Thursday, May 21, 2015

నిర్లిప్తత


చెత్తలోకి జారిన పారవేసుకున్న ఆశలు
నిన్నటి కలలు
తియ్యని జ్ఞాపకాలు
డైరీలో అక్షరాలు
పదాల పొదరిళ్ళు వెక్కిరిస్తున్నట్లై .
ప్రతి సందేశం తోనూ
ఒక అనుభూతి తలపు ఏడిపిస్తుంటే
డైరీలోంచి చింపి తొలగించాను.

కేవలం మూర్చిల్లిన శబ్దం లా
పేలవమైన నవ్వొకటి
హృదయం లోంచి పరామర్శలా
రాలీ రాలని కన్నీరు రుచి పెదవుల్ని తాకింది.
ఓదార్పు మాటల సన్నిహితులు
కొన్ని స్మృతుల్ని అతికించి మరీ వెళ్ళిపోయారు.
నాటి నా ఆత్మరాగ పదాల మాధుర్యాలు
నన్ను విఛ్చిన్నం చేసేలా చేసి

ఉనికంటూ లేనట్లు
అన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే
చుట్టూ ముసురుకుని నన్ను ....
జరిగిన ఉపద్రవం ఆలోచనకు తావివ్వలేక
నిశ్శబ్దంలో కలిసిపోయిన నొప్పిని విస్మరిస్తున్న క్షణాల్లో
రాలిన నిర్లిప్తత భావమే కొన్ని పదాలుగా
రూపుదిద్దుకుని, సిరా స్మశానంలో
నాలో నేను సంభాషిస్తూ ద్రవిస్తున్నాను.

No comments:

Post a Comment