Wednesday, June 12, 2013

ఊపిరాడ్డంలేదు


చల్లని సాయంత్రపు గాలులు
సున్నితంగా వీస్తూ,
చంద్రకాంతి
వెన్నెలతో వెలుగుతున్న ఆకాశం,
ఎక్కడో రాలుతున్న తార
నా హృదయ రోధన
నీకు వినపడే అవకాశం లేదు.

ఇక్కడ క్రింద
ఈ చెట్లు చేమ గుర్తించలేవు
నా మనోవేధన బాధ
వయ్యరంగా మెలికలు తిరుగుతూ
సాగే ఆ నదులు
ఎగిరిపడే అలల విధ్యుత్ కాంతుల్లో
నా ముఖ రాగాలు గమనించలేవు.

గడ్డిపరకల్ని ముద్దాడుతూ,
మంచుబిందువులు ....
వాటి ఆనందంలో అవి.
దూరంగా మెరిసే ఆ నక్షత్రాలు
శ్వాస బారమై ఉక్కిరిబిక్కిరౌతున్న
హృదయాన్నీ, నా తెగి స్రవిస్తున్న ....
ప్రేమ రక్త నాళాల్ని చూడలేవు.

ఓ చల్లగాలీ
చెట్లతో .... ఆకులు, పూలతో
ఆడుకున్నంత సులభం కాదు.
మనసు అలజడిని అర్ధం చేసుకోవడం!
విషాదభరితమైన గుండెను
తట్టి పులకింపచేయడం!
సూక్ష్మ భావనల సెగలు
విరహాగ్నిని చల్లార్చడం!!

విచ్చిన్నమై విసిరేసినట్లు ....
అక్కడక్కడా మబ్బుల నీడలా,
పరుచుకునున్న వెన్నెలా ....
బొట్టుబొట్టుగా కారుతున్న
ఈ కన్నీటి వర్షం
నా మౌన రోధనకు సాక్ష్యం!
ఈ విచార నిట్టూర్పు భావన
హృదయ వీక్షణ సులభం కాదు.

ఈ పచ్చిక బయళ్ళ క్రింద
ఖననం చెయ్యబడ్డ ....
నా మనోభావనలు
ఒకనాటి రెండు శరీరాలు
ఒక్కటిగా అతికివున్న బాధ
ఈ నక్షత్రాల వెలుగులోనే కోల్పోయాను.
నా ఈ మది నిశ్శబ్దం భయం
జ్ఞాపకాల వెచ్చదనం .... మరుపు సాధ్యం అనుకోను

నా హృదయం ఆకాంక్షించడం లేదు
బ్రతిమాలుకోవడం లేదు.
ఏ పిల్లగాలుల్నీ,
చిరు జ్ఞాపకాల సవ్వడుల్నీ రమ్మని ....
ఓ చిరుగాలీ .... నా జ్ఞాపకాలతో,
నన్ను తడమొద్దు!
మనో భావనల్తో ఆటలాడుకోవద్దు!
నా ఎద చేరి శ్వాస ఆడకుండా ఆపెయ్యొద్దు!

No comments:

Post a Comment