Saturday, June 28, 2014

ప్రత్యేకించి .... ప్రత్యేకతను చూస్తున్నాను నీలో





నా మనః పరిణామ స్థితి, నీకు తెలియపర్చాలనుండేదెప్పుడూ
నువ్వెక్కడో నేనిక్కడో ఉన్నా అరమరికల్లేని విధంగా .... నా ఆలోచనల్లో ....
అనుక్షణం నీ గురించి తెలియని ఏదో సంవేదన, పరితపన
గుండెలు నిండిన ప్రాణవాయువు లా అంతా నీవే అయి .... మార్చలేని ప్రేమ బంధం లా

అదే భావన, అదే తపన .... ఎప్పుడూ మనసెందుకో ఆరాటపడుతూనే ఉండేది.
అసందర్భమే అయినా ఏదో ఒకటి ముచ్చటిస్తుండాలని .... నీతో ఒంటరి ఏకాంతం లో ….
నా కలలకు రెక్కలుంటే బాగుంటుందని .... గగనసీమలకు నిన్నెగరేసుకుపోవచ్చని
నీకు తెలుసా!? వెదుక్కుంటూ ఎగురుతూ తిరిగి .... నీవెక్కడ ఉన్నా నీ చుట్టూ పరిబ్రమిస్తుండాలని 




ఎప్పుడైనా మది లో నీవు .... మెలుకువగా ఉండి, తారసపడితే .... పరామర్శిస్తే .... చిత్రం!
నీవు నా పక్కనే ఉన్నట్లు, బుజ్జగిస్తున్నట్లు .... నా మది స్థిమితపడి .... భారం తగ్గిన భావన
నిజంగా భవిష్యత్తును గురించి ఇంతగా కలలు కనడం అవసరమా .... అనిపించినా
నా ప్రేమ ఫలించి నీ సాహచర్యం లో .... పడిన కష్టం, ఒంటరితనం, బాధ మరచిపోగలనని సర్ధిచెప్పుకునేవాడ్ని.

ఎందుకో చెప్పుకోవాలనిపిస్తుండేది ఎప్పుడూ .... నా జన్మకు ఈ ఉద్వేగానికీ అన్నింటికీ .... కారణం నీవని
కాలగమనం లో ఎక్కడైనా నిర్దేశించబడి కానీ, యాదృశ్చికంగా కానీ .... నీవూ నేనూ ఎదురెదురైతే
ఒక్కటయ్యే పరిస్థితే వస్తే .... నా హృదయాన్ని విప్పి నీ ముందు పరిచెయ్యగలనుగా అనిపించేది
అన్నాళ్ళూ దాచుకునున్న నా ప్రేమ మాధుర్యాన్నంతా పంచుకోగలనుగా అని అనిపించేది.

ఊహలలో, కలలలో నీతో విన్నవించుకోవాలనుకునేవాడిని .... ఆ ఊహలు కలలు కరిగిపోయేయి.  
నా ప్రపంచమూ, నా మనసంతా నీవే అని .చెప్పుకోవాలనుకునేవాడిని …. నా ప్రేమ చరిత్ర లో శిలాక్షర పదాలు
నా పేరుపక్కనే, నీ పేరుండాలని, నా ఆకాంక్షని నీతో చెప్పుకుంటున్నట్లు నాకు నేను చెప్పుకునేవాడిని.
ఎందుకో తెలుసా!? నీవు నా జీవితం లో మార్పుకు కారణానివి .... నా జీవితానికో దిక్సూచివి కావాలని. 




మరి ఇప్పుడు నా ఊహలు, కలలు ఆశలు పండి నా తపస్సు ఫలించి నీవు నా పక్కనే ఉన్నావు.
నా కష్టం, బాధ ఆలోచనల్ని నీ నీడలో దాచుకుని ప్రేమ మాధుర్యాన్నై కరిగి నీ రక్తం లో కలిసిపోవాలనుకుంటున్నాను.
ఈ ప్రేమ, పరితపన …. నిజం! ఇప్పుడు రేపును గురించి కలలు కనాల్సిన, ఒంటరి బాధను భరించాల్సిన అగత్యం లేదు నాకు.
ఆకాశమే దిగొచ్చిన ఈ అనుభూతి .... నీ  పక్కనే నడిచి జీవితం వరాన్నాస్వాదించాలనిపిస్తుందే కాని..

No comments:

Post a Comment