Friday, December 6, 2013

ఒక్కసారైనా ....


 











నేను నేనులా ఉండాలననుకుంటున్నా!
నా భావనల్ని పండించుకోవాలని,
నా కాళ్ళమీద నేను నడవాలని .... అనుకుంటున్నా!
మంచైనా, చెడైనా మనసుకు నచ్చిన విధంగా చెయ్యాలని,
ఈ సమాజం ఏమనుకుంటుందీ అని ఆలోచించకుండా,

ప్రేమించలేని, ద్వేషాన్ని భరించలేని పసివాడ్నిగా ....
కావాలని లేదు. ఏ సాహసమూ చెయ్యలేని
మనోధైర్యం లేని వృద్దుడ్ని గా బ్రతకాలని లేదు.
నా జీవితాన్ని నేనే జీవించాలనుకుంటున్నా!
నా ఆశ, ఆశయాల సాధన ను ఆనందించాలని,

నేను నేనుగా అస్తిత్వంతో బ్రతకాలనుకుంటున్నా! 
ఏ కట్టుబాట్ల తాళ్ళకూ కట్టుబడాలని లేదు.
అందుకే నన్ను సరిహద్దుల్తో కట్టెయ్యాలని చూడకు!
స్వేచ్చగా జీవించాలనుంది. బయటపడాలనుంది.
నీ బంధనాలనుంచి, నీ ఆదేశాల నిరంకుశత్వం నుంచి,

నన్ను గమనించేందుకని నీ కాలం వృధా చేసుకోకు.
ఓ సమాజమా! నన్ను నన్నుగా నమ్ము!
నా గురించి మాట్లడకు! సంబంధం లేని వదంతులు పుట్టించకు!
నా ఆలోచనల్ని, నా నడవడికను, నా జీవనలక్ష్యాలను,
ప్రభావితం చెయ్యని జీవితాన్ని జీవించనీ .... ఒక్కసారైనా ....


No comments:

Post a Comment