Saturday, June 13, 2015

అమ్మ ఒడి రాగం


కళ్ళు మూసుకో, భయపడకు
ఉరుములకు భీతిల్లకు
రక్కసి దూరంగా పారిపోయింది.
ఈ చీకటి కూడా చెరిగిపోక తప్పదు.
అమ్మను నేను
నీ పక్కనే ఉన్నాను.

నా బుడ్డీ, నా మున్నీ, ఓ నా తల్లీ
నిద్దురపోవాలనుకున్నప్పుడు,
నీవు చిరు ధ్యానం చెయ్యి
ప్రతి రోజూ, ప్రతిక్షణమూ అన్ని విధాలా
నీకు మనోధైర్యం, నమ్మకం పెరిగి
మనోప్రశాంతత దొరికేలా

ఎన్నినాళ్ళుగానో ఈదుతూ ఉన్నాను
ఈ సాగరం .... జీవితాన్ని బాధ్యత గా
ఎదురు చూస్తూ ఉన్నాను
నువ్వు ఎదగాలి తొందరగా అని
తొందరపడకుండా .... ఆశగా
నిమిత్తమాతృరాలినై .... కాలంతో పాటు కదులుతూ 


ఎప్పుడైనా, తెలియని మార్గంలో
కదిలే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రం
నీ ముందు నా అనుభవముంది. చెయ్యందుకో
జరగబోయేదే జీవితం .... అయినా
నీ ప్రయత్నాలు, నీ కలలు, నీ ఆశల
క్రమ సరళి ని నీవే నిర్ణయించుకోవాలి.

ఓ బుజ్జీ, ఓ తల్లీ, ఓ నా ప్రాణమా
నిద్దుర లేస్తూనే, పంచభూతాలనే తోడుగా
నవ్య నవచైతన్య రాగానివై
కదులు ముందుకు ముందుకు
మానవీయత పరిపూర్ణత వైపు
కాంతులు ప్రకాశం పరిసరాల్లో వెదజల్లుతూ

No comments:

Post a Comment