నిద్దుర రాదు,
తల నిండిన నీ ఆలోచనలకు
లొంగిపోయి
తగదు తగదని అరుస్తూ
లోలోపల
నీకు వినపడే అవకాశం లేదు,
వినపడినా నీవు వినవు
నాకు తెలుసు
తెలిసే తప్పదనుకుని నాకు ఇష్టమైన
ఏ లక్షణానికో అతుక్కునుంటాను.
నీవు మాత్రం
నా బుర్రను తొలుస్తూ ఉంటావు
భయపెడుతుంటావు
అంతకు మించి భిన్నంగా
ఏమీ ఉండదు.
ఎక్కడికి పారిపోలేను పోయినా
మనం మనమనే చోటుకే చేరి
అలిసి నీ ముద్దులకు లొంగిపోతాను.
వద్దు కాదు కూడదనుకుంటూనే
భావనలను తొక్కిపట్టి
కానీ
నీ ఆలోచనలకు మాత్రం
దూరంగా పారిపోలేను
నిన్ను తాకకుండా ఉండనూలేను
ఒకరి వలలో
ఒకరి ప్రేమలో ఒకరు సుస్థిరమైనట్లు
బద్దకపు లక్షణాల సౌకర్యాలకు లొంగి
కాసింత అసౌకర్యంగానూ ఉంటాము
అంతవరకే మనకు తెలుసు.
మన మనోభావనల ప్రభావం తో
మనకు సంబంధం లేకుండా
నడుచుకుంటాము.
మాట్లాడుకుంటాము
వింత వింత వాగ్దానాలు చేస్తుంటాము.
చివరికి మనం
మనమున్న చోటుకే చేరుకుంటాము.
స్థిమితపడుతుంటాము.
నాలో నీ మది పలుకుల్ని విని చూడు
నీకే అర్ధం అవుతుంది.
No comments:
Post a Comment