
ఊపిరిలా నిన్నే పీలుస్తున్నాను.
ఊపిరితిత్తుల్ని దాటి హృదయాలయం లోకి
సిరలు దమనుల్లోకి వ్యాపించేలా
స్వాగతిస్తూ నీ భావనల్ని స్పర్శిస్తున్నాను.
అయినా వేసవి వర్షం లా కురిసినట్లే కురిసి
అంతలోనే వెలిసి కనుమరుగైపోతావను తెలిసీ

కళ్ళు తెరువు మానసీ


నా మనోభిలాష
నీ హృదయాన్ని నిలువునా చీల్చి
నా ఆలోచనలను అందులో
ఒక క్రమంలో సర్ధుదామని 

నా భావోద్వేగాలను బలవంతంగా
నీ మదిలోకి నెట్టాలనుంది.
నన్ను నీవు
స్పష్టంగా చూడగలిగేలా

నీవు భావరహితంగా ఉన్నావు.
నేను ప్రేమిస్తున్నానని తెలిసీ
ఎక్కడ దగ్గరౌతానో అని
ప్రభావితం కావడం ఇష్టం లేనట్లు

రెండు భిన్న గ్రహాలు
మన జీవన చక్రాలు ఒకదాన్నొకటి
పాయింట్ బ్లాంక్ గా శూన్యం లో 
గుద్దుకుంటాయేమో అన్నంత భయంగా  


ఒకవేళ నేను, నీవు నన్నర్ధం చేసుకునేలా చేసి
గుడ్డిదానిలా బలవంతంగా మూసుకునున్న
నీ కళ్ళు తెరిపించగలిగితే ....
నన్ను స్పష్టంగా నీవు చూసేలా చెయ్యగలిగితే

అవకాశం ఉంది. కారణమూ ఉంది.
సమతులనం అయ్యేందుకు 
కానీ, జరిగిపోతున్న ప్రతి క్షణం కదలిక తోనూ
వృధా అయిపోతుంది కాలం .

ఎంత ప్రయత్నించినా .... నేను,
నీ హితుడ్ని కాలేకపోతున్నాను.
ఏ జన్మ అనుబంధమో ..... నా ఆత్మ నిన్ను
జన్మ ఆరంభం నుంచి మోస్తూనే ఉన్నా

పట్టీ పట్టనట్లు ఉంటున్నావు జారిపోతున్నావు.
అది అవాస్తవమో సత్యమో ప్రయత్నమో
నీ కోరిక నేనిలానే ఉండాలనేనా?
నేను నీకు అతి సమీపంగానూ, బహుదూరంగానూ

అన్యాయం అమానుషం
ఇది ఇలానే జరుగుతుంటే .... నీవు నన్ను కోల్పోతావు.
కలత చెందని కారణాన్ని .... నిన్ను
పొదువుకునుండాల్సిన అవసరాన్ని చూపించలేకపోతే

ఒకసారి ముక్కలై అల్లకల్లోలమైన నా హృదయం
మళ్ళీ బ్రద్దలౌతుంది. నీకూ తెలుసు.
కానీ ఈ సారి మాత్రం .... నేను
ఆ ముక్కల్ని అతికించను. దూరంగా విసిరేస్తానే కాని

Friday, October 30, 2015

హద్దులు


ఎండిపోయి
ఎడారిలా

పొడిగాలి
వీస్తూ

పెదవులపై
వెచ్చదనం వగరు,


ఒక ప్రేమిక
జారిన ముద్దు లా

మినహాయింపు లేకే


స్పర్శించి చూసా
నీ నామం
సున్నితంగా ముద్దాడి
పెదవులతో

నీకు వినిపించుండాలి 
పూజ్యభావం
కరుణార్ధ్రంగా
నా ప్రతి శ్వాస లోనూ 


బద్రంగా పొదువుకోలేని
ముకుళిత.హస్తాలు
నీ ఆత్మ అనుగ్రహం కై
అర్ధిస్తుండటము

నీవే 
అన్యోన్యత గమ్యం అని
నీవే నా
ప్రారబ్ధం అంతానివి అని

Wednesday, October 28, 2015

అనురోధన


లోతుగా శ్వాసించి
నా లోనికి
ఆనురూప్యం చెందేలా
నా ఆత్మ


ఆనంద పారవశ్యం తో
మమైకమయ్యి
నేను
మళ్ళీ లేచి నిలబడి
సంసార జగతిలోకి
సాగే
ఒక ఉత్కృష్ట కార్యం
ఉపక్రమించవా మానసీ

Tuesday, October 27, 2015

ఊపిరాడదని తెలిసే


నాలోని ఈ తపన ఆరాటం ఆవేశం
కదిలి కదిలి కరిగిపోవాలి మమైకమై నీలో
అతుక్కుపోవాలి, ఊపిరి ఆగిపోయేలా నిన్ను

పగటి వెలుతురు మసకేసి సంద్యరాగాన్ని పులుముకుని 
పని మాలిన కాలం ఆగి చూస్తున్న వేళ
నీ కోసం ఎదురుచూపులు చూస్తూ

నన్ను బలహీనుడ్ని చేసే
పరవసింపచేసే
నీ చిరు స్పర్శ కోసం

అబద్ధం ఆడను. నీనుంచి ఏదీ దాయను.
ఎదురుచూపులు చూస్తుండలేని లక్షణాన్ని
దాయలేను. ఈ అసహనాన్ని జయించనూ లేను. 


ఊపిరాగిబిగబట్టి మరీ చూస్తున్నాను. 
నీవు నన్ను సమ్మోహపరచాలనీ
చికాకుపెట్టాలనే ఆశ నిజం కావాలని

నీ ముద్దు కోసం నన్ను అన్నీ త్యజించేలా చేసే
నీ పై ప్రేమ భావన 
నా కోరిక బహిర్గతం నిజం కావాలని 

కదిలి కదిలి కదిలి కడలి అంచువరకూ
రేపనేది ఉందో లేదో
మనముందున్నది ఈ క్షణమే అనిపించేలా

కేవలం నీకు దగ్గరకాగలిగితే చాలనుకుంటున్నాను
సంతోషిస్తాను ఏదో ఒక రకం గా
నీవు కావాలి నీ ప్రేమే కావాలి నాకు

నిదురించని వేళల్లోనూ నా కల గమ్యం నీవే
నీవున్న కలలోంచి మేలుకొనాలని లేదు
కోల్పోవాలని లేదు కలలోనూ, నిన్ను

Monday, October 26, 2015

అబద్ధం నీ పేరు



అసత్యం అవినీతి రహస్యాల గుహల్లో 
నివసిస్తున్న అనాగరికుడిలా  
తునక తునకలైన ఏకతాళత్వము 
మదిని వెంటాడుతూ 
అపారదర్శకపు నవ్వులు 
ఆ భయంకరమైన నిట్టూర్పులు 
వికృతమైన మనఃకల్పన సంకల్పాలు 
ఆరంభావేశానివై .... సత్యాన్ని దాచి 
మోసాన్ని వమనం చేస్తూ  

ఎవరికైనా తెలుస్తుంది .... నిన్ను చూస్తే 
అది విముక్తిపదం కాదు అని 
చల్లగా మసకగా 
ఎన్ని సంవత్సరాలు గడిచినా 
మారని నీ వికృత మనఃకల్పనలా 
నీవు ఇంకా 
నీ వెలిసి వాడిపోయిన 
ఆ కలల్లోనే నివసిస్తూ 
ఏనాడూ నీ స్వీయ గౌరవం 
పెంపొందించుకునే ఆలోచన చెయ్యలేదు 
నీ రక్తం లోనే మిళితమై ఉందన్నట్లు 
ఎప్పుడూ బాధగా దిగులుగా .... 
ఒంటరిగా మరణాన్ని సమీపిస్తున్నావు.
ప్రేమకు అర్ధం తెలియకుండా 
ఎవరి ప్రేమనూ పొందకుండానే

అంతే




ఇక్కడ ఎవరికీ
ఎవరిపైనా
ఆకర్షణ లేదు
ద్వేషం లేదు

కలిసి జీవించాలి
రాగ బంధాలు
పెంచుకోవాలి
అనుకోవడం లేదు 



ఒంటరితనం, మౌనాన్ని
తాపసితనాన్ని
ఇష్ట పడుతూ
ఉన్నారు .... అంతే









గెలుపేం సులువు కాదు



యుద్దంలాంటిదే
ప్రేమ

నిర్ణయించడం
మనసు
ఇవ్వడం
సులభం!

