Saturday, December 28, 2013

ఒక మంచి కల కంటున్నా!



 










చాన్నాళ్ళయ్యింది బాధపడటం మినహా ఆశ్చర్యపోవడం మానేసి. .ప్రతి రోజు పసి మరణాలని విని, చూస్తూ మనసు తరుక్కుపోతుంది.

ఇక్కడ, ఎవరికీ ఎవరి గురించీ ఆలోచించే సమయమే ఉండదు. ఉదయం లేచామా ఆఫీసుకు వెళ్ళామా, సాటివారితో సమం గా డబ్బు సంపాదించామా, ఆస్తులు పోగు చేసామా, ఆకాశహర్మ్యాలు కట్టామా అని ఆలోచించడంతో నే సరిపోతుంది.

ఒక్కోసారి చీదరేస్తూ ఉంటుంది. తొలి పుట్టినరోజైనా జరుపుకోకుండా తల్లీ తండ్రీ ఎవరో కూడా తెలియని పసికూనలు కొందరు నడిరోడ్డు మీద అడుక్కుంటూ అకలితో అల్లాడుతూ ఉంటే .... కొందరం మాత్రం అద్దంలో ఫిజిక్ ను చూసుకుని "కాస్త బరువు పెరిగాను. తగ్గితే యింకా నాజూగ్గా ఉంటాను" అని అనుకుంటున్నప్పుడు.


 











అప్పుడప్పుడూ నాకు వినాలనిపిస్తుంటుంది. ఆనందం, ఆహ్లాదం గా ముగిసిన అనాద కథ ఏదైనా .... అది ఎవరి ఆలోచనల్లో అయినా ఉంటే .... వినాలని ఆశగా ఉంటుంది. అది అభూతకల్పనే అయినా సరే .... అది చిత్రంగా, నూతనంగా అనిపించినా సరే వినాలనిపిస్తుంటుంది.

అందరూ ఒక్కరుగా ఆలోచించి, కలిసి కష్టసుఖాల్ని పంచుకుంటున్నారని .... ఎవరైనా చెబితే, మనసు విప్పి మరీ వినాలనుంటుంది. అలా పంచుకోవడం లో ఎంతో ఆనందాన్ని పొందుతున్నామని ఎవరైనా చెబితే ఒళ్ళు మరిచి మరీ వినాలనుంటుంది.

ప్రకృతి వనరులేగా అన్నీ. ప్రతి ఒక్కరూ భూమి పుతృలమేగా ....

అందరమూ బ్రతికేందుకు కావలసిన అన్ని వనరులు ఆ ప్రకృతి బిక్ష అని పగలూ రాత్రీ నమ్మే వాళ్ళలో నేనూ ఒకడ్ని. ఒక బాలుడు కావొచ్చు ఒక బాలిక కావొచ్చు ఏ దుమ్మూ దూళి చెత్తకుండీలు, బస్సు షెటర్స్, ప్లాట్ ఫార్మ్ ల మీద ఆహారం కోసం ఒకరితో ఒకరు కలబడటం తగదని .... ఆ పసి కూనలకు చాలినంత ఆహారం అత్యవసరం సామాజిక న్యాయం అని అనిపిస్తుంటుంది.

నేను అతిగా ఆదర్శాలు చెబుతున్నానని, కలల్లో జీవిస్తున్నానని అనిపిస్తుంది కదూ. ఏం? నాకు కలలు కనే హక్కు లేదా? ప్రపంచం లో అందరూ సుఖ శాంతులతో కలిసి జీవించాలని అనుకో కూడదా?


 











రాజకీయం కోసం గానీ, మనసు ద్రవించి కానీ, ఆదర్శం పల్లవించి కానీ .... మనలోనే ఎందరో అప్పుడప్పుడూ అంటూ ఉంటారు గా! ఆ కల నిజమయ్యే రోజు ఎంతో దూరం లో లేదు. నాకు గానీ ఒక్క అవకాశం దొరికితే కార్యాచరణతో సిద్దంగా ఉన్నాను. "ఈ బీదరికాన్ని పారద్రోలుతాను. దార్ద్ర్యం విషవృక్షాన్ని కూకటి వేళ్ళతో పెకలించేస్తాను" అని అంటుంటారుగా .... వారి మాటలు నిజం అయితే బాగుణ్ణని కల కంటే తప్పేముంది.

స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా నేను ఆశ్చర్యపోయేది బాధపడేది మాత్రం ఒక్కందుకే? పసి ఆఖలి నడివీధుల్లో, ఆ నాలుగురోడ్లకూడళ్ళలో నాట్యమాడుతూ నాగరికత నవ్వుకుంటుండటమే? మంచి మనుషులుగా గుర్తించబడ్డవారు కూడా జాలి పడటాన్ని మించి చాలా వరకు ఆ పసి ఆఖలిని ఎదుర్కునే ప్రయత్నం చెయ్యక పోవడమే .... ఆఖలి మహమ్మారిపై అంతిమ పోరాటానికి సిద్దం కాకపోవడమే!

