Saturday, November 30, 2013

స్వేచ్చా భావనలు (ఒకటి)


 












గత కొద్ది రోజులుగా ఆకాశాన్నీ ఆ నక్షత్రాల్నీ చూడటం ఒక అలవాటుగా మారిపోయింది. అలా చూసీ చూసీ ఏకాగ్రత ఎక్కువై కళ్ళు మసకేసి తడి జారడం లోని ఆనందానికి బానిసనయ్యానేమో అనిపిస్తుంది యెప్పుడయినా పార్కు లో ఆరుగు మించి తూలి జారిపడినప్పుడు. నా తోటి అనామక నిరాశ్రయులు నవ్వుకుంటూ అంటూ ఉంటారు, నాకు కవిత్వం పైత్యం బాగా వంట పట్టిందని.

ఆకాశం కొలనులో కదిలే చేపలు ఆ నక్షత్రాలు అని అన్నప్పుడు అందరూ నవ్వుకోవడం నాకు తెలుసు. వారి నవ్వులకు బలాన్నిస్తూ అప్పుడప్పుడూ అర్దరాత్రుల్లో నిద్రలేచి ఆకాశంలో చుక్కల్లేవని ఏడుస్తూ వుంటాను, ఏడిచే శక్తిని పూర్తిగా కోల్పోయేవరకూ. అలా అని నాకు ఆకాశమంత ఎత్తు ఎదగాలనే ఆశ లేదు. అనాధను అయినా గుండెల్లోకి తీసుకుని ఆదరిస్తున్న భూమి పుతృడ్ని అనుకోవడం లో నాకెంతో ఆనందం ఉంది.

అప్పుడప్పుడు రాత్తిరి వేళల్లో నక్షత్రాల్ని లెక్కెట్టుకుంటూ, ఫుట్ పాత్ ల మీద నేను నడుస్తున్నప్పుడు .... రక్షక బటులు నన్ను ఆపి ప్రశ్నించడం భయపెట్టడం ఏ టాంక్ బండ్ అరుగు మీదో ఆ రాత్త్రిని గడిపెయ్యడం .... జలాశయం మధ్యలో బుద్దుడి సహనాన్ని పరీక్షిస్తున్న విధ్యుత్ బల్బుల కాంతిని నక్షత్రాల కాంతితో పోల్చుకుంటూ నిద్రలోకి జారిపోతుండటం చేస్తుంటాను.

నిజం! నాలాంటి వారిని క్రమబద్దీకరించడంలో ప్రభుత్వం విఫలమైనట్లే మనం అందరమూ కొన్ని కొన్ని జీవన అత్యావశ్యకతలను అలక్ష్యం చేస్తున్నాము.

Thursday, November 28, 2013

భయం!


భయం!
అలజడి, 
ఆందోళన, 
అస్థిమితత్వం 
ఆమెను చూసిన క్షణం నుంచి, 

ఆమె మాటలు 
పెదవుల కదలికలు, 
కళ్ళు, 
కళ్ళ మెరుపులు 
నవ్వులు చూస్తున్నప్పుడు
కలిగే అపరిమిత ప్రేమభావన తో

భయం
.............
మితం కాని ఏదైనా 
నాశనము, 
ధ్వంసము, 
చెరుపే అవుతుంది అని,

ఎంత 
పొందినా 
ఇంకా పొందాలనిపించే 
తపన, 
బలహీనతే ప్రేమ అని,

Monday, November 25, 2013

నేనూ వస్తాను నీతో


ఆగకు, కదులు ముందుకు
పురోగమనం వైపు .... కదులు ముందుకు,
కదులు చైతన్యానివై ముందుకు ....

కుక్కలు అరుపులు వినిపించొచ్చు 
గబ్బిలాలు తలమీదుగా ఎగురుతూ ఉండొచ్చు 

తెలుసా నీకు? ఆ చెట్ల గుబురుల్లో
విషనాగులు నిదురిస్తుంటాయని,
ఆ ఎండిన కొమ్మలు ఒకదానితో ఒకటి రాసుకుని
అడివి అగ్నిగుండం అవుతుందని,

నాటుబాంబులు, నాటుతుపాకులు
గొడ్డళ్ళు, కొడవళ్ళ వీరంగం తో
చేతనత్వం ప్రజ్వరిల్లి,
అవినీతి, స్వార్ధ ఆక్రందనలు
భయనాదాలు వినిపిస్తాయని,

ఆగు, ఆగు .... "నేనూ వస్తాను నీతో" అంటూ,
వెనుకనుంచి పిలుపులు వినిపించొచ్చు.
అయినా ఆగకు .... కదులు ముందుకు

స్వేచ్చను శ్వాసించాలనుకుంటున్నావా!
కొనసాగించాలనుకుంటున్నావా!
అందుకే .... ఆగకు, కదులు ముందుకు.

నాకు స్వేచ్చ కావాలి


యుద్ధం అంటే భయంతో కాదు.
యుద్ధాన్ని ఆక్షేపిస్తున్నాను.
ఎవరినో చంపాల్సొస్తుందనో
ఎవరి చేతిలోనో చావాల్సొస్తుందనో .... కాదు.
చంపడం, చావడం అతి స్వల్ప విషయాలు.

కానీ,
నా స్వేచ్చను, నా హక్కుల్ని
కోల్పోతున్నానే .... అదీ అభ్యంతరం.

కాలనీలో మారుమూల
ఓ చిన్న గదిలో, ఆకలికి మాడుతూ,
అప్పుడప్పుడూ,
ఏ చవకబారు సారానో తాగుతూ,
వీధుల్లో వీరంగం చేసి
సావకాశంగా బలాదూర్లు తిరగే స్వేచ్చను,
పౌరుడిగా నా హక్కును కోల్పోవాలని లేదు.


మోసపూరితప్పువ్వు


అందమైన సంపెంగ పువ్వొకటి పూచి
నన్నే చూస్తూ పగలబడి నవ్వింది.
పరామర్శించింది.

ముగ్దుడ్ని అయ్యాను,
ఆ మాట, ఆ నవ్వూ వెనుక నాగుల కదలికుందని
అది ఒక మోసపూరితప్పువ్వని, విషం కక్కుతుందని తెలీక

ఒక నవ్వూ, ఒక పలుకరింపే
సాహచర్యం, జీవితం, ఇంక చాలు అనుకున్నా
ఆమె కలవక మునుపు

అంతే కానీ, ఆరంభం లోనే
నా కోరిక ఆఖరిది, తీరనిది
ఫలించనిది .... అని అనుకోలేదు.

నమ్మించి మోసగించింది.
మోసపోయాను మళ్ళీ వోసారి,
మోసపోవడం నాకు కొత్తేమీ కాదు.


(ఎప్పుడో ఏప్రిల్ లో రాసుకున్న కవిత ఇది. పోస్ట్ చెయ్యకుండా అప్పుడప్పుడూ ఎడిట్ చేస్తూ ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నాను. చివరికి ఈ రూపం లో వెలుగు చూసింది.) 

Sunday, November 24, 2013

నా జీవన నూతనాధ్యాయం

ఒక జీవన అధ్యాయం ముగిసిపోనుంది. కొత్త అధ్యాయం ఇంకా రాయలేదు. భవితవ్యం తెలిసిన జ్యోతిష్కురాలిని లా నా జీవితాన్ని నేనే రాసుకుంటున్నాను.

నా ముందు నాకు రెండే మార్గాలున్నాయి. జీవితం లో నేను తీసుకోబోయే అతి పెద్ద నిర్ణయాల్లో వొకటి తీసుకోక తప్పదు. ఈ ఊరిలోనే ఉండి అనామకురాలినిగా చావడమైనా చెయ్యాలి లేదా సాహసించి నీ వద్దకు చేరాలి. మధ్యే మార్గం లేదు.

బహుశ ఇదే మొదటిసారి, ఇలాగే జరగబోతుంది అని నేను అనుకోవడం. సాధారణం గా గమ్యం తెలియని ప్రతిసారీ ఒక అశక్తురాలిలా గాలివాటుగా కదులుతూ వుండేదాన్ని.

ఇప్పుడు నా హృదయం నన్ను నిర్దేశిస్తుంది. నా ఆత్మ లోని అంతరాత్మ నన్ను పిలుస్తుంది. తెలుగు సినిమాల్లో చూపిస్తున్న స్వచ్చమైన ప్రేమ లాంటి ఔన్నత్యాన్ని ప్రదర్శించలేను కానీ నాకు తెలుసు .... నా ఆత్మ ప్రతి చిన్న అభిలాషను కూడా నేను అర్ధం చేసుకోగలను.

నీతో కలిసి కొన్నాళ్ళైనా జీవించితే కొంతైనా వివేకం అబ్బుతుందని ఆశ. నీవు నాకెంత దూరమో నేనూ నీకంత దూరమే అని తెలిసినా. ఎందుకో మన మధ్య ఈ దూరం నన్ను చంపేస్తుంది.

ఇక్కడ ఊరులో నా కోసం అంటూ నాకు ఏమీ మిగిలి లేదు. ఒక్క తలనొప్పి తప్ప. ఎవ్వరూ నా మాట వినరు. షో కేస్ లో బొమ్మలా మిగిలిపోతానేమో అని భయంగా ఉంది.

నాకిప్పుడు జీవించాలని ఉంది. నన్ను నేను సమర్పించుకోవాలనుంది .... నీకు. ప్రతి క్షణమూ నా హృదయం ఆలపిస్తుంది ఒక విరహ గీతాన్ని. నా మనసు మారాం చేస్తూ వుంది నీ సాహచర్యం, ప్రేమ కావాలి అని.

నేనిప్పుడు రోజుల్ని లెక్కేసుకుంటున్నాను. కదిలిపోతున్న గంటల్లో, నిముషాల్లో, క్షణాల్లో ని యాంత్రికత లోంచి బయటపడాలని, నీ వద్దకు బయలుదేరాలని. 

నా జీవితం నూతన అధ్యాయం నా కోసం ఎదురుచూస్తుంది …. నా గమ్యం నా కదలికల ప్రత్యక్షక్షరాల .... ఘటనల్ని నేనే రాయాలని.
పేజీ తిప్పి హెడ్లైన్స్ రాసేందుకు ఉపక్రమించాను.

గులాబీల పరిమళం!

అటుగా
వెళుతూ ఆగిన
ఒక పిల్లగాలి పలుకరింపు తో
ఎర్రబారి,
గులాబీ మొగ్గొకటి
సిగ్గు భారం తో తల దించుకుంది.
పరిమళాల ప్రకాశం వెదజల్లుతూ.

హాయ్!


ప్రేరణ లేదు.
ఇన్నాళ్ళూ యిచ్చిన చెలి
తనతో పాటు దూరంగా తీసుకెళ్ళింది.
ఇప్పుడు నాకు
ప్రేరణను పొందాలనుంది .... కష్టమైనా సరే
ఆ స్పూర్తి కోసం
స్నేహచాలనం చేస్తున్నాను. 
సాధ్యమని .... నీతో!

ప్రేమాలాపన

నీ కళ్ళలో రంగవల్లుల వర్ణాల్ని చూస్తున్నాను.
నీవూ నేనూ, వొకరిలో వొకరం అయి
ఇరు ఆలోచనలు భావనలు వొకటిలా 
బేషరతుగా మనం మమైకం అయినట్లు
"నీదనేదే నాది, నాదనేది లేదు" అన్న
అశరీరవాణి ఆలాపన లా

దూది లా మెత్తగా
తెల్లని మబ్బు లా నీవు.
నీలోకి జారిపోతూ నేను.
ఎన్నో జన్మల కల నిజం అవుతూ
తపస్సు ఫలించిన భావన లా
స్వర్గం అదే అనిపిస్తూ ....

మనసెందుకో తడబడింది.
ఆహ్వానించేందుకు తొలుత
భయం, సందేహం కాలయాపనలనే ఆలోచనే,
నా హృదయద్వారం తెరుచుకుని
గ్రాండ్ గా రక్త తివాచీలు, స్వాగత తోరణాలు
పరిచింది .... నీ కోసం

అవును! అది నేనే! నీవు పొరబడ్డం లేదు.
ఒక ఆకులా నేలను చేరుతూ,
చల్లని గాలిలా మబ్బుల్ని తాకుతూ.
ఒక నక్షత్రం లా భూమిపై రాలుతూ.
ఒక నమ్మకాన్ని, నిన్ను చేరుతూ,
నీలో విలీనమైపోతూ ....

నేనిప్పుడు నీ చిరునవ్వును చూస్తున్నాను.
సున్నితంగా చాచి
అందించిన నీ చేతిని,
మృదువైన నీ స్పర్శను అనుభవిస్తున్నాను.
నీ ప్రేమను శ్వాసిస్తూ ఆస్వాదిస్తున్నాను.
ఈ క్షణాలిలాగే స్తంభించాలని ....

ఇంత సమీపంగా, సన్నిహితంగా
ఎన్నడూ చూడ లేదు నిన్ను. నీ కళ్ళను ....
ఆ మెరుపుల్ని,
ఆ అయస్కాంతం ఆకర్షణా శక్తిని. 
నీవు నిదురించే వేళల్లో నేను కోల్పోయే
ఆ కళ్ళను .... నిన్ను ముద్దాడాలనుంది.

నన్ను నేను కోల్పోయా!

గుండె వేగంగా కొట్టుకుంటూ, 
కాళ్ళలో నిస్సత్తువ  

.... కారణం ఆమే 

నేనామెకు దొరికిపోయా!

ఆ కంటి చూపులో నన్ను కోల్పోయాను. 

నా అస్తిత్వాన్ని కాపాడుకోవాలనిపించడం లేదు.

నేనామె ప్రేమలో పడ్డం వల్లే నేమో ....

Saturday, November 23, 2013

నడివీధుల్లో


సామాజిక మనో భావనల వేడి
ఉద్యమంగా మారి,
నడి వీధి లో
నొప్పి, సాక్ష్యం నర్తిస్తూ ....
కొంగు నడుముకు బిగించి
స్త్రీలు
తమ వాదనల్ని
స్పీకర్ల గొంతుల ద్వారా
బ్రాడ్ కాష్ట్ చేస్తూ,
పురుషులు.
సెంటర్లో వీరంగం చేస్తూ,
యువకులు.
అంతటా ....
మబ్బుల వర్షం కురుస్తూ,
సంబంధం లేని పరిసర జీవాలు.

ఒకరు చెప్పక్కర్లేదు.
ఎవరైనా పసిగట్టొచ్చు.
ఆ పొగలను,
ఆ కాలిన విగత ఆలోచనల
ఆవిర్ల సెగలను,
ప్రాణముండీ ఉద్యమించలేని
ఎన్నో జీవశ్చవాల నిట్టూర్పులను,
వారి మాటల్లో
వారి ప్రతి కదలికలో
రక్తం మరిగి వినిపించే
సైరన్ లు ఏడ్పులు లో
ఉద్యమ దృడసంకల్పాన్ని
పరిసరాలలో
శ్వాస భారం అవ్వడం లో,

ఎన్నో నిరుపయోగం
వ్యర్ధాలు
ఉదాసీనత చోటుచేసుకుని
వాతావరణం లో ....
చైతన్యం లోపించి
అక్కడ,
తలలు ఆలోచించలేవు.
పిచ్చితనం ఆవేశం
నిశ్శబ్దంగా వ్యాపించి,
స్త్రీలు
ఆవేశాన్ని అక్షీకరిస్తూ,
పురుషులు
నాగళ్ళు, కత్తులు,
తుపాకులు పట్టుకుని
యువత
మార్పు వైపు అడుగులేస్తూ,
కాలం తనమానాన తను
కదులుతూనే ఉంది.
ఉద్యమం ముందుకు సాగుతూ ....

ఆర్ద్ర మోహావస్థ


అలసిపోయిన వణుకు లు అవి
నగ్న ప్రవాహాల 
గవాక్షాలు విరిగి
ముగుస్తూ, మునిగిపోతున్న 
చిన్ని అలలు విశ్చిన్న వ్యామోహ చర్యలు   
కీలక వేళల
మునిగిన అరుపుల 
ఆనందాల తడి కాటులు .... అవి. 

Friday, November 22, 2013

నీ దరి చేరాలనుంది

ఓ పిల్లా! ఇటు చూడు! నా మాట విను! 
ఎలా చెప్పాలో తెలియడం లేదు.
నీకు తెలుసు. 
నేనేది చెప్పినా, 
అది నిజమైనా అబద్దమైనా  
గుండె లోంచే చెబుతానని,
నేను తప్పు చేసానన్నది నిజం, 
సమర్ధించుకునేందుకు ప్రయత్నించి 
మానసికంగా నిన్ను దూరం చేసుకున్నాను. 
నిన్ను బాధించాలని మాత్రం కాదు. 
నీ మానసిక క్షోభను అర్ధం చేసుకుని, 
ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను. 
నాకో అవకాశాన్నివ్వవా 
నీ తోడు నాకు కావాలి అని.

నా మూసుకున్న కళ్ళ వెనుక 
ఆశల, కలల బృందావనం లో 
పూచిన పారిజాతం, పరిమళం 
అద్భుతంలా నీవు. 
అక్కడ నీ ముందు ముద్దాయిలా నేను, 
.....
కళ్ళు మూయలేకపోతున్నాను. 
ఓ పిల్లా! నీవూ చూడు .... కళ్ళు మూసుకుని 
ఎక్కడైనా గమనించగలవేమో 
నీ కలల వీధుల్లో నన్ను .... 
నీ ప్రకాశం కోసం పరితపిస్తున్న .... బాటసారిని. 
నిర్దారణగా తెలుసు నాకు. 
దోషిగా నేను నవ్వుతూ నీవూ 
నిన్ను చూడాలనుకున్న ప్రతిసారీ 
కళ్ళు మూసుకుంటే చాలని.

నీవూ నేనూ ఒక్కరుగా కలిసి
స్నేహం, ప్రేమ ద్వేష రాగాలనూ  
ఒకరినొకరం  పంచుకున్నాము. 
ఇద్దరమూ కోరుకున్నదీ, పొందిందీ అదే. 
బేషరతుగా 
నీవు నా తోడువి ఎప్పటికీ అని 
అనుకున్నాను. 
నీ ప్రేమను నీవు బాధ్యత గా పంచాలి అని. 
అహంకారినై తొందరపడ్డాను. 
పరుషాలెన్నో అన్నాను. 
ఇప్పుడు బాధపడుతున్నాను. 
మళ్ళీ మాటకలపాలని చూస్తున్నాను.
కానీ పిల్లా! చిత్రం కాల మహిమ ....
నీవు లేని జీవితం ఊహించలేకపోతున్నాను. 
నాకు నీ అవసరమే గుర్తుకొస్తుంది.

నా మనసు మనసులో లేదు. 
అంతా శున్యం లా ఉంది. 
నీ పక్కనే ఉన్నా నిన్ను కోల్పోయాను. 
అశక్తుడ్ని, అచేతనుడ్ని. 
ఒక్క మాట చెప్పు పిల్లా! 
అన్నీ సరిదిద్దుకుంటాయి అని, 
ఎదురుచూస్తాను కాలాంతంవరకైనా. 
నీ అనురాగం, నీ అమాయకత్వం 
నీ మృదుస్పర్శను కొల్పోయాను. 
ఇప్పుడు కోరుకుంటున్నాను. 
నీవు నన్ను మన్నించాలని 
నన్ను నీ దగ్గరకు చేరనివ్వాలని.

మది శూన్యమై, ఒంటరిగా ఉన్నప్పుడు 
అలసినప్పుడు, ఆలోచనల్లో తలమునకలైనప్పుడు 
నీవే గుర్తుకొస్తుంటావు. 
నీ ప్రేమే గుర్తుకొస్తుంటుంది. 
నిన్ను బాధించాను. నిజమే! 
అబద్దాలు ఆడాను. తెలిసినా నీవు క్షమిస్తావనుకున్నాను. 
ఇప్పుడు నేను మారాను. 
నిజం! ఈ మార్పు మాత్రం అబద్దం కాదు. 
ఓ పిల్లా! నేను నీకు దగ్గర కావాలనుకుంటున్నాను. 
నీ గుండెలో తిరిగి స్థానం పొందాలనుకుంటున్నాను. 
నిన్నను మరిచి నేడు, రేపు లో 
నీతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాను, 
రానియ్యవా నన్ను .... ఓ పిల్లా! నిన్నే!!

Thursday, November 21, 2013

నీ నీడను నేను


కళ్ళు మూసుకోకు!
పోరాడాల్సిన సమయమిది.
భయపడల్సిన భూతం ....
రాక్షసుడు దాక్కున్నాడు.
ఒక రాత్తిరి గడిచి
చీకటి ఎటో పారిపోయింది.
వర్తమానం, ఆత్మబంధువునై
నేను నీ పక్కన ఉన్నాను.

జీవన సంఘర్షణల ఇష్టాలను
వెంట తెచ్చుకోకు.
వాకిట్లోనే పాదరక్షలతో పాటే
కోరికల్నీ వదిలొచ్చెయ్యి.
నిర్మలంగా, నిరాపేక్ష తో
నిద్రకు ఉపక్రమించి చూడు.
ప్రతి నిద్దుర లోనూ
ఎదురొస్తాయి. అందమైన కలలు.

నడి సంద్రం లో దూరంగా
ఈదేందుకు ప్రయత్నించేప్పుడు, 
ఆగి ఆలోచించలేవు.
నిన్ను నీవు సంరక్షించుకోగలవా అని,
అక్కడ రోదించనూ లేవు.
క్షేమంగా జీవన గమ్యం
కనుపించని తీరం
చేరుకోవాలని కోరుకోగలవే కానీ,

సమశ్యల రద్దీ అతిగా వున్న
రహదారిలో నడుస్తున్నప్పుడు,
కష్టాల్ని దాటేప్పుడు ....
ఓ స్నేహం చెయ్యందుకుని కదులు ముందుకు 
నుదుట రాత దానంత అది
జరిగిపోతుందని అలక్ష్యించకుండా,
లక్ష్య సాధనలో రాతను ....
తిరగ రాసుకునేప్పుడు నీ నీడనై నేనుంటాను.


Wednesday, November 20, 2013

పరితాపం


ఉత్సాహం, 
సాహసం, 
నులిపి, లాగిన భావోద్వేగం  
బలవంతపు అగ్ని 
అభిలాష 
ఈ చల్లారని వేదన 

కొద్ది విచారమూ ....!

Tuesday, November 19, 2013

నా మౌనం చాటున


భావోద్వేగాన్ని దాచేసుకుంటున్నాను.
నీ కళ్ళు 
కొట్టుకుంటున్న ఆ కనురెప్పలు, 
నీ మందహాసం 
దాచేసుకున్న ఆ చొట్ట బుగ్గలు
ఊపిరాడనివ్వని  
నీ అస్థిత్వం 
నీ ప్రతి లక్షణం పరిసరాలు నిండి 
ఉక్కిరిబిక్కిరౌతున్నాను.
అందుకే,
దూరంగా ఉండే నిన్ను ప్రేమించాలనుంటుంది. 

Monday, November 18, 2013

ఎప్పటిలానే మరో రోజు

పూల దుస్తుల రెపరెపలు.
గులాబీ పరిమళాల సంభాషణలు.
సగం సగం మింగేసినట్లు 
వినపడీ వినపడని 
అర్ధం అయ్యీ అవ్వని 
అవ్యక్త భావనల 
గుసగుసల సవ్వడులు.  
సముద్రపు గాలికి 
నుదుటి మీద ఆడుకుంటున్న జుట్టు. 
నా కళ్ళు ఇసుక లో కట్టుకున్న గూళ్ళను వెదుకుతూ  
ఏవో గణనసమీకరణ చర్యలు. 
నీ మనసు ను ఆకట్టుకునేలా ఏదో ఒకటి చెయ్యాలి అని,
తపన, ఆలోచన.
దూరం గా నీవే లా .... ఎవరో 
నవ్వుతూ పలుకరించా .... నీ జ్ఞాపకాన్ని 
మరో రోజు గడిచిపోయింది.

Sunday, November 17, 2013

సరేనా?

నా ఊహల రెక్కలు విస్తరించుతున్నా 
నీ, నా ఆశల కోరికల శిఖరాలు 
అధిరోహించాలని. 
నీతో కలిసి ప్రయాణించి
ఆ వికసించిన ప్రకాశం
ప్రేమ నక్షత్రం ను అనుసరించాలని, 
మనం ఇద్దరం ఒక్కరులా ఎగరాలని,
అల్లకల్లోలగా ప్రవహిస్తున్న 
పరిస్థితుల ప్రవాహం కు 
ఎదురీదుతున్న చేపల్లా 
ప్రేమ మందమారుతాల్ని దాటాలని,
హృదయ పారవశ్య పర్వతాల 
అంచుల్ని చేరుకోవాలని, 
అందుకు గానూ ....
మనం మన లోపలి ఊహల ఆశల
పక్షి రాజాల్ని స్వేచ్చగా వొదిలేద్దాం 
రెక్కలు విచ్చుకుని 
గగనానికి ఎగిరి .... ఆ స్వర్గం లో 
కలిసి సహ జీవనాన్ని కొనసాగిద్దాం అని!

పిల్ల గాలులు

సాయంత్రం వేళ 
మబ్బులను తాకి  
మృదువు గా ఈ చల్లని గాలులు
ఊగిసలాడిన వృక్ష శాఖలు 
ఆకుపచ్చని ఆకులు-
అక్కడక్కడా
వెదజల్లబడి
కురిసిన .... వర్షపునీటి బొట్లు 

Saturday, November 16, 2013

ఒక కల కందామా?


నీవు నా కలలో రాణివి. నా మనో సామ్రాజ్ఞివి.
ఒంటరి .... వెన్నెల రాత్రుల్లో కలల రహదారుల్లో 
యౌవ్వన వేళల్లో, నా ఊహల్లో వొక అద్భుత కల్పనవని

నడి రాత్తిరి నిశ్శబ్ద దిగంతాల చాయల్లో 
ఎవరూ గమనించని వేళల్లో నీవూ నేనూ 
ప్రేమ ఆకాశం వైపు జంటగా యెగిరే పర్వతాలమని.

మన ఊహలు, ఆశలుగా పరిణమించిన వేళ 
అన్ని అడ్డంకులు, అవరోధాల్ని దాటి, .... మనం
ఆ నీలివర్ణ ఆకాశం భవితవ్యం వైపు ఎగురుతున్నట్లు

ఒకప్పుడు నేను నీతో, నీవు నాతో చేసుకున్న శపధాలు 
ఎన్నెన్నో సంకల్పాలు, నీ నా జీవనాశయాలు 
గుర్తు తెచ్చుకుని ఒక్కొక్కటిగా చక్కబెట్టుకుంటున్నట్లు 

ఎన్నెన్నో సారహీనమైన నదీనదాల్ని సాగరాల్ని దాటి 
అనంత కీకారణ్యాల .... చీకటి గుబురుల్లో 
అనంతమైన ఏ లోయల్లోనో మునిగి తేలుతున్నట్లు 

మన ముగింపులేని కాలం కథ, .... అందమైన కల
వేలకొద్దీ ఊహల నిట్టూర్పుల గుసగుసల సారాంశం 
ఒక వెన్నెల రాత్రి ఒంటరి ప్రణయ భావన .... కలలా

సహజీవన పరిమళం

లక్ష్మి నన్నే చూస్తుంది. నేనూ లక్ష్మినే చూస్తున్నాను. 
కానీ, చిత్రం! ఎందుకో నవ్వలేకపోతున్నాను.

లక్ష్మీ దగ్గరగా వచ్చింది. 

"ఎలా ఉన్నావు లక్ష్మీ!" అన్నాను.

చిత్రంగా కళ్ళు ఆర్పింది. కొంచెం సిగ్గు కొంచెం బిడియం పరిచి.
"బాగున్నాను. .... నీవు?" అడిగింది ఎలా ఉన్నావు అన్నట్లు.

ఆ నవ్వు ముఖం, ఆ ముఖం పై ఆ ప్రకాశం .... లక్ష్మంటే నాకెంతో ఇష్టం. మంత్రముగ్దుడ్నిలా అలాగే చూస్తుండిపోవాలనిపిస్తుంది. మాటలు రాని స్థితి .... నవ్వలేక మౌనంగా ఉండిపోయాను.

లక్ష్మి నా చెయ్యందుకుంది. 

ఆమె చెయ్యెంతో మృదువుగా ఉంది. మామూలు సమయాల్లో అయితే అది నాకు ఒక మనోహర అనుభవం కానీ అప్పుడు ఆ సున్నితత్వాన్ని ఆస్వాదించే స్థితి లో లేను నేను. 

"నువ్వంటే నాకు చాలా ఇష్టం!" అంది.

"నాకూ నీవంటే ఇష్టం!" అన్నాను. 
యాంత్రికంగా అన్నట్లుంది.

లక్ష్మి చిన్నబోయినట్లుంది. వెళుతున్నా అని అనకుండానే వెళ్ళిపోయింది.

నాకు బాధ అనిపించింది. కానీ .... గుండె మరీ భారం అనిపించలేదు. బహుశ నా బాధ లాంటి బాధే ఎదుటి వారూ పడి నా బాధను అర్ధం చేసుకుంటారు అని అయ్యుండొచ్చు.
నాలో యాంత్రికత ....

లక్ష్మి తో నా పాత జ్ఞాపకాలు తట్టకుండానే నిద్రలేవ సాగాయి. మంచి అమ్మయి. తెలివైన అమ్మాయి. ఎవరినీ నొప్పించని గొప్ప మనస్తత్వం. సమశ్యలకు దూరంగా అందరితోనూ కలిసిపోయి తనను మాత్రమే మార్చుకునే ఔన్నత్యం. 

నాలో కోపం, అమూల్యమైన సంపదను కోల్పోతున్నాననే బాధ. స్థిమితం కుదరడం లేదు.

లక్ష్మి కి ఆ అమెరికా అబ్బాయితో నిశ్చయతాంబూలాలు అన్న నిర్ణయం జీర్ణం కావడం లేదు. లక్ష్మికి అతని కి నిశ్చయ ముహూర్తం మరో యిరవైనాలుగ్గంటల్లో .... 

అన్నీ కోల్పోయి, పూరించలేని వ్యద నన్ను నిలువెల్లా కుదిపేస్తున్నాయి.

మోసపోయాను అనిపించింది. 

కానీ ఎందుకో కళ్ళవెంబడి నీళ్ళు రాలేదు. నేను నిజంగా మోసపోయానా!? లేక నాది కావాలనుకున్నది పొందలేక పోయిన కోపమా? నేననుకున్నట్లు జరగటం లేదని అసూయపడటం భావ్యమా?

ఎందుకు? ఎందుకిలా ఆలోచిస్తున్నాను? ఔనూ లక్ష్మి కూడా నాలా ఆలోచిస్తే? నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

నాలానే లక్ష్మీ కూడా తపిస్తుందేమో!? ఉలిక్కిపడ్డాను. 

లక్ష్మి తపించకూడదు. సంతోషంగా ఉండాలి. ఎక్కడ, ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి. నేను అన్నీ కోల్పోయినవాడ్ని కాదు. లక్ష్మి ఆనందం లోనే నా ఆనందమూ ఉంది. నేను ఆనందంగా కనిపించాలి అనుకోవడం తో .... నా మనసు కుదుటపడింది. లక్ష్మికి వెంటనే మనస్పూర్తిగా శుభాకాంక్షలు చెప్పాలి. లేచి నిలబడ్డాను.

లక్ష్మి ఇప్పుడు నా సమీపం లోనే వుందనే భావన కలగసాగింది. ఆమె అడుగు ముందుకు వెయ్యడం లో నేను అవరోధం కాకూడదు అనే భావనతో. 

నా కళ్ళలో నీరు ఉబికింది. ఇప్పుడు నిజంగానే ఏడుపు వస్తుంది. 

....

వడలిన పువ్వు పరిమళంలా ఒక నవ్వు మొలిచింది నా ముఖాన.

Friday, November 15, 2013

అమర ప్రేమ

ఓ పిల్లా! 
ప్రియం అనే పద అర్ధం 
నా జీవితం లో నీతోనే మొదలయ్యింది. 
నా తొలి ప్రేమ, నా ప్రతి శ్వాస. 
నా ప్రతి అడుగు నీవే అయి.

నా మనసు భావన, ఆవేశం, 
ఆలోచన
నన్నూ, 
నా ప్రేమను 
కేవలం నీతోనే పంచుకోవాలని!

నీ కళ్ళ అద్దంలో .... హుందాగా
కనిపిస్తున్నాను. నాకు నేను. 
నీ అనురాగం,
నా పట్ల నీ శ్రద్ధ, 
నీ మాటల భావనల్ని అర్ధం చేసుకున్నాక,

నిజం పిల్లా! 
మన రెండు హృదయాలు ఒక్కటిగా కొట్టుకోవడం 
మన జీవితాల సమాగమం, 
సంగమం 
మొదలయ్యింది ఇప్పుడే .... 

నిజం చెబుతున్నాను.
నీ మనోజ్ఞతను, 
నిన్నూ, దూరం చేసుకోలేని అశక్తుడ్ని. 
ఎప్పుడూ నా బాహువుల్లోనే 
పొదివి .... దాచుకోవాలనిపిస్తుంటుంది. 

ఓ మృధు మధుర మంజుల రూపమా 
నీవే 
ఈ జన్మలోనూ, 
మరుజన్మలోనూ, ఏ జన్మలోనూ 
నా ప్రియ భావనవు, ప్రేమదేవతవు. 

నమ్మకంగా చెప్పగలను. 
నీ కోసం, నీ ప్రేమ కోసం నేను, 
పిచ్చివాడ్ని అయ్యేందుకు వెనుకాడనని
అది నీవు కనుక, 
నీవు .... నా ప్రపంచం కనుక. 

తెలుసా నీకు .... ఓ పిల్లా? 
ఈ అమర ప్రేమ .... 
మన మధ్యే అని 
నా మది సాగర మధనం లో 
ఆవిర్భవించిన అమృతానివి నీవని. 

నాకు తెలుసని నీకు తెలుసు.
నా ఎదలోనే నీవున్నావు అని. 
నీ కోసం సర్వం కోల్పోయేందుకు సిద్ధపడి 
నీ చుట్టూ నేను 
సంరక్షణ వలయం గీస్తున్నానని .... !

Thursday, November 14, 2013

నేడు వడలిపోయి

నిన్నటి,
పువ్వులం నవ్వులం ....
కేరింతల ఉడుకు ఉత్సాహం
ప్రేమోత్సవాల జీవితం ....
మనది
ప్రతిదీ
ఒక అందమైన కలే!

నేడు,
ప్రేమ పంచుకుంటున్నాము.
స్వేదం, కన్నీళ్ళు కారుస్తున్నాము.
ప్రేమ తగ్గి కాదు.
కానీ
ఎంతో అంతరం ఉంది.
నిన్నటి, నేటి ప్రేమల మధ్య
ఒక వాస్తవం, ఒక కల మధ్య లా ....

ఈ రోజూ కల కంటున్నాము
కానీ కన్నీళ్ళ తో
ఎండిపోయిన కళ్ళు
రాని కన్నీరు
మింగుడుపడని బాధ
అది నిన్నటి
ప్రేమ, ఉల్లసం, కలలా కాదు.

పువ్వుతేనె

నవ్వు పువ్వులు పూసాయని, 
తొందరపడి ....
ఒక సీతాకోకచిలుక 
అత్తరు నవ్వులు అలంకరించుకుని, 
రంగుపూలపై వాలింది. 
పూతేనియ, ప్రేమా వొక్కటే అనుకుని!

ఎంత లోతు ప్రేమో ....

ఒకేలా .... 
ఆదరణ, గౌరవం పెంచుకుని 
ఒక్కరుగా చుట్టేసుకుని 
మనం 
ఇరు హృదయ సమరాగం
కొనసాగుతూ .... 
ఆ అనురాగం, ఆ వెచ్చదనం 
ఎంత లోతైన వాత్సల్యమో, 
ప్రేమో, ఒకప్పుడు మన మధ్య.

Wednesday, November 13, 2013

నీడలు

సిద్ధం గా ఉన్నట్లు .... ఎప్పుడూ 
నీడలు
నిన్నూ నన్నూ అనుసరిస్తూ 
ఒంటరిగా ఉన్నప్పుడు ....
ఒక ధ్వని, 
రెండు శ్వాసలు, 
గాలి నిస్సార దారాలు. 
చుట్టూ తిరుగుతున్నట్లు .... 
నీడెప్పుడూ స్థిరం
తోడూ అనుకోలేము. అది వొక
వింత అద్భుత ఆకారం  
అస్తిత్వాల్ని విధి ముందుకు తోస్తూ,

చీకటి తో స్నేహం!

చీకటిని చూసి భయపడను. 
స్వాగతిస్తాను. 
ఒక స్నేహితుడిలా 
ఒక భగ్న ప్రేమికుడి లా 
ఒక పసి బాలుడి లా 
తోబుట్టువులు లేని ఒక సహోధరుడి లా 
స్నేహం కోల్పోలేని ఒక సామాన్యుడిలా 
చీకటి స్నేహమే నాకు సర్వస్వం అయినట్లు, 
అది లేని నేను 
మరణానికి చేరువౌతున్నట్లుగా 
స్నేహిస్తాను. చీకటిని స్వాగతిస్తాను.  

Tuesday, November 12, 2013

గతం


నిన్న, ను
హతమార్చిన
విజయోత్సాహం
ఉదయం
చదువుతుంది.
వార్తాపత్రిక
కొంచెం కొంచెంగా
తాగుతూ
వేడి వేడి కాఫీ ....

పొడినవ్వు

ఆ ముఖాన చిరునవ్వు పూసుకునుంటే
"బాగున్నావు!" అని, అనుకోలేను. 
కొన్నిసార్లు ....
దాని అర్ధం 
ధైర్యంగా భింకంగా 
ఉండేందుకు చేసే ప్రయత్నమేమో అని 

Monday, November 11, 2013

ఓ కవయిత్రీ?

నాతో వస్తావా!
కలిసి నడుస్తావా?
అడుగులో అడుగేసి
చీకటి రహదారిలో
నక్షత్రాల కప్పు .... ఆకాశం కింద
నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ,
ముందుకు, ఇంకా ముందుకు
నడుస్తూ,
నాలా నీవూ నిశ్శబ్దం గా ....,
సన్నని ఆ వెలుగు కిరణాల 
దారాలు ఏరుకుని
ఊహాక్షరాల మాలలు అల్లుకుని,
చూస్తున్నావా!?
మన తల పై ....
ఆ నక్షత్రాలతో నిండిన
చిక్కని చీకటి ఆకాశాన్ని.
ఆ నక్షత్రాలు ఒకదానితో ఒకటి
ఘర్షణ పడనంతవరకూ
నిశ్శబ్దం గా,
గాలి గుసగుసలు వింటూ,
భయం వేస్తే
చాదస్త, చపలత్వ శ్లోకాలను
లోలోన పటనం చేసుకుంటూ,
కలలు, ఊహలు, అద్భుతాల భావాలు
ప్రణయ గీతికలుగా రాసుకుంటూ ....,
ఆ రహశ్యం నీవూ తెలుసుకుని,
గొప్ప పేరు తెచ్చుకుందువు గానీ
నాతో వస్తావా .... ఓ పిల్లా?
అన్నట్లు,
నీకు నామకరణం చేస్తున్నాను.
"అగ్ని పుష్పం" నీ కలం పేరు.
నాతో వస్తావా?
కలిసి నడుస్తావా .... ఓ కవయిత్రీ?

Sunday, November 10, 2013

అంతా బూడిదమయం అవుతూ

నిశ్శబ్దం రంగులు .... 
నర్తిస్తూ, 
ఛాయలు మాదిరిగా మారి
నీరు కలిసిన రంగుల చిత్ర పటంలో లా 
సూర్యరశ్మి .... పలుచనౌతుంది.
ఓ నేస్తమా నువ్వెక్కడ?
దయాళుత్వం కనుమరుగయ్యిందో, 
విశ్వాసం జారిపోయిందో, 
రెక్కలు మరిచిన దేవకన్య ....
ఒక నక్షత్రం లా నేలదిగినట్లు 
నా ప్రియ సాహచర్యమా నువ్వెక్కడ?

అధోగతి

అవి నిశ్చల, వినోదాత్మక ఆలోచనలా?
సున్నితంగా తగిలిన సమ్మెట దెబ్బలా? 
ముమ్మాటికీ, అవి
అతి స్పష్ట బుద్ధిహీన చర్యలే!
నిన్నటి, 
సంక్లిష్టతతో కూడిన ....
మన ఆకశ్మిక సరళీకృత విధానాలు
వాటి అత్యుత్సాహ ప్రచారం, 
అవగాహనారాహిత్యం ఏకమై
ఊహించని విధంగా ....
ఒక వినూత్న, సృజనాత్మక వైరస్‌ సోకి 
అర్ధ వ్యవస్థ అధోగతి పాలై .... 
అయోమయమే ఏ వైపు చూసినా.

నిన్నే ప్రియా!


ఒకవేళ నన్ను నేను పోగొట్టుకుంటే ....?   

నువ్వక్కడే వుంటావా?
నన్ను నాకు తిరిగి ఇవ్వడానికి. 

అప్పుడు అలాగే ఇచ్చావు, గుర్తుందా!?

Saturday, November 9, 2013

అందమైన ఆవేశం, కల

ఉత్సాహభరితం గా .... 
ఆ తారలు, నక్షత్రాలు కలిసి 
ఒక అసంబద్ధ 
నిబంధ సంగీతాన్ని 
తంబుర, వీణ, శితార లతో .... 
అప్పుడు,
హిమవన్నఘాలకు ప్రాణం వచ్చి 
.............
ఆనందం, పారవశ్యం తో ప్రకృతీ, 
పారిజాతాలూ సకల పుష్పాలూ వొంగి 
పర్వతరాజుకు ప్రణమిల్లి 
ఉదయాన్నే
ఆ సూర్య కిరణ వీక్షణాలకు 
కరిగిపోయి .... ఆ కారు మబ్బులు 
వర్షించిన క్షణాలు .... ఇంకా 
నా కల, తెల్లారలేదు .... భయ పడి.

Friday, November 8, 2013

వీడ్కోలు చెప్పాలని లేదు

కొట్టుకుంటూ వున్న 
ఆ కనురెప్పల టపటపలు
వారి ముఖాల పై 
నర్తించే చిరునవ్వు 
అప్పుడే
విడిపోవాల్సొచ్చిందే అనే

నమ్మకం తో


నీతోనే ఉన్నాను. 
నీ చుట్టూ పరిభ్రమిస్తూ,
ఒదిలి వెళ్ళే సాహసం చెయ్యలేక  
కొన్నిసార్లు జారిపోతూ ఉంటాను ....
నీ అధీనత భావనల్లో ఉన్నప్పుడు, 
అదుపుతప్పి, 
గట్టిగా పట్టుకుని ఉంటావని నమ్మకం తో 
నేను నీతోనే ఉన్నాను పిల్లా!

ఈలాంటి ఒక్క క్షణం కోసం


నా ఉద్దేశ్యం, భావం ఇదీ అని 
నేను నీకు చెప్పలేదు.
నీవు నమ్ముతావో లేదో అని
నిజంగా అంగీకరించేదానివేనా?
లేక అర్ధం లేని పదాలతో 
అనుకూల అర్ధాలు అల్లుకుని, 
అపరిచితను పలుకరిస్తున్నాడు.
వెర్రి మనిషి అనుకుంటున్నావా! 
నీవూ, నేనూ ఎప్పుడో, ఎక్కడో కలిసామనే 
ఒక ప్రియభావన నాది, 
ఎక్కడో ఎప్పుడో చూసినట్లుంటుంది 
అందుకే, "నా ప్రియురాలొచ్చింది" ఇప్పుడు 
అని నాలో నేను అన్నాను .... నీతో.

ఇలాంటి, ఒక్క క్షణం కోసం 
కొంతమంది ఒక జీవిత కాలం 
వేచి చూస్తూ ఉంటారు. 
ఇలాంటి, ఒక సాంగత్యం కోసం 
కొంతమంది శాశ్వత అన్వేషణ చేస్తూ
అనిర్వచనీయమైన అనుబంధం, 
విలక్షణము, ఒక ప్రత్యేకమైన 
సాన్నిహిత్యం ముద్దు కోసం .... 
తపస్సులు చేస్తుంటారు.
ఓహ్! నేను నమ్మలేకపోతున్నాను. 
నిజంగా నిజమేనా ఇదీ అని. 
కానీ, పొందగలుగుతున్నాను. 
ఎందరో వ్యక్తులు .... జీవితకాలం 
వేచి, వెదుక్కునే క్షణం 
నీ సాహచర్యం నా ముందుందీ క్షణం.

మూలాలతో పాటు అన్నీ మారుతున్నాయి. 
కానీ సహధర్మం, ప్రేమ 
సాంగత్యం అందం అలానే ఉన్నాయి. 
అది ఎంతో లేతగా, సున్నితంగా 
పసి మృదుత్వం లా
అక్షరాలు, పదాల్లో వివరించలేను. 
నేను కలల్లో కంటుంటాను. 
ఇప్పుడూ కలే అనుకుంటున్నావేమో ....  
కాదు. నేను మెలుకువగా ఉన్నాను. 
నా కలను నిజం గా, ఎప్పటికీ లా 
మార్చుకోవాలని అనుకుంటున్నాను. 
నీ తోడుంటే ఏదైనా సాధ్యమే! 
జీవన భాగస్వామ్యం లో ప్రేమను కాపాడి, 
పెంచి పోషించి, వర్ధిల్ల చెయ్యగలం మనం.

మనం మన బంధాన్ని
గొప్ప ప్రేమ బంధంగా మలచుకోగలము. 
నీవు తడబడి ఎప్పుడైనా త్రుళ్ళుతున్నప్పుడు  
పడకుండా నేను నా చెయ్యడ్డువేస్తాను. 
నేను ఎప్పుడైనా తొందరపడి 
అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు  
నీవు నన్ను బుజ్జగిస్తూ ఉంటావు.
మరోసారి చెబుతున్నా నీతో .... పిల్లా! 
ఎందరో ఇలాంటి క్షణం కోసం 
ఒక జీవితకాలం ఎదురు చూస్తుంటారు. 
అన్వేషిస్తుంటారు. ఇంకెందరో ఈ క్షణం, 
ఈ సాంగత్యం, అనుభవం కోసమే శ్వాసిస్తుంటారు.

స్వాగతం!

చిక్కటి, రాత్రి చీకటి లోకి 
ఉండిపోయేందుకు ఆహ్వానిస్తున్నా నా గుండెలోకి  
ఔనూ ఆమె ఎలా ఉంటుంది? 
నిజంగా అంత విశాలంగా ఉందా నా గుండె గది!?  
ఉన్నతంగా, ఒదిగుండగలిగే అవకాశం ఉందో లేదో ....
అక్కడ చీకటిమయం అంతా .... పిచ్చి ఆలోచనల్లా, 
అయోమయం మబ్బులే ఎటుచూసినా ....
ఎలా చూడగలరు? ఎవరైనా, 
నేనే చూడలేని నిజాన్ని .... నన్నును నాలో.

Thursday, November 7, 2013

అమ్మవో ప్రేయసివో .... ?

నేను 
పడిపోతున్నప్పుడు 
నీవు తడబడి పొరపాట్లు చేస్తుంటావు. 

నేను 
విచ్ఛిన్నం అయినప్పుడు 
నీవు పొడి అవుతూ కొంచెం కొంచెంగా రాలుతుంటావు. 

ఏదైనా 
నన్ను బాధిస్తూ ఉంటే 
నీవు ప్రాణమే పోయినట్లు విలవిల్లాడిపోతుంటావు.

మరి, 
నేను కిందికి జారిపోతున్నప్పుడు 
నలిగిపోతున్నప్పుడు ఏమి చెయ్యాలి?

నీకు 
ఆ సమస్యను, ప్రతిక్రియను 
తెలీకుండా నేనే సరిదిద్దుకోవాలి.

నీవో ప్రేమలేఖ రాస్తే ....

నీ పద మనోభావనలను
చదువుతూనే
నా ఊపిరి ఆగిపోయేలా
ఒక లేఖను
నీ అంత అందంగా
అక్షరాలు అద్ది
నీవో ప్రేమలేఖ రాస్తే ....

అది చదివినప్పుడు
ఆ అక్షరాల కత్తులు
నన్ను నిలువునా చీల్చేసి
నాలోని,
నా ప్రపంచపు రహశ్యాలన్నీ
వాటంటవే తుళ్ళిపడి
...............
ప్రకృతి సర్వం
నన్నే అసూయగా చూస్తే ....

ఔనూ!
అలాంటి లేఖను
నాకే అని అనుకోగలనా ....
ఎంత నీవు ఎంత ప్రేమగా రాసినా?

Wednesday, November 6, 2013

నా ప్రతి కదలిక కారణం నీవు

నా కళ్ళలోకి చూడు.
నా భావన,
నా ఉద్దేశ్యం లో ....
నీ స్థానం ఏమిటో
నీకు అర్ధం అవుతుంది.
పిదప
నీ గుండెలో,
నీ ఆత్మలో వెదికి చూడు
అక్కడ నేనున్నానేమో అని,
దొంగను నేను
అక్కడ దొరికిపోతాను.

నాతో చెప్పాలని
నన్ను మార్చాలని చూడకు.
ప్రయోజనము ఉండదు.
ఏ ప్రయోజనమూ ఉండదని
నీవు చెప్పలేవు.
నాకు ఏది ప్రాణాధికమో?
నీకు తెలుసు!
నా నడవడి ....
నా ప్రతి అడుగులోనూ
ఆ చైతన్యం
ఆ కదలిక నీవే అని.

నీ గుండెలోకి చూసుకో
నీవూ గమనిస్తావు.
అక్కడ,
ఎలాంటి రహశ్యం లేదు.
ప్రశాంతంగా ఉన్నాను.
నన్ను నన్ను గా
ఉన్నట్లే చూడు!
నన్ను గుర్తించు!
నాదీ అనే ప్రతిదీ ఇచ్చేస్తా అని
ఒట్టేసి చెబుతున్నా!
నన్ను నేను సమర్పించుకుంటాను.

నీ ప్రేమ ను మించిన
ప్రేమను నేనెరుగను.
ఉందని అనుకోను.
ఔనూ!
మరింతగా,
నీ ప్రేమను పొందగలనా అని
శోధించాలి అనుకుంటున్నాను.
అన్ని వేళల్లోనూ,
అన్ని పద్ధతుల్లోనూ,
ప్రేమించాలనుకుంటున్నాను.
నీతో ఉండాలనుకుంటున్నాను.

నాకు మళ్ళీ మళ్ళీ చెప్పాలని చూడకు.
ప్రయోజనం ఉండదని,
నిర్ణయించేసుకున్నాను.
నిన్ను మించి నాకింకేమీ అక్కర్లేదు.
నీ కోసం పోరాడతాను.
నీ కోసం అబద్దాలాడతాను.
నీ కోసం సర్కస్ లు చేస్తాను.
నీ కోసం మరణిస్తాను.
నిజం చెబుతున్నాను .... పిల్లా!
నా ప్రతి అడుగులో
ప్రతి కదలిక, నీ అబిమతం
నీవు భాగం కావడం నా ఇష్టం!


Tuesday, November 5, 2013

పరుగుపందెం


పడిపోతానేమో అని
భయపడకు.
తొలి అడుగుల పసివయసు లో,
సాహసము,
ప్రయత్నమే ఊపిరి.
జీవితం పరుగు పందెం లో,

Monday, November 4, 2013

ఉబలాటం

కొన్ని జీవితాలు ....

సొగసుగా, 
నాణ్యంగా, 
విలక్షణంగా కత్తిరించిబడి 

మరి కొన్ని మాత్రం  

యెండి, 
వట్టిపోయి, 
శుష్కించి పోయి ....

ఒకే ప్రపంచం లో భిన్న జీవ సరళులు.

నీ ప్రపంచం లో నీవు, 
నా ప్రపంచంలో నేను. 

ఒక్క రోజైనా,  

ప్రత్యేక ప్రపంచాలు లేని 
పేనిన దారాలం .... మనమై  
ఏక దృష్టితో .... 
రెండు గళాల ఏకరాగాలమై,  
జీవన గాంధర్వం ఆలపించి .... 
ఆనందించాలని .... ఉబలాటం.

ఆ రోజు వస్తుందా అనే. 

మనం!

నేను, నీవు ....
కవితల్లో కూడా 
వేరు వేరు పదాలం అయి 
వ్యవధి, ఖాళీ .... ఆ పదాల మధ్య 
.... అవసరమా!

నీవు

జీవితం ఒక పాట అయితే,
నా పాటకు పల్లవి వి
లేదా 
కనీసం 
ఎదురొచ్చే చిరునవ్వు వి .... నీవు.

తోడు


దయచేసి నన్ను గమనించు.
తెలియని దూరాలు నడిచి వెళుతున్నప్పుడు, 
నన్ను నేను కోల్పోయే ప్రమాదం ఉంది.
తిరిగొచ్చే మార్గం మరిచిపోయి ....
అందుకే, 
నీడవై నా తోడు రా!  
నన్ను తిరిగి నా గూటికి చేర్చేందుకు. 

ఓ సహచరీ!

ఓ సహచరీ, 
ఓ ప్రియా!
నా కోరిక 
నిన్ను 
నా భాగస్వామిని గా  
చేసుకోవాలని.

ఆ కొండ శిఖరాల 
అంచుల మీద నిలబడి ....
"ఓ చెలీ, నిన్నే ప్రేమిస్తున్నా!" అని, 
నా హృదయపు లోతుల్లోంచి,
గొంతెత్తి అరవాలని ....
ఆశ పడుతున్నాను. 

నా మనసు పడే ఈ ఆరాటం, 
ఈ పోరాటం, 
ఈ సమశ్యలన్నింటినీ 
దాటి, జీవన సాగరాన్ని 
ఈదేందుకు నీ సాహచర్యం 
తోడును అభిలషిస్తున్నాను.  

నీకు నిజంగా,
నా వ్యక్తిత్వం, నా సాహచర్యం పై 
నమ్మకమే ఉంటే ....
నా నువ్వని 
నిన్ను నీవు అనుకుంటే, 
నా చెయ్యందుకునేందుకు ముందుకు రా!
  
నా ఒక్కడి ఆశ, ఆలోచన 
ఉద్దేశ్యం మాత్రమే సరిపోదు.
ఈ సమాజం, నన్నూ నిన్నూ లను 
ఒక్కటి చెయ్యలేదు.
అది ఒక్క నీకూ, నాకే సాధ్యం  
నీవూ, నేనూ నిర్ణయించుకునే భవితవ్యం కనుక. 

ఓ మహిళా నీకు జోహార్లు!


పరిమాణం లో గుప్పెడంతే 
నీ గుండె ....
కానీ, 
అల్లకల్లోల సమయాల్లో, 
అస్తవ్యస్తం కాని 
ధైర్యం మనోబలం 
నీ కళ్ళలో చూస్తున్నాను.

ఏదీ సవ్యంగా జరగక, 
ఒడిదుడుకుల మయ జీవితం లో
ప్రతిదీ ప్రతికూలం అయి,
నీదీ అనుకున్న అన్నింటినీ
కాలం నీనుంచి లాక్కుని 
త్యజించాల్సొచ్చి
తలొంచుకోవాల్సొచ్చిన క్షణాల్లో 
నీలో ....
సానుకూలతను చూస్తున్నాను.

నీ భావనల్లో ఎనలేని 
ఆ నమ్మకం
నిన్ను నీవు కోల్పోతావేమో 
అనిపించిన సమయాల్లో,  
నీ పాత్ర పోషణలొ 
చూపించే ఉదాత్తతను, 
నీ వ్యక్తిత్వాన్నీ .... 
ఎంతో సరళంగా పోషిస్తుండటాన్ని ....
చూస్తూ ఉన్నాను.

ఎప్పుడూ చెదరని 
ఆ చిరునవ్వు 
రవ్వంతైనా సడలని 
ఆ ఆత్మస్తైర్యం, 
ఓ మహిళా! 
నీ గుండె ధైర్యానికి జోహార్లు!

Sunday, November 3, 2013

అసమర్ధుడి అపజయం

ఇప్పటికీ నేను అశక్తుడ్నే. ఏమీ చెయ్యలేను. 
ఉరుముల్లా రాలుతూ ఉన్న ఇల్లాలి కళ్ళలో నీళ్ళు 
పిల్లల కళ్ళలోకి సూటిగా చూడలేక 
ఖాళీ గిన్నెలో కి  నిశ్చేష్టుడ్నై చూస్తున్నాను.
నాకు పైరవీలు చెయ్యడం రాదు. 
మధ్యవర్తినై బేరసారా లాడ లేను. 
అడుక్కోవడం రాదు. దొంగిలించే నైపుణ్యమూ లేదు. 
చిల్లు జేబులు చేసిన అప్పులతో అడుగు బయట పెట్టలేను. 
నులకమంచం మీద శల్యావస్థ లో అనారోగ్యం .... నా కూతురు 
వైద్యం చేయించలేను. రోగాన్ని పారద్రోల లేను. 
పసిదాని ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే,
చూస్తూ అల్లల్లాడటం మినహాయించి. 
చెయ్యగలిగిన దారి ఏదీ కనిపించడం లేదు. 
ఆకలి, నిస్సహాయత నన్నూ, నా సంసారాన్నీ ఆవహించి 
ఏమీ చెయ్యలేని, ఈ అసమర్ధ జీవితాన్ని అసహ్యించుకుంటున్నాను తప్ప.





Saturday, November 2, 2013

సచేతనత్వం

నా చెవిలో 
ఈ తృప్తినిండిన నిట్టూర్పు 
నీ వెచ్చని శ్వాసతో చుట్టబడిన  
వెచ్చదనం ఊపిరులు.
-----
నీ గుండె 
వేగంగా 
నాలో కొట్టుకుంటుంది. 
.........
మనం 
లోతైన ప్రణయపు 
వలత్రాళ్లలో చిక్కుకుపోయి 
కదలలేక 
ప్రేమ యొక్క 
సర్వోత్కృష్ట సారంలో 
చలికాచుకొంటున్నట్లు,

ఆకలి

పొయ్యి వైపు చూసాను. 
పిల్లి పడుకుని ఉంది.
జేబులో చూసాను. 
జేబు చిరిగిపోయి ఉంది.  
గోడమీద చూసాను. 
నీ నవ్వు ముఖం 
కడుపో గుండో తెలియదు .... కానీ, 
నిండి, సంతృప్తి గా ఉంది.

అయితే ....

నేను, ప్రకృతిని స్పృశిస్తున్నాను.
మట్టి వాసన ను ఇష్టపడుతున్నాను.
ఎవరో ఆ నక్షత్రాలు
గ్రహాల్ని తాకుతున్నారని తెలిసీ
ఈ వాస్తవ,
ఊహా జగత్తు లో
నిన్ను లో నన్ను కలుపుకుంటున్నాను.
నా (జగత్‌) వ్యవస్థవు
నీ సమక్షంలో
చాలా చిన్నవాడ్ని
నీ గురించి నేను తెలుసుకుంది ఏమీ లేదు
అయినా
ఒక్కటి మాత్రం నిజం
దూళితో సహా నిన్ను ఆస్వాదిస్తూ
నీ ఒడిలో నిద్దురపోతున్నాను.
ప్రేమ వృక్షాన్నై మొలకెత్తాలని.







ఎలా????

ప్రేమమయ
జీవనం కావాలి!
నిజమే ....?
రేపటి జ్ఞాపకం
ప్రేమ జీవసరళ
శాశ్వత అమరత్వం
లక్ష్యం గానా!?
లేక,
బదులుగా
ఒక ఒంటరి జీవితంలో
అనేక అమరత్వాల
భాగస్వామ్యం
సమాజం లక్ష్యం గానా!?
ఎలా????

జిహ్వ


జిహ్వేంద్రియాలను చుట్టుకుని 
వికసించిన వ్యసనం 
వెక్కిరింత పదాలు 
తాండవం ఆడుతున్న 
చాడీలు 
గుసగుసల శ్వాసలు ....
బతిమాలుకుని నేను
పొందిన బహుమతి .... మెల్లని నీ మూలుగు

Friday, November 1, 2013

మనం ఒక్కటైతే


నీవూ నేనూ 
ఈ సమాజం పట్టించుకోని 
ఒంటరి పక్షులం! 
.................
ఒంటరులం గానే కలిసుంటే? 
అటు చూడు! 
సంధ్యారాగం స్వాగతిస్తుంది. 
మరో పక్కన 
చీకటి .... 
దారిద్ర్యం ఆకలి, చాపక్రిందనీరులా 
లోకాన్ని చిక్కగా 
అలుముకునే లక్ష్యం తో 
.............
నా బాధను నీవు 
నీ బాధను నేనూ 
ఉపశమన వ్యాఖ్యలతో 
చల్లార్చుకుంటే బాగుంటుందనిపిస్తుంది.
ఆ ఆకాశం వైపు చూడు. 
ఎలా మబ్బులు కమ్ముతుందో ....
మనం ఒంటరులం అని కాబోలు. 
...............
నాకు నమ్మకం ఉంది. 
వాతావరణంలో మార్పొస్తుందని 
మన ఒంటరి 
బాధాతప్త హృదయాలు 
ఒక్కటైతే 
దౌర్భాగ్యం, దీనస్థితి 
వేడుక గా మారుతుందనిపిస్తుంది. 
ప్రకృతి తిరిగి పరవశిస్తుందనిపిస్తుంది.

బృందావనమదిగో

అరవిరిసిన అందం 
నాకు తెలిసిన బృందావనమదిగో 
నాతో వస్తావా పిల్లా!  
అక్కడ, 
పువ్వుల పరువాలు పరమళిస్తాయి. 
ఇంద్రధనస్సులు దాక్కుంటాయి. 
వర్షించని 
మబ్బుల గొడుగులు 
విస్తరించుకునే ఉంటాయి .... ఎప్పుడూ, 
నాతో వస్తావా పిల్లా! ....
నిన్నూ, నీ ప్రపంచాన్నీ వదిలి, 
చెయ్యీ చెయ్యీ కలిపి ....
వడపోసిన 
సూర్యుని కిరణాల్లో తడుస్తానికి. 
కాలాంతంవరకూ కలిసి నడుస్తానికి. 
ఒకరికి వొకరమై 
ఊహల, ఊసుల గుసగుసలాడటానికి. 
ప్రియ భావనలతో పరామర్శించుకోవడానికి. 
కలిసి కలలు కనడానికి.
ఉల్లాస, ఉద్వేగ రాగాల ....
నవ్వులు ఒకరిపై వొకరం గుమ్మరించుకోవడానికి. 

కష్టపడుతున్నా!

కాస్త ఎదిగాననుకుంటున్నాను. 
ఒకప్పటి 
ఘనీభవించిన స్తబ్దత 
స్వీయ విధ్వంసం స్థితి నుండి 
పునర్నిర్మాణ లక్ష్యం వైపు 

ఇప్పుడు ....
నన్ను నేను మేలుకొలుపుకుంటున్నాను. 
నిన్నటి నిరాశ, నిస్పృహల 
అసమర్ధ బద్దకపు ఆలోచనల  
నిద్రావస్థ నుండి చేతనావస్థ లోకి

కష్టపడి 
ఇన్నాళ్ళూ కూడబెట్టుకున్న దాచుకునున్న 
చీకటి అవ లక్షణాల్ని
బలహీనతల్ని అధిగమించేందుకు 
శ్రమిస్తూ .... నేను ఎదిగాననే అనుకుంటున్నాను.