Tuesday, December 31, 2013

రాత్తిరి వేళల్లో ..... 

చీకటి మాటలాడుతుంది.
లోలోపల, వంకరటింకరగా
మెలికలు తిరిగిన
పేగులు, ధమనులు సిరలలో
ప్రవహిస్తున్న రక్తం,
జీర్ణించబడని పదార్ధాలు
ఆరనిమంటల చితి రహశ్యాలు,
భూస్తాపితం అవుతూ
 


స్పృశించే మైకపు భావనలు
కలల కవ్వింపులు
అరుపులు,
ఆర్తనాదాలు
మిణుగురుల తళతళలు,
కీచురాళ్ళ శబ్దాలు
నెమ్మదిగా తోముకుని
మెరుస్తున్న భయాలు
భయానక కష్టాలు
శ్రుతివ్యత్యయమైన పిడేలు
రాగాలు వినిపిస్తూ

 భూతమేదో అడ్డం వచ్చినట్లై
వేగంగా కదులు వాహనం
కీచుమని అరిచి, ఆగి
అంతలోనే ఏమీజరగనట్లు
నాజూకు గా జారి నీడగా మారి
............
పొడుగ్గా పెరిగిన గోళ్ళు,
ఏవో పిచ్చిగీతలు ....
పాతాళం లోంచి, అరుస్తున్నట్లు
ఎవరో స్త్రీ భీతావహ ఆలాపనల్లా
చీకటి మాటలాడుతుంది.

Monday, December 30, 2013

కవిత్వం రాయాలని .... కవిత్వం 

నాకు కవిత్వం రాయాలని ఉంది.
ధైర్యమే లేదు.
రాసేందుకు కావలసిన శిక్షణే లేదు అని.
భయం .... న్యాయం చెయ్యలేనేమో అని,

ఏదో రాయాలనిపించి, రాసి
చదివి చూసుకున్నాను.
ఎందరో రాస్తున్న కవితల్నీ చదివాను.
వారు రాసిందే బాగుంది అనిపించింది.

ఆ కావ్యదేవత నన్ను కటాక్షించ లేదేమో,
దూరం గా జరిగిపోయిందేమో .... అని!
అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది.
ఔనూ! కావ్యదేవతేనా? కవి దేవుడైతే కాదు కదా? అని, 


అందమైన శ్రేష్ట పదాలు తట్టడం లేదు.
రాయాలనే ఉబలాటం పెరుగుతుందే కానీ,
ఊహలు పరిమళాలై నన్ను ముసరడం లేదు.
ఆవేశం బడబాగ్నిలా .... నాలో రగలడమూ లేదు.

కానీ, నాకు మాత్రం కవిత్వం రాయాలని ఉంది.
సాటి మనిషిని, నన్నులా ప్రేమిస్తూ .... ప్రేమ గురించి,
మంచితనం, అనురాగం, మానవత్వం గురించి,
సంఘటన, సందర్భాల్ని ఇతరులు చూడని కోణం లో చూస్తూ,
సామజిక భద్రత గురించి, ఆస్వాదించ గల కవిత్వం రాయాలనుంది. కేవలం ప్రయోజనకర సాహిత్యం రాయాలనుంది.

వివేకం
ఉద్వేగ భావనలతో ఎద,
ఆలోచనల వ్యూహాల ఆటలు ఆడుతూ మది,
నిజమే అయితే,
అది ....

Add captionప్రేమో, ప్రణయమో ....
గాయమో, నొప్పో తెలుసుకుని కదలడం
ఒక చక్కని ఉపాయం! వివేకం!!

Sunday, December 29, 2013

అరుణోదయ వేళపెరటి వైపు కిటికీ లోంచి 
మసక మసగ్గా 
వెలుగు కిరణాలు 
ఆ తూరుపు కొండల్లోంచి తొంగి చూస్తూ 
....................
పాలవాడి అరుపులు 
కుళాయిల్లోంచి జారుతున్న నీటి శబ్దాలు 
కోడి కూతలు 
ఆడపడుచుల వంటగది ద్వనులు 
తరుముకొస్తున్న భావనలు అవి.
...................


చేతులు బార్లాచాచి 
గట్టిగా ఊపిరి పీల్చుకుని, విడిచి 
చేతులు మడిచి 
అరచేతులు ఒకదానితో ఒకటి రుద్దుకుని 
ఆ వెచ్చదనంతో .... కళ్ళను తాకి 
బద్దకాన్ని సుతారంగా సాగనంపేలోగా ....
దూరంగా గణగణ మని 
ఆలయంలో గంటలు మోత. 
మౌనంగా నిలబడ్డాను. 
అంతా సవ్యంగానే జరగాలని,
................పొగ మంచు కమ్ముకునే ఉంది. 
అప్పుడు, 
విషాదం చ్చాయలో .... 
నిద్దుర బద్దకం వీడాల్సిన అఘత్యం
నా ఒంటరి పోరాటం 
చైతన్యావశ్యకతను గుర్తుచేస్తూ. 


చిరు స్వార్థములే 

ఈ భూమి, ఈ పచ్చదనం,
ఈ నీరు
ఆ ఆకాశం,
ఆ మబ్బుల గుంపుల కదలికల
జారుతున్న వర్షం చినుకుల్లో .... ప్రకాశం
..........
తూరుపు దిశ నుండి
గుంపులు గుంపులుగా కదిలి
ఒకదానిని ఒకటి రాసుకుంటూ, పెళపెళలాడే
ఆ మేఘ గర్జనలు, ఉరుముల .... శబ్దాలు
................
మేఘాలతో ముచ్చట్లడుతూ కదులుతున్న
ఆ చల్లని గాలి
మదిని చల్లబర్చి, శ్వాసై ఎదను చేరి,
సంబ్రమంగా తలెత్తి చుసేలా చేస్తున్న
గగనంలో ఆ మెరుపు .... వెలుగులు

Saturday, December 28, 2013

ప్రతీ రాత్రి ఇదే తంతు 

అదే రాత్రి ప్రవృత్తి.
అక్కడ
చీకటి ముసురుకున్న అమర్యాదపు చొరబాటులే అన్నీ.
బలాత్కారపు ప్రవేశాలే అన్నీ.
దోపిడి,
దొంగతనాలు,
విలువలేని ప్రమాణాలు,
సగటు మనిషి నిత్య జీవన సరళి లా ....
అర్ధం లేని, ఊహాజనిత సమీకరణాల తో,
తెలివిని ప్రదర్శించే అడ్డ గాడిదల వ్యర్ధ వ్యాఖ్యానాలు అవి.
అసంబద్ధ పదబంధం లా మారుతూ,
  
పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టిన
ఆ తుపాకీ .... బుల్లెట్
ఆలోచనల్ని తాకి, బలైన చేతనావస్థ
నిద్రావస్థకు లొంగి, 
ఉన్నచోటే పడుండిపోతూ .... అది,
నాగరికత నిద్రలోకి జారుతున్న శబ్దం.

పిల్లగాలులే అవి 

మృదు మధురంగా
స్పర్శించీ స్పర్శించని కమ్మని పవనాలకు
ప్రభావితం అయి,
వృక్షాలు
శాఖలు
ఆ ఆకుపచ్చని ఆకులు ....
అప్పుడు,
అక్కడక్కడ అలా వర్షపు నీటి బొట్లు రాలి ....

ఒక మంచి కల కంటున్నా! 


చాన్నాళ్ళయ్యింది బాధపడటం మినహా ఆశ్చర్యపోవడం మానేసి. .ప్రతి రోజు పసి మరణాలని విని, చూస్తూ మనసు తరుక్కుపోతుంది.

ఇక్కడ, ఎవరికీ ఎవరి గురించీ ఆలోచించే సమయమే ఉండదు. ఉదయం లేచామా ఆఫీసుకు వెళ్ళామా, సాటివారితో సమం గా డబ్బు సంపాదించామా, ఆస్తులు పోగు చేసామా, ఆకాశహర్మ్యాలు కట్టామా అని ఆలోచించడంతో నే సరిపోతుంది.

ఒక్కోసారి చీదరేస్తూ ఉంటుంది. తొలి పుట్టినరోజైనా జరుపుకోకుండా తల్లీ తండ్రీ ఎవరో కూడా తెలియని పసికూనలు కొందరు నడిరోడ్డు మీద అడుక్కుంటూ అకలితో అల్లాడుతూ ఉంటే .... కొందరం మాత్రం అద్దంలో ఫిజిక్ ను చూసుకుని "కాస్త బరువు పెరిగాను. తగ్గితే యింకా నాజూగ్గా ఉంటాను" అని అనుకుంటున్నప్పుడు.


 అప్పుడప్పుడూ నాకు వినాలనిపిస్తుంటుంది. ఆనందం, ఆహ్లాదం గా ముగిసిన అనాద కథ ఏదైనా .... అది ఎవరి ఆలోచనల్లో అయినా ఉంటే .... వినాలని ఆశగా ఉంటుంది. అది అభూతకల్పనే అయినా సరే .... అది చిత్రంగా, నూతనంగా అనిపించినా సరే వినాలనిపిస్తుంటుంది.

అందరూ ఒక్కరుగా ఆలోచించి, కలిసి కష్టసుఖాల్ని పంచుకుంటున్నారని .... ఎవరైనా చెబితే, మనసు విప్పి మరీ వినాలనుంటుంది. అలా పంచుకోవడం లో ఎంతో ఆనందాన్ని పొందుతున్నామని ఎవరైనా చెబితే ఒళ్ళు మరిచి మరీ వినాలనుంటుంది.

ప్రకృతి వనరులేగా అన్నీ. ప్రతి ఒక్కరూ భూమి పుతృలమేగా ....

అందరమూ బ్రతికేందుకు కావలసిన అన్ని వనరులు ఆ ప్రకృతి బిక్ష అని పగలూ రాత్రీ నమ్మే వాళ్ళలో నేనూ ఒకడ్ని. ఒక బాలుడు కావొచ్చు ఒక బాలిక కావొచ్చు ఏ దుమ్మూ దూళి చెత్తకుండీలు, బస్సు షెటర్స్, ప్లాట్ ఫార్మ్ ల మీద ఆహారం కోసం ఒకరితో ఒకరు కలబడటం తగదని .... ఆ పసి కూనలకు చాలినంత ఆహారం అత్యవసరం సామాజిక న్యాయం అని అనిపిస్తుంటుంది.

నేను అతిగా ఆదర్శాలు చెబుతున్నానని, కలల్లో జీవిస్తున్నానని అనిపిస్తుంది కదూ. ఏం? నాకు కలలు కనే హక్కు లేదా? ప్రపంచం లో అందరూ సుఖ శాంతులతో కలిసి జీవించాలని అనుకో కూడదా?


 రాజకీయం కోసం గానీ, మనసు ద్రవించి కానీ, ఆదర్శం పల్లవించి కానీ .... మనలోనే ఎందరో అప్పుడప్పుడూ అంటూ ఉంటారు గా! ఆ కల నిజమయ్యే రోజు ఎంతో దూరం లో లేదు. నాకు గానీ ఒక్క అవకాశం దొరికితే కార్యాచరణతో సిద్దంగా ఉన్నాను. "ఈ బీదరికాన్ని పారద్రోలుతాను. దార్ద్ర్యం విషవృక్షాన్ని కూకటి వేళ్ళతో పెకలించేస్తాను" అని అంటుంటారుగా .... వారి మాటలు నిజం అయితే బాగుణ్ణని కల కంటే తప్పేముంది.

స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా నేను ఆశ్చర్యపోయేది బాధపడేది మాత్రం ఒక్కందుకే? పసి ఆఖలి నడివీధుల్లో, ఆ నాలుగురోడ్లకూడళ్ళలో నాట్యమాడుతూ నాగరికత నవ్వుకుంటుండటమే? మంచి మనుషులుగా గుర్తించబడ్డవారు కూడా జాలి పడటాన్ని మించి చాలా వరకు ఆ పసి ఆఖలిని ఎదుర్కునే ప్రయత్నం చెయ్యక పోవడమే .... ఆఖలి మహమ్మారిపై అంతిమ పోరాటానికి సిద్దం కాకపోవడమే!

Friday, December 27, 2013

ఎందుకు?ఎందుకు? 
ప్రేమ యింత కఠినం!? 
ఎందుకు??
ఎందుకు యింత కఠినము!!?? 
నేను అనుకుంటాను ఆమె నన్ను ఇష్టపడుతుందని. 
కానీ, 
ఆమె నన్ను ఇష్టపడదు. 
ఎంతో లోతుగా, గాడంగా ....
నిశ్చయించుకుని ఉంటాను. నా ఆశల గమ్యం ఆమె అని.  
కానీ, 
నా తల తిరిగేలా చేస్తుంది.
కుదురుగా ఉండనీయకుండా .... ఆమె.  
నా హృదయం, అచేతనము అగమ్యము అవుతుంది. 
ఎందుకు? 
ఎందుకని?? 
ప్రియురాలి మనసు యింత కఠినం!?

మది మధనంగులాబీ పువ్వును,
వేళ్ళ మధ్య పట్టుకుని ....
రేకుల్ని విడదీస్తూ లెక్కిస్తున్నావు.
కారణం ఉందంటావా?
ఎమిటంటావు?

మార్పు వస్తుందని
ఎదురు చూస్తున్నావు.
ఊహించని అదృష్టం ఏదో వచ్చి
తలుపు తడుతుందని,
మీనమేషాలు లెక్కబెడుతున్నావు.
అవసరమా!?

కాలం వృధా అయిపోతుంది.
ఏదైనా చేసేద్దువు కాని .... రా!
కొన్నినాళ్ళయినా జ్ఞాపకం ఉండేలా
కాలచక్ర గమనంలో ....
మిగిలుండేలా, చిన్న మార్పుకయినా
కారణం అవుదాం రా!

శిల్పాన్ని చూపించి ఓట్లడిగే
రాజకీయం వద్దు నీకు.
కలల శిల్పివి నీవు
నీ కలలకు రూపాన్నియ్యి!
నాలుగు రోడ్ల కూడలిలో ప్రతిష్టాపన గా
ఆచరణ క్రమం ను ఆవిష్కరించు.
మార్పు, అరుణ రాగమై అడుగులేస్తూ,
రా! .... రా ముందుకు!
 

నేను,
నీలో ప్రజ్వలనాన్ని!
చూస్తున్నావా! గమనిస్తున్నావా?
సముద్ర మధనానికి వేళయ్యిందని.


Thursday, December 26, 2013

అన్యాయం సుమా! 

కిటికీ అద్దం లోంచి ....
తొంగి చూసి,
దూరి, విస్తరించి, ఉషా కిరణాలు
సూదుల్లాంటి శరాలు
దొంగల్లా
ఏమీ లేదు "కాజువల్ గా వచ్చాను" అన్నట్లు
జారుకున్నాయి.
నా బద్దకాన్ని దొంగిలించి ....
నా మది గదిని కిలకిలారావాలు,
చేతనత్వం తో నింపి మరీ.

Wednesday, December 25, 2013

తాపసి 


ఆ బ్రహ్మ రాసిన అక్షరం లో
అమ్మ అయువును పోసి నేనయ్యాను.
ఆమె రాసుకున్న ఆశల భావనల రూపం నేను.
జ్ఞానాన్ని దిద్దుకుని చదువుకో అంది.
ఆమె ముద్దుగా మురిపెంగా నేర్పిన మాటలు 
విని అప్పచెప్పేవాడిని.
వచ్చీ రాని మాటల పసితనం అది.
..............
ముద్దులు, చందమామ కథలు ....
చాక్లెట్ వయసు దాటాక,
జీవితం ఊహలు కలల మయమైనప్పుడు ....
అవి ఎలా సఫలీకృతం చేసుకోవాలో చెప్పి,
ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు వైధ్యుడి గా మారి,
భయపడ్డప్పుడు ధైర్యం చెప్పి ....
తడబడి పడిపోతున్నప్పుడు పడకుండా ....
భుజాలే ఆసరాగా చేతులందించిన అమృత హస్తం అమ్మ.
................ 


 

తప్పుడుదారిలో నడిచెళ్ళుతున్నప్పుడు
నన్ను మందలించి
సరైన మార్గాన్ని సూచించి
భయంకర సునామీలనుండి నన్ను రక్షించి
జీవితం భారం అనిపించినప్పుడు
ఆత్మీయానురాగ కవచంతో
పొదుగుకుని వెచ్చదనాన్నిచ్చిన భూమాత అమ్మ.
................
ఎవో వింత అనుభూతుల కోసం, కోరికల సాధనకై
నేను దూరంగా వొదిలెళ్ళిపోయినప్పుడు కూడా,
ఎదురుచూసి .... నీడనిచ్చి ....
నీడగానే మిగిలేందుకు ఇష్టబడి
నా అభ్యున్నతినే తపించి
స్వర్గం లో నన్నుంచి .... నరకాన్ని తను అనుభవించి
ఆక్షేపించని అమ్మ .... ఏ శాపగ్రస్తో( ఏజన్మ లో )

ఎందుకో తెలియదు! వెనక చూపులే అన్నీ 
గతాన్ని ఆలోచిస్తూ,
కాలం తో పాటు కదులుతూ.
నా మదిలో
కొత్త జ్ఞాపకాలు కొన్ని
పాత జ్ఞాపకాలపై మరుపు దుప్పటై
ఎప్పటికప్పుడు
చాయల్లా .... మసకేసి పోతూ
కొన్ని రంగులద్దుకుంటూ, వస్తూ పోతూ,
కళ్ళముందు .... నర్తిస్తూ

జ్ఞాపకాల మైలురాళ్ళు
కొన్ని ....
ఎంతో గర్వం గా ఫీల్ అయ్యిన సంఘటనలు
కొన్ని
సిగ్గు పడిన న్యూనతావేళలు .... ఎన్నో
మతిమరుపు పరదా చాటున దాచేసుకుని
కనపడకుండా జాగ్రత్త పడినా ....
చివరికి అవి కూడా
నా మది పొరల్లో నిక్షిప్తాలే
ఎద గోడపై పుట్టుమచ్చలే

ఉద్వేగాలు కొన్ని, ఉపేక్షలు కొన్ని
ఆసక్తి, అనుభూతి, ఆవేశం
ద్రావకాలతో నిండి .... జీవితం ఇది.
అవి ఎప్పుడైనా పొంగి, పొర్లి
అంతరాంతరాల్లో, ఎద స్పందనలై ....
కళ్ళలోంచి కన్నీరై కారుతూ ....
పొంగి
చిందిన ఆ పరిసరాలు
పులకరింతలో, జలదరింపులో అవుతూ

