Wednesday, December 18, 2013

వడలి రాలుతున్న పూరేకును



 


















అలసిన సూర్యాస్తమయ వేళ .... నేను,
ఇంకా పరుగులుతీస్తూ ఉన్నాను.
ఇంటికి, నా ఆలోచనలకు దూరంగా
శిల్పం లా మలిచేందుకు అనువైన
ఒక శిలాహృదయం నా కోసం ప్రతిష్టాపించుకోవాలని
వెదుక్కుంటూ తిరుగుతున్నాను.
తపిస్తున్నాను .... అహరనిశలు.
మనసులో, హృదయం గోడపై పుట్టుమచ్చలా
మిగిలిన నీ ముఖం ....
కనపడకుండా చూసేందుకు
క్రొత్త దృష్టితో .... ప్రపంచాన్ని చూసేందుకు.
.......................
కారణం నీవే అని నీకు తెలుసా?!
.........................
అమాయకత్వం ....
నీ ముఖం చూసిన ప్రతిసారీ,
నిజం!
నన్ను నేను దాచేసుకుందుకు చేసిన ప్రయత్నం
ఎందుకో .... మనం ఎదురైన ప్రతిసారీ
శృంగభంగుండ్నయ్యేవాడ్ని.
నిన్నొదిలెళ్ళలేకపోయేవాడ్ని.
నీవు ఒదిలెళ్ళేప్పుడు మాత్రం
మనసెందుకో వడలిన పువ్వు లా అయి
ఒక్కో కణాన్నై నన్ను నేను కోల్పొతున్నట్లు
నాలోని కణాలన్నీ నన్నిడిచెళుతున్నట్లు అయ్యేది.
నిజం ప్రియా! అప్పుడు,
నాలో నేను గుండెపగిలేలా అరిచేవాడ్ని.
నీవు వచ్చేదానివి కాదు.
బదులిచ్చేదానివి కాదు. నేనున్నానని.
నీకోసం వెతుక్కునేవాడ్ని!
నువ్వక్కడుండేదానివి కాదు!
నా మనోవొకారం మినహా ....
నేను నిదురిస్తున్నప్పుడు .... అక్కడా నీకోసమే చూసేవాడ్ని.
నీవు దూరం గా ఎటో చూస్తూ .... కనిపించేదానివి.
నేను విశ్చిన్నమైపోయేవాడిని. బావురుమని ఏడ్చేవాడిని.
...............
అప్పుడు, ఆ క్షణాల్లో
వడలిపోతున్న పువ్వును లా
రాలిపోతున్న ఆశలు రేకుల్లో రేకును లా .... నేను
తుఫాను ఉప్పెన తాకిడి తగిలినట్లు అల్లల్లాడుతూ
నాతో నే మాట్లాడుకుంటుండేవాడిని.
వరదలో కొట్టుకుపోతున్నట్లు,
సుడిగుండం లో చిక్కుకున్నట్లు,
అర్ధం కాని లోతు తెలియని ప్రవాహం లో
కొట్టుకుపోతున్నట్లు ....
శరీరమంతా చలి, గడ్డకట్టుకుపోతున్నట్లు
ఒడ్డుకు చేర్చే మృదు హృదయం కోసం వెదుకులాడుతున్నట్లు,
నేను .... ఒక వడలి రాలుతున్న పూరేకును లా ఆ క్షణం లో.

4 comments:

  1. ఏదో కలలా సాగింది కవిత, కొన్ని భావాలు ముఖ్యంగా మానసిక సంఘర్షణా చాలా బాగా చిత్రించారు.

    ReplyDelete
    Replies
    1. "ఏదో కలలా సాగింది కవిత, కొన్ని భావాలు ముఖ్యంగా .... మానసిక సంఘర్షణా చాలా బాగా చిత్రించారు. "
      చిత్రణ బాగుందని స్పందన అభినందన
      అభివాదాలు ఫాతిమా గారు!

      Delete
  2. భావుకత చాలా బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. భావుకత చాలా బాగుంది చంద్రగారు.
      ఏకీభావన స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete