Monday, October 22, 2012

నేను, ఆమె ... ప్రేమ!


కంట్లో నలుసులా కొంతకాలంగా నీవు
ఎన్నాళ్ళయ్యిందో ఆ చిరు మాయ
సొట్టబుగ్గల వెలుగుల్ని, నీ చిరునవ్వును చూసి
ఏ మాయామోహానికి లొంగి నిన్ను ప్రేమించానో ...
ఆ మాయ లాస్యం నాది కాదని తెలిసిందీ రోజు! ... ఏం చెయ్యమంటావు?

కలిసి తిరిగిన గతాన్ని,
అడుగులో అడుగై, ఒక్క మాట, ఒక్క చూపైన క్షణాల్నీ
మనసు గుడిలో నీవు ఉన్నప్పటి నీ ప్రేమ ప్రతిస్పందనల్నీ
సొట్టబుగ్గల్లోంచి జారిన నీ సిగ్గు మరిమళాల్నీ గుర్తుతెచ్చుకుని
నిదుర పట్టడంలేదు ... ఎందుకిలా అవుతుంది ... అదీ నాకే అని, అన్నీ ప్రశ్నలే!

ఉన్నంతలో ... లోపం లేకుండా చూస్తానని మాటిచ్చాను! అయినా!
ఆజానుబాహుడనా! ఆస్తిపరుడనా! అతన్నే ఎందుకు కావాలనుకున్నావు?
నా రక్తాణువుల్లో శక్తివి ... పరిశుద్దం చేసే ఆక్సీజన్ వి నీవని, నీకూ తెలుసు ...
నా అణువణువులో స్పందనవు, నా ఆలోచనల మబ్బుల్లో తారవు నీవే! అనీ నీకు తెలుసు ...
తెలిసీ ఇలా జరిగింది ... ప్రేమేమైనా నన్ను బుద్దిహీనుడ్ని గుడ్డివాడ్నీ చేసిందా!?.

ఇప్పుడు నేను కదలికల్లేని అబద్దాన్ని అయి పోయాను.
నిదురించలేను. ఆకలి లేదు. స్థిమితం లేదు. నా ప్రేమ వాగ్ధానాలను
కొంగుకు ముడేసానన్న నీ ముద్దుమాటలు నా చెవిలో ప్రతిద్వనిస్తున్నాయి.
మరిచిపోలేక, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా! ... కారణం నేనైతే కాదు కదా అని,
అనుమానంగా నా గుండె లోతుల్లో వెతుక్కుంటున్నాను! ... నాలో ఏ లక్షణం ఎడబాటుకు కారణం అయ్యిందీ అని,

పూదోటలో ఒకప్పుడు ... నీవూ నేనూ చెట్టపట్టాలేసుకుని తిరిగిన క్షణాల్ని
చిత్రంలా ... నా మనసు తెరమీద చూస్తున్నాను ... నీ అణకువతనాన్ని
నేను నీ చెవిలో గుసగుసలాడిన, వేరెవ్వరూ వినని పదాలు ... నీతో పాటు విన్న నెచ్చెలి, చిరుగాలి
అందుకే ... చిరుగాలిని సాక్ష్యం అడుగుతున్నా! కారణం నీకైనా తెలుసా నేస్తమా అని,
ఆ మధుర భావనల, మనసు బాసల, మేని పులకరింతల ... క్షణాల్ని నేనింకా మరిచిపోలేదు!

నీకూ తెలుసు నిన్ను ప్రేమించానని
నీవూ నన్ను ప్రేమిస్తున్నావని అనుకున్నా!
అతని పక్కన నవ్వుతూ నీవు నిలుచున్నప్పుడు,
నాకు మనం కలిసిన తొలిరోజు గుర్తొచ్చి, నీ నవ్వు నన్ను పరిహసిస్తున్నట్లు ...
నాకూ నవ్వొస్తుంది ... మనసారా ప్రేమిస్తున్నాను అన్న పదం ఉపయోగం ఇన్నిరకాలా అని,

No comments:

Post a Comment