నిజం నేస్తం!
గొప్ప అనుభూతి .... జీవితం
ముగింపు తెలియని అనిశ్చితే అయినా
భ్రమ లోనే జీవిస్తున్నా!
చావే లేదన్నట్లు ....
ఎందుకో తెలియదు?
రేపు ఉంటానో లేదో తెలియకుండానే రేపు కోసం,
మార్చలేని మార్పు కోసం ....
నన్ను నేను మోసం చేసుకుంటూ,
ఎన్నో అవకాశాల్ని కోల్పోయాను.
నిన్నటి అనుభవాల సహాయంతో
వర్తమానాన్ని అందంగా మార్చుకోకుండా

Tuesday, December 24, 2013

పిల్లా! ఒక్క మాట చెప్పు చాలు
పందిరి మంచం పక్కన నీవు, 
వేడి వేడి కాఫీ తో గోరువెచ్చని మందహాసం తో
ప్రతి ఉదయమూ ....
పిల్లా! 
దాయలేను. తుడిచెయ్యలేను ఈ భావనల్ని 
అవి కలిగించే ఆహ్లాదాన్ని .... మదిలో, 
సంపూర్ణుడిని అనే భావన నీవు పక్కన ఉన్నప్పుడు. 
అడగాలని అనిపిస్తూ ఉంటుంది, నా హృదయానికి, 
"నేనంటే ఎంతో ఇష్టం అని", చెప్పి, 
ఆ క్షణాల్ని అలాగే ఉండనియ్యమని .... నిన్ను.

నిజం చెబుతున్నా!
నీ చేతిలో చెయ్యేసి, కలిసి నడుస్తానని, 
నీ ప్రతి అవసరమూ, నా అవసరం అనుకుంటానని, 
నాడు, 
మంగళవాయిద్యాల సందడిలో, 
నీవూ నేనూ చేసుకున్న ఆ మౌనబాసలు ....
ఇంకా గుర్తున్నాయి. ఎప్పటికీ గుర్తుంటాయి. 
ఓ పిల్లా! 
ఒట్టేసి చెబుతున్నాను. 
నా హృదయభావనలు, 
నా మనసుమాటలు ఒక్కటే అని. 

పిల్లా! మనది సామాన్యమైన ప్రేమ కాదు. 
ఏంత తాగినా తీరని దాహం మనది. 
ఇరువురం అస్తిత్వాలు కోల్పోయి, నీవు నేనై 
నేను నీవై పరిపూర్ణులం అయ్యేవరకూ 
తీరని ఆర్థి అది.
మళ్ళీ చెబుతున్నా!  నా హృదయం, ఆత్మ, కణకణమూ 
ప్రతి రోజూ ఆ ప్రకృతికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాయి. 
నిన్ను ఇంతగా ప్రేమించే శక్తిని నాకిచ్చినందుకు .... 
ప్రతిరోజూ నీవు 
"నేనంటే ఎంతో ఇష్టం అని", 
చెప్పేవరకూ మురిపించే శక్తిని ప్రసాదించినందుకు.

నీవు సంకల్పించిన ప్రతి పని లో తోడుంటాను 
ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఏమి చెయ్యాలనుకున్నా 
పిల్లా! 
నేను నీ పక్కనే ఉంటా! 
ఆ ప్రకృతి సాక్షి గా చెబుతున్నా! 
ప్రాణమున్నంత వరకూ, నీ శ్వాసనై ఉంటానని, 
మాటిస్తున్నా! అన్నీ సక్రమంగానే జరుగుతాయని, 
సర్వం సవ్యమే అని ....
పిల్లా! 
"నేనంటే ఎంతో ఇష్టం అని" ఒక్క మాట చెప్పు చాలు.

కాలగతి

ఇది నా సామ్రాజ్యం .... ఇక్కడ అంతా నేనే 
నాదే అంతా ఇక్కడ 
నేను మాత్రమే నివశిస్తుంటాను. 
నా అంగీకారంతోనే ఎవరైనా ఇక్కడ ఉండేది. 
నేను ఉండమన్నప్పుడు ఉండి 
వద్దంటే వెళ్ళిపోవాలి ఎవ్వరైనా

ఎవరైనా 
నాతో మాట్లాడగలిగేది 
నా సమ్మతం తోనే 
నేను ఎక్కడ అంటే అక్కడే 
నేను కోరుకున్న వాహనంలో 
నేను నిర్ణయించిన స్థలం లో
నా ఇష్ట ప్రకారమే

ఇంతవరకూ జీవితం లో 
నేను కావాలనుకున్న ప్రతిదీ పొందాను. 
ఎలాంటి అసౌకర్యమూ కలగ లేదు. 
సమశ్యల కొండలు ఎన్నైనా 
ఒక్కటొక్కటిగా ద్వంసమై దూళిగా 
గాలిలో కలిసిపోయేవి.
నాకు ఊపిరి పీల్చుకునే స్వేచ్చ దొరికేందుకు

ఉదయం నేను లేచినప్పుడే 
ప్రకృతికీ స్వాంతనం 
నేను కోరుకున్నప్పుడు, 
నేనెరుగని కాలంలోకి 
స్వాగతించబడుతూ ....
భవిష్యత్తు సుపరిచితం లా 
నా పలుకరింపుకోసం అలమటిస్తూ ఉంటుంది.

రేపు ఎప్పుడూ అందంగా ఉంటుంది .... ఊహల్లో. 
ఆ ఊహలు నా మనోగతం మేరకే ....
నేను కోరుకున్న భవితవ్యమే నాది 
నాకు ఈ సమీకరణాలంటే ఇష్టం. 
నేను కాలాన్ని ప్రేమిస్తున్నాను. 
వర్తమానం లో జీవిస్తున్నాను 
అది నాతోనే నేనే లానే అందంగనే ఉంటుందని.

Monday, December 23, 2013

మూడ విశ్వాసం
దృష్టిని కోల్పోయి ....

చూడలేక

వర్తమానాన్ని,

అంధ మానసం లో

ఆవగింజ పరిమాణపు

అపనమ్మకం ....

భూతం లావయసెళ్ళిపోయింది 
ఆమె చెప్పుకుంటుంది. సాగదీస్తూ,
నిన్నటి గురించి,
ఒకప్పటి నన్ను,
వసపోసిన నా వాగుడు లక్షణాన్ని
గంటల కొద్దీ తనతో గడిపి,
నవ్వించి ఆనందించిన .... నన్ను గురించి.

ఆమె ప్రేమ కోసం తపించి,
భక్తుడినై ....
పరికిణీల జూలియట్ కోసం
బస్టాండుల వెంట రోమియోలా తిరిగిన
ఒకప్పటి నన్ను గురించి,
మురిపెంగా పదే పదే తనలో తను.

వయసు మీదపడి ఇప్పుడు,
అప్పటి నేనులా ఉండలేకపోతున్నా!
అయినా ఒప్పుకోను. వాదిస్తాను.
కాలంతో పాటు మార్పులు సహజం అని,
మనం మనుషులం అని,
అందుకు మనం మినహాయింపు కాదూ అని,
.
రేడియో లా ఇరవైనాలుగు గంటలూ
తను మాట్లాడుతుంటే, వింటూ ....
ఆ ముఖభావనల్ని గమనిస్తూ,
మధ్య మధ్య కురిసే ఆ నవ్వుల్లో తడుస్తూ,
బ్రతికెయ్యొచ్చు అని ఎందుకనిపించేదో ఆనాడు,
ఇప్పుడదే పిచ్చేమో అనిపిస్తుంది.

అప్పటిలా యిప్పుడెందుకో ఆమెలో
ప్రియురాలిని, చూడలేకపోతున్నాను.
సహధర్మచారిణినే తప్ప,
వెన్నెల్లో తడుస్తూ నర్తించాలని అనిపించడం లేదు..
ఆమె గొంతు అరిగిపోయిన
గ్రామఫోన్ రికార్డ్ లా చీకాకనిపిస్తూ,

తల నెరిసి, ముఖాన ముడతలొచ్చి
గొణుగుతూ తను.
ఎప్పుడూ సాదిస్తూ ఉన్నట్లే ఉంటుంది.
ఒకప్పటి నువ్వు కాదు అంటూ,
నేను ఆమె, జ్ఞాపకాన్ని మాత్రమే
ఆ జ్ఞాపకానికి అస్తిత్వం లేదు .... ఆమె తలలో తప్ప.

ఇష్టం తో కూడిన ప్రేమ


నాకు ఎంతో ఇష్టం
ఆ నవ్వు.

ప్రేమిస్తున్నాను.

ఏ భావనలూ లేని,
ఏ భ్రమరమూ తాకని,
ఆ తెల్లని పూల
సువాసనల చిరు జల్లును.

అంతరాల్లోంచి 
రా, రమ్మనే
ఆ స్వచ్చ ....
స్వాగత ఆహ్వాన సంజ్ఞలను.

ఇష్టపడుతున్నాను.
ప్రాణాధికంగా ప్రేమిస్తూ ఉన్నాను.Sunday, December 22, 2013

అతడే మూడుతలల మనిషి అతడు
ఒక శాస్త్రవేత్త.
పదార్ధాన్ని, వాస్తవికతను మాత్రమే నమ్ముతాడు.
హెచ్చవేతలు, కూడికల సమీకరణాలు చేసి,
సమశ్యల గోడల చుట్టూ సమాధానాలు వెదుకుతూ ఉంటాడు.

అతడు,
ఒక మతవాది.
అతని నమ్మకం, అతను చూడని దేనిలోనో ....
అన్నీ చూసేందుకు ప్రయత్నిస్తూ,
ఆ ఊహల రూపాన్ని ప్రతిష్టించి పరమార్ధాన్ని వెదుకుతూ ఉంటాడు.

అతడు
ఒక వేదాంతి.
కళ్ళముందు ఉన్నదంతా భ్రమే అని,
జగము, జీవము, పదార్దమూ అన్నీ మాయే అంటూనే,
ఏది కాదంటున్నాడో దాని మీదే కూర్చుని ఘాటుగా వాదిస్తుంటాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే,
అతడు
మూడు తలల మనిషి
తాను పెట్టుకున్న .... రంగు అద్దాలతో ప్రపంచాన్ని చూసి,
ఆ రంగు, ఆ లక్షణమే మూలం అనే భావనను ప్రపంచానికి పులిమేస్తూ ఉంటాడు.

Saturday, December 21, 2013

అమంటే ప్రేమను 


ఎలా దాయను .... ఎలా?
ఈ అనురాగాన్ని
నాలోని ఈ పామరత్వాన్నీ
నా ముఖం పై
కనపడనీయకుండా .... ఎలా దాయను?
గుట్టుగా ఇన్నాళ్ళూ దాచుకునున్న
ప్రియ భావనల్ని .... ఎలా దాయను?
ఆమె వచ్చి
ఎదురుగా నిలబడి, 
"ఎందుకలా!
ఇబ్బందిగా కదులుతున్నావు!
చెప్పు! నేనేమైనా చెయ్యగలనా!?"
అని అన్నప్పుడు
మాటలు రాని మౌనంలో,
బిడియం లో
నిండా మునిగి ఉన్న నేను,
తెరవెనక్కు జారిపోతూ .... ఎలా?
ఎలా దాయను ఆమెను? .... నా ప్రేమను??

ఏమయ్యిందో ఎదలో 
చెప్పలేకపోతున్నాను.
ఎందుకని అని,
నా హృదయం
గాయపడింది.
అంతగా అని,

ఒక
తేనె మనసును మెచ్చి
బహూకరించిన
పిదపే ....
ఎందుకో మరి.

కురుచ ఆలోచన 

నీ చిరునవ్వు
గాలి చొరడానికైనా వీలివ్వని,
పలుకరింపు.
ఆ పలుకరింపు, పరామర్శపై
సమానీ కరించుతూ నా మనోభావనలు.
భద్రతారాహిత్యంగా,
నీ చూపుల వలలోచిక్కుకొని.

ప్రేమంటే ....
 


నిజంగా, అది ప్రేమ అని అనుకోలేను.
కళ్ళను కమ్మిన
ఆ కన్నీటి మేఘాలు
ఆ మసక పొగమంచు
పొరలను చూసి,

పగిలిన హృదయాన్నీ,
కోల్పోయిన
స్పర్శేంద్రియ గ్రాహక శక్తిని,
అయోమయానికి లోనై,
చెదిరిన ఆత్మను .... ఆమెను చూసాక.

ఆమె కదలికల్లో ....
యాంత్రికత
స్వస్థచిత్తత ను కోల్పోయి.
నిజం చెబుతున్నా!
ముమ్మాటికీ
అది ప్రేమ అని అనుకోలేను.

అనునయం, బుజ్జగింపు పొందాల్సుండి,
నిరాశ అంచులపై తిరగాల్సిరావడం,
అశిక్షితుఁరాలిలా,
అనాగరిక, అసంసారిక రేఖల సరిహద్దుల్లో ....
ఒంటరిగా తిరగాల్సిరావడం.

ఓదార్పు, స్వాంతనము
పొందిక లేని నరక జీవనం సాగిస్తూ
చిక్కుముడులు,
గందరగోళము,
అవహేళనలకు పాలౌతూ .... ఆమె,

నిజమే చెబుతున్నా!
అది ప్రేమ అని అనుకోలేను.
చీకటి కుహరం లో
మిగిలుండేందుకు
సుముఖతను చూపించడం,

ఆశ అనే ఆఖరి దీపం
అలసటతో ఆరిపోయేవరకూ
అస్తిత్వం, రూపం మసకబారేవరకూ
శూన్యంలో, మౌనం లో
కలిసిపోవాలనుకోవడం.

అపనమ్మకం,
అత్మ విశ్వాసం
సడలిన అసహాయత్వం,
అభద్రతాభావం
ఊపిరాడకపోవడం ....

ఉండుండి "అతనిది నిజమైన ప్రేమేనా!" అని
అతను కాదు, "నేనైనా నన్ను ప్రేమిస్తున్నానా!" అని
అంతరంగం లో ప్రశ్నలు
సంఘర్షణలతో సతమతమౌతూ,
నిజం! నిజంగా అది ప్రేమ కాదు.

ఎందుకంటే, 
ప్రేమ, శూన్యం కాదు.
ప్రేమ, కలవరం, భ్రమ కాదు.
ప్రేమ, బాధ, పశ్చాత్తాపం కాదు.
ఒంటరితనం, మత్తులో మునగడం కాదు .... ప్రేమ.

తెలియని అనిశ్చితి,
కదలలేని సంశయము .... ఊబి,
అబద్దపు సాక్షం, మోసపూరిత ముసుగు కాని ....
ప్రకాశించే వెలుగు కిరణం .... ప్రేమ,
నిజం! ఆమె ఉన్న స్థితికి భిన్నత్వం వికృతే .... ప్రేమ

 

Friday, December 20, 2013

ఎవరికి తెలుసని?
 
 

చెప్పలేరు ఎవరూ. ఎంతప్రయత్నించినా
ఏ ప్రేమ మొలక .... ఎప్పుడు చిగురులేస్తుందో 
అంకురం దశలోనే .... మురిగిపోతుందో అని,
మది భావనలు, ఎద స్పందనలు రెట్టింపై
ఏది వాస్తవమో, ఏది కృత్రిమమో తెలియని క్షణాల్లో.
.............
ఎప్పుడైతే, తనలో .... లోలో సర్వం చిద్రమై
అస్తిత్వం ముక్కలై, చెల్లాచెదురైన క్షణాల్లో ....
ఏమని చెప్పగలరు? ఎవరైనా ....
ఉప్పొంగే హృదయస్పందనల్ని దాచుకోవాల్సి వస్తే
దాచుకునేందుకు మదుగే లేకపోతే
.......................
ఒకవైపున జీవితం సాఫల్యం చెందిందని
మరోవైపున హృదయం కన్నీరు వర్షిస్తూ
అంతా సవ్యం, ఎక్కడా పొరబడటం లేదు అని
తప్పేందుకు అవకాశమేలేదు అని అనుకుంటూ,
హృదయం మాత్రం దైన్యంగా, సుడిగుండం లో
చిక్కుపోయినట్లు ఉక్కిరిబిక్కిరౌతుంటే ....
.........................
తలదాచుకుందుకు .... మనసు పరామర్శ
కనీసం నీడ దొరకని క్షణాల్లో .... కణ విశ్చిన్నం
గమనించక తప్పనిసరైనప్పుడు,
అది ఊపిరి అందీ అందని గుండె పోటే అవుతుంది.
అప్పుడు ఆ ప్రాణం ఉంటుందో, పోతుందో
చెప్పేదెలాగా? ఎవరికి తెలుసని!?


Thursday, December 19, 2013

నేనామెనే ప్రేమిస్తున్నా .... కానీ 


ఒక పారిజాతం నవ్వింది.
ఆ నవ్వులో పరిమళం, ఉల్లాసం
ఆలోచనల ఉపశాంతి,
ఆమె చూపుల్లో చిలిపితనం ....
చిత్రం!
"ఏదో అనబోతున్నావు, అనొచ్చుగా!?"
అన్నట్లు .... కొంటె పలుకరింపు.
...............
నవ్వాను ప్రతి పలుకరింపుగా,
నాలో కంగారు, అలజడి.
తెలుస్తూ ఉంది.
నా మనోభావనలు
అమూల్యం,
మనోజ్ఞం అయిన పదాలు
పెదాలమీంచి దొర్లి,
"నేను నిన్ను ప్రేమిస్తున్నా!" అన్న క్షణం
ఆ పదాలు,
నేను, ఆమె సొంతం అయిపోతామని.

Wednesday, December 18, 2013

వడలి రాలుతున్న పూరేకును 


అలసిన సూర్యాస్తమయ వేళ .... నేను,
ఇంకా పరుగులుతీస్తూ ఉన్నాను.
ఇంటికి, నా ఆలోచనలకు దూరంగా
శిల్పం లా మలిచేందుకు అనువైన
ఒక శిలాహృదయం నా కోసం ప్రతిష్టాపించుకోవాలని
వెదుక్కుంటూ తిరుగుతున్నాను.
తపిస్తున్నాను .... అహరనిశలు.
మనసులో, హృదయం గోడపై పుట్టుమచ్చలా
మిగిలిన నీ ముఖం ....
కనపడకుండా చూసేందుకు
క్రొత్త దృష్టితో .... ప్రపంచాన్ని చూసేందుకు.
.......................
కారణం నీవే అని నీకు తెలుసా?!
.........................
అమాయకత్వం ....
నీ ముఖం చూసిన ప్రతిసారీ,
నిజం!
నన్ను నేను దాచేసుకుందుకు చేసిన ప్రయత్నం
ఎందుకో .... మనం ఎదురైన ప్రతిసారీ
శృంగభంగుండ్నయ్యేవాడ్ని.
నిన్నొదిలెళ్ళలేకపోయేవాడ్ని.
నీవు ఒదిలెళ్ళేప్పుడు మాత్రం
మనసెందుకో వడలిన పువ్వు లా అయి
ఒక్కో కణాన్నై నన్ను నేను కోల్పొతున్నట్లు
నాలోని కణాలన్నీ నన్నిడిచెళుతున్నట్లు అయ్యేది.
నిజం ప్రియా! అప్పుడు,
నాలో నేను గుండెపగిలేలా అరిచేవాడ్ని.
నీవు వచ్చేదానివి కాదు.
బదులిచ్చేదానివి కాదు. నేనున్నానని.
నీకోసం వెతుక్కునేవాడ్ని!
నువ్వక్కడుండేదానివి కాదు!
నా మనోవొకారం మినహా ....
నేను నిదురిస్తున్నప్పుడు .... అక్కడా నీకోసమే చూసేవాడ్ని.
నీవు దూరం గా ఎటో చూస్తూ .... కనిపించేదానివి.
నేను విశ్చిన్నమైపోయేవాడిని. బావురుమని ఏడ్చేవాడిని.
...............
అప్పుడు, ఆ క్షణాల్లో
వడలిపోతున్న పువ్వును లా
రాలిపోతున్న ఆశలు రేకుల్లో రేకును లా .... నేను
తుఫాను ఉప్పెన తాకిడి తగిలినట్లు అల్లల్లాడుతూ
నాతో నే మాట్లాడుకుంటుండేవాడిని.
వరదలో కొట్టుకుపోతున్నట్లు,
సుడిగుండం లో చిక్కుకున్నట్లు,
అర్ధం కాని లోతు తెలియని ప్రవాహం లో
కొట్టుకుపోతున్నట్లు ....
శరీరమంతా చలి, గడ్డకట్టుకుపోతున్నట్లు
ఒడ్డుకు చేర్చే మృదు హృదయం కోసం వెదుకులాడుతున్నట్లు,
నేను .... ఒక వడలి రాలుతున్న పూరేకును లా ఆ క్షణం లో.

నాది నిజమైన ప్రేమే 

నిజంగా నాది నిజమైన ప్రేమే
ఓ అమ్మాయీ!
నమ్ము!
ఈ భావనల్లో
ఈ మనసులో ఉన్నది నీవే!
ఆట అనుకుంటున్నావేమో నా మాటల్ని
నీ సాన్నిహిత్యం
చేరువ కావడం కోసమని
....
నిజంగా నేను దిగులుచెందటం లేదు,
నీవు ప్రేమించవేమో అని.
నా మనసుకు తెలుసు
నా ప్రేమ స్వచ్చమైనదే అయితే
నీకూ ప్రేమించకతప్పదని.
నీ వద్ద ఉన్నదంతా
నిన్ను నీవుగా
సమర్పించుకునే రోజు వస్తుందని నమ్ముతున్నా!
....
నేను నేనుగా నిర్మలంగా
నీ పై నా ప్రేమ సడలకుండా ఉంటే,
నీవూ నేనూ వేరు కాదని నువ్వనుకునే రోజొస్తుందని.
....
ఇప్పుడు
నీవు కోరుకునేదీ అదే అయినా ....
కొంత సమయం పడుతుంది నీకు,
నీ ప్రేమను ప్రకటించడానికి.
అప్పటివరకూ పల్లవించి ఉన్న
నా ప్రేమ పరిమళాలు పంచుతూ ఉంటుంది.
....
నిరాశోపహతుడ్నౌతాననుకోకు.
నీకూ వ్యవది అవసరం అనుకుంటా
నీకుగా నీవు నచ్చజెప్పుకోవడానికి.
....
ఒక్కసారి
నచ్చి మనసిచ్చాక
నా మాటే నీ మాట అంటావని తెలుసు.
నాకు నమ్మకం
అప్పుడు
మన మనసులు మమైకం అయి
సాహచర్య మాధుర్యం మనం చవిచూస్తామని.

Tuesday, December 17, 2013

బొమ్మ 


ఆమె

ఒక ఖాళీ పాత్ర.

ఒక పొడి పుష్పం,
నిట్టనిలువుగా రేకులు రాలుతూ
దాయలేకపోతున్న ఆ చిరుగు వస్త్రం మోస్తూ.

ఆమె

ఒక గాజు బొమ్మ.

శుద్ద మానసం,
ఎవరి ఆడటం సరదా కోసమో.
పెళ్ళున పగిలిన ఒక నమ్మకం ఓడి పడిపోయి,

ఆమె ఒక పగిలిపోతున్న వాస్తవం.

Monday, December 16, 2013

ప్రేమాహ్వానం ....
 


మనసుందా? మరి మార్గమూ ఉంది.
అన్వేషించు! తెరిచేఉంచా ....
నా ఎద తలుపుల్ని,
ఎక్కడ్నించైనా సరే, రా!
గుమ్మం వద్దే నిలుచునున్నా .... నీకోసం
ఇక్కడ, నీ స్థానం పధిలంగా ఉంది.
లోపల ఓ  చిన్న దీపాన్ని
వెలిగించుంచాను.
వీలు కుదుర్చుకుని,
నీవు నీవుగా వచ్చేప్పుడు
దారి నీకు స్పష్టంగా కనిపించాలని.

ఈ ఎదలో విశ్రమించేందుకు
వచ్చే నీ ప్రయత్నం, మార్గం
సులభం కాదని తెలుసు.
ఎక్కడైనా అడుగులు తడబడి,
నువ్వు త్రుళ్ళిపడినా ....
నమ్మకం తగ్గినా, చెప్పలేను.
నీపక్కన నేనే ఉంటానని.
కాలం తో పాటు పరివర్తన చెందే
కొన్ని ప్రశ్నలు, అనుమానాలు
ఉదయించనేరాదు.
ప్రేమ, నమ్మకం లోనే ఉన్నాయి
నీక్కావల్సిన సమాధానాలు ....
వెదుక్కుంటే.

దయచేసి
ఎద లో నివసించేందుకు
ఆత్మతో ముడివేసుకుందుకు
సమాయత్తం అయి కదిలి వస్తావు కదూ!

కాలం కలిసి రావొచ్చు!
రాకనూ పోవచ్చు!
ఎవరు అర్ధం చేసుకోకనూపోవచ్చు!
ఏవేళైనా ....
నన్ను పిలిచి చూడు
నీ పక్కనే ఉంటాను .... తప్పకుండా. .
కొన్ని కట్టుబాట్లు
పెద్దలు కొందరి ఆశలు, పట్టుదలలు
వారెవరికో చేసిన ప్రమాణాలు
తెంపుకుని రాక తప్పదు .... నాకు.
శబ్దం రాకుండా
ఒక్క మాటా మాట్లాడకుండా

జీవితం లో సెటిల్ కాని కారణమే
ఇన్నాళ్ళూ నాకుగా నేను
తలుపులు మూసి ఉంచేలా చేసింది.
ఇన్నాళ్ళూ నా దృష్టి ని, నా ఆలోచనలను
ఆకర్షణలకు దురంగా ఉంచేల చేసింది.
ఇప్పుడు స్థిరపడ్డాను.
స్థిరపడ్డాకే నువ్వు కనిపించావు.
నీ ఆశలు, ఆశయాల అర్ధం తెలుసుకున్నాకే
ఇష్టం అనిపించింది.
నా లక్ష్యమూ కనిపించింది.
అందుకే, ఈ ఎద తలుపులు తెరిచింది.
వెలుగులు పరిచింది.
నీ మార్గం సుగమం చేసి,
నా హృదయంలో రాణివాసానికి
సాదరంగా ప్రేమాహ్వానాన్ని పంపింది.


Sunday, December 15, 2013

మరణావస్థ
మరణించిన కళ్ళ మసకేసిన అద్దాలవి
అక్కడ, అన్నీ
జ్ఞాపకాల ఏడుపులే ....
భయంకరమైన కన్నీటి చారలే.

అది బ్రతకడానికి చేసే
పోరాటం అని అనుకోను.
కళ్ళముందు ఆకశ్మికం గా కనిపించిన 
మృత్యువును చూసిన అచేతనావస్థ అనుకుంటా.

ఎంతో లోతుగా నన్ను ఎవరో
భూస్థాపితము చేయబోతున్నట్లు,
బలంగా శవపేటికపై వొరుసుకుపోయేలా
నన్ను ఎవరో తాళ్ళతో కట్టేస్తున్నట్లు,

కాకుల్నుద్దేశించి, తన అయిష్టాలే ఇష్టాలని జరిగే
పిండం ధానాల బంతుల్లాంటి ముద్దలు ....
చేసిన పాపాల ప్రభావాన్నుంచి స్వర్గానికి
సాగనంపే షార్ట్ కట్ల దారులు అవి అనే నమ్మకాలు.

ఏ శతృవు కూడా ఊహించని,
ఇష్టపడని శిక్షలు, ఆ చీకటి విస్తరణలు
సహచరిణిని సౌందర్యరహితంగా
మార్చే సాంప్రదాయ ప్రక్రియలు అవి.

మరణించిన నా కళ్ళ మసకేసిన అద్దాల్లో
అక్కడ, అన్నీ
అనుబంధాల ఏడుపులే ....
భయంకరమైన కన్నీటి చారికలే.

చివరికి నా అస్తిత్వం యొక్క యెముకలు
రంగును కోల్పోయి మట్టేసిపోతున్నట్లు ....
ఔనూ! బ్రతికున్నప్పుడే చేసిన పాపాల్ని
కొన్నింటినైనా సేవ, ధర్మాల తో కడిగి, తగ్గించుకుంటే,


Saturday, December 14, 2013

శిఖరారోహణ ఒక భూమి ప్రయాణం లాంటిదే ఈ జీవనయానం
బయలుదేరిన చోటుకే తిరిగిరాకతప్పదు.
తనచుట్టూ తాను తిరుగుతూ .... గుండ్రంగా భూమి
కొన్నిచోట్ల సమతలంగా, కొన్ని సమయాల్లో సులభంగా
అప్పుడప్పుడూ, అక్కడక్కడా .....
ఆ మొండి మైదానాలు, ఆ దూరాభారాలు
ప్రేమానురాగభావాలు, కష్టతరమై నిలువెత్తున
మీదమీదకు వచ్చిపడే ఆ సమశ్యలు .... బాధలు,
ఆ నిలువెత్తు సమశ్యల శిఖరాలు
అదిరోహించగలిగిన క్షణాల్లో మాత్రం .... ఒక్కోసారి,
అది ఒక అద్భుత పక్షి వీక్షణ.
అది ఒక అత్యున్నత జీవనావిష్కరణ,
ఆ క్షణాల్లో కళ్ళు సంతోషంతో నిండిపోవడం,
గాలిలో ఎగిరిపోతున్నట్లు అనిపించడం,
ఆ విజయోత్సాహాన్ని గళమెత్తి పాడాలనిపించడం,
ఆ ఆనందం అందరికీ పంచుకోవాలనిపించడం ....
ఒక పల్లవించిన చైతన్య సుమం .... ఆ భావన.
అది అంతటితో ఆగని ప్రయాణం ..... అది ఒక పురోగమనం.
ఉన్నత శిఖరాల మీంచి, మరోవైపు నుంచి క్రిందికి దిగివస్తూ,
దారి వెంబటి ఆదర్శ కేతనాలెగురవేస్తూ, కదులుతూ ....
ఆ పాదాలు తాకి శిల అహల్య అవుతూ, అది ఒక
అవిశ్రామ గమనం .... అనుభవపాటాలకు అక్షరరూపాన్నిస్తూ పోతే,

నీవెవరివి? నా
మనోవినీలాకాశం లో
ఎన్నినాళ్ళుగానో
నేనెదురుచూస్తున్న
నా ఊహల గమ్యం
స్వర్గం లో
ఆ మధుర భావహాసం
తారవు .... నీవా!
నా రాత్రుల్ని
ప్రకాశవంతం చేసే
ఆ వెన్నెల నవ్వు
మార్గదర్శక కాంతి వా?
నా కలల గమ్యం,
హృదయావేశానివా?
నా ఆశల, ఎదురుచూపుల
ప్రియ రూపానివా .... ?
ఎవరివి? ఇంతకీ నీవెవరివి??