Saturday, April 23, 2016

నీవు లేక


నాలో ఒక వ్యర్థ, నిరర్ధక
చీకటి అగాధం ....
దిక్కుమాలిన
దౌర్భాగ్య దురవస్థా స్థితి
శూన్య అంతరంగ ఆవేశం
....
ఇప్పుడు
ఓ శూన్య మనోభావనై

Friday, April 22, 2016

అతలస్పర్శ అంతరంగం


నీలోదుష్టతే ఉన్నా దుష్టత అని అనుకోలేను. 
ఊహించనూ లేను. భయం ....
కళ్ళల్లోంచి .... నీ గుండె లోతుల్లోకి
చూసే ప్రయత్నం 
ఊపిరిబిగబట్టి మరీ ....
పైకి డాంబికంగా కనిపించే నీలో
నీ ముఖ కవళికల్లో కదలికల్లో
ఎప్పుడైనా ....
ఏ అంధకారచ్ఛాయలనో
చూసి అలజడి చెందుతుంటాను. 
అప్పుడు ....
నా మెడమీద పదునైన కత్తేదో
తాకిన అవిజ్ఞతా స్పర్శానుభూతి
నీ చేరువలో 
నీడల్లా చుట్టుముట్టిన ....
ఏ సంకటాలు, చిక్కుల మధ్యో
ఎప్పుడైనా దిక్కు తోచక నీవు పెనుగులాడితే
గత్యంతరం లేకేనేమో అని
సరిపెట్టుకుంటుంటాను. అప్పుడు
నీ అమాయక అస్తిత్వనగ్నత్వం
నా ఆత్మను అవహేళన చేస్తుంటుంది.
నీ చుట్టూ ఉన్న
అపసవ్య పరిస్థితులు పరిసరాలే
వీటన్నింటికీ ప్రేరణ అని సరిపెట్టుకుంటాను, కానీ 
నిజానికి నా మనోదౌర్బల్యమే
కారణం వీటన్నింటికీ ....
నిన్నూ, అనిశ్చితి పరిస్థితుల్నీ తెలిసీ
నియంత్రించే ప్రయత్నం చెయ్యకపోవడం
అంతకు మించి అతిగా నిన్ను
ప్రేమించకుండా ఉండలేని బలహీనుడ్నవ్వడంThursday, April 21, 2016

చాలా కష్టం .... ఆత్మకు


అది జీవితం కాదు జీవించినట్లూ కాదు
ఎవరో నిర్దేశానుసారంగానో
జీవించాల్సిన జీవనసరళే
తప్పనిసరి అయితే .... జీవితంలో
అంతా కష్టమే, ఆ ఆత్మకు

తనకు తానుగా ఎలా జీవించాలో
నిర్దేశించుకునే అవకాశం దొరకనప్పుడు
జీవన రంగస్థలంపై
ఎంత గొప్ప నటుడనిపించుకున్నా
ఎంత శ్రేష్టుడు అని ప్రశంసలు పొందినా,

తన కోరిక కాని ఏ సాధన ద్వారానో
ఏ తోలుబొమ్మలాటలోనో
తెరవెనుకనున్న ఎవరి నిర్దేశానుసారంగానో
తెరపై బొమ్మలా .... తను
ఎంత కళాత్మకంగా నటించినా 

పొందాల్సిన స్వేచ్చాస్వీయతను పొందక

Tuesday, April 19, 2016

కాలే కవితల కర్తన్నేను


ఒకవేళ
రాస్తే, ప్రేమ ప్రకోపంలో .... నేను
ఎప్పుడైనా .... నీ గురించి
ప్రేమ భావనలు పద కవితలుగా
తొందర పడి
ఉద్వేగపడతావేమో 


ఈ రోజుటి
ఆ ప్రేమాక్షర గీతికలు 
రేపటి .... ఏ భగ్న క్షణ
హృదయాగ్ని జ్వాలల్లోనో
కాలి నుసవ్వవని మాటివ్వడం
బహు కష్టం

Monday, April 18, 2016

మౌనరాగం లో నీ జ్ఞాపకాలు


ఈ ఆఖరి శ్వాస
పెదవులను దాటుతున్నప్పుడు
నా ఆలోచనల్లో మిగిలేది మాత్రం
మన తొలి పరిచయం .... తొలి ముద్దు
ఎంతో తియ్యని
నాటి పట్టలేని ఆనందమే

నేనెప్పుడూ కోల్పోలేదు.
నిన్నూ, నీ ప్రేమను
నేను కోల్పోయింది కేవలం
మాటల్నీ, మాట్లాడుకోలేని శ్థితినే
అమితమైన ప్రేమ మౌనరాగమై మిగిలి
వెల్లడించలేక పెదవులతో

శరీరాల బాషలో
శరీరాలు మాట్లాడుకుంటుండేవి ఒకప్పుడు
మనం మాట్లాడని ఎన్నో విషయాలను
మితిమీరిపోయిన మోహం ....
ఎవ్వరూ ఊహించనూ పోల్చనూ లేని
కోరికల పరిపూర్ణత ను
అధిగమించేంత గా పంచుకుంటూ 


ఏదో నువ్వు ఇచ్చేదానివి
నాలో స్వాంతనం కలిగేది
నీవు మాత్రమే
నన్ను సంరక్షించగలిగినట్లు
నీవు మాత్రమే నన్ను
పరిపూర్ణుడ్ని చెయ్యగలిగినట్లుంటుందేది.

ఎలాంటి ప్రతిక్రియ
ఎలాంటి ప్రకోపమూ లేని
అశక్తత నాది .... ఆ క్షణాల్లో
బహుశ నువ్వు వినే ఉంటావు
ఎవ్వరికీ వినపడని ఎన్నో నిశ్శబ్దం రోధనల్ని
నేను నాతో మిగుల్చుకున్నది .... కేవలం
నాటి మౌనరాగం తీపి జ్ఞాపకాలనే 

Thursday, April 14, 2016

నువ్వెప్పుడూ నాతోనే అని


కవితలు రాసుకుంటున్నాను
నా గురించి, నీ గురించి
నీవూ నేనూ ఎక్కడికి వెళ్ళినా
ఒకరికి ఒకరము తోడుగా
ఉన్నప్పటి కొన్ని సంఘటనల గతాన్ని 
కొన్ని తీపి అనుభవాలను
కొన్ని చల్లని మనోభావనలను
అక్షరాలతో అల్లి
రాసుకుంటున్నాను. హృదయ ఫలకం పై  


మన ప్రేమానుబంధాన్ని 
ప్రేమ ఎప్పుడూ .... జీవించి ఉండాలనే
అభిలషను చిత్రీకరిస్తున్నాను.
కళాత్మకంగా కాగితం మీద
ఎవరికి ఎవరం దూరం కారాదనే
అభిమతం ను రాసుకుంటున్నాను కవితలుగా

నా ఊపిరి నీవుపోగొట్టుకొన్నాను నిన్నూ నన్నూ
చాన్నాళ్ళుగా
ఎన్నో విధాలుగా
చేజార్చుకున్నాను విఫలమయ్యాను.
హృదయం గోడపై రాతిశాసనం లా
ఆనవాయితీ అయినట్లుగా

అకశ్మాత్తుగానే నిద్రలేస్తూ ఉంటాను.
వ్యాయామము ప్రాణయామమూ
దినచర్యలు చేస్తున్నప్పుడు
నీవే గుర్తొస్తుంటావు.
నిన్ను పోగొట్టుకున్నాననే లోప భావన 
నీవు లేవనే లోటే కనిపిస్తుంటాయి. 


నా శరీరమూ ఆ ప్రతి అవయవమూ
తీవ్రమైన ఒత్తిడికి లోనౌతూ ఉంటాయి.
శ్వాసించడం భారమౌతుంటుంది.
పోతే పోయింది పోగొట్టుకోమ్మంటూ
ప్రకృతి పరామర్శిస్తుంటే
స్వాగతించి సమర్ధించలేని దుస్థితి నాది.

నిజంగా అంత సులభమా?
హృదయం శ్వాసించడాన్ని నియంత్రించగలగడం
అలసట అయిష్టత బాధ అసంతులనమే అంతా అయితే 
నన్ను నేను పోగొట్టుకోగలనేమో
సరిపెట్టుకోగలనేమో కాని
జీవించలేను, మాని .... నిన్ను శ్వాసించడం

అస్పష్టత లో స్పష్టత
తాపసించి ముదిరిపోయిన మనఃస్థితి నాది
ప్రేమ పొల్లుకొస్తున్న, ఏకాకిని
తోడుగా .... నా అనిశ్చలతను, నన్నూ
అర్ధం చేసుకునేందుకు ఎవ్వరూ లేరు అని

ఒంటరిని, ఏకాకిని అను భయం
తినేస్తూ ఉంది నన్ను
నన్ను, నా మనోభావనల్ని వినేందుకు
ఎవరైనా తోడుంటే బాగుండేది అని అనిపిస్తూ

జీవితం ఆవశ్యకతను గుర్తించాను .... అందుకే 
నిన్నటి గాయాలకు లేపనం రాసుకుంటున్నాను.
సూర్యోదయాన్నే నిద్రలేచి, శ్రమ సేద్యం చెయ్యాలి అని
చైతన్య పధం వైపు పురోగమించాలి అని 
అలా అనుకుంటూనే నేనున్న ఆ అస్పష్టతల్లోంచి
పై పైకి వస్తున్న పొద్దును పరిక్షగా చూసాను.
ప్రతిదీ భిన్నంగా కనిపిస్తూ
అన్నింటిలో నూ మరింత స్పష్టతను చూడగలిగాను.

ఇప్పుడు నా కళ్ళు రెండూ సంపూర్ణంగా భైర్లు కమ్మాయి.
ఎటు చూసినా, దేనిలోనూ .... అన్నింటిలోనూ
మిగిలి ఉన్నది .... నొప్పి బాధ అయోమయములే  
నొప్పి, బాధ, అయోమయాన్ని మినహాయించి ఏమీలేవు.

కానీ నేను ఎప్పుడూ అనుభూతి చెందనిది ఏదో
నాకు కావలసిందే ....
ఎప్పుడూ ఊహించనిది నేను శ్వాసించనిది
నా అందుబాటులో లేని ఏదో అద్భుతం ఉంది అక్కడ

ఇప్పుడు .... దాన్నే అందుకోగలిగే స్థితిలో ఉన్నాను.
నా చేతికి అందే అంత దగ్గరగా
వెచ్చని స్పర్శాభావన .... ఆ సాన్నిహిత్యంలో ఉంది
అనిపించింది .... బహుశ ప్రేమ భావనేమో అది అని

నిజంగా దాన్ని నేను ప్రేమ భావనే అని
చెప్పలేను. విడమర్చలేను.
ఆ మనోభావనలు వినూత్న విలక్షణంగా
పసి మాటల అస్పష్టత లా ఉంటూ ....

నా జీవన నక్షత్రంఆకాశంలోకి చూస్తున్నా
ఎన్నో లక్షల నక్షత్రాలలో నీ రూపాన్ని
కేవలం
నా కోసం అన్నట్లు
మెరుపువై వెలుగువై
నేను ఎంత అదృష్టవంతుడ్నో
ఏకవచనంతో
నిన్ను పరామర్శించగలుగుతూ .... వెలిగే ఆ ప్రతి నక్షత్రమూ
ఒక కారణమే .... నీ, నా
ప్రేమ గాఢత్వ పరిచయమే 
జతవై ఉన్నంత కాలం 
నా జీవన నక్షత్రం .... నీవే
నా చీకటి జీవన గడియల్లో
వెలుగు దారివి నీవే
మసకెయ్యని ప్రేమవు నీవే
శాశ్వతత్వానివై
వెలుగులు విరజిమ్ముతూ
మోహోద్రేక, ఉద్వేగ,
ఆవేశ క్రోధాలలో సంతులనానివై
రేపటి నా మనోభావన పదాల్లా 

శూన్యంలో రాతలుధరించుతూనే ఉన్నాను.
భిన్నమైన ముసుగులను ....
దాచుకునేందుకు
నన్నూ, నా అస్తిత్వాన్ని ....

గొణుక్కుంటూనే ఉన్నాను.
అసంబద్ధ అశ్లీల పదజాలాన్ని 
తొంగిచూస్తూ,
వైవిధ్యపు ఆలోచనల్లోకి .....

అయినా,
మారలేదు .... మనమూ
మన జీవన సరళి ....
ఒకేలా ఉన్నాము .... సందర్శకుల్లా

ఉత్సుకతే ఆధారంగా
మానవ జీవన పంజరం
సంబంధాల చట్రం లో ....
ఒదిగి ఒదిగి జీవించక తప్పట్లేదు. 

మరణం రానంత వరకూ
భానిసత్వపు సంకెళ్ళు
తెంచుకున్న స్వేచ్చా విహంగమై ....
ఏ తెలియని లోకాలకో ఎగిరేవరకూ

Wednesday, April 13, 2016

ఊపిరిగుండె కొట్టుకోవడం
శ్వాసించడం ఆగి రాదు .... చావు
గుండె తొలిసారి
కొట్టుకుని .... ఎవరికోసమో
శ్వాస భారమైన క్షణాల్లోనే ....
ఆరంభం తెలుస్తుంది.
ఎందరో మనలో
దూళై 
ఆఖరిశ్వాసకు మునుపే
ప్రేమ అనే ఆ దావానలంలో
పడి మాడి మసై మట్టిలో కలుస్తున్నారని

Sunday, April 10, 2016

స్వార్ధం తోనే ....
ఆటకు ముందు ఎగురవేసే నాణెం 
పుట్టిన రోజు
పడేది తలో తోకో
కానీ
ప్రతిసారీ
ఆకాంక్షలు
హృదయం అసఫలం కారాదనే

అన్నింటికీ ఆధారం
ఒక కామన
ఒక మనోభావన
అస్పష్ట గణనీయత
ఏ ఒక్కరు గుర్తించారో లేదో అనే

Saturday, April 9, 2016

సాహితీ ప్రస్థానమే జీవితంఒక కవివి కా లేదా
ఒక రచయితవో వ్యాసకర్తవో కా .... నీవు
అది మాత్రమే సమాధానము మార్గమూనూ
అది మనోవేదనే అయినా భావోద్వేగమే అయినా
నడుం విరిగి వెల్లికిలా పడిపోకమునుపే
ఎప్పుడైనా .... నీ ఆవేదనను బాధను
అక్షరాల్లో అల్లి పొదువుతూనే ఉండు

నీ రాత కవిత్వం అయినా
కథ అయినా
వ్యాసం అయినా
ఏదైనా
అక్షరాల్లో జీవించు
పదపంక్తుల్లోనే
నీ ఆవేశాన్ని శిల్పించు 


ఎప్పుడైనా ఏ బాధ్యతల మెట్లమీదైనా
ఏ ఆశయాల పడీదులోనైనా
ఏ వ్యసన, దుఃఖకర 
నిర్జనప్రదేశంలో నిద్దుర లేచినప్పుడు
ఏ అపసవ్య కారణాల వల్లైనా
నీ మనోభావనలకు, ఎప్పుడైనా నీకు
సరైన పదాలు దొరకనప్పుడు

గాలినో, నది అలల్నో,
తారనో, పావురాన్నో ....
పరుగెత్తే కాలాన్నో అడుగు
ఎగిరే పరుగులుతీసే  
పట్టనట్లుండే దేన్నైనా
దొర్లేదే అయినా, పాడేదే అయినా
మాట్లాడేదే అయినా ....
దేన్నైనా అడుగు
ఏ ఋతువు ఇదీ అని

అవి సమాధానం చెబుతాయి.
"సాహిత్యానికి సమయమే ఎప్పుడైనా" అని
"బానిసలా కాలచక్రం ఇరుసులో
నలిగిపోవద్దు రాయీ" అని
"చరిత్రను రాస్తూనే ఉండు" అని
"కవితో కథో వ్యాసమో ఏదైనా
నీ భావనల్ని శిల్పించు సృజించు" అని

Friday, April 8, 2016

అతను
బాధ్యత
బయలు

పని పట్ల
సద్భక్తి

అతని
అనిరీక్షణలో

గృహస్థ
అవసరాలు

ఉన్నది
సరిపెట్టుకోలేక

కోపంప్రయత్నం

అరవాలని

స్వయం

లేచి
నిలబడ్డా

శరీరంలోంచి
ఒణుకు

గొంతులోంచి
అశక్తమైన
శబ్దం

Thursday, April 7, 2016

దోషగుణ అస్తిత్వాలం మేము
చీకటి ఆలోచనల గతాలు ....
మాలాంటి వారి అస్తిత్వాలు
ఎప్పుడూ చీకటి గుహల్లోనే నివశించుతూ
చిక్కని సాధ్యం కాని ఆకాంక్షల అవాస్తవికత లో
ఆశగా, ఎవరైనా వస్తారని .... ఒకరోజొస్తుందని
జీవితం వెలుగుమయం అవుతుందని అనుకుంటూ 