6 comments:

  1. మనస్సును కదిలించే ఇలాంటి సంగటనలు రాయండి, ఇలాంటివి లిఖించండి,
    తల్లి ఎవరో తెలీక, అన్నానికి అల్లాడే ఆబిడ్డల ఆక్రనందనలు కలాల బాకాలతో చెవిటి సమాజాన్ని నిద్రలేపండి,
    సిక్స్ ప్యాక్ అబ్బాయిలకూ , నాగరికత అమ్మాయిలనూ ఆకలి కేకలు ఉంటాయని హెచ్చరించండి,
    యువతకు తెలియాలి, వచ్చే తరాన వారి బాద్యత ఏంటో,
    మురికి గుంటలో.. తేలియాడే పాచిపోయిన ఆహారపదార్దాలను ఏరుకుని తినే అనాదలు, కుక్కలతో కలబడి ఎంగిలాకులు నాకే అన్నార్తులూ ఉన్నారు,
    కలానికి బలం ఉంటుంది, దాన్ని వెన్నెల్లో ఉంచొద్దు వేడి తగలినివ్వండి,
    సర్, ఈనాటి మీ రచనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. "మనస్సును కదిలించే ఇలాంటి సంగటనలు రాయండి, ఇలాంటివి లిఖించండి,
      తల్లి ఎవరో తెలీక, అన్నానికి అల్లాడే ఆబిడ్డల ఆక్రనందనలు కలాల బాకాలతో చెవిటి సమాజాన్ని నిద్రలేపండి,
      సిక్స్ ప్యాక్ అబ్బాయిలకూ , నాగరికత అమ్మాయిలనూ ఆకలి కేకలు ఉంటాయని హెచ్చరించండి,
      యువతకు తెలియాలి, వచ్చే తరాన వారి బాద్యత ఏంటో,
      మురికి గుంటలో.. తేలియాడే పాచిపోయిన ఆహారపదార్దాలను ఏరుకుని తినే అనాదలు, కుక్కలతో కలబడి ఎంగిలాకులు నాకే అన్నార్తులూ ఉన్నారు,
      కలానికి బలం ఉంటుంది, దాన్ని వెన్నెల్లో ఉంచొద్దు వేడి తగలినివ్వండి,
      సర్, ఈనాటి మీ రచనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను."
      ఒక గొప్ప ఉద్వేగ భరిత వ్యాఖ్య స్పందన అతి పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను.
      ధన్యవాదాలు సామాజిక కవయిత్రి మెరాజ్ గారికి! శుభోదయం!!

      Delete
  2. మీలా, నాలా, మనలాటి కొందరిలా అందరూ ఇలా కల గనాలని ఆ కల సాకార దిశగా అడుగులు వేయాలని ఆశిస్తున్నాను. సామాజిక స్పృహ ను మేల్కొల్పేలా చక్కగా వ్రాశారు

    ReplyDelete
    Replies
    1. "మీలా, నాలా, మనలాటి కొందరిలా అందరూ ఇలా కల గనాలని ఆ కల సాకార దిశగా అడుగులు వేయాలని ఆశిస్తున్నాను. సామాజిక స్పృహ ను మేల్కొల్పేలా చక్కగా వ్రాశారు."
      హరిత గారు ముందుగా మిమ్మల్ని నా బ్లాగుకు స్వాగతిస్తున్నాను.
      చాలా చక్కని స్పందన సామాజిక స్పృహతో కూడిన కవితలను ప్రోత్సహిస్తూ
      ధన్యవాదాలు హరిత గారు! శుభ ఉషోదయం!!

      Delete
  3. సమాజంలో ఎందరో సిగ్గుతో తలదించుకునేట్లు కర్తవ్యాన్ని బోధిస్తూ కలంతో మీ అంతర్యుద్ధాన్ని నూరుశాతం వ్యక్తం చేసారు,ఒక్కరిని మేల్కొలిపినా ధన్యతే. వాస్తవాలకు వాకిలిలా ఉంది చంద్రగారు .

    ReplyDelete
    Replies
    1. "సమాజంలో ఎందరో సిగ్గుతో తలదించుకునేట్లు కర్తవ్యాన్ని బోధిస్తూ కలంతో మీ అంతర్యుద్ధాన్ని నూరుశాతం వ్యక్తం చేసారు, ఒక్కరిని మేల్కొలిపినా ధన్యతే. వాస్తవాలకు వాకిలిలా ఉంది చంద్రగారు."
      ఎంతో బలాన్నిచ్చే గొప్ప కాంప్లిమెంట్ ఒక స్నేహ ప్రోత్సాహక అభినందన ఈ స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవి!

      Delete