గెలవడం
మనసును
పొందడమే
కష్టం!

Sunday, October 25, 2015

ఏనాడైనా



నువ్వంటే ఇష్టం
ప్రేమ
నా ప్రాణం అని

అన్నామా

ప్రియురాలితో కాదు 

 
అన్నీ పొందుతూ
ఆస్వాదిస్తూ

ఒక్కసారైనా,

ప్రకృతి మాత(అమ్మ)తో
ఏనాడైనా

చింత



పాలనా సామర్ధ్యం
ఉన్నవాళ్ళంతా
విశ్లేషకులు

టి వి లో ....

అయోమయం
అస్పష్టతలు
అర్ధం చేసుకోలేని

చింత లో
సామాన్యుడు

Saturday, October 24, 2015

అతను


ఆ పెదవుల పరిమళించిన నవ్వు
ఆ చిగురు తడి మెరుపు
తియ్యదనం
భావనలతో
అతను పిచ్చివాడయ్యడు.

ప్రేమ భావననే వింత తపనకు లొంగి
నిశ్చేష్టుడయ్యి
యాంత్రికంగా జీవించే అతను 
అప్పుడు అద్భుతాలు కల్పనలు
వింతలే లక్ష్యం గా మారిపోయాడు.


కాలం కదులుతుంది
కొన్ని క్షణాలు, గడియలు, రోజులై
కదులుతున్న కాలం ఆగింది.
విశ్పోటనం లా
ఆ నిశ్శబ్దం విశ్పోటనంలో
విశ్చ్చిన్నమయ్యింది .... అతని జీవితము

అతని అధోగతికి కారణం
ఉత్ప్రేరకం అయిన
అతని ఉపపత్ని ఆమె .... ఆమెపై ప్రేమ
ఆ ఆకర్షణ భావనలతో కొల్లగొట్టబడి
ఏమీ లేని ఒంటరైపోయాడు.

ఖాళీ మనసు, స్పందించని హృదయం తో
ఇప్పుడు, అతని ఆలోచనలు అనుభూతులు
అన్నీ విషమయం కలుషితమై
అతని హృదయం ముక్కలు ముక్కలై
జీవితం అర్ధం తెలియని పిచ్చివాడై

వినిపిస్తున్నానా!?


ఉన్నాము గా .... ఒకే చెట్టు
ఒకే ఆకాశం గొడుగు క్రింద, కలిసి
ఒకే గాలిని శ్వాసిస్తూ ....
ఒకే గమ్యాన్ని చూస్తూ
బద్దకం ఎక్కువై నీరసపడిన వేళల్లో
ఆ సూర్యకిరణాల వెచ్చదనం
తాకి .... నా ముఖం పై
చైతన్యం ఉత్తేజితం కావడాన్ని
ఈ చెట్ల కొమ్మలు ఆకులు జల్లెడలుగా
వడబోసిన వెలుతురు నీడల్లో
నీకు వినిపిస్తున్నాయా
నేను పాడుతూ జారవిడుస్తున్న
పారవశ్యపు మనోభావనలు
ఆ నిశ్శబ్ద రాగాలు 

 నిజం గా నీవు నన్ను
గమనించగలుగుతున్నావా మానసీ!
వింటున్నావా ఈ నిశ్శబ్ద శబ్దాలు
నీ, నా గుండెలు లయబద్దం గా కొట్టుకోవడాలు

జీవితం


తొలి
జోల పాట
తల్లి ఒడి లో

జననం తో 
 

తుది
శ్వాస, అశ్రుతర్పణ
భూమాత ఒడి లో

మరణం తో


ఎంత అద్భుతం
అనురాగమయం, అర్ధవంతం

మనిషి జీవితం

Friday, October 23, 2015

రాలి పువ్వొకటి


కళ్ళముందు
సర్వం విచిలితం
విశ్చిన్నం
అయినట్లు
భావనల
కన్నీళ్ళు
హృదయం లోంచి
పొంగి
జారి
అకస్మాతుగా
అలజడి ....
ఎటుచూసినా
వేదన, క్షోభ
శ్మశాన వైరాగ్యం

Thursday, October 22, 2015

ఆశ


ఒక కొత్త అవకాశం
మనోవికాసం
అందం, ఆనందం,
చైతన్యం .... మంచిని
ఊపిరి పీల్చి
కొత్త అధ్యాయం
కొత్త రోజుకు
స్వాగతం పలకాలి  

గుండె నొప్పిని నివారించి
ద్వేషాన్ని పారద్రోలి
తూరుపు కొండల్లో
ప్రభవించి
పురోగమించే
సూర్యుని
నీరెండ తాకే వేళ 
నన్ను నేను కనుగొనాలని

అద్భుతానుభూతి జీవితం


కోల్పోయినా తప్పు లేదు అనుకునేవాడ్ని .... నన్ను నేను
ఒంటరిని కాకుండా ఉంటే చాలు అనుకునే వాడిని.
ఎక్కడ ఉన్నానో తెలియని
ఏ వాడలోనో రహదారిలోనో ఏకాకిని అవ్వాలని ఏనాడూ అనుకోలేదు.

ఎంతో విలక్షణమూ అతి కటినమూ ఈ కాలచక్రం కదలికలు 
కాళ్ళ క్రింద తడి, కన్నీటి వర్షం అనిపించేది.
ఆ రోజు నీవు ఎదురుపడే వరకూ మానసిక అసంతులనం
అవగత పరిచేవరకు గమ్యం ఎరుగని అయోమయం .... నేనై 

ఎందుకో మరి, నా జీవితం లోకి రా అని ఆహ్వానించాలనిపించింది.
నచ్చజెప్పి .... అంతా సవ్యంగానే జరుగుతుంది
జీవితం ప్రేమమయం అవుతుంది
మన జీవితం అద్భుతాల సంచలనం అవుతుంది అని చెప్పాలనిపించింది.


అలా నిర్ణయించుకున్నాక, ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాను.
నీ మూలంగా నాలో వచ్చిన మార్పును .... పరిపూర్ణత్వం ను
స్నేహ అనురాగ సమ సంతులనాన్ని
అద్భుతానుభూతి జీవితం అనే వాస్తవ పారదర్శకభావాన్ని  

ఇక్కడ, నీవు నా పక్కన సహచరివై నా జతగా ఉంటే చాలు.
అన్నీ సాధ్యమనే నా నమ్మకం తత్వాన్ని
నా ఆలోచనల పర్యవసానపు పులకరింతల పరవశాన్ని 
నమ్మలేని .... ప్రేమ మహత్యం సత్యాన్ని .... అనుభూతి చెందగలనని

ఇంతకు ముందు .... అన్నీ చూస్తున్నాను అనుకునేవాడిని
రూపాన్నే చూసి మనో ఔన్నత్యాన్నీ చూసాననుకునేవాడిని. 
కళ్ళున్న గుడ్డివాడ్ని .... ప్రేమే నాకు చూపునిచ్చింది.
ఆనందాన్నిచ్చింది. వెదుకుతున్న ప్రతివస్తువు లోనూ తనే నిండి

నాలో ఇంత మార్పును తెస్తుందనుకోలేదు .... నీ పట్ల ప్రేమ
నిన్ను ప్రేమించడం ద్వారా ఇంత బలాడ్యుడ్నౌతాననీ .... అనుకోలేదు.
మరొకరి కోసం జీవించడంలో ఇంత ఆత్మ తృప్తి ఉందని
కలనూ కనలేదు. నాకు కావల్సిన మనోధైర్యం .... గర్వం నీవౌతావని

నిజం మానసీ! నీ ఆలోచనల్లో ఉన్నప్పుడు .... గాల్లో తేలిపోతున్నట్లుంటుంది. 
ఏనాడూ అనుకోని విధం గా ఎంతో తేలికై దూదిలా శరీరం  
ప్రేమ మయం జీవితమై .... ఒక అందమైన వాతావరణమై 
మనోనందనవనం లో పరిమళాలము .... చెదరని సాంగత్యం మనమైనట్లు

Monday, October 19, 2015

శ్వాస ఆగిపోతూ .... అశక్తుడ్ని



నమ్మలేకపోతున్నాను
ఎంత సేపటినుంచో తదేకంగా
డ్రస్సింగ్ టేబుల్ అద్దం లోకి చూస్తూ
అర్ధం చేసుకోగలుగుతున్నానే కాని
నా ఆత్మ నాతో లేదు అని
చిన్న చిన్న ముక్కలుగా రాలిందని,
అద్దంలాంటి హృదయం విసిరేయబడి
అతికించేందుకు వీలుకానంత
చిన్న ముక్కలుగా మారి
కలిపేందుకు చేసే ప్రతి ప్రయత్నమూ
తెగేంత పదును .... భంగపాటే అని
నా ప్రయత్నాన్ని నరికెయ్యగలిగినంత
రెండు వైపులా పదునైన
పదార్ధం ముక్కలు అయ్యాయని తెలిసే
తాకే ప్రయత్నం చెయ్యలేను.
రక్త స్రావం అవుతుందనో
ఊపిరి ఆగిపోతుందనో మాత్రం కాదు. 



ఎప్పుడైనా ఒక శ్వాస తీసుకునే
ప్రయత్నం చేస్తే .... నా ఆత్మ నుంచి
అప్పుడు నీవు .... మొండిగా
పసి బిడ్డలా తిరస్కరిస్తావు.
అబద్దాలాడి, నమ్మించాలని చూస్తావు.
నిజమే చెబుతున్నానంటావు.
కుదుటపడని అస్వస్తత నాది అంటూనే.
తోడున్నాగా ఫర్వాలేదంటావు.
ఇంకా ఎన్నెన్నో చెబుతుంటావు.
ఆ మాటలన్నీ అబద్దాలని నిరూపించే
ఆసక్తి లేదు నాకు.
అందులో ఆనందమూ లేదు.
తేడా అంతా .... దృష్టి కోణాల్లోనే
నా మదిలో, నీ మదిలో ఉన్న ....
మూల్యతల్లోనే
నేనేమీ చెయ్యలేను .... ఆశ్చర్యపోగలను తప్ప
అందుకే ఈ రక్తపోటు .... ఈ రక్తస్రావం
శరీరం స్వేదమయం, శ్వాస అందకపోవడం

రెక్కలు తొడుక్కుని వచ్చాను



నిన్ను చేరాలనే
నీవద్దకు వచ్చాను
ఎగురుతూ 
సీతాకోకచిలుక రెక్కలు
అద్దెకు తొడుగుకుని

నాతో తీసుకుని వచ్చాను.
ప్రేమను,
అన్యోన్యానురాగభావనలను
నీవూ, నేనూ కోరుకునే
సాంగత్యం మార్పులను 


నా అంతరంగంలో నీవు
నీ శ్వాసనై నేను
విశ్రమించి శాంతించి
పరిపూర్ణ మమైకం చెంది
మనుగడ సాగించేందుకు 

హృదయ నందనవనం
పూతోటలో 
పరిమళాలు వెదజల్లి
మరో నూతనోదయమై
నిద్దుర మేలుకొనాలని

Saturday, October 17, 2015

కన్నీరలా కార్చకు



తుడుచుకో గోరువెచ్చని .... కన్నీళ్ళు
ఎందుకు, ఎలా వచ్చావో .... మరిచిపో
అద్దాలను పగులకొట్టి ఏం ప్రయోజనం?
పోయేదేమీ లేదు అనుకుంటే
ఆకాశం పైకప్పునే లేపెయ్యి
నీవు దోషివికావు దూరంగా పారిపోను

నాకైతే తెలియదు .... నువ్వేమిటో
తెలుసుకోవాలనే ఉత్సుకతా లేదు.
ఏమీ జరగనట్లు ఉండే ప్రయత్నమనుకోకు 
నిర్ణయాత్మక ధొరణిని అలవర్చుకో
నిన్నూ నీ బానిసత్వ లక్షణాల్ని చూస్తుంటే
భరించలేని కోపం బాధ కలుగుతున్నాయి.

ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావో
సంకెళ్ళు తెంచుకుంటే లాభమేమిటా అనా
ఏ బంధాలు బాందవ్యాలు అనురాగాలైనా
సామాజిక క్రమబద్దత కోసమే
మొయ్యలేనిది ఎలాగూ మొయ్యలేవు
ఆలశ్యం నరకం మరీ దుర్భరంగా ఉంటుంది 



కన్నీరు తుడుచుకో .... సంసిద్దురాలివై
ఉద్యమించు ముందుకు ముందుకే అడుగెయ్యి
ఉన్నన్నాళ్ళైనా అన్యాయానికి వ్యతిరేకం గా
అవినీతి నిరంకుశ దోరణులను ప్రశ్నిస్తూ ....
జీవించేందుకే పుట్టామని తెలిపేలా
జీవ ప్రస్థానం బాటలో .... అడుగులెయ్యి

శూన్యం భారం



ఒక నిశ్చలన స్థితి, అది
ఆ సమయం లో ఆవేశం లో
భూగోళం ను
ఒక బంతి లా మార్చి
హృదయం జేబులో
కుక్కుకుంటే ....
ప్రేమ అని,
కదలలేవు.
శ్వాసించలేని పరిస్థితి ఎదురై
శూన్యం
బహు భారం అనిపిస్తుంది.

బాధగా ఉంది



నీ లోతైన పద అర్ధాల
నిరంకుశ భావనల
క్రింద
సమాధి చెయ్యబడి ....
నా హృదయం

ఆ మచ్చ
స్వల్పమే  కానీ 
బాధిస్తూ ఉంది.
నొప్పి పంజరం లో
బంధించబడినట్లు 

ఇందులో నేను చేసిందీ
పొందిందీ ఏమీ లేదు.
కనీసం ఇప్పుడైనా
అభ్యసించితే ....
ప్రేమించడం ఎలానో?

Friday, October 16, 2015

చూసి కదులు



ఎంతో లోతుగా ప్రేమించు
అంతగానూ ఇష్టపడు .... ఆత్మను
సులభం గా ముక్కలు చేసేందుకు
అది ఒక ఆటవస్తువు కాదు.
నీ గుండెకు దగ్గరగా జరిగి 
గమనించు, విను
అర్ధం చేసుకో .... ఏ స్పందనలు నిన్ను
ప్రాణాలతో ఉంచుతున్నాయో

చూడు నీలోని అద్దం లోకి
గాజు తో తయారు చేసిన
డ్రస్సింగ్ టేబుల్ అద్దం లోకి కాదు. 
అంతర్దర్శినిలోకి, ఆ కాంతిని చూడు
ప్రసరిస్తున్న ఆ ప్రకాశం .... ప్రేమను 
చిమ్మ చీకటిలోనూ
చూడగలుగుతున్నవు
ఆ అద్దం లోకి చూడు, నీలోకి నీవు 



చూడు ఆ రహదారుల కూడళ్ళలో
ధర్మమూ, న్యాయము యారో మార్కుల్ని
ఆ వైపు కదులు, అక్కడే కదులుతూ ఉన్న
స్నేహం, సహకారం, ప్రోత్సాహాలు
ఆ పొగలను పీల్చుతూ
అనుమానం, అపనమ్మకాలను తరిమి
స్వయం ను తెలుసుకుని .... ప్రేమించు
నీవుగా మారు
అందరూ అనుసరిస్తారు నిన్ను

Thursday, October 15, 2015

సెలవా మరి



జారిపోతూ పడిపోతూ ఉన్నట్లు ఉంది.
నీ భావనల లోంచి లోయల్లోకి

దూరంగా ఏ వైరాగ్యం
బాధ, నిట్టూర్పు వడగాలుల్లోకో

నా గూడు, నీ హృదయం కు 
సమీపం లో లేకుండా విసిరేసినట్లు 

ఏకాకి ఆలోచనల ఎడారిలోకి
ఊపిరి సలపని కందకాల అదఃపాతాళం లోకి 



నీవు సమ్మతించి అనుమతించినట్లు
నీ కళ్ళ ముందే నిస్సహాయంగా ....