ఆ చీకటికి మాత్రమే అలవాటు పడిన
ప్రవర్తన .... చూపుల్లో అగ్ని,
ఎదురైన ఆవేశాన్ని  
మమ్మల్ని అర్ధం చేసుకోవడం సులభం అనుకోను ....
మా అంతరంగాల్లో దాగి ఉన్న సంఘర్షణల్ని
ముఖాలపై పూచిన చిరునవ్వు చాటు బాధల్ని

నల్లని చీకటి దుప్పటి కప్పుకున్న
అగంతకుల్లా 
 ముసుగేసుకున్న .... చందమామ వాగ్దానాలు మావి
మా తారకలతో .... ఎన్నో కాదు ప్రతిదీ చేస్తామని
మేము బ్రతుకుతున్నదే వారి కోసం అని
కేవలం వారి కోసమే శ్వాసిస్తున్నామని బాసలాడుతూ చీకటిలోనే
మా నివాశం తప్పని శాగ్రస్తులము మేము 
తెలుసు .... తప్పదు అని, నొప్పిని సహించక
అది ఎంత భరించలేనిదే అయినా,
నిరుపయోగ జీవులమని అనిపించినా, ఏడ్చినా
ఎంత పశ్చాత్తాపపడినా తగ్గని బాధ మా అస్తిత్వాలది అని

మాలాంటి చీకటి బ్రతుకులకు సహచరి దొరకడం కష్టం
ఒంటరితనమే మాలాంటి వారి తోడు
మేము ప్రేమించిన వారు ఎందరు ఉన్నా .... అందరూ
మమ్ము నమ్ముకున్న, మేము సహకరించిన వారే అయినా
అందరికీ భయమే మేమన్నా చీకటన్నా .... తోడుండేందుకు

కొన్ని నిజాలంతే .... అనాకార అందహీనతలే 
ఎప్పుడైనా ఏ అనుసరణీయమైన .... మంచి పని చేసినా
అనుసరించేందుకు అయిష్టపడే వారే అందరూ
వారి శాపశరాలు చేసిన గాయాల .... తప్పని బాధలే
చీకటి మనిషి అనే .... అసామాజిక న్యాయమే

మాలా ఎందరో .... ఆ చీకటి మానవులు
ఉత్సాహాన్ని పంచి ప్రతిగా అగౌరవాన్ని పొంది
మేమంతా చీకటి సామ్రాజ్య అధిపతులమే
బాధ్యత్వము మీద సతతమూ నిలబడి
చీకటిని ధరించిన .... నిర్మూల్య అపరిచితులమై

Wednesday, April 6, 2016

తెర వెనుక
రెండు జతల కళ్ళు కురుస్తూ ఉన్నాయి.
ఒకరు ఆమె ఒకరు అతను ఇరువురి కారణాలే వేరు వేరు ఒక హృదయం బ్రద్దలయ్యి ముక్కలు ముక్కలయ్యి .... తెర వెనుక గ్రంథపు అబద్ధపు చరిత్ర పుటలు కనిపిస్తూ ఏ పరావర్తించిన వెలుగు కిరణమైనా తాకి నిజం బట్ట్టబయలౌతుందనే ఉలికిపాటు ఆమెలో ఎన్ని నాళ్ళుగానో ఎంతో భద్రంగా ఆమె, ఆ పేజీల్లో పాతిపెట్టిన రహశ్యం వెలుగును చూస్తుందేమో అని ఆమె తడబాటు, మదిలో ఏమరుపాటున కూడా నెమరుకు అందుబాటులోనే ఉన్న కావాలని ఆమె దూరంగా నెట్టేసి పెకిలి పారవేసిన ఎన్నో జ్ఞాపకాల కలుపుమొక్కలు పదిలంగా పచ్చగా ఇంకా రెపరెపలాడుతూ ప్రశ్నలుగా మిగిలున్నాయని ఆమె భయం అభద్రతాభావం ఆమె రచించిన స్వీయ నాటకం ప్రదర్శన విజయవంతం కావాలని రసాభస కారాదు అని తెర వెనుక భద్రత నిగూడత తగ్గరాదని నిజంగా అదేనా ఆమె కోరిక సమాధానము అంటే చెప్పడం చాలా కష్టం ఎంతో జాగ్రత్తగా ముఖం కనపడకుండా తనను తాను ముసుగులో దాచుకున్న ఆమె అతని కళ్ళకు గంతలు కట్టగలదా దూరంగా నెట్టి వేయగలదేమో కాని అందుకే అతను చూడగలుగుతున్నాడు ఆమె అంతరంగాన్ని, పలుచని ఆమె బేలతనాన్ని

Tuesday, April 5, 2016

ఆమెకు గుర్తుంది
నిద్దుర రాక 
వింటూనే ఉంది 
నీ జ్ఞాపకాల్ని 
పాటల్ని 
రాత్తిరంతా 
ఆమె 
మరువలేక .... 
ఆ హృదయం 
ముక్కలయ్యింది 
నీవల్లే అని 

అనంతరాగం
తొలిసారి ఎదురైనప్పుడు, సరిగ్గా
నేను ఆమెను కలిసిన ఒక ముందు రోజు
ఒకే హృదయం ఒకే మనసు
ఒకే ఆత్మ ఒకే ఆలోచన .... నాలో
అంధకారమూ అగమ్య శూన్య జీవితమూ నేను

ప్రేమతో నా కళ్ళు మసకేసిపోక మునుపు 
నేను పరిక్షగా చూసిన ముఖం ఆమె 
ఎటు చూసినా ఆమె చిత్రాలే
నా హృదయం గోడపై చిత్రించుకుంది.
మదినిండా అన్నీ అపసవ్యపు ఆలోచనల మధ్య

ఇప్పుడు నేను మా ఇరువురి దృష్టితోనే
జీవితాన్ని చూస్తున్నాను
జతలుజతలుగా రెండూ నాలుగులుగా అన్నింటినీ
ఆమె హృదయం మార్గదర్శకత్వం లో
నా కళ్ళెప్పుడూ ఆమెవైపే ఆకర్షించబడుతూ. 
మా రెండు ఎదలు రెండు మదులు
మా రెండు ఆత్మలు రెండు ఆలోచనలు 
మమైకం మేమై .... మా జీవితం లో
చెదరని చిరునవ్వుల పువ్వులమై  మేము
పరిమళిస్తూ కలిసి నడుస్తూ .... జీవిస్తూ

Friday, April 1, 2016

అతివాదినైన కొన్ని క్షణాలు
కోల్పోయాను నన్ను 
అభిమంత్రితమైన ఆ అడవిలో 
చుట్టూ చెట్లూ పుట్టలు 
పొద్దు కనపడనంత దట్టంగా 
తిరిగి వెళ్ళేందుకు దారుల్లేక 
అయిష్టంగానే ....
అంతా అంధకారితము
నన్నూ, చివరికి నమ్మకాన్నీ 
మార్చుకోలేని అస్థిరత  
అనిర్వచనీయ భయం ఏదో 
పర్యాప్తము 
అది ఒక నిషిద్ధారణ్యం 
ఊడలు బలంగా పాతుకున్న చెట్లు 
చిరిగిన దుస్తులు 
మధ్యలో అగమ్యుడ్నై 
రక్కుకుపోయిన శరీరం 
గాయాల పుండుపై 
భయాన్ని ఊదుతూ అతివాదం 
నిశ్శబ్దం ఏడుపులు 
దయ్యాలు ద్వేషంతో 
నన్ను పేరుపెట్టి మరీ పిలుస్తున్నట్లు 


బాధ నిరాశ నిస్పృహల 
మబ్బులు ఆవహించి 
కుంభవృష్టి 
కాలువలు వాగులై వరదలై 
మురుగు నీరు 
ఆ నీటిపై తేలుతూ నేను  
అంతా చీకటిమయం, 
ఆవేశం మానవత్వాన్ని దబాయిస్తూ 
అక్కడ ప్రేమ లేదు. 
వెలుగు లేదు. క్రమబద్దత లేదు. 
ఉన్నదంతా కారు చీకటి 
కారు మానసికత 
క్షతి, నరకమయ జీవనమూ