Tuesday, June 4, 2013

మరుపురాని బంధం



ఏ రహదారిలో ఎక్కడో
అనామకుడిలా నేను
నింపాదిగా నడుస్తూ ఒకరోజు
ఏ సమూహం లోనో ఉన్న
ఏ మొహాన్నో చూసి
నువ్వనుకుని నవ్వుతాను
అప్పుడు
నా పెదాలపై ఒకప్పుడు
నీవు పూయించిన నవ్వులు
వాటి ప్రకంపనలు ....
బుగ్గలు సొట్టలు పడ్డ గతం
కళ్ళ ముందు కదులాడుతుంది.

దగ్గరకు రా!
నా కళ్ళలోకి చూడు!
ఆ కనుపాపల్లో .... సుందర దృశ్యాల్ని
అక్కడి అందాన్ని అద్భుతాల్నీ
ఆ పారదర్శకతను
నీ మాటల్లో వినాలనుంది.
నీవు వినాలనిపించేలా చెప్పాలి.
కాలంతో పాటు
హిమస్పటికంలా మారిన మన ప్రేమ
ఇద్దరూ ఆడి
ఇద్దరం విజేతలమైన వైనం
నాకింకా గుర్తుంది.
నన్ను ఓడించకుండానే నీవు గెలవడం

ఆనాటి ఉద్రేకం చైతన్యం
యౌవ్వనం ముదిరి
ఇటీవలి కాలంలో ....
ఆ ప్రేమాగ్ని నివురు కప్పుకు పోయి
ఆ పిదప
పిండి ఆరబోయని వెన్నెల రాత్రిళ్ళు
అనాసక్తిగా కాలం గడుస్తూ
గతం గుర్తుంచుకోవడం కష్టం అనిపించేది.
అయినా,
గుర్తు తెచ్చుకున్నాను.
మది పొరల్లో భద్రంగా
దాచుకున్నాను నిన్నూ .... నీ జ్ఞాపకాల్నీ!

ఎన్నో కొత్త సంవత్సరాలు.
వెంటనే పాతబడిపోయేవి.
మన జ్ఞాపకాలకు మాత్రం
వయస్సు రాలేదు.
మరింతగా బలోపేతమయ్యాయి.
ఎదను తట్టే ఆ జ్ఞాపకాలకు గుడ్ బై
చెప్పలేని స్థితే ఇప్పటికీ,
నిజమైన ప్రేమ ....
హిమవన్నఘం లా
కాలంతో పాటు గడ్డకట్టి రాయిలా మారింది.
ఆనాడు మనం ఆడి గెలిచి 
నేడు కాగితం పై
కదులుతున్న ప్రేమ భావనలం!
ఒకరికొకరు బహుమతులమైన ప్రత్యర్ధులం! 

No comments:

Post a Comment