ఒక అందమైన వ్యక్తిత్వం


ఆమె ఒక స్వేచ్చాజీవి 
ఐదో పదిలో పడిన పిదప కూడా
ఒక అందమైన వ్యక్తిత్వం .... ఆమె 
ప్రేమే అని అనలేను కానీ 
నాకు ఆమె అంటే .... ఇష్టం, ఆమె నడవడిక,
ఆ హుందాతనం, ఆ నిండైన నమ్మకం 
ఎప్పుడూ సాదరంగా పలుకరిస్తున్నట్లు ఉండే ఆ చూపులు 
ఆమెను కలవడం .... సంతోషం 
ఆమె చాలా సౌమ్యంగా సాధారణంగా ఉంటుంది.
అందరితో కలిసిపోయే స్వభావం ఆమెది. 

వయస్సు, 
ముడతలు కనపడకుండా క్రీములు, 
తెల్లని జుట్టు కనబడకుండా డై లు వాడని, 
వయసు సరిపడ్డట్లు కనపడాలనే .... ఆమె, 
ఒక మంచి తల్లి! 
ఒక మంచి భార్య! 
ఒక మంచి స్నేహితురాలు.
నిరంతరమూ ఉట్టిపడే ఆ యౌవ్వనం 
ఆమె హృదయం 
జీవితం అంటే అమితమైన ప్రేమ .... ఆమెకు 
ఏబై ఏళ్ళు పైబడ్డాయని అనుకోలేము. 
.... చూసి, 
వయస్సు కాదు, ఆమే కనిపిస్తుంది ఆమెలో. 
ఒక అందమైన మహిళ .... కనిపిస్తుంది. 
ఎలాంటి ఆత్మస్తుతి, అహంకారం, 
వంచన, కపటము తెలియని 
ఒక సుందర వ్యక్తిత్వం దర్శనమిస్తుంది. 
గోరువెచ్చని ఆమె చిరునవ్వు లో

Wednesday, October 14, 2015

మరుపురాని మనోభావం నీవు



మరిచిపోలేని మది మృదు భావనవు నీవు
ఎంతో దూరంగా ఉన్నా .... ఇంకా చేరువలోనే ఉన్నా
వినిపిస్తూ, ఒక ప్రేమ పాట లా
హృదయం పాడిన ప్రేమకీర్తన లా
నీ భావనలు నా మనసుకు అతుక్కుపోయి
ఎంతగా ప్రభావితం చేస్తాయో .... ఆ ఊహలు
ఎవ్వరూ ఇంతకు ముందెన్నడూ చెయ్యనంతగా

ఏ విధంగానూ మరువలేని ఉన్నత మనోభావనవు  
ఎప్పటికీ కావాలనిపించే ఔన్నత్యానివి.
ఎప్పుడూ భరోసా ఇస్తున్నట్లు ఉంటావు.
మానసా! అందువల్లనేనేమో .... నీవు
ఎప్పటికీ పోగొట్టుకోలేని సౌకుమార్యానివి.
అద్భుత అపురూప అతిశయానివి అనిపిస్తావు.
నీ సహవాసం లో నేనూ నీ లా ....
అందమైన అభిలషంచబడే అస్తిత్వాన్ని కావాలని

Tuesday, October 13, 2015

ప్రేమ సామ్రాజ్యం



ఎన్నాళ్ళుగానో ఎన్నో చెప్పాలనుకుంటున్నాను
నిన్ను, ఎప్పుడూ ప్రేమిస్తునే ఉంటాను
ఎప్పుడూ ఒంటరిగా ఉండనీయను అని, కానీ
మరిచిపోతూ ఉంటాను .... తొందరపడి
అంతలోనే పశ్చాత్తాప్పడుతూ ఉంటాను.
గుండె పగిలిన బాధ .... నీవు ఏడుస్తుంటే లోలో
నాకు నిన్ను కోల్పోవాలని ఉండదు.
ఒంటరిగా కోల్పోనియ్యను నిన్ను .... నేను

మరోసారి మనసు విప్పి చెబుతున్నాను.
ఎంతకాలమైనా పోరాడుతూనే ఉంటాను,
నీ గౌరవాన్ని కాపాడుకునేందుకు .... అని
నీవు కలలు కనే కథానాయకుడ్నౌతాను అని
మానసీ! మనం ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని
యుగాంతాలవరకు కలిసి జీవించుదాం
మన జీవనం ఆదర్శ జీవనమయ్యేలా
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేమే మనం అన్నట్లు,

నన్ను ఉన్నతుడ్నిగా చూస్తూ ....
గౌరవనీయుడి గా ఉంచాల్సిన బాధ్యత నీది.
అందుకు కావల్సిన అన్ని సహాయ సహకారాలూ
నీవే సమకూర్చుకోవాలి. నీకు తెలుసా ....
నేనెంతో బలాడ్యుడ్ని నీవు నా పక్కన ఉంటే అని
మనసీ మరోసారి ప్రాదేయపడుతున్నాను.
ఎప్పుడూ నీ తోడు కావాలి నాకు అని
ఒంటరిగా ఏమీకాని అవశేషాన్ని నేను అని

ఈ జీవనయానం లో సంరక్షణ కోసం
నా అస్తిత్వం ధరించిన కవచంలో
ఆ మెరుస్తూ ఉన్న పదునైన ఖడ్గం నీవు
ఎన్నిజన్మలుగానో ఆపత్సమయం లో తోడుండి
సంరక్షిస్తూ ఉన్నావు నన్ను .... నిజం మానసీ!
నా ఈ ప్రేమ దుర్గానికి మహారాణివి నీవు.
మనం, ఒకరిని ఒకరం అర్ధం చేసుకుని కలిసుందాం
ఈ ప్రేమ సామ్రాజ్యాన్ని మహోన్నతంగా తీర్చి

Sunday, October 11, 2015

పసి మనోభావన



సున్నితంగా తీసుకోవాలనుంది
చేతుల్లోకి .... ఇరు హృదయ మనోరధాన్ని
ఒక పసి పువ్వును ....  నిన్ను,

నీవు కదులుతున్నావనే .... వాత్సల్య భావనే
బలమైన ప్రేమ రాగమై 
మధురమైన ఒక లాలిపాటను పాడాలని. 

ఊ కొట్టలేక. శక్తి లేక, వంగిపోయి
మెత్తని దూదిముద్దలా .... నా చేతుల్లో
నిట్టూర్పు భారం లా .... నా మదిలో  


ఎంతగా ప్రేమిస్తున్నానో
ఎంతగా ఎదురుచూస్తున్నానో
తెలుసా నీకు,

నన్ను గుర్తించలేని కౌగిలించుకోలేని,
ఇంకా కళ్ళే తెరవని, మొదటి శ్వాసైనా తీసుకోని,
ఓ పసిమనోభావనా!

ఓ పసిపరిమళమా!
నువ్వు, మా ముంగిట ఇంకా
ఉదయించని మా అందమైన వ్యామోహానివి.

తెలుసా? రాయిలా మారింది .... హృదయమని



రాలిన మన జ్ఞాపకాల
ముక్కల్ని ....
విసిరేయబడి
దూరదూరంగా పడిన
నా గుండె ముక్కల్ని ....
జ్వలిస్తున్న గాజుపెంకుల్ని ....
ఏరుకుంటూ ఉన్నాను.

అప్రమత్తంగా ఉండకపోతే
అవి గాయపరుస్తాయని తెలుసు.
తెలిసీ ....
పట్టించుకోలేని స్థితి.
పింగాణీ హస్తాలుగా
భావించుకుని ....
అందుకునే ఆత్రుతలో 
గాయాలై రక్తశ్రావమైపోతూ 



నా హృదయాన్ని
ఎప్పుడైతే నీవు
ముక్కలు చేసావో ....
అప్పుడే,
అలా ముక్కలైనప్పుడే ....
కారిపోయింది. 
రక్తం మిగిలి లేదు.
కొత్తగా కారేందుకు

అయినా, ఏదో ఆశ ....
నీవు నా ఈ రాతల్ని
చదివే అవకాశం ఉందేమో అని,
నిజంగా చదివితే ....
పరిపూర్ణంగా నన్ను
అర్ధం చేసుకునే
అవకాశం ఉందేమో అని,
తెలుసుకుంటావేమో అని

నేను, నీ అందాన్ని చూసి
ప్రేమించలేదని
మనం తొలిసారి
కలిసినప్పటి నుంచి ఈ క్షణం వరకూ
అన్ని వేళలా .... నా ప్రేమ
ఒక కరుగని మంచుగడ్డలా ....
ఘనీభవించి,
ఇక్కడే నీ పరిసరాల్లోనే ....
ఇలానే శిలలా ఉండిపోయిందని