నాకు నీవు జన్మజన్మాలుగా తెలుసని
నీకు కూడా విడమర్చేఅంత లోతుగా
నీ మనోభావనల విశిష్టతను
నీ చిరునవ్వును
సూక్ష్మంగా చూడగలనని
నీకు కూడా తెలుసు
ప్రేమ భావన అనే దారం
మన అనురాగం పూపరిమళాలను
అల్లుకుని ఇరువురిని ఒక్కరుగా
కట్టిపడెయ్యాలని చూస్తుందని
నీ కళ్ళలో చూడగలుగుతున్నాను
నా కలల జీవన గమ్యాలను
నీ కనుసంజ్ఞలలో చూడగలుగుతున్నాను
ఎన్నో శేష ప్రశ్నల సమాధానాలను
చూస్తున్నాను .... నీకూ నాకూ మధ్య పెంపొందిన
అమర ప్రేమబంధం కారణాలను
చూస్తున్నాను .... జీవ సాగరంలో మనం అనే నావ
సురక్షితంగా ఒడ్డుకు చేరగలగడాన్ని
నీ సాహచర్యం లోనే .... అర్ధం చేసుకోగలుగుతున్నాను
ఇంతగా నీ పట్లే ఎందుకు ప్రేమో నాకు అని
కాలం తో పాటు జీవితమూ మారుతుందని
గమ్యాన్ని ఎవరమూ నిర్ణయించలేము అని
కాలమే మనుషులను
అపరిచితులుగానో ఆత్మీయులుగానో చేస్తుందని
మనిషిలో మార్పుతో పాటు
పురోగమనాన్నీ కాలమే నిర్దేశిస్తుంది అని
ఆ కాలచక్రం పరిభ్రమణలోనే
సమయంతో పాటు దారులూ మారుతూ
ఒక్క ప్రేమ మాత్రమే శాశ్వతం అన్నావు.
ఆ ప్రేమ కోసమే నా తపన .... మానసీ
No comments:
Post a Comment