Monday, October 22, 2012

నీ కంటి పాపను కావాలని



మిణుకు మిణుకు మనే
నక్షత్రాలు! మెరుస్తున్న నీ ... కళ్ళు!
మనసు పారేసుకునే మన్మదాస్త్రాలు ... అవి
 ప్రకృతి పదాల నెన్నో ... బాసలు పాఠాలుగా చెబుతున్నాయి.

ఆ వింత కాంతిలో,
నీ చూపు ... వెలుగు ప్రవాహం ... వరద లో,
ప్రాణం పణంగా పెట్టి ... ఎదురీదే చేపలా నేను ..
ఎదురీదే ప్రయత్నం చేస్తూనే కాలగతిని కొట్టుకుపోతున్నా!

వేల వేల జ్ఞాపకాలు పసితనపు ఆలోచనలు
ప్రేమ కథల్లా నా చుట్టూ పరిభ్రమిస్తూ,
చరిత్రలో అక్షరానివి కా అని ... మనసును  ప్రేరేపిస్తూ,
చిక్కటి నమ్మకం బలాన్నిస్తుంది ... కట్టుబాట్లను కాలరాసెయ్యమంటుంది.

ఒకరకంగా ... నేను అదృష్టజాతకుడ్నేనని అనుకుంటున్నా!
ప్రేమ జీవితాల సారమంతా గ్రోలిన,
చదివేసిన కథల కావ్యాల చిరునామాను కావాలని ఆకాంక్ష!
వెచ్చని నీ స్పర్శానుభవం పొందిన, నీ జీవన సహచరుడిగా మిగిలిపోవాలని ...

మన్మధుడి బాణం
మోహపు అంచు సూది మొన బలంగా గుండెల్లో దిగి,
ఏదో అయ్యింది నాకు  ... ప్రపంచమంతా దేధీప్యమానంగా,
సౌందర్యం సంతరించుకున్నట్లు ... నీ కళ్ళ ప్రకాశం నిర్మలత్వమే ఎటు చూసినా

ఉదయం కురిసిన మంచులా,
అసాధారణ, విలక్షణ అందం నీ కళ్ళలో ... నీలో చూస్తున్నా!
మనొహరంగా కొత్తగా చూస్తున్నట్లుంది ప్రపంచాన్ని ... నిన్ను
ఎటు చూసినా వసంతం ఆనందమే పురివిప్పి నర్తిస్తున్న నాట్య మయూరాల్లా

నీ కళ్ళలోకి చూసిన ప్రతిసారీ ...
మనసు కేదో అవుతుంది గాల్లోకి తేలిపోతున్నట్లుంటుంది.
అంతులేని ఏ జన్మానుబంధ జ్ఞాపకాల్లోకో జారిపోతున్నా!
నన్నూ నా నీడల్నీ నడుస్తున్న నా జీవన వాస్తవాల్నీ మరిచిపోతున్నా

నేనేమీ ఆశించదంలేదు!
ఆకాశాన్ని అందుకోవాలని లేదు ... నక్షత్రాలతో దోభూచులాడాలని లేదు.
నీ సహజీవిగా గుర్తించబడాలని, కలిసి సహజీవనం చెయ్యాలనుంది.
ఆ కంటి వెలుగు కు కారణం ... కంటి పాపను కావాలనుంది ...

No comments:

Post a Comment