Sunday, November 24, 2013

నా జీవన నూతనాధ్యాయం

ఒక జీవన అధ్యాయం ముగిసిపోనుంది. కొత్త అధ్యాయం ఇంకా రాయలేదు. భవితవ్యం తెలిసిన జ్యోతిష్కురాలిని లా నా జీవితాన్ని నేనే రాసుకుంటున్నాను.

నా ముందు నాకు రెండే మార్గాలున్నాయి. జీవితం లో నేను తీసుకోబోయే అతి పెద్ద నిర్ణయాల్లో వొకటి తీసుకోక తప్పదు. ఈ ఊరిలోనే ఉండి అనామకురాలినిగా చావడమైనా చెయ్యాలి లేదా సాహసించి నీ వద్దకు చేరాలి. మధ్యే మార్గం లేదు.

బహుశ ఇదే మొదటిసారి, ఇలాగే జరగబోతుంది అని నేను అనుకోవడం. సాధారణం గా గమ్యం తెలియని ప్రతిసారీ ఒక అశక్తురాలిలా గాలివాటుగా కదులుతూ వుండేదాన్ని.

ఇప్పుడు నా హృదయం నన్ను నిర్దేశిస్తుంది. నా ఆత్మ లోని అంతరాత్మ నన్ను పిలుస్తుంది. తెలుగు సినిమాల్లో చూపిస్తున్న స్వచ్చమైన ప్రేమ లాంటి ఔన్నత్యాన్ని ప్రదర్శించలేను కానీ నాకు తెలుసు .... నా ఆత్మ ప్రతి చిన్న అభిలాషను కూడా నేను అర్ధం చేసుకోగలను.

నీతో కలిసి కొన్నాళ్ళైనా జీవించితే కొంతైనా వివేకం అబ్బుతుందని ఆశ. నీవు నాకెంత దూరమో నేనూ నీకంత దూరమే అని తెలిసినా. ఎందుకో మన మధ్య ఈ దూరం నన్ను చంపేస్తుంది.

ఇక్కడ ఊరులో నా కోసం అంటూ నాకు ఏమీ మిగిలి లేదు. ఒక్క తలనొప్పి తప్ప. ఎవ్వరూ నా మాట వినరు. షో కేస్ లో బొమ్మలా మిగిలిపోతానేమో అని భయంగా ఉంది.

నాకిప్పుడు జీవించాలని ఉంది. నన్ను నేను సమర్పించుకోవాలనుంది .... నీకు. ప్రతి క్షణమూ నా హృదయం ఆలపిస్తుంది ఒక విరహ గీతాన్ని. నా మనసు మారాం చేస్తూ వుంది నీ సాహచర్యం, ప్రేమ కావాలి అని.

నేనిప్పుడు రోజుల్ని లెక్కేసుకుంటున్నాను. కదిలిపోతున్న గంటల్లో, నిముషాల్లో, క్షణాల్లో ని యాంత్రికత లోంచి బయటపడాలని, నీ వద్దకు బయలుదేరాలని. 

నా జీవితం నూతన అధ్యాయం నా కోసం ఎదురుచూస్తుంది …. నా గమ్యం నా కదలికల ప్రత్యక్షక్షరాల .... ఘటనల్ని నేనే రాయాలని.
పేజీ తిప్పి హెడ్లైన్స్ రాసేందుకు ఉపక్రమించాను.

No comments:

Post a Comment