Saturday, May 16, 2015

పోరాడితేనే ఫలితం



చల్లటి చల్లదనం నవనాడుల్నీ స్తంభించిపోతూ
యాంత్రికంగా పడే అడుగుల .... కవాతు, జడత్వం
రక్త ప్రసరణ వేగం పెరిగి, నరాల అరుపులు
జవాబు లేని సహాయం కోసం ఏడ్పులు
శరీరం లో కణాలు చచ్చి కుళ్ళిన దుర్వాసన
ప్రతి క్షణమూ చావును సమీపిస్తున్నట్లు
ముదురు మబ్బులు అన్ని వైపుల్నుంచీ
ఆకాశాన్ని కమ్ముకుని
ఒక్కో చిన్న మేఘం ఒక్కో మనిషినీ 
అనుసరిస్తూ కమ్ముకుంటూ మీదపడిపోతున్న వృద్ధాప్యం అయి
ఇక్కడికి ఏ సూర్యుడూ రాడు.
వెచ్చదనం నమ్మకం ధైర్యం ను పంచేందుకు
ఇక్కడ మిగిలేది చివరకు అస్తికలూ బూడిదే
యాంత్రికమో ఉద్దేశ్యమో .... నడుస్తాము, శ్రమపడతాము
అయినా స్తబ్ధమై ఎదుర్కొనీ సాధించలేని సమయాల్లో
లొంగిపోతుంటాము .... పరిస్థితులకూ, కాలానికీ
ఇది నిజం మాత్రమే కాదు, సాధించలేని అవాస్తవం కూడా
ఇది ప్రతి రోజూ తంతు మెలుకువలోనూ నిద్దురలోనూ తప్పించుకోలేని స్థితి.
భయం నీడలు ముసురుకుని, భయం తో నిద్దుర రాదు
జ్ఞాన .... ఇంద్రియాలు దిగంబరమై, తెలిసింది కూడా మరిచిపోయి
చావైనా వస్తే బాగుణ్ణు అని మనమే మనసారా కోరుకునేలా
అంతరంగం లో నాదికాని ఏదో శక్తి ఉందనిపిస్తుంది.
అది ఎప్పుడూ అరుస్తునే ఉంటుంది న్యాయం, న్యాయం ఎక్కడా అని
ఆ నీడలు మబ్బుల ప్రభావమే మన సమాధుల్ని మనం 
కరుడుగట్టిన నేలల్లో యంత్రాల్లా తవ్వుకునే లా చేస్తూ
ఆ నీడల ఆనందపు చిరునవ్వులే .... వెన్నులో చలి పుట్టిస్తూ
అది స్పష్టంగా అరిష్టమే, దుష్కర్మ....ద్వారా ఆనందాన్ని పొందడమే
ఎందుకో తెలియదు
ఇప్పుడు నాకు ఈ అపజయాన్ని ఒప్పుకోవాలనిపించడం లేదు
శతృవుతో పోరాడాలని, పోరాడాలి ప్రతి క్షణమూ అని
ప్రభావం కనిపించేవరకూ అని
ఏ మేఘాలూ, నీడలూ నా బలహీనతల్తో ఆడుకోని విధంగా
మరణం నిజంగా ముందున్నా జీవితాన్నే కోరుకునేలా
అది ఎంత కష్టమైనా .... అన్ని భయాలనూ ఎదుర్కుని
ఈ పోరాటం లో నేను ఓడిపోను. అందరికీ కనువిప్పవుతాను,
గెలిచి పురోగమిస్తాను. ప్రకృతి సహాయం తో అని అనుకునేలా
ప్రకృతి మహిమే అనుకుంటాను. ఆశ లేని క్షణాల్లో ఊపిరిచ్చినందుకు
ఏ దారీ కనిపించని వేళ నాకో దారి చూపించినందుకు
ఇంద్రధనస్సు నా ఆలోచనల్లో మెరిసినందుకు
ఆశ్చర్యం .... జీవితం ఒక పోరాటం, పోరాడాలి అని
అనుకున్నానో లేదో .... ఇప్పుడు శతృవు పారిపోతున్నాడు.
మబ్బులు కకావికలమై చెల్లాచెదురౌతున్నాయి
చూస్తున్నాను, నా శతృవు నాలోనే ఉన్నాడనే నిజాన్ని స్పష్టం గా

No comments:

Post a Comment