Saturday, February 20, 2016

అస్పష్టతను నేను


నీ తోడనే ఉన్నాను ఎప్పుడూ
నీ ఆలోచనల్లోనే నీ వెంటే నడుస్తూ
అప్పుడప్పుడూ
నన్ను చూసి నీవు భయపడేలా చేసే
నీ నీడను నేను

చీకటిలా ఉండి ప్రాకుతూ
చూసేందుకు నేను శూన్యాన్నే కానీ
నీతోనే ఉంటుంటాను ఎప్పుడూ
నిన్నే గమనిస్తూ ....
నీ వెనుకో, పక్కనో, ముందో కదులుతూ

ఎప్పుడూ నీకు తెలిసేలాగానే ఉంటాను.
ఒక్కోసారి అతి చిన్నగా ఒక్కోసారి అతిగా
ఎప్పుడూ నిన్ను ఆలోచింప చేస్తూ
ఎంతో దగ్గరగా ఉండి
ఎప్పుడు ఎలా భయపడాలో తెలుపుతూ

నీ ఇంటి గోడలమీద నర్తిస్తుంటాను.
ఒక నీడలా, ఒక ముదురు కళంకం లా
అసకమసక గా అక్కడే
నీ పక్కన .... ఒక అస్పష్ట అస్తిత్వాన్ని లా
నీ వైపే తదేకం గా చూస్తూ

ఒక ప్రచ్ఛాయను లా ఎప్పుడూ
నీ ఊహల్లో జీవిస్తూ
నీ చుట్టూ .... నీ నీడల్నే తిప్పుతూ
ఏ ఎత్తిపొడుపు శూన్యం లా నో
ఏ ఉపరితలం భూతం లా నో

మసకచీకటి మంద్రపడుతున్న
ఏ చీకటి అంధకారాన్నో అయ్యి
సగం జీవితం రాత్రిళ్ళు నీకు కనబడను కానీ
నేను అక్కడే ఉంటాను ఎప్పుడూ
నీ పక్కనే తచ్చాడుతూ

మసకను చూసి భయపడేవు
సున్నితంగా స్పర్శించి చూడు
ఎందుకంటే
నేను అనే నీడ .... నీ సృష్టే
నీవే కారణానివి .... బ్రహ్మవు నా జన్మకు

నిన్ను ఒదిలి నేను ఎటూ వెళ్ళను.
నీవు కృశించినా మరణించినా
నీ నీడనయ్యే ఉంటాను
నిన్నే గమనిస్తూ పరిబ్రమిస్తూ
రూపాంతరం చెందుతూ నీతోనే ఎప్పుడూ

No comments:

Post a Comment