Saturday, May 2, 2015

ఈ ప్రేమను ఏమంటారో?


గొంతు లో మింగుడుపడని ముద్ద లా ప్రారంభమై
అగ్నిలా గుండెలో మిగిలిపోయావు
నువ్వింకా నడుస్తూనే ఉన్నావు 
నా ఆలోచనల పొలిమేరల్లో
ఈ బిస్లరీ సోడా
ఎలా అయితే నా వేళ్ళ అంచుల్లో ఉందో అలా

ఎందరో అన్నారు.
"ఏదో ఒకరోజు నీకు జ్ఞానోదయం అవుతుందిరా" అని
నాకు బాగా గుర్తు నీవు నవ్వావు, కోపం తెచ్చుకోలేదు
కొన్ని రోజుల కాలం గడిచాకే తెలిసింది
ఆత్మీయతకన్నా ఆస్తి అస్తిత్వమే ముఖ్యమని నీకు
ఎవరికోసమూ ఎవరూ పుట్టరని అన్నావు 


అప్పటివరకూ ఎప్పుడూ కనుబొమ్మల్లోనే ఉన్న నీవు
అప్పుడు,
నిద్ర లేచాక కూడా
నీ ముఖాన్ని గుర్తుంచుకోవద్దనుకునే స్తాయికి ఎదిగావు.
కొన్ని రోజులు మాత్రం
ఎంతో బాధ పడ్డాను. నీవు చేసిన పుండు సలిపి
నీవు నా తలలోనే కూర్చుని చేసిన అలజడి అధికమై

నేనొక సగటు మనిషినని, సామాన్యుడ్నని
బలహీనుడ్నని కూడా
త్యాగాలు చేసేంత గొప్పవాడ్ని కాను.
నాకు నిన్ను మరిచిపోవాలని లేదు.
మరిచిపోలేను కూడా
నా కోరికల్లా నీవూ గాయపడి బాధపడాలనే
నేను గాయపడి బాధపడ్డట్లే నీకూ జరగాలనే

ఊరటనిపించి ఒక్కసారిగా గుక్కతిప్పుకోకుండా
చేతిలో ఉన్న బిస్లరీ సోడా అంతా తాగాను.
గొంతు తీవ్రంగా మండింది.
తట్టుకోలేనంతగా
నీవు గుర్తుకొచ్చిన క్షణాల మనోవేదన లా
అది నా గొంతులో మింగలేని ముద్దలా
గుండెలో చల్లారని అగ్నిలా అలా మండుతూనే ఉంది.

No comments:

Post a Comment