Saturday, November 16, 2013

సహజీవన పరిమళం

లక్ష్మి నన్నే చూస్తుంది. నేనూ లక్ష్మినే చూస్తున్నాను. 
కానీ, చిత్రం! ఎందుకో నవ్వలేకపోతున్నాను.

లక్ష్మీ దగ్గరగా వచ్చింది. 

"ఎలా ఉన్నావు లక్ష్మీ!" అన్నాను.

చిత్రంగా కళ్ళు ఆర్పింది. కొంచెం సిగ్గు కొంచెం బిడియం పరిచి.
"బాగున్నాను. .... నీవు?" అడిగింది ఎలా ఉన్నావు అన్నట్లు.

ఆ నవ్వు ముఖం, ఆ ముఖం పై ఆ ప్రకాశం .... లక్ష్మంటే నాకెంతో ఇష్టం. మంత్రముగ్దుడ్నిలా అలాగే చూస్తుండిపోవాలనిపిస్తుంది. మాటలు రాని స్థితి .... నవ్వలేక మౌనంగా ఉండిపోయాను.

లక్ష్మి నా చెయ్యందుకుంది. 

ఆమె చెయ్యెంతో మృదువుగా ఉంది. మామూలు సమయాల్లో అయితే అది నాకు ఒక మనోహర అనుభవం కానీ అప్పుడు ఆ సున్నితత్వాన్ని ఆస్వాదించే స్థితి లో లేను నేను. 

"నువ్వంటే నాకు చాలా ఇష్టం!" అంది.

"నాకూ నీవంటే ఇష్టం!" అన్నాను. 
యాంత్రికంగా అన్నట్లుంది.

లక్ష్మి చిన్నబోయినట్లుంది. వెళుతున్నా అని అనకుండానే వెళ్ళిపోయింది.

నాకు బాధ అనిపించింది. కానీ .... గుండె మరీ భారం అనిపించలేదు. బహుశ నా బాధ లాంటి బాధే ఎదుటి వారూ పడి నా బాధను అర్ధం చేసుకుంటారు అని అయ్యుండొచ్చు.
నాలో యాంత్రికత ....

లక్ష్మి తో నా పాత జ్ఞాపకాలు తట్టకుండానే నిద్రలేవ సాగాయి. మంచి అమ్మయి. తెలివైన అమ్మాయి. ఎవరినీ నొప్పించని గొప్ప మనస్తత్వం. సమశ్యలకు దూరంగా అందరితోనూ కలిసిపోయి తనను మాత్రమే మార్చుకునే ఔన్నత్యం. 

నాలో కోపం, అమూల్యమైన సంపదను కోల్పోతున్నాననే బాధ. స్థిమితం కుదరడం లేదు.

లక్ష్మి కి ఆ అమెరికా అబ్బాయితో నిశ్చయతాంబూలాలు అన్న నిర్ణయం జీర్ణం కావడం లేదు. లక్ష్మికి అతని కి నిశ్చయ ముహూర్తం మరో యిరవైనాలుగ్గంటల్లో .... 

అన్నీ కోల్పోయి, పూరించలేని వ్యద నన్ను నిలువెల్లా కుదిపేస్తున్నాయి.

మోసపోయాను అనిపించింది. 

కానీ ఎందుకో కళ్ళవెంబడి నీళ్ళు రాలేదు. నేను నిజంగా మోసపోయానా!? లేక నాది కావాలనుకున్నది పొందలేక పోయిన కోపమా? నేననుకున్నట్లు జరగటం లేదని అసూయపడటం భావ్యమా?

ఎందుకు? ఎందుకిలా ఆలోచిస్తున్నాను? ఔనూ లక్ష్మి కూడా నాలా ఆలోచిస్తే? నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

నాలానే లక్ష్మీ కూడా తపిస్తుందేమో!? ఉలిక్కిపడ్డాను. 

లక్ష్మి తపించకూడదు. సంతోషంగా ఉండాలి. ఎక్కడ, ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి. నేను అన్నీ కోల్పోయినవాడ్ని కాదు. లక్ష్మి ఆనందం లోనే నా ఆనందమూ ఉంది. నేను ఆనందంగా కనిపించాలి అనుకోవడం తో .... నా మనసు కుదుటపడింది. లక్ష్మికి వెంటనే మనస్పూర్తిగా శుభాకాంక్షలు చెప్పాలి. లేచి నిలబడ్డాను.

లక్ష్మి ఇప్పుడు నా సమీపం లోనే వుందనే భావన కలగసాగింది. ఆమె అడుగు ముందుకు వెయ్యడం లో నేను అవరోధం కాకూడదు అనే భావనతో. 

నా కళ్ళలో నీరు ఉబికింది. ఇప్పుడు నిజంగానే ఏడుపు వస్తుంది. 

....

వడలిన పువ్వు పరిమళంలా ఒక నవ్వు మొలిచింది నా ముఖాన.

2 comments:

  1. సర్, ఈ చిన్ని కథ ఓ జీవితానికి సరిపడా దీవెనని ఇస్తుంది,
    ప్రతి ప్రేమించే హృదయమూ ఇలా దీవించగలిగితే యాసిడ్ దాడులు ఎందుకుంటాయి చెప్పండీ.
    మీరు కథలు చాలా బాగా రాయగలరు అని తెలుస్తుంది. అప్ప్పుడప్పుడూ యువతకు ఇలాంటి మెస్సేజస్ ఇస్తూ ఉండాలని కోరుకుంటూ..

    ReplyDelete
    Replies
    1. "సర్, ఈ చిన్ని కథ ఓ జీవితానికి సరిపడా దీవెనని ఇస్తుంది, ప్రతి ప్రేమించే హృదయమూ ఇలా దీవించగలిగితే యాసిడ్ దాడులు ఎందుకుంటాయి చెప్పండీ. మీరు కథలు చాలా బాగా రాయగలరు అని తెలుస్తుంది. అప్ప్పుడప్పుడూ యువతకు ఇలాంటి మెస్సేజస్ ఇస్తూ ఉండాలని కోరుకుంటూ...."
      ఒక మంచి మనోభావన స్నేహ ప్రోత్సాహక అభినందన.